Previous Page Next Page 
కొత్తనీరు పేజి 4


    "ఎలాగైనా తమిళుల సంస్కృతి, ఆ జాగ్రత్త, ఆ శుభ్రత, అది మనకు లేదు!" అంటూ ఆ దేశాన్ని, ఆ మనుష్యులని, వారి తెలివితేటలిని, వారి కార్యశూరత్వాన్ని పొగిడేవాడు. తెలుగువారిని ఉత్త చేతకాని వారిలాగ జమకట్టి చులకనగా మాట్లాడడం జగన్నాధం గారు చాలాసార్లు కనిపెట్టారు. కొడుకు మీద భార్య ప్రభావం, ఆ దేశప్రభావం బాగానే పనిచేస్తున్నాయని గ్రహించారు. అందుకే అవకాశం చూసి యీ వేళ కాస్త నిష్ఠూరంగా చురక తగిలించారు.
    అందరూ ఒకే మాట అనేసరికి రామానికి ఏదో తప్పుచేసిన భావం కలిగింది. అందుకే యింటికి వెళ్ళిన దగ్గిరినింఛీ పిల్లలతో కావాలని తెలుగులోనే మాట్లాడసాగాడు. పిల్లలు కాబట్టి త్వరలోనే తెలుగు పట్టుబడింది. ఇంట్లో అందరూ మాట్లాడుతూంటే మీనాక్షికి వచ్చేసింది.
    పిల్లవాడి అక్షరాభ్యాసం నాడు కాస్త భార్యాభర్తల మధ్య గొడవే జరిగింది. మీనాక్షి పూజ తంతు. అదీ యథావిధిగా చూపిన రామానికి కాస్త పంతం, కోపం వచ్చింది. "పిల్లలకి ముందు నేర్పవలసింది మాతృభాష. నా భాష తెలుగు కాబట్టి తెలుగు నేర్పా"లని రామం అన్నాడు. "మనం వున్నది తమిళదేశం. పిలల్లల చదువు సంధ్యలు చూడవలసింది నేను కాబట్టి నేను అరవమే చెప్పిస్తా"నని మీనాక్షి వాదించింది. "నువ్వు చెప్పలేకపోతే నేను మాష్టర్ని పెట్టి చదివిస్తాను. నీ భాషకూడా నేర్చుకోవాలని వుంటే నేర్పుగాని, వాళ్ళకి ముందు తెలుగు రావలసిందే" అని రామం ఖచ్చితంగా చెప్పాడు. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. ముఖం ముడుచుకుని కోపంగా లోపలికి వెళ్ళి పోయింది మీనాక్షి. తనే పిల్లవాడిచేత ఆపూటకి అక్షరాలు దిద్దించాడు రామం.
    ఇలాగే అనేక విషయాలలో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చేవి.
    మీనాక్షి యింట్లో వంటలు, పద్దతులు, అలవాట్లు అన్నీ తనకి అనుగుణంగా చేసేది. పండగలు, పూజలు అన్నీ ఆ దేశ పద్దతులే అనుసరించేది. రామం మొదట్లో ఏ విషయాలు అంతగా పట్టించుకోలేదు. భార్య యిష్టాయిష్టాలకి అనుగుణంగా తన అలవాట్లని మార్చుకున్నాడు.
    కాని.....కాలక్రమాన కొత్త భార్యమీద మోజు తీరి, పిల్లలు పుట్టి పెరుగుతూంటే మీనాక్షి మరీ తనని తమిళుడుగా మార్చేస్తూందని గ్రహించాడు. అంతేకాక తన యింట్లో తల్లితండ్రులు, చెల్లెళ్ళు అందరూ మధ్య మధ్య తనలోని మార్పుని వేలెత్తి చూపించి, భార్యవిధేయుడయిపోయి తనజాతి, తనదేశం, తన వాళ్ళని మరిచిపోయినట్లు హేళనగా మాట్లాడడం విని రామంలో జాత్యభిమానం, పౌరుషం తలెత్తాయి. ఫలితం భార్యాభర్తలకి తరుచు భేదాభిప్రాయాలు వచ్చేవి.
    మీనాక్షి యింట్లో రోజూ సాంబారు, కొబ్బరికూరలు, అవీ చేయిస్తే మొదట్లో మెచ్చుకుని తినే రామం తరవాత తరవాత విసుక్కోవడం ఆరంభించాడు! ఒకరోజు ఏదో ధ్యాసలో వుండి తినేసేవాడు. ఇంకో రోజు "రోజూ యీ వెధవ సాంబారు, యీ చప్పిడికూరలు చెయ్యవద్దని ఎన్నిసార్లు చెప్పాను? పప్పు, పులుసులు, అవీ చేయించవేం ఎన్నిసార్లు చెప్పినా? అని కేకలు వేసేవాడు.
    "మీ గొడ్డుకరం తిలలు మంచివి......మా సాంబారు తిళ్ళు వెధవ్వీనా!" అని మీనాక్షి సవాలుచేసేది. "నీ కిష్టమయితే నువ్వు తినుగాని, నాకోసం పప్పు, పులుసు, ఆవ కూరలు చేయించు...... పచ్చళ్ళు, అవీ కావాలి నాకు" అనేవాడు రామం.
    "ఏమో,అవన్నీ నాకు రావు" అనేది మీనాక్షి.
    "ఎందుకు రావు? చెయ్యాలని వుంటే అన్నీ వస్తాయి. అమ్మ ఎన్నిసార్లు చెప్పలేదు నీకు. అవన్నీ చేయడం" అని కోపంగా ఆపూట అన్నం సరిగా తినకుండా వెళ్ళిపోయేవాడు రామం.
    ఆ మర్నాడు ఏదో కాస్త కావలసినట్లు చేయించేది మీనాక్షి. రామం చల్లబడగానే మళ్ళీ మామూలే!
    వంటలు, భోజనాల విషయంలోనే కాక పండగలు, పబ్బాలు అవీ కూడా తమిళదేశ ఆచారం ప్రకారమే చేసేది మీనాక్షి.
    ఒకసారి తెలుగు సంవత్సరాది పండగ యింట్లో జరపలేదు మీనాక్షి. రామానికీ తెలియదు ఆరోజు ఉగాది అని. ఓ తెలుగు స్నేహితుడింటికి వెళ్ళి పిండివంటలు తినేదాకా! ఇంటికి వస్తూనే యీవేళ ఉగాది కదా. పండగ ఎందుకు చేయలేదు?" అని మీనాక్షిని అడిగాడు.
    మీనాక్షి మామూలుగా "మన సంవత్సరాది యింకా ముందుంది" అంది. ఆ జవాబుకి రామానికి పట్టరాని కోపం వచ్చింది.' "మన' -అంటావేం, 'నా' అని అను! నీ పండగలే తప్ప యింట్లో చేయవా? ఇంటికి యజమానిని కాబట్టి నా యిష్టప్రకారం జరగాలి యింట్లో" అన్నాడు. ఖండితంగా.
    సంక్రాంతి, దసరా, దీపావళి మొదలైనవి యిద్దరికీ పండగలే కనక అంత బాధలేక పోయేది అప్పుడు. అందులో కూడా తెలుగు వారికి సంక్రాంతి పెద్దపండుగ. తమిళులకి దీపావళి పెద్ద పండుగ. మీనాక్షి దీపావళి పెద్ద ఎత్తున జరిపేది. మిగతా వాటి కంటే పిల్లలకి అన్ని పండగలకంటే మంచి ఖరీదయిన బట్టలు కొనేది. తనకి పట్టుచీర కొనుక్కునేది. "మాకు సంక్రాంతి పెద్ద పండుగ. ఆ పండక్కి కొంటాను పట్టుచీర. ఇప్పుడు మామూలుది కొనుక్కో" అనే వాడు రామం, ఏడిపించడానికి మీనాక్షిపంతంపట్టి పట్టుచీర దీపావళికే కొనిపించుకునేది.
    ఇన్నాళ్ళూ చిన్న చిన్న విషయాలు కాబట్టి ఏదో జరిగి పోయింది. కాని కూతురి పెళ్ళి విషయంలో భార్యా భర్తల మధ్య వాగ్యుద్ధమే జరిగింది.
    కూతురి పెళ్ళి ఓ సమస్యగా తయారవుతుందని రామం ముందు గ్రహించలేక పోయాడు. అందరికంటే మీనాక్షే అభ్యంతరం ఆరంభించింది. "మీ తెలుగు వాళ్ళకంటే మావాళ్ళే పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నావాళ్ళున్నారు. ఎలాగైనా అన్నింటిలో తమిళులకంటే తెలుగువారు వెనక బడివున్నారు. పిల్ల సుఖపడాలంటే పిల్లని మాదేశం వాడికే యిచ్చి పెళ్ళి చెయ్యాలి" అని పోరడం మొదలుపెట్టింది. రామం సంబంధాలు చూడడం ఆరంభించిన దగ్గిరనించీ "ఏం, తెలుగు వాళ్ళని చేసుకున్న అందరూ కష్టపడిపోతున్నారా ఏమిటి? నా కూతురికి తెలుగు సంబంధమే చేస్తాను......" అన్నాడు రామం పంతంగా.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS