బ్రాహ్మణుని మృతదేహం అయినా కూడా గ్రామంలో యెవ్వరూ తాకడానికి అంగీకరించలేదు. అంచేత చండాలురు వచ్చి కట్టుకొని తీసుకుపోయారు. తర్వాత ఎండిపోయిన ఏ చెరువు ఒడ్డునో సగం కాలిన శరీరాన్ని పారేశారు. కాకులూ-గ్రద్దలూ దాని మీదికి వచ్చి వాలిపోయాయి. కుక్కలూ, నక్కలూ పరస్పరం కలహించుకుంటున్నాయి. అప్పుడు కూడా విన్నవాడల్లా అన్నాడు....'ఆహా!' అని దాస దాసీలు కూడా అక్కడక్కడ దీనిని గురించి చెప్పుకుంటున్నారు-
ఎవరో గొప్ప వ్యక్తి! రెండు వందల రూపాయల శాలువ, వందన్నర రూపాయల ఉంగరం, అన్నీ ఇన్స్ పెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. రెండు ఉత్తరాలున్నాయి. అవికూడా వాళ్ళే ఉంచుకున్నారు.
ఈ సమాచారమంతా పార్వతి చెవిన పడింది. కాని ఆమె ప్రస్తుతం పరధ్యానంగా వుంటున్నది. ఏ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ద చూపడం లేదు. అందువలన ఈ విషయంలో కూడా కొంచెం సరీగా అర్ధం చేసుకోలేదు. కాని అందరూ ఈ విషయం చర్చించుకోవడం చూసి ఈ విషయంలో కొంచెం ప్రత్యేకంగా తెలుసుకొనవలెననే అభిలాషతో ఒక దాసీని అడిగింది_"ఏం జరిగిందీ? ఎవరు చనిపోయారు?"
"ఆహా! అది ఎవరికీ తెలియదమ్మా! గత జన్మలోని వాడెవరో యీ మట్టికి చెందినవాడై వుంటాడు. అతడు కేవలం చనిపోవడానికే వచ్చాడు. నిన్నరాత్రి అంతా ఇక్కడే పడి వున్నాడు. ఈ రోజు ఉదయమే చనిపోయాడు."
పార్వతి దీర్ఘంగా నిట్టూర్చి "అతణ్ని గురించి ఎవరికీ ఏమీ తెలియదా?" అన్నది.
"మహేంద్రబాబుకు తెలిసి వుండవచ్చు. నాకేమీ తెలియదు" అన్నది దాసీ.
మహేంద్రుడికి పిలుపు వచ్చింది. "మీ ప్రాంతానికి చెందిన దేవదాస్ ముఖోపాధ్యాయ" అని ఆయన చెప్పాడు.
పార్వతి మహేంద్రునికి చాలా దగ్గరగా జరిగి తీవ్రంగా చూస్తూ "ఏమిటీ! దేవదాదా? ఎట్లా తెలుసుకున్నావు?" అని అడిగింది.
"జేబులో రెండు ఉత్తరాలు ఉన్నాయి. ఒకటి ద్విజ్ దాస్ ది...."
"అవును, ఆయన అన్నగారిది" అన్నది పార్వతి.
"మరొకటి కాశీనుంచి హరిమతీ దేవి వ్రాసినది...."
"అవును, ఆమె తల్లి."
"చేతిమీద పేరు పచ్చ పొడిచి వుంది...."
"అవును, మొట్టమొదట కలకత్తా వెళ్ళినప్పుడు పచ్చ పొడిపించుకున్నాడు."
"ఇక నీలంరాయి వున్న ఉంగరం వుంది."
"తండ్రిగారి కాలంలో దానిని పెదనాన్న యిచ్చాడు....నేను వెళతాను...."
అంటూనే పార్వతి పరుగు తీసింది. మహేంద్రుడు నిశ్చేష్టుడై "ఓ అమ్మ! ఎక్కడికెళతావు?" అన్నాడు.
"దేవదాసు దగ్గరికి."
"ఆయన ఇప్పుడు లేడు. చండాలురు తీసుకెళ్ళారు."
"ఆమ్మో, అమ్మో!" అంటూ రోదిస్తూ పార్వతి పరుగుతీసింది.
మహేంద్రుడు పరుగెత్తుకుంటూ పోయి అడ్డం నిల్చున్నాడు. "అమ్మా, పిచ్చెక్కిందా ఏం? ఎక్కడికెళతావు?"
పార్వతి మహేంద్రుని వైపు తీవ్రంగా చూస్తూ "మహేంద్రా! నిజంగా నీవు నన్ను పిచ్చిదాన్ని అనుకున్నావా? దారికి అడ్డం రాకు....!" అన్నది.
ఆమె వైపు చూచి మహేంద్రుడు దారిలో నుంచి తప్పుకున్నాడు. మౌనంగా ఆమె వెనకే వెళుతూ వున్నాడు. బయట అప్పుడు కూడా మేనేజరు, గుమస్తా మొదలయిన వాళ్ళు పనులు చేస్తూ వున్నారు. వాళ్ళు చూస్తూ ఉన్నారు. చౌదరిగారు కళ్ళజోడు పెట్టుకుని "ఎవరు వెళుతున్నారు?" అని అడిగాడు.
"చిన్నమ్మ" అన్నాడు మహేంద్రుడు.
"ఈమె ఎందుకు? ఎక్కడికి వెళుతున్నది?"
"దేవదాసును చూడటానికి" అన్నాడు మహేంద్రుడు.
భువన్ చౌదరి అరుస్తూ "మీ అందరి బుద్ధి యేమయిపోయింది? పట్టుకోండి, పట్టుకోండి! ఆమెను పట్టుకొని తీసుకురండి. అందరూ పిచ్చి వాళ్ళయిపోయారు! ఓ మహేంద్రా, త్వరగా పరుగెత్తు!" అన్నాడు.
ఆ తర్వాత దాసీలందరూ పరుగెత్తారు.దాసీలందరూ కలిసి పార్వతిని పట్టుకొన్నారు.స్పృహ తప్పిపోయిన ఆమె దేహాన్ని లోపలికి తీసికొని వెళ్ళారు. రెండవరోజు ఆమెకు స్పృహ వచ్చింది. కాని ఆమె ఏ విషయమూ చెప్పలేదు. కేవలం ఒక దాసీని పిలిచి అడిగింది__రాత్రి ఆయన వచ్చారా లేదా? రాత్రంతా....!"
ఆ తర్వాత పార్వతి మౌనం వహించింది.
ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పార్వతి సంగతి యేమయిందో, ఆమె ఎట్లున్నదీ, ఆ విషయం మాకు తెలియదు. తెలుసుకోవాలనే కోరిక కూడా కలగటం లేదు. కేవలం దేవదాసు కోసమే హృదయం క్షోభిస్తూ ఉంది. మీలో గూడా యీ కథ చదివిన వాళ్ళు బహుశా నా మాదిరిగానే క్షోభిస్తారు. అయినప్పటికీ దేవదాసు వంటి దురదృష్టవంతుడు, సంయమనం లేనివాడు, పాపిష్టుడూ అయిన వ్యక్తితో ఎవరికైనా పరిచయం వుంటే వాళ్ళు అతని కోసం పరమేశ్వరుని ప్రార్థించండి. ఇంకేమైనా కానివ్వండి. కాని దేవదాసు మృత్యువు లాంటిది ఎవరికీ సంభవించకూడదని ప్రార్ధించండి. మృత్యువు సంభవించడంలో హానీ ఏమీలేదు. కాని ఆ సమయంలో స్నేహ హస్తపు స్పర్శ తలమీద తప్పకుండా వుండాలి. కరుణార్ద్ర మై ఉన్న ఒక వదనాన్ని చూస్తూ చూస్తూ యీ జీవితం అంతం కావాలి. అందువల్ల మరణించే సమయంలో ఎవరి నయనాల నుండి అయినా రాలిన రెండు అశ్రు బిందువులు చూసి అతడు శాంతితో మరణించ గలగాలి.
* సమాప్తం *
