Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 29


    
    ఎవరు నీవు! ఎవరునీవు! ఎందుకు ఏడుస్తున్నావు ?
    అమ్మ ప్రక్కన నిలుచుండి అలా అశ్రువులు రాలుస్తున్నావు.
    క్షణం క్షణం కరిగిపోతూ జ్వలించే మైనపు వత్తిలా !
    ఝంఝామారుతానికి చలించే చిన్నారి పూలగుత్తిలా!
    
    దురంత దుర్దిన దురాక్రమణలో నిరాశ చెందకు
    నిరంత నిస్ప్పుహతో నిట్టూరుస్తూ లోలోపల కుందకు
    నీ హృదయంలో నిబ్బరం కోల్పోకు
    నీ ధైర్యం సడలనీకు - చింతాక్రాంతురాలివి కాకు
    మంగళమయమైన ఈ మహిమాన్విత సమయంలో
    అమంగళంగా అశ్రుతరంగాలు పొంగి పొరలనీకు.
    
    ఇది పూజాసమయం - ఆరాధనకు వేళయింది -
    జగజ్జనని కాళికాదేవి ఆలయద్వారం తెరవబడింది -
    అగరుధూపం - అక్షతలూ - అన్నీ - తీసుకురా!
    అసృగ్ బిందుల చిందులతో తడిసి వికసించిన
    అరుణ కమలాలు కోసుకురా!
    
    కాదిది కల్యాణీ! ఒకరిద్దరి సంగతి
    యావద్దేశానికీ సంభవించింది విపత్కర పరిస్థితి
    వందలు వేలు వీర సైనికులు నావంటివారు !
    పవిత్ర కర్తవ్య మహాయజ్ఞంలో
    ప్రాణాలు ఆహుతు లిడుతున్నారు!
    
    పరమోత్కృష్టమైన ఇటువంటి అదృష్టం
    బ్రతుకులో ప్రాప్తించడం ఎంతో కష్టం
    అదేదో ఆవేదన అంతరాత్మ అంతరాంతరాలందున
    గుబగుబలాడుతున్నది గుండెల సందున
    ప్రాణం పోయేముందు ఒక్కసారి నిన్నుచూడాలి!
    పసుపు కుంకుమల బంగారు కాంతిలో స్నానమాడాలి!
    నీ లోచనకాంతులు నాలోని నవజీవన స్రవంతులు !
    ఆలోచనకు సమయం లేదు! ఆత్మార్పణకు వేళయింది!
    విశాల భారత విమోచన వీరదుందుభి మ్రోగింది !
    వెలుగులు వెదజల్లుతూ విజయోత్సవం సాగింది!
    
    ఏమాత్రం నీకు నామీద ప్రేమ ఉన్నా
    ఈ మాత్రం తప్పకుండా నీవు చెయ్యాలి !
    ఉక్కు తునకల వంటి మన బిడ్డల మనసుల్లో
    "దిక్కులేని వార"మనే భావం తీసెయ్యాలి.
    
    వాళ్ళకు ఆత్మగౌరవం నూరిపోయాలి.
    వాళ్ళు పెద్ద వాళ్ళయి సంఘంలో తలెత్తుకు తిరగాలి.
    వాళ్ళ నాన్నపేరు తలుచుకొని సగర్వంగా
    వాళ్ళ దేహాలు నిలువునా పులకించాలి.
    
    కరుణామయీ! కన్నీళ్ళు తుడుచుకో!
    విచారం దిగమ్రింగు! వీరనారీమణివై నడుచుకో!
    కర్తవ్య నిర్వహణం!
    కఠోర పరీక్షా నిరీక్షా క్షణం!
    
    నారీ జీవనం నాటికీ నేటికీ ఒకలాగే నడచిపోతున్నది
    గుండెలనిండా మండే దుఃఖజ్వాలలు భరించుతూ
    పెదవులపై మాత్రం చిరునవ్వులు చిందించుతూ
    నారీ జీవనం నాటికీ నేటికీ ఇలాగే నడచిపోతున్నది.
    
    పౌరుష పూర్ణమైన నా ప్రతిజ్ఞకు హారతిపట్టు !    
    పరువు నిలబెట్టు! భారత గౌరవానికి జేకొట్టు !
    నీ కన్నబిడ్డలకు నిప్పుతో చెలగాటం నేర్పు !
    ఇదే లోకం నీ కిచ్చిన తీర్పు !
    భావి సంతానానికి ఇదే మనం పంచి ఇచ్చే బహుమానం
    త్రివేణియై ప్రవహించే శౌర్యం - ధైర్యం బలిదానం.
    వస్తాను వస్తాను తప్పకుండా వచ్చేస్తాను    
    మువ్వన్నెల విజయపతాకంలా నవ్వుతూ ఎగిరివస్తాను.
    
    గాండీవధరుడు నరుని ప్రతిజ్ఞ
    తాండవిస్తున్నది నా జిహ్వాగ్రాన !
    ఇకలేదు తిరోగమనం !
    చకచకా సాగుతున్నది పురోగమనం.
    
    తెస్తాను తెస్తాను ముమ్మాటికీ తెస్తాను
    విలువైన విజయోపహారం వేగిరం తీసుకువస్తాను
    దురాక్రమితమైన దేశ పారతంత్ర్యానికి
    విముక్తి గీతం ఆలపిస్తాను.
    
    ఇదిగో ఇప్పుడు జ్వలించిపోతున్నాను
    హిమాచ్చాదిత గిరి శిఖరాల మీద
    దేదీప్యమానంగా ప్రజ్వలించి పోతున్నాను
    క్రమ్మిన అమావాస్య చిమ్మ చీకట్లను చీల్చివేస్తున్నాను.
    
    అచంచల సౌభాగ్యవతి - అమర భారతి - అఖండజ్యోతికి
    అక్షయమైన ఆజ్యంగా వేడినెత్తురు అర్పిస్తున్నాను.
    సర్వస్వం సమర్పిస్తున్నాను.
    
                                       ఆనందలహరి
    
    తెల్లవారితే దేశమంతా
    వెల్లి విరుస్తుంది ఆగస్టు పదునైదు !
    తెల్ల వారికి  స్వస్తి చెప్పడంతో
    తీరిపోయిం దానాటితో మన ఖైదు !
    
    రేపటి కిరణాలు పాపల చెక్కిళ్ళు
    సోకుతాయి తీయతీయగా !
    రేపటి మలయ మారుతాలు పాపల నుదుళ్ళు
    తాకుతాయి హాయి హాయిగా !!
    
    రోజూ కంటే రేపు నాజూకుగా
    ఊగుతాయి పూలతోటలో రోజాలు !!
    రోజూ కంటె రేపు తేజస్సుగా
    మ్రోగుతాయి ఎఱ్ఱకోటలో బాజాలు !!
    
    ఎప్పటికంటే ఎంతో ఉల్లాసంగా
    ఎగురుతుంది రేపు త్రివర్ణ పతాకం !
    ఎప్పటికంటే ఎంతో ఉత్సాహంగా
    విప్పుకుంటుంది హృదయం ప్రజానీకం !
    
    పది పన్నెండేండ్ల యింది పట్టుకొన్న
    పారతంత్ర్య పిశాచిని దూరంగా సాగనంపి.
    పదములకు గట్టిగా చుట్టుకొన్న
    బానిస బంధాలు ఫటఫటా త్రెంపి.
    
    ఎంతో భక్తితో రేపు ఎత్తుతుంది జయహారతి
    సంతోషంతో నవ్వుతూ జననికి స్వరాజ్య భారతి
    అది మన భారతీయుల స్వాతంత్ర్య మహా పర్వోదయం !!
    అది మన గుండెలు పండించుకొన్న ఆనందమయ సర్వోదయం !!
    
    వినవస్తున్నవి విజయశ్రీ మంజుల మంజీర నిస్వసాలు
    వికసిస్తున్నవి మానసంలో హిరణ్మయ కమలవనాలు
    ఎందుకో తనలోతాను అందంగా నవ్వుకుంటున్నది తూర్పు
    అందీఅందని అనురాగంలో అందిస్తున్నది ముత్యాల కూర్పు.
    
    పదమూడు వసంతాలు నిండిన
    బాలకుమారీ! నీ వెవ్వరు ?
    అంతరంగాలలో శాంతితరంగాలు లేపే
    కాంతితరంగిణీ ! నీ వెవ్వరు ?
    
    త్రివర్ణ పతాకం నీడలో నిలిచిన
    సువర్ణ ముఖీ! నీ వెవ్వరు?
    "సత్యమేవ జయతే" అని చాటే
    నిత్యకల్యాణీ! నీ వెవ్వరు?
    
    చతుస్సింహ ముద్రాంకిత
    చక్రేశ్వరి! నీ వెవ్వరు?
    ముసిముసి నవ్వులు చిందించు
    ముద్దుల చెల్లీ! నీ వెవ్వరు?
    
    రాణా ప్రతాపసింహుని రక్తారుణ రోచిస్సులు
    ఛత్రపతి శివాజీ ప్రభు క్షాత్రోచిత తేజస్సులు
    కృష్ణరాయ భువనవిజయ కీర్తిలతా వర్చస్సులు
    కదలెను నీ కన్నుల్లో కల్యాణీ! నీ వెవ్వరు?
    
    ఝాన్సీలక్ష్మి శౌర్యం! బహదూర్ షా ధైర్యం!
    మంగళపాండే బలిదానం! తాంతియాతోపే అభిమానం !
    శాలివాహనుల సాహసం! కాకతీయుల పౌరుషం!
    చిలుకుతున్నవి నీ పలుకులు! చిట్టి తల్లీ! నీ వెవ్వరు?
    
    యశోధర ప్రేమధామంలో ప్రసరించిన నవ్వులు!
    అశోకుని ఆరామంలో వికసించిన పువ్వులు !
    విక్రమార్క కాళిదారులు వెలిగించిన దివ్వెలు !
    సాక్షాత్కరించు నీ చూడ్కులు! చైతన్యమయీ! నీ వెవ్వరు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS