Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 28


    నా మానసం మానస సరోవరం వలె మారిపోతున్నది!
    నా భావన సహస్ర పత్రకమలమై తేలి పోతున్నది!
    నా అనురాగం సుకుమార సుగంధమై దెసల ప్రసరిస్తున్నది !
    నా ఆనందం మధుర మకరందమై పొంగి ప్రవహిస్తున్నది !!
    
    కన్నీటితో జగత్కాలుష్యమును గడిగి
    శాంతి కలహంసలకు కాంతిఱెక్కలు తొడిగి
    అజ్ఞానముల నణచు విజ్ఞానముల పంట
    కాలూనునంట! వైశాలి నర్తకి యింట !!
    
    తథాగతులు మా యింటికి దయతో విజయంచేస్తారట!
    సుధాకరులు ఈ కలువపూవును చూడటానికి వస్తారట !
    నా జీవనం వనమయూరమై నవోల్లాసంతో నర్తిస్తున్నది!
    నా యౌవనం తన పవిత్ర కర్తవ్యాన్ని నవనవంగా గుర్తిస్తున్నది!!
    
    కఱకు కత్తులు పెఱికి కంఠాలు తెగనఱకి
    ప్రజల నెత్తురు త్రాగు గజదొంగలను గూడ
    సాధువులుగా మార్చు సౌహార్దముల పంట
    కాలూనునంట! వైశాలి నర్తకి యింట !!
    
    చక్కని కలహంసలా వెండిఱెక్కలు తొడుక్కున్నది శరత్తు;
    చిక్కని మధు పరాగాలు చిమ్ముతున్నది మలయమరత్తు !
    పరవశించి పొంగి పొరలుతూ పరువెత్తి వస్తున్నది సరిత్తు !
    నిరవధికంగా నిర్నిమేషంగా నిలిచి నిరీక్షిస్తున్నది వియత్తు !!
    
    మూగ ప్రాణుల బంధమోక్షణమ్మొందించి
    యాగావేదికల వాగమృతమ్ము చిందించి
    "సర్వార్దసిద్ద" మౌ సౌజన్యముల పంట
    కాలూనునంట! వైశాలి నర్తకి యింట !!
    
    విచ్చేస్తాడు నేడు నా యింటికి విశ్వశాంతి ప్రదాయకుడు
    వెలుగు నిస్తాడు నా కంటికి విజయ మంగళ విధాయకుడు
    నా అదృష్టనర్తకి గజ్జెకట్టి నాట్యం చేస్తుం దీనాడు!
    శాంతరసాన్ని శృంగారం శరణు పొందుతుంది నేడు!!
    
    ఆ ప్రభువు చూపు తాపత్రయ మ్మెడబాపు
    ఆ దయామయు మాట అపవర్గముల మూట
    "సర్వతోభద్ర"మౌ శాంత్యహింసల పంట
    కాలూనునంట! వైశాలి నర్తకి యింట !!
    
    జగద్గురువుల కీరాజనర్తకి స్వాగతమిస్తుంది నేడు
    జన్మజన్మాల సాధన సార్ధకమౌతుం దీనాడు
    గగనం పుష్పవృష్టి కురుస్తుంది! కరగి నీరౌతుంది భూమి!
    పూజ లందుకుంటాడు నా స్వామి! "బుద్ధం శరణం గచ్ఛామి."
    
    సంసార దుఃఖ హరణాలు! చైతన్య పరిస్ఫురణాలు!
    శాంతిదేవత కలంకరణాలు! సౌభాగ్య సమవతరణాలు!
    అజ్ఞాన తమస్సు లణచు అహస్కరుని కిరణాలు !!
    శాక్యసింహుల శ్రీచరణాలు !! సర్వదా నాకు శరణాలు !!

                                  సైనికుని ఉత్తరం
    
    (ఇది శివమంగళ సింహ 'సుమన్' హిందీ రచనకు స్వేచ్చాను వాదం. 1963 రిపబ్లిక్ దిన మహోత్సవ సందర్భమున "ఆకాశవాణి విజయవాడ" కేంద్రము నుంచి ప్రసారిత మైనది.)
    
    ఓ నా దేశ ప్రజలారా! ఉభయకుశలోపరి
    ఉత్తరం వ్రాస్తున్నాను ఉత్తరం ఇదిగో మరి.
    
    కరాళ మృత్యు దంష్ట్రాంకురాల తెర చాటునుంచి
    గంగా యమునా  బ్రహ్మపుత్రలు జన్మించిన చోటునుంచి
    కత్తులు తుపాకులు కదం త్రొక్కే కఠోరకదన వేదినుంచి
    ఉత్తరం వ్రాస్తున్నాను ఉత్తరగిరి మీదినుంచి.
    
    అత్యంతం అమూల్యమైన మానవత్వాన్ని
    ఆమూలాగ్రం నాశనం చేయాలని
    ప్రత్యేకం పనిగట్టుకున్నారు పాతకులు
    సత్యాన్నీ ప్రేమనీ సౌహార్దాన్నీ
    హత్యచేస్తున్న కిరాతకులు.
    
    ఇద్దరి నడుమ సరిహద్దుల కోసం గ్రుద్దులాట కాదిది
    సమస్త విశ్వశాంతిని సవాలుచేసే జటిల సమస్య ఇది
    కుక్కల్లా లెక్కకు రాని దిక్కులేని చావు చావటమో !
    జయించి జీవిత పరమార్ధాన్ని సార్ధకం చేయటమో !
    
    రణం కాదు! కాదిది రణం! రామ కార్య నిర్వహణం !
    అహోరాత్రాలు జాగరణం - మహామహిష సంహరణం -
    బ్రతుకో చావో తప్పదు పవిత్ర జాహ్నవీ తీరం !
    స్వామి కార్య నిర్వహణం - క్షణభంగురం జీవనం!
    
    దేనికిలే పేరు తమ్ముడూ! నేనొక సైనిక వీరుణ్ణి
    దీనురాలైన ఒకానొక వితంతువు కుమారుణ్ణి
    బ్రతుకు గతుకుల్లో ప్రాణాలు బిగబట్టుకొని
    అమ్మ పెంచింది నన్ను అరచేతుల్లో పెట్టుకొని
    
    కరగి స్రవించే కన్నతల్లి నిండుగుండెల కన్నీళ్ళలో
    పెరిగి పెద్దయినాను చిరిగిన నిరాశల పొత్తిళ్ళలో
    గ్రామం పేరు ఏమంటున్నావా భాయీ!
    భూమి మీది గ్రామాలన్నీ  ఒకేలా నాకు కన్పిస్తాయి.
    
    సన్నని సందులు! సావిళ్ళు! ఎద్దు బండ్లు !
    కన్నుల విందు చేసే చిన్ని చిన్ని పూరిండ్లు !
    పైరు పొలాలు! పంటకంకుల కళకళలు !
    పడుచు లంగా కలంకారీ అలంకారాల తళతళలు !
    సంధ్యారుణ కాంతుల్లో స్నానంచేస్తూ "అంబా" అని అరుస్తూ
    కోడెదూడను నాకుతున్న గోమాత కన్నుల మిలమిలలు!!
    గ్రామాలన్నీ ఒకేలా నాకు కన్పిస్తాయి !
    
    ఈ కదకంలో ఇలా పడివుండి
    ఈ రోజుకు సరిగా మూడురోజులు;
    రగిలే పొగలు -పగిలే బాంబులు - మండే మంటలు -
    మృత్యుదేవత నీలినీడలు పారాడే గుంటలు.
    
    జాముసేపునుంచీ వాతావరణం శాంతంగానే ఉన్నది!
    సైనిక భాషలో శాంతికి సరైన అర్ధం ఏమున్నది?
    ఎవరివో ఆర్త ధ్వనులు చెవులు బద్దలు చేస్తున్నవి !
    దొంగతోడేళ్ళ బిరుసు గడ్డాల బరబరలు విన్పిస్తున్నవి !!
    
    ఎముకలు కొరుక్కుతినే చలిలో కాళ్ళుచేతులు కొంకర్లు పోతున్నవి.
    నెత్తురు గడ్డకట్టింది - నేత్రాలు నిరర్ధక మౌతున్నవి.
    ఎదలో వెచ్చవెచ్చగా కదులుతూ మెదులుతూ
    పదే పదే గుర్తుకు వస్తున్నవి -
    దూరాన ఉన్న కన్నతల్లి చల్లని మమతా !
    అనురాగమయి అర్ధాంగి తియ్యని అమాయికతా !
    పిట్టల కిచకిచలలో కిలకిల నవ్వే
    చిట్టిబాబు చిన్నారి పెదవులజతా !
    ఎదలో వెచ్చ వెచ్చగా కదులుతూ మెదులుతూ
    పదే పదే గుర్తుకు వస్తున్నవి.
    
    కనిపిస్తున్నవి అవిగో కన్నతల్లి కనికరపు కళ్ళు !!
    జలజల స్రవిస్తున్నవి నులివెచ్చని కన్నీళ్ళు !!
    తల్లిని ఓదార్చే ఇల్లాలికి తడిసి ముద్దలయినవి చెక్కిళ్ళు !!
    ఒడిలో ఉన్న పసివాడు ఊరకే మింగుతున్నాడు గ్రుక్కిళ్ళు.
    
    ప్రక్కనున్న పంచాయతీ రేడియో ఒక్కటే అమ్మకు తోడు
    అక్కడే కుక్కిమంచంలో అమ్మ పడుకున్నది నేడు
    మింటి ముంగిట్లో మిలమిల మెరుస్తున్న నక్షత్రంవైపు
    అదేపనిగా పరుగిడుతున్నది అమ్మచూపు,
    ఎవరైనా చెప్పండి అమ్మకు ధైర్యంగా ఉండమని.
    నా శిరస్సుపై ఆమె ఆశీస్సులు కురుస్తుండమని.
    
    అమ్మా! నీవు నిబ్బరంగా ఉండు ఆందోళన ఎందుకు ?
    నీ పేరు తలుచుకుంటూ నేను నడుస్తున్నాను ముందుకు.
    నక్కినక్కి నరుల కండలు కొరుక్కుతినే
    నక్కల డొక్కలు చీలుస్తున్నాను.
    రక్కసి రాబందుల ఉక్కుముక్కులు
    చెక్కి వ్రక్కలు చేస్తున్నాను.
    
    ధన్యమైన నీ స్తన్యం మీద ఒట్టు పెట్టుకొని
    గట్టిగా చెబుతున్నాను చేతిలో తుపాకీ పట్టుకొని
    "వీరమాత" అనే బిరుదం నీ కంఠంలో
    హారంగా అలంకరిస్తాను అచిరకాలంలో.
    
    రణరంగం నుంచి  తిరిగి ఇంటికి రాగలిగితే
    కన్నులారా కన్నతల్లిని నిన్ను చూచుకోగలిగితే
    నీకాళ్ళు కళ్ళకద్దుకొని - నీ చేతులు ముద్దు గొని
    నీ పాదధూళి అలికంపై తిలకంగా దిద్దుకొని
    నిలువునా పులకించి పోతాను.
    లేదా తల్లీ! ఏది ఏమైనా సరే నేను మాత్రం
    కన్నతల్లి గౌరవానికి కళంకం తీసుకురాను ఏమాత్రం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS