Previous Page Next Page 
ఉద్యోగం పేజి 27

చంద్రావతి యింకా నర్సుద్యోగం చేస్తూనేవుంది.  చంద్రావతి పతివ్రతా శిరోమణి అని నాగరిక సుబ్బారావు సర్టిఫికెటిచ్చేడు. చంద్రావతిని చూసి భయపడుతున్నది ఆ నాగరికి సుబ్బారావు తాలూకు అవసరమైన ఆలోచనలు. అందుచేతనే అతను కోలుకోలేక పోతున్నాడు.
ఈ రోజున- వి. సుబ్బారావు వాళ్ళబ్బాయి తొమ్మిది నెలల వాణ్ణి యెత్తుకుని. ఆడిస్తున్నాడు యింట్లో ఆ కుర్రాడి బోసినవ్వు ముద్దొచ్చే  చిన్న చిన్న మాటలూ, అప్పుడప్పడూ వాడి తాలూకు మెత్తని తాపులూ అనుభవించడం లేదతను. అతని మనసు మదరాసు మెయిల్మీద, అందులో ఖరీదైన కంపార్టుమెంటులో, అతివిలువైన సీట్లో ముద్దబంతి పూవులా కూర్చునుండగల సుబ్బుల్ని పలవరిస్తోంది. సుబ్బులుకి సొంతమైన రంగుల జీవితాన్ని ఊహిస్తోంది.
సుబ్బులూ  పైకొచ్చేశావ్! ఫో! నీ దరిద్రాన్ని అండ్ సన్స్ తీర్చి పారేశారు. నువ్వైనా సుఖపడు సుబ్బులూ! నీకు గతం వెధవది; నిజం సుబ్బులూ! కానీ నాగతం  బంగారంతో సమానం. నే నిప్పుడేమో వెధవని. నేనిప్పుడేమో వెధవని. ఏం చేతగాని వెధవని నీకూ నాకూ చాలా భేదం ఉందోయ్ సుబ్బులూ!  పూర్వం నీకు డ్రింకు తాగడం చాతనొచ్చేది గాదు, తాగాలో నన్నిడిగేదానివి, ఇప్పుడేం తాగుతున్నావో మరి! పోన్లే సుబ్బులూ! అభిమానముంది ఇంత  వుత్తరమైనా రాశావ్. తప్పకుండా వొస్తాను. వొచ్చి ఖరీదు పెరిగిన నీతో నాలుగు నిముషాలపాటు నాచేదుజీవితాన్ని మనవి చేస్తాను సుబ్బులూ, సుబ్బులూ నువ్వు పెళ్ళిచేసుకుంటావా? ఎవర్ని చేసుకుంటావ్? ఇంకా ఆ రెండు జెడలే వేస్తూన్నావా? నా మాటడు గుతే అవే నీకు నప్పుతుంది. తారామణీ! అఖిలాంధ్ర ప్రజలకి పరిచయం కాబోతూన్న ఒకప్పటి పేదరాలు! నీకు  నా అశీస్సులు."
సుబ్బారావు కనుకొలకుల్లో  నీళ్ళునిలిచేయి! ఎంచేతంటే జెలసీ, అందానికి మధ్యనున్న  భా వేమేదో అతన్ని పూర్తిగా నింపేసింది.ఏమైతేనేం సుబ్బుల్ని తలుచుకుని ఏడ్చేసేడు సుబ్బారావు:వి. సుబ్బారావు.
అతనీ అవస్థలో ఉన్నప్పుడు చంద్రావతి పిలిచింది. మూడోసారిగాబోలు ఉలిక్కిపడి, తెప్పరిల్లి వూకొట్టేడు సుబ్బారావు.
" అన్నం  వొడ్డించేను."
" అఖ్ఖర్లేదు, చంద్రా! ఆకలవడంలేదసలు: నువ్వు తినేయ్."
" ఇప్పుడు నా సంగతేగావల్సొంది. లేవండి చల్లారి పోతుంది."
బుజ్జిగాడ్ని భూజానవేసుకుని సుబ్బారావు వంటగదిలోకి వెళ్ళేడు. వంటగదిలో రెండు కంచాల్లోనూ వొడ్డించింది చంద్రావతి . బుజ్జిని నేలమిదికిందించి, చొక్కా దులుపుకుని కసిగా అనేశాడు సుబ్బారావు.
"చంద్రా నువ్వు నన్ను  పూర్తిగా అవమానించేస్తున్నావ్. నీకు తెలుసా నువ్వు నన్ను తినేస్తున్నావు.  మనిషి ని వున్నపళంగా చంపేస్తున్నావ్ నువ్వు."
సుబ్బారావు కెక్కిన పిచ్చిసంగతి చంద్రావతికి పూర్తిగా తెలుసు. అందుకే తలొంచుకు కూర వొడ్డిస్తోంది. సుబ్బారావు గది గుమ్మానికి  ఆనుకుని రెండు చేతుల్తోనూ తల సవరించుకుంటూ అన్నాడు!
" చంద్రా! పోనీ ఓపని చేయలేవూ?"
చంద్రావతి తలెత్తి చూసింది.
"మరేం లేదు.  నువ్వు ఖంగారు పడొద్దు. నేను నిజమే చెప్తున్నాను. నే చెప్పింది పూర్తిగా  విని ఆనక ఆలోచన చేసి చెప్పు. ఫర్సేదు కాస్తాలస్యమైనా నా నిర్ణయం చెప్పేయ్."
" చెప్పండి నన్నేం చేయమంటారు?"
సుబ్బారావు చంద్రావతి వేపు నిశితంగా చూసేడు. చెప్దామనుకున్న మాటకాస్తా గుండెల్లోనే పేలిపోయింది.  గిర్రున వెనక్కి తిరిగి హాల్లోచి వచ్చేడు. పడక కుర్చీలో కూర్చుని యింటి టాపు వేపు చూస్తూ గొణుక్కున్నాడు.
" నా కుద్యోగం లేదు. నువ్వు  నన్ను  పోషించేస్తు న్నావు చంద్రా!  నా బాధ  గూడా అదే. నువ్వు నాకోసం ఉద్యోగం మానేయ్ . పైగా నువ్వు నర్సువి.ఒక నాడు నన్నల రించిన... వొద్దు చంద్రా! నువ్వు మంచి దానివి పైగా దేవతవి. నేనేం నీకు చెప్పలేను. శాసించే అధికారం నీ మంచి తనం తినేసింది.!
బుడ్డుగాడి యేడుపు విని మళ్ళా  లేచి నించున్నాడు సుబ్బారావు. గబగబా వాడిదగ్గరికెళ్ళాడు. రెండు చేతులతో వాడి నెత్తుకుని గుండెలకు హత్తుకుని అన్నాడు.
"నువ్వొకడివి బుజ్జీ!  అమ్మప్రాణం తినేస్తున్నావ్ వెధవ! చంద్రా నన్ను క్షమించు. మరేంలేదు నేను  నీకేం చెప్పలేను. అన్నం వడ్డించావుకదూ,  తినేస్తాను చంద్రా.చాలా ఆకలిగావుంది. వెధవది నాకుఉద్యోగ లేదుగదూ అందుచేత నోటికొచ్చినట్లు వాగేస్తున్నాను."
అతను కంచంముందు కూర్చున్నాడు, చంద్రావతి లోలోపల ఏడ్చేసింది. సుబ్బారావు అన్నంతినడం పూర్తి చేసేడు.
ఆ సాయంత్రం అతను స్నానంచేసేడు.చక్కగా తల దువ్వుకున్నాడు చంద్రావతిముందొచ్చి నించున్నాడు.
" వొస్తా చంద్రా! మళ్ళా యిప్పుడే వొస్తాను. స్టేషన్ వరకూ వెళ్ళొస్తాను. వొస్తారా బుజ్జీ! వొస్తా."
ఇల్లొదిలి స్టేషనురోడ్డువైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళేడు. స్టేషను చేరేసరికి మదరాసు మెయిలొచ్చి ఆయిదు నిమిషాలయిందని ఎవరో చెప్పేరు. వేగంగా ప్లాటుఫారం మిదికి గెంతేడు.  సుబ్బుల్ని స్పష్టంగా చూళ్ళేదుగాని సుబ్బులు చుట్టూతా మూగిన జనాన్ని చూసేడు. వాళ్ళ ఖరిదైన వేషాల్ని చూసేడు. మతిపోయినట్లయింది. ఓగోడకి చేరగలపోయేడు.    
సుబ్బులు కంపార్టుమెంటుదగ్గిర జనంనుంచి మందహాసాలూ, అట్టహాసాలూ వివిథరకాలుగా వినిపిస్తున్నాయి. తలుపుదగ్గిర నుంచున్న సుబ్బులు " సగం" కనిపించింది.  పూర్వపు బంగారుబొమ్మకి యి మధ్య నగిషీతనం ఎక్కువైనట్టు పసిగట్టేయగలిగాడు, జనంతో చప్పేయాలి.
ఏమండోయే ! జెంటిల్మెన్ ఆఫ్ ది సిటీ పురప్రుముఖుల్లరా! పెద్దలారా! ఆవిడెవరనుకున్నరు? మాసుబ్బులు. ఆప్టరాల్ జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ లో సేల్స్ గర్ల్. అమ్మకం చేసే ఆడకూతురు  ఆవిడ్నెందుకు ఆకాశానికెత్తేస్తారు? ఇక్కడ  నేనున్నాను. పై చెప్పబడిన సంస్థలో యజమానిగా చెలామణి అయిన శ్రీ శ్రీ వి.సుబ్బారావుగార్ని. మిరంతా నాదగ్గరకు రండి. వేగంగా వొచ్చేయండి! నేనా. పిల్లతో ఏకాంతంగా మాటాడేందుకు అవకాశమివ్వండి:మి దొంగచూపులూ, నక్కవినయాలూ, కారాకిళ్ళీపళ్ళూ, వాసనగొట్టే నోళ్ళు, జడ్డి వొళ్ళూ సుబ్బులుకి దూరంచేయండి తప్పుకోండిముందు సుబ్బులూ నేనొచ్చేశాను. సుబ్బులూ, నామిద జాలిచూపించు. " ఏమండీ! నా యజమానిగారూ! బాధపడుతున్నారా" అని సముదాయించు సుబ్బూలూ.
రైలు కదిలేముందు ఓ అడుగు ముందుకువేశాడు. సుబ్బారావు సుబ్బులు తెల్లటిచెయ్యి గాలిలో వూగడం మాత్రం చూసేడు. వేగంగా  రెండడగులు వేశాడు. సుబ్బారావుని సుబ్బులు చూచింది. గాలిలో హేళనగా నవ్వినట్టు ఓ చిన్న చిర్నవ్వు విసిరింది. అది తిన్నగా గుండెల్లో దూసుకుపోయినట్లయింది సుబ్బారావుకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS