మారుతి సీతతో ;
5. "నీవలెనె శ్రీ - రామచంద్రుడు
నిద్రాహారములు - మరచెనమ్మా |
ఫలపుష్పాదులు - ప్రియమైనవిగని
హా సీతా ! యని - శోకించునమ్మా |
నీ జాడ తెలిసి - కోదండపాణి
తడవు చేయకే - రాగాలడమ్మా |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
__: 36 వ. స. సంపూర్ణము :__
37వ. సర్గ
సీత హనుమంతునితో ;-
1. "రావణు తమ్ముడు - విభీషణుడు
రాముని కడకు - నన్ను జేర్చుమని |
పలికినందులకు - రావణుడలిగి
తమ్మునిపై దు | ర్భాషలాడేనని |
విభీషణు సుత - నలయను కన్యక
స్వయముగ దెల్పెను - నా కీ వార్త |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో ..... ||శ్రీ||
2. "ఓ హనుమంతా - నిను గనినంత
నాలో కలిగె ప్ర | శాంతత కొంత |
వానరోత్తమా - నిను వినినంత
నే పొందితిని - ఊరట కొంత |
రాముని వేగమె - రమ్మని దెల్పుము
రెండు నెలల గడు | పు మరువ బోకుము"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో ..... ||శ్రీ||
మారుతి సీతతో ;
3. "తల్లీ నీ విటు - శోకింపనేల
వగచి వగచి ఇటు - భీతిల్ల నేల |
ఇపుడే నీ కీ - చెర విడిపింతును
కూర్చుండుము నా - మూపు మీదను |
వచ్చిన త్రోవనే - కొనిపోయెదను
శ్రీరామునితో - నిను జేర్చేదను |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
సీత హనుమంతునితో :
4. "పోనివ్వక పో | తివిగా హనుమా
సహజమైన నీ - చెంచల భావము |
అరయగ అల్ప శ | రీరుడ వీవు
ఏ తీరుగ నను - గోనిపోగలవు |
రాముని కడకే - నను జేర్చెదవో
కడలిలోన నే - జారవిడుతువో |"
అని పల్కె సీత హనుమంతునితో
తనలో కలిగిన - వాత్సల్యముతో .... ||శ్రీ||
5. సీత పలికిన - మాటల తీరును
హనుమంతుడు విని - చిన్నబోయేను |
సీత చెంత తన - కామరూపమును
ప్రదర్శింపగ - సంకల్పించెను |
కొండంతగ తన - కాయము బెంచెను
కాంతిమంతుడై - చెంత నిలిచెను |
జయ హనుమంతుని - కామరూపమును
ఆశ్చర్యముతో - జానకి చూచెను .... ||శ్రీ||
6. ఎర్రని మోము - ఎర్రని కన్నులు
వజ్ర దంతములు - వజ్ర నఖములు |
పెంచిన కాయము - తేజోమయమై
విలసిల్లెను కా | లాగ్ని సదృశమై
మందర గిరివలె - మహోన్నతమై
కాంతులెగజిమ్మె - అతి భీకరమై |
అనిల కుమారుని - కామరూపమును
ఆశ్చర్యముతో - జానకి చూచెను .... ||శ్రీ||
సీత మారుతితో :-
7. "అద్భుతమౌ నీ - కామరూపమును
కాంచితినయ్యా | శాంతింపుమయ్యా |
పవన కుమారా - నీవు గాక మరి
ఎవరీ వారిధి - దాటేదరయ్యా |
క్రూర రాక్షసుల - కంటబడకయే
లంక వెదకి నను - కనగలరయ్యా |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో .... ||శ్రీ||
8. "వాయు వేగమున - పోగలిగిన నీ
మూపుపైన నే - కూర్చుండ గలనా ?
ఆకసమంటి - ఎగిరిపోవు నీ
మూపు నుండి నే - భయపడి పడనా ?
జలధి పడినచో - జలచరములు నను
ప్రీతిగ మ్రింగక - వదలివేయునా ?"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో .... ||శ్రీ||
