'సరే!' అంది నిశ్చింతగా.
మరో సంవత్సరానికి పండంటి బాబుకు తల్లయింది. అత్తగారి హడావుడి చూస్తుంటే ఆశ్చర్యంగా అన్పించింది. చనిపోయిన మామగారే ఇలా పుట్టాడని ఆవిడ నమ్మకం. బారసాల... వగైరా... వైభవంగా జరిగాయి. బాబుని ఒళ్లోంచి దింపట్లేదావిడ. వాడి పన్లన్నీ ఆవిడే చేస్తోంది.
వాడికి క్రమంగా మూడో నెల వచ్చింది. వాడి బోసి నవ్వులతో ఇల్లంతా పండగ వాతావరణం.
ఇంక ఉద్యోగంలో చేరవచ్చనిపించింది. నాలుగైదు అప్లికేషన్స్ పంపించింది. ఒక మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం త్వరగానే దొరకటం మమతకి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇంటిల్లిపాదీ సంతోషించారు.
మమత రోజూ ఉద్యోగానికి పోయి రావటంతో బాగా అలసిపోయేది. టార్గెట్ వర్క్ ఉద్యోగాల్లో వత్తిడి ఎక్కువగా ఉండటం సహజం కూడా.
ఓ రోజు రాత్రి పొద్దుపోయాక వచ్చిన ఫోన్ కాల్ పిడుగులాంటి వార్తని అందించి ఇంటిని శోకసముద్రంలో ముంచేసింది. ఆడబడుచు పద్మ భర్త శేఖర్ యాక్సిడెంట్ లో పోయాడని.
అత్తగారు కుప్పకూలి పోయింది.
అంతా కలిసి రాజమండ్రి వెళ్ళారు. అన్ని కార్యక్రమాలు రవి దగ్గరుండి జరిపించాడు. తమతో వచ్చేయమనీ పిల్లల్ని హైద్రాబాదులోనే చదివిస్తామంటే పద్మ ఒప్పుకోలేదు. భర్త ప్రేమగా కట్టించిన ఇంట్లో అలాగే ఉంటూ తన టీచర్ ఉద్యోగంలో అలాగే కంటిన్యూ అవుతానంది. అత్తగారు కూడా ఆ పరిస్థితిలో పద్మకి సాయంగా ఉండిపోయింది.
భారమైన మనసుతో వెనక్కి తిరిగి వచ్చారు మమత, రవి దంపతులు. అసలు సమస్య హైద్రాబాదుకి వచ్చాక భూతంలా ఎదుట నిల్చింది. బాబుని ఎవరు చూస్తారు. తను వెళ్తే సాయంత్రమో రాత్రో వచ్చేది. క్రచ్ లో చేర్చుదాం అనుకొని కొన్నిచోట్ల వెళ్ళి విచారించింది. కానీ అక్కడి పరిస్థితులు, వాతావరణం నచ్చలేదు.
చివరికి తెల్సినవాళ్ళ ద్వారా ఇంట్లో ఉండి బాబుని చూసుకునే ఆయాను కుదుర్చుకుంది. బాబు అలవాట్లు అవసరాలు ఆయాకి నేర్పి ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది మమత.
అంతా బాగానే జరిగిపోతోంది. బాబు కూడా పెద్దగా పేచీ పెట్టకుండా ఆయాకి మాలిమి అయ్యాడు. ఆరోగ్యంగా ఉన్నాడు.
ఓ రోజు ఇంటికి వచ్చేసరికి బాబు మురికిగా చిరిగిన చొక్కాతో కనపడేసరికి మమతకి చాలా కోపం వచ్చింది.
"ఆయా! ఈ చొక్కా ఎక్కడిది. తీసేసిన చొక్కానా! చిరిగింది వేశావే? స్నానం చేయించలేదా" తీవ్రంగా అడిగింది.
"అయ్యో! చిరిగిందా! చూడలేదమ్మా" అంటూ హడావుడిగా స్నానం చేయించి మంచి చొక్కా వేసింది ఆయా!
బాబు మొహం వాడిపోయి ఉంది.
"బాబుకి వంట్లో బాగా లేదా" నుదుటిమీద చేయి వేసి చూసింది మమత. నులివెచ్చగా ఉంది.
"బాగానే ఉన్నాడమ్మా! ఇప్పటిదాకా బాగా ఆడాడు" సంజాయిషీగా చెప్పింది ఆయా.
మమతకి మాత్రం ఆ సమాధానం తృప్తినివ్వలేదు. జవాబు దొరకని ప్రశ్నలేవో తల్లి హృదయాన్ని వేధిస్తున్నాయి.
ఆరోజు మధ్యాహ్నం నుంచి మమతకి కడుపులో నొప్పి... వాంతులు. ఇక ఆఫీస్ లో కూచోలేక లీవ్ లెటర్ ఇచ్చి వెంటనే ఇంటికి బయలుదేరింది. కారు డ్రైవ్ చేస్తోందన్న మాటేగానీ సౌఖ్యంగా లేదు. చికాకుగా ఉంది.
లిబర్టీ దగ్గర ఎర్ర లైటు పడింది. కారు ఆగగానే చుట్టూ ఈగల్లా బిచ్చగాళ్ళు.
"ఈ బెగ్గర్స్ తో వేగలేక ఛస్తున్నాం. రోజూ ఇదే రూటులో వస్తాం. రోజూ ఎందుకు. నెలకోసారి తీసుకో" టూ వీలర్ వ్యక్తి విసుక్కున్నాడు.
కారు అద్దాల్లోంచి దూరంగా ఓ బిచ్చగత్తె. మెడచుట్టూ తిప్పి కట్టుకున్న పాతచీర జోలెలోంచి పసివాడి బుల్లి కాళ్ళు, చేతులు అస్పష్టంగా కన్పిస్తున్నాయి. కార్లు చీమల్లా కదుల్తున్నయ్. గాలికి జోలె చీర అల్లల్లాడింది. ఆ పసివాడ్ని, ఆ బిచ్చగత్తెని ఎక్కడో చూసినట్లనిపించింది.... మమతకి... అదేంటి... అదే... వాడు... వాడు... గుండె బద్దలైంది. బ్రేకుతో కారు ఆగింది. వెనకనించి ఒకటే హారన్లు.
ఒక్క ఉదుటున ఇంట్లోకి వచ్చి పడింది. మెయిన్ డోర్ కి తాళం కప్ప వెక్కిరిస్తోంది.
దడదడలాడుతున్న మనసుతో తాళం తీసి బెడ్ రూంలోకి వచ్చి మంచం మీద వాలిపోయింది. కన్నీటితో దిండు తడిసిపోతోంది. కడుపునొప్పి ఏమయిందో.... కన్నపేగు మెలి తిరిగి బాధ పెడ్తోంది.
మరోగంటలో ఆయా బాబుతో వచ్చింది. తాళం తీసి ఉండటంతో కంగారుపడింది.
ఆయా కట్టుకున్న చిరుగు పాతచీర తనెప్పుడూ చూసింది కాదు. బాబు వంటి మీద పాతచొక్కా కూడా వాడిది కాదు.
పచ్చని బాబు వళ్ళు అంత నల్లగా...
ఆయా చేతుల్లోంచి ఆవేశంగా బాబుని లాక్కుంది మమత. మమత కోపం చూసి హడలిపోయింది ఆయా.
"బాబు ఏడుస్తుంటే పార్కుదాకా... అలా..." నసిగింది ఆయా.
"నోర్ముయ్... ఇంకో మాట మాట్లాడావంటే పోలీసులకి పట్టిస్తాను.. సిగ్నల్ దగ్గర నీ నాటకం చూళ్ళేదనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు" మమత కళ్ళు నిప్పులు కురిసాయి.
"గెటౌట్ ఇడియట్..." అరిచింది మమత. ఆయా జారుకుంది తలొంచుకుని.
కాలింగ్ బెల్ శబ్దానికి ఆలోచనల్లోంచి బయటపడింది మమత.
తలుపు తీస్తే... ఎదుట రవి.
"ఎలా ఉంది మమతా.." అంటూ లోపలికి వచ్చిన రవిని కౌగిలించుకుని ఒకటే ఏడుపు.
"అదేంట్రా... కొంచెం వంట్లో బాగాలేకపోతే ఇంత భయమా. అమ్మని పిలిపించనా, బాబు ఏడీ..." సోఫాలో కూర్చొని బూట్లు విప్పుతున్న రవి పక్కన కూర్చుని కళ్ళు తుడుచుకుంది మమత.
మమతకేసి పరిశీలనగా చూశాడు రవి. తను ఇంతగా బాధపడ్తున్నదంటే బలమైన కారణం ఉండే ఉంటుంది. మెల్లగా వివరాలు రాబట్టాడు. కొయ్యబారిపోయాడు. ఇలాంటి మానవమృగాలుంటాయా! పసివాణ్ణి వ్యాపారవస్తువు చేయటం ఎంత అమానుషం. కోపంతో అతని దవడ ఎముక బిగిసింది. కాస్త తమాయించుకున్నాడు.
"పోన్లే మమతా! మనకిప్పుడైనా తెలీటం మన మంచికే. ఇంకా ఏమేం జరిగేవో! నీ నిర్ణయం కరెక్టే. సూపర్ ఉమన్లా అన్ని పన్లు ఎలా చేస్తావ్. పిల్లలకి ప్రేమానురాగాలు ఇవ్వలేని జీవితం ఎందుకు. డబ్బు సంపాదించుకోవచ్చు. వాడి బాల్యం మళ్ళీ రాదు. వాడు పెద్దయితే మనల్ని ప్రేమగా చూడాలనుకోమూ" అంటూ మమత చేయి పట్టుకొని బాబు దగ్గరికి తీసికెళ్ళాడు.
నిద్రలో బాబు ఉలిక్కిపడ్డాడు.
మమత బాబు పక్కనే కూర్చుని మెత్తగా జో కొట్టింది. వాడి పెదవులపై సన్నని చిరునవ్వు సంతృప్తిగా వెలిగింది.
కంప్యూటర్ కలల నుంచి కన్నబిడ్డ చిరునవ్వుకు ప్రయాణించిన మమతను చూస్తుంటే రవి మనసు అంకెలకందని ఆనందంతో నిండిపోయింది.
* * *
