Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 24


    సెక్స్ కి మానసికమైన కాంక్షే ప్రధాన ప్రేరణ అవుతుందని ఆమెకు బాగా తెలుసు.

 

    "నా పేరు మధుమతి. బావుందా...?"

 

    "బ్రహ్మాండం బ్రద్ధలయ్యేలా వుంది. మనమెప్పుడు కలుద్దాం?" గొంతు తగ్గించి అడిగాడు నరసింహం.

 

    "అంత తొందరగా వుందా?" చిలిపితనాన్ని గొంతులో పలికిస్తూ అడిగింది.

 

    "అమాంతం ఈ ఫోన్ తీగల వెంటే పరిగెత్తుకు వచ్చి నిన్ను చూడాలని వుంది. చెప్పు... ఎప్పుడు కలుద్దాం?" తిరిగి అదే ప్రశ్న వేశాడు నరసింహం.

 

    "వీడికి మూడింది! అందుకే అంత ఉత్సాహం చూపిస్తున్నాడు" అని అనుకున్నాడు తనలో తానే సత్యం.

 

    "రేపు కలుద్దామా?" మార్దవాన్ని గొంతులో పలికిస్తూ అంది ఆమె ఆ వేపు నుంచి.

 

    అసలంతసేపు ఫోన్ లో నరసింహం మాట్లాడగా ఆ స్టేషన్ లో ఎవరూ అంతవరకు చూడలేదు.

 

    అందుకే ఆ హాల్లో వున్న కానిస్టేబుల్స్ మతులు పోగొట్టుకుంటున్నారు.

 

    "కలుద్దాం" అందామె చిన్నగా నవ్వుతూ.

 

    ఆమె నవ్వు నరసింహానికి ఎలక్ట్రిక్ షాకులా కిక్ ఇచ్చింది.

 

    "ఎక్కడ...? ఎలా...?" నరసింహంలో క్షణక్షణానికి ఆతృత పెరిగిపోతోంది.

 

    "మా వాళ్ళంతా పెళ్ళికి ఔరంగాబాద్ వెళ్ళారు" ఆమె మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ-

 

    "ఎన్నాళ్ళుంటారక్కడ?" అని ప్రశ్నించాడు నరసింహం ఆతృతగా.

 

    "జీవితాంతం అక్కడే వుండిపోతే బావుంటుందన్న ఆశ మీ గొంతులో నాకు వినిపిస్తోంది"

 

    నరసింహం సిగ్గుపడుతూ చిన్నగా నవ్వాడు.

 

    "ఓరి నీ సిగ్గు చింతలపూడి చెరువులో కలిసిపోను. ఎంత క్రూరంగా సిగ్గు పడుతున్నావురా? నిజంగానే నీకు మూడే ఆ అమ్మాయి ట్రాప్ లో ఇరుక్కుంటున్నావు. ఎందరో అమాయకుల ఉసురుపోసుకున్న రాబందు ఈ అమ్మాయి గాలివాటుకి నేలకొరగడం ఖాయం!" సత్యం తనలో తాను అనుకున్నాడు కసిగా.

 

    "అంత అదృష్టమా?" మురిసిపోతూ అన్నాడు నరసింహం.

 

    "మహారాష్ట్ర టూరిజమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ బస్ లో ఓ రోజు అజంతాకి, మరో రోజు ఎల్లోరా, దౌలతాబాద్ పోర్టుకి వెళ్ళి అవన్నీ చూసి మరో వారంరోజులు ఔరంగాబాద్ లో గడిపి వస్తారు. మొత్తం ఒక వారం పడుతుంది."

 

    "మహాభాగ్యం... ఇంతకీ ఎక్కడ కలవటం?"

 

    "సరీగ్గా రేపు సాయంత్రం ఐదు గంటలకు స్టీఫెన్స్ స్ట్రీట్ లోని ఆరవ నెంబర్ ఇంటిలో కల్సుకుందాం."

 

    "స్టీఫెన్- సిక్స్..." మననం చేసుకుంటున్నట్లు అన్నాడు నరసింహం.

 

    ఆమె చెప్పిన అడ్రస్ మొత్తం నరసింహం రిపీట్ చేసుంటే అతను వలలో చిక్కుకుపోకుండా సత్యం రక్షించేవాడే!

 

    సత్యంకి తెలీగూడదనే నరసింహం ఆమె చెప్పిన అడ్రస్ ని పూర్తిగా రిపీట్ చేయలేదు.

 

    "వస్తారా?"

 

    "తప్పక వస్తాను"

 

    "ఎట్టి పరిస్థితుల్లోనైనా రావాలి" ఆమె క్రమంగా నరసింహాన్ని తనకేసి ట్యూన్ చేసుకుంటోంది.

 

    "ఆఖరికి మర్డర్ కేసు వచ్చినా వదిలేసి వస్తాను"

 

    "శెభాష్... అది రసికత అంటే"

 

    నరసింహం గర్వంగా నవ్వాడు.

 

    "నేను ఇంటిలోనే వుంటాను. మీరు సరాసరి ఇంట్లోకి వచ్చేయండి. అక్కడే ఆగిపోయి తారట్లాడవద్దు. బాగా పరిచయమున్న వ్యక్తిలా తలుపు తోసుకుని లోపలకు వచ్చేయండి. లేదంటే చుట్టుప్రక్కల వున్న వాళ్ళకు అనుమానం వస్తుంది. మీరు మాకు ఫేమిలీ ఫ్రెండ్ అన్నట్లుగానే బిహేవ్ చేయాలి. మీలో భయం కాని, పిరికితనం కాని కనిపించకూడదు" ఆమె రహస్యం చెబుతున్నట్టు చెప్పింది చిన్నగా.

 

    "నెవ్వర్... నాకసలు భయమంటే తెలీదు. పోలీస్ డిపార్టుమెంట్ డిక్షనరీలో ఫియర్ అన్న పదమే వుండదు. వుండకూడదు"

 

    "నాభయం మీ కర్థమయిందా?"

 

    "నేను పోలీసోడ్ని. తల్లిదండ్రుల చాటునుండి నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకున్నాను. నీకేం భయం లేదు. నేను మేనేజ్ చేస్తాను" ప్రపంచాన్ని జయించినంతగా ఫీలయిపోతూ అన్నాడు నరసింహం.

 

    "మీలో వున్న ఆ ధైర్యం, తెగువ, సాహసమే నన్నింతగా ఆకర్షించాయి. మీ గురించి నేను పిచ్చిదాన్నయి పోతున్నాను. సరిగ్గా నెలక్రితం మిమ్మల్ని గాంధీ చౌక్ లో చూశాను. పాతిక ముప్ఫై మంది గూండాలను కూడా చిరుతపులిలా ఎదుర్కొని జీప్ లో కుక్కి పోలీస్ స్టేషన్ కేసి లాక్కెళ్ళారు. అప్పుడే నేను నా మనస్సు పారవేసుకున్నాను. కోరి వచ్చింది కదాని లోకువ చేస్తే తట్టుకోలేను. మీకోసం రేపు సరిగ్గా సాయంత్రం-"

 

    ఆమె మాటలింకా పూర్తి కాలేదు.

 

    "సరిగ్గా ఐదు గంటలకు! గుర్తుంది" అన్నాడు ఆనందంగా.

 

    "ఓ.కే... బై" అంటూ ఫోన్ పెట్టేస్తూ ఫోన్ మౌత్ పీస్ పై పెదవులతో చిన్న శబ్దం చేసింది.

 

    దాన్ని ముద్దుగా అర్థం చేసుకున్న నరసింహం కొద్ది క్షణాలు ఉద్రేకపడి పోయాడు.

 

    మరికొద్ది క్షణాలకి ఫోన్ ని క్రెడిల్ చేసిన శబ్దం వినిపించింది నరసింహానికి.

 

    ఆ వెంటనే తనూ క్రెడిల్ చేసి వళ్ళు విరుచుకున్నాడు విచిత్రమైన ఆనందోద్వేగానికి గురవుతూ.

 

    కానిస్టేబుల్ సత్యానికి అనుభవమెక్కువ.

 

    నొటోరియస్ క్రిమినల్స్ దగ్గర్నుంచి జేబు దొంగల వరకు అందర్నీ చూశాడు. ఆ అందర్నీ డీల్ చేశాడు. అప్పుడప్పుడు పోలీసుల మీద పగతో క్రిమినల్స్ పన్నే వలల గురించి కూడా సత్యానికి బాగా తెలుసు.

 

    ఎవరో అమ్మాయి... ఎలా వుంటుందో తెలీదు. నరసింహానికి అసలే తెలీదు. అతన్నే వలచిందనుకోటానికి నరసింహం ఆకారం అడ్డు. మరేదో ప్రత్యేకమైన కారణం లేందే ఆ అమ్మాయి నరసింహం మీదే ఎందుకు కన్ను వేస్తుంది? ఇతనేమన్నా పాతికేళ్ళ నవ మన్మధుడా...? కాదు. సో... ఏదో వల ఆ అమ్మాయి ద్వారా నరసింహం మీద పన్నబడబోతుంది.

 

    నరసింహం పొరపాటు మూలంగా స్టేషన్ కేదన్నా చెడ్డపేరు వస్తే దాన్ని అందరూ నెత్తికెత్తుకోవలసి వస్తుంది. కనుక హెచ్చరించడం అందరికీ క్షేమం అనుకొని సత్యం "సార్..." అంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించబోగా-

 

    "షటప్... ఇప్పుడు ఎవరేం మాట్లాడొద్దు" అంటూ నరసింహం సీట్లోంచి లేచాడు.

 

    ఇక అప్పుడేం చెప్పినా నరసింహం వినడానికి సత్యానికి తెలుసు.

 

    అందుకే మౌనంగా వుండిపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS