Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 23


    సిగ్నల్ మెన్ ఒక్కడే టెర్రస్ మీదున్నాడు.
    
    ఒకసారి వాచీకేసి చూసుకున్నాడు.
    
    మరోసారి చుట్టుప్రక్కలకు చూశాడు.
    
    సంతృప్తిగా తలపంకించి తన భుజానికి వేలాడుతున్న సంచి నుంచి బైనాక్యులర్స్ తీసి కళ్ళ ముందుకి తెచ్చుకుని దేవానంద్ ఇంటికేసి తిప్పాడు.
    
    క్లియర్ అండ్ క్లోజ్ విజన్ కోసం బైనాక్యులర్ ఫోకస్ ని అడ్జస్ట్ చేసుకుంటూ దృష్టిని మామిడిచెట్టుమీదకు మరల్చాడు.
    
    కొద్దిక్షణాలు నిశ్చలంగా అటుకేసే చూశాడు. మామిడి చెట్టు కొమ్మలు కదలటాన్ని స్పష్టంగా గమనించి సంతృప్తి పడ్డాడు.
    
                                                 *    *    *    *    *    

    సరిగ్గా 6-28 పి.యమ్.కి మాస్టర్ రోల్స్ రాయిస్ వచ్చి బంగ్లా ముందాగింది.
    
    క్షణాల్లో పైలటుకారు, మోటార్ బైక్సు, అంబులెన్స్, సెక్యూరిటీ వెహికల్ సిద్దమయి పోయాయి.
    
    ఎమర్జన్సీ వార్ కి సిద్దమవుతున్న తరహాలో ఏ వాహనంలో ఎక్కేవారు ఆ వాహనాల్లో ఎక్కేశారు.
    
    6-29వ క్షణం పూర్తవుతూనే ముందుండే బైక్సు స్టార్టు అయిపోతాయి.
    
    ఎవరు ఎక్కినా ఎక్కకున్నా వాహనాలు కదిలిపోతాయి.
    
    6-28 నిమిషాల ముఫ్ఫై క్షణాలకు యశోధర తన మనుమరాలితో కారు దగ్గరకు వచ్చింది.
    
    కారు ఫ్రంటు డోర్ తెరుచుకుంది.
    
    ఆ ఇద్దరూ కారెక్కేశారు.
    
    6-29 పి.యమ్
    
    మాస్టర్ బయటకు వచ్చేశాడు.
    
    మోటార్ బైక్సు ఇంజన్స్ స్టార్టు అయ్యాయి.
    
    రోల్స్ రాయిస్ మిడిల్ డోర్ ఓపెన్ అయింది. బ్యాక్ డోరు బదులు మిడిల్ డోరు ఓపెన్ కావడంతో మాస్టర్ ఓ క్షణం ఆశ్చర్యపోయి వెంటనే సర్దుకుని ఎక్కేశాడు.
    
    అది చూసిన అందరికీ ఆశ్చర్యమేసింది.
    
    ఎప్పుడూ బ్యాక్ సీటులో కూర్చునే మాస్టర్ మిడిల్ సీటునెందుకు ఆక్రమించాడు.
    
    అనుమానాలు మాత్రమే వాళ్ళకొస్తాయి.
    
    అడిగే సాహసం ఎవరూ చేయరు. చేయకూడదు.
    
    6-29 నిమిషాల ముఫ్ఫై క్షణాలకు మిల్లర్ వచ్చాడు.

    ఆ మరుక్షణం అన్ని వాహనాల ఇంజన్స్ స్టార్టు అయ్యాయి.
    
    అంబులెన్స్ డ్రైవింగ్ సీటుని మిల్లర్ ఆక్రమించుకున్నాడు.
    
    మరోసారి అందరూ ఆశ్చర్యపోయారు. మాస్టర్ మరింత ఆశ్చర్య పోయాడు.
    
    సరిగ్గా 6-30 అయింది.
    
    డిగ్.... డిగ్.... మని శబ్దం చేస్తూ ఫైలట్ బైక్స్ స్టార్టు అయి ముందుకు దూకాయి.
    
    ఆ వెనుకనే మిగతా వాహనాలు కదిలాయి. మెయిన్ గేటు ఓపెన్ అయింది.
    
    వరుసగా ఒకదాని వెనుక ఒకటి బయటకు దూసుకు పోయాయి.
    
                                                   *    *    *    *    *
    
    జోహ్రా తాను ఎంచుకున్న కొమ్మమీద కంఫర్టబుల్ గా సెటిల్ అయిపోయి థాంప్సన్ సబ్ మెషిన్ గన్ ని చేతిలోకి తీసుకున్నాడు.
    
                                                   *    *    *    *    *
    
    మృదుల రామ్ డా ఇన్ పామ్ గ్రోవ్ హోటల్ లో జరగనున్న ఓ ఫంక్షన్ కి బయలుదేరింది.
    
    మాస్టర్ ఎలా వుంటాడు...?
    
    పర్సనాలిటీ ఎలా వుంటుంది...?
    
    ఇండియన్ లా వుంటాడా...?
    
    చైనీస్ లా వుంటాడా...?
    
    లేక మిక్స్ డ్ జీనియలజీనా...?
    
    ఆమె మాస్టర్ భౌతిక స్వరూపానికి ఒక ఊహాచిత్రాన్ని మనస్సులోనే ఆకృతి కల్పించుకుంటూ కారు బ్యాక్ సీటులో రిలాక్సు అయింది.
    
    హోండా అకురా సర్రున పామ్ గ్రోవ్ కేసి దూసుకుపోతోంది.
    
                                                      *    *    *    *    *
    
    మాస్టర్ వాహనాలు విక్రోలిదాటి మెయిన్ రోడ్ లోకి వచ్చాయి. వాటిని చూస్తూనే బొంబాయి ప్రజలు థ్రిల్లింగ్ కి గురవుతున్నారు.
    
    "ఎలా ఉంటాడో? అతన్ని తలుచుకుంటే నా ఒళ్ళు జలదరిస్తుంది."
    
    "కొన్ని వేల కోట్లకు వారసుడు..."
    
    "అతన్ని అనుక్షణం చావు వెంటాడుతూ వుంటుందట. అందుకే అంత సెక్యూరిటీ."
    
    పాదచారులు తలోరకంగా కామెంట్ చేశారు.
    
                                                      *    *    *    *    *
    
    సిగ్నల్ మెన్ బైనాక్యులర్స్ ని అంధేరి దిక్కుకేసి మార్చాడు.
    
    అంధేరి రూట్.
    
    మోస్ట్ డేంజరస్ రూట్.
    
    ఫెమిలియర్ రూట్.
    
    దానిమీదే జోహ్రా కన్నేసి ఉంటాడని మిల్లర్ కి తెలీదా? తెలుసు మరి? తెలిసే ఆ రూట్ ని ఎన్నుకున్నాడంటే జోహ్రాని తక్కువ అంచనా వేశాడా? లేక తనకు వేరే ఆలోచన ఉందా? సిగ్నల్ మెన్ ఆలోచిస్తూనే టైమ్ చూసుకున్నాడు.
    
    6-33 పి.ఎమ్.
    
    ప్రొద్దు ఏటవాలింది.
    
    అంధేరి నుంచి జుహూకేసి సాగివచ్చే 200 ఫీట్ రోడ్ మీద వాహనాలు బారులు తీరి పోతున్నాయి.
    
                                                   *    *    *    *    *
    
    మాస్టర్ అన్న ఇంగ్లీషు అక్షరాలు ఫైలట్ బైక్స్ నడిపే కమెండోస్ వైట్ డ్రస్ మీద ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి. మెరుస్తున్నాయి ఉండుండి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS