22. శక్తీ! నీకే ఈ పరీక్ష
న్యూస్ పేపర్ చదువుతూన్న వర్ష, ఒక్కసారిగా పేపర్ ని ముఖానికి అడ్డం పెట్టుకుని కెవ్వున కేకేసింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్లెవరూ లేక పోవడంతో సరిపోయింది కానీ లేకపోతే ఏ తేలో పామో కుట్టినంత గట్టిగా అరిచింది. భర్త పార్థూ అప్పుడే కాలేజీకి వెళ్ళిపోయాడు. పని మనిషి నాగులు పని చేసి వెళ్ళిపోయింది. పసంతా అయిపోతేగానీ, న్యూస్ పేపర్ కాదు కదా, అర్జెంటు ఉత్తరం చదవడానికి కూడా టైముండదు వర్షకి. ఉదయం లేచింది మొదలు పార్థూ కాలేజీ కెళ్ళిపోయేదాకా, ఒక వందసార్లు పిలుస్తాడు. వర్షా, నా బ్రష్, టూత్ పేస్టు ఏవీ? దగ్గర నుంచి, సాక్సూ, షూ, టైల దగ్గరనుంచి, స్నానానికి నీళ్లు పంపులోంచి గీజర్ లో వేడెక్కిన నీటిని బక్కెట్ లోకి నింపడం వరకూ కంచంలో అన్నం పెట్టి, టిఫిన్ కట్టి అతని బ్రీఫ్ కేసులో పెట్టేంత వరకూ, తయారయి అతను కార్లో కూర్చుని వెళ్ళిపోయేంతవరకూ రోజూ ఇదే వరస. ఆ గొడవలోనే మేఘనకి పాలుపట్టడం, వగైరా. ఆ తరవాత అతను వెళ్ళిపోయాక, మేఘనకి స్నానం చేయించి, బట్టలువేసి ప్లేస్కూలుకి పంపించి, అప్పుడు తను రెడీ అయి, కుక్కర్ లో అన్నం, పప్పు, ఏవో పడేసి, మెల్లగా పేపరు తీసి చదువుతుంది. ఆ పేపరు చదివే కాస్సేపే ఆమెకి శారీరకంగానూ, మానసికంగానూ కూడా రెస్టు.
మేఘన పన్నెండున్నరకి ఇంటికి రాగానే బట్టలు మార్చడం, భోజనం పెట్టడం వగైరా పనులన్నీ గంటన్నరా రెండు గంటలు పడుతుంది. ఒక పట్టాన అన్నం తినదు మేఘన. అన్నింటికీ పేచీ, ఏదో వంక. అటు తిప్పి, ఇటు తిప్పి, పిల్లీ, కుక్కా అన్నీ చూపించి నాలుగు ముద్దలు తినిపించేసరికి నీరసం ఒచ్చి, తన భోజనం మూడు నిమిషాల్లో ముగించేస్తుంది. అరగంట అలా వాలుతుందో లేదో, మూడింటికే పనిమనిషి తయారు మధ్యాహ్నం జీటీవీ, ఈటీవీ, జెమినీ, జైన్ ఏవేవో టీవీలలో ఎన్నెన్నో సినిమాలు. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చూసుకోవొచ్చు. ఆ ఫ్లాట్లలో ఎవ్వరూ దాన్ని టీ.వీ. పెట్టనివ్వరు, చూడనివ్వరు. తను పోనీకదా అని ఊరుకున్నందుకు టంచనుగా అది మూడింటి కల్లా, సరిగ్గా తనకి కాస్త కునుకుపట్టే సమయానికి, కాలింగ్ బెల్ కొడుతుంది. ఆ సమయంలో నిజంగా దాన్ని కొట్టాలన్నంత కోపం వొస్తుంది. కానీ, దాన్ని కేకలేస్తే మర్నాటి నుంచి పనిలోకి రాదేమోనన్న భయంతో, ఏమీ అనకుండా నోరు మూసుకుని, మళ్ళీ పనిలో పడిపోతుంది. ఒక్కొక్కసారి ఈ మాత్రం దానికి ఎమ్.ఏ. మేథమేటిక్స్ ఎందుకు చదివానా, ఫస్టు క్లాసులో ఎందుకు పాసయ్యానా, తనకన్నా తక్కువ చదువుకున్న వాళ్లూ, ఏ రకంగానూ తనతో సమానత్వం లేనివారూ కూడా ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారని బాధపడిపోయేది వర్ష. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడో తప్ప కనిపించడంలేదు. అమ్మమ్మలూ, బామ్మలూ కూడా ఉద్యోగాలు చెయ్యడం, ఏదో ఒక వ్యాపకంలో వుండడంవల్ల, పూర్వకాలంతో లాగా వాళ్ళ సాయం అంతంత మాత్రంగానే వుంది. అలా లేనివాళ్లూ, ఇంట్లో వుండి పిల్లల్ని చూసుకునేవాళ్లూ, కనీసం పనివాళ్ళని ఒక కంట కనిపెట్టుకునుండేవాళ్ళయినా వుంటే ఫరవాలేదు కానీ, ఒంటరి కుటుంబాల బాధలు అంతా ఇంతా కాదు. దానికితోడు పతిదేవుడు ఇంటి పన్లలోనో పిల్లల్ని ఆడించడంలోనో సహాయపడకుండా, భర్తగారి పోస్టు హోదాను నిలబెట్టుకుంటూ ఆధిపత్యం చెలాయించడం వుంటే ఇక ఆ భార్య ఒక్క పడకటింట్లో తప్ప, అన్ని చోట్ల దాసీయే.
మేఘన తలుపు తోసుకుని బడినుంచి రావడంతో, ఆలోచనలకి బ్రేకువేసి, మేఘనని ఎత్తుకుని గుండెకి అదుముకుని ముద్దులతో ముంచెత్తేసింది. ఆ క్షణంలో వర్ష నాడి ఎంత వేగంగా కొట్టుకుందో డాక్టరు దగ్గరుంటే తెలిసేది. వర్ష కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయి, ముద్దులాడుతూన్న మేఘన మొహాన్ని కూడా తడిపేశాయి.
"ఏంటమ్మా....నువ్వులుత్తున్నావా? ఎందుకు?" ముద్దు ముద్దుగా అడిగింది మేఘన.
"లేదమ్మా!" అంటూ తన పొరపాటు గ్రహించి, పమిట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ "కంట్లో నలకపడింది" అంది వర్ష. ఆ సాయంత్రం మేఘన ఆడుకోవడానికి పక్కింట్లో వున్న కీర్తి ఇంటికి వెళతానంటే వెళ్ళనివ్వలేదు. పార్ధూ ఎత్తుకొని కార్లో కూర్చోపెట్టడానికి తీసుకుని వెళుతూ వుంటే గబుక్కున మేఘనని అతడి చేతిలో నుంచి లాక్కుంది. ఆ రోజంతా ఆమె ప్రవర్తన ఎంతో వింతగా అనిపించింది. పార్థుకి. "వర్షా! ఏమిటి ఇవాళ అదోలా వున్నావు? మేఘనని నువ్వు తప్ప నన్ను కూడా ఎత్తుకోనివ్వడం లేదు, ఆడుకోవడానికీ పంపించలేదు. ఎందుకని?" అనునయంగా అడిగాడు. తను పొద్దుట చదివిన పేపరుతీసి అందులోని రెండు వార్తలు, చదవమని చూపించింది.
"కన్నతండ్రి తన ఆరేళ్ళ కూతుర్ని, భార్య ఇంట్లో లేనప్పుడు రేప్ చేశాడు. అతడి ప్రవర్తనపట్ల అనుమానం కలిగిన ఆ ఇల్లాలు పాపని మెల్లగా అడిగితే, ఆమె బయటికెళ్ళగానే తన స్నేహబృందంతో పాపని తీసుకుని బ్లూ ఫిలింస్ చూసేవాడు. ఆ ఫిలింసు పాపకీ చూపించేవాడు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అతడు పనిచేస్తున్న పై ఆఫీసర్లకీ, పోలీసులకీ ఆమె ఫిర్యాదు చేసినా, ఎవరూ పట్టించుకోలేదు. ఆ రోజున పాపపై అఘాయిత్యం జరిగాక, ఆసుపత్రి డాక్టర్ల సహాయంతో ఆమె పోలీసు రిపోర్టు ఇచ్చి, ఆ శాఖకు చెందిన మంత్రిగారికీ, రక్షణశాఖ మంత్రికీ, ఫిర్యాదులు చెయ్యగా, అప్పుడు రంగంలోకి దిగారు అందరూ" అని ఆమె పేపర్లకిచ్చిన వార్త. అది చదువుతూవుంటే, పార్థూకి ఒళ్ళు గగుర్పొడిచింది. అసహ్యం వేసింది. 'అతడు మనిషా, పశువా, రాక్షసుడా, ఏది ఏమైనా పరమనీచుడు' అనుకుంటూ తరవాతి వార్తని చదవడం మొదలు పెట్టాడు.
"పక్కింట్లో టీ.వీ. చూడ్డానికెళ్ళిన మూడేళ్ళ పాపని, వాళ్ళింట్లో ఎవరూ లేకపోవడం చూసి, పద్దెనిమిదేళ్ళ యువకుడు ఆ పాపపై అత్యాచారం చెయ్యగా, ఆ పాప ఏడుస్తూ ఇంటికొచ్చి జరిగినది చెబితే, పోలీసులని పిలిచి అతణ్ణి అప్పగించిన కేసు."
ఈ రెండు వార్తలు పార్థు మనసుని కలిచివేశాయి. కంచేచేను మేసినట్టు, కన్నతండ్రీ; పొరుగింట్లో వున్నా పాపకి అన్నలాంటివాడో, బాబాయిలాంటివాడో, అతడూ, వావీవరసలు లేక, వయస్సుతో ప్రమేయం లేక, పసికూనలపట్ల వారి ప్రవర్తన ఏ మాటలో చెప్పాలో, ఏమని వాళ్ళని తిట్టాలో కూడా అర్ధం కాలేదు. పూర్వం వయస్సులో వున్న ఆడపిల్లల్ని మాత్రం, బయటికి పంపించడానికి భయపడేవారు. పసిపిల్లలు, వృద్ధులూ నిర్భయంగా కటికచీకట్లో కూడా బయటకు వెళ్ళేవారు. ఇప్పుడు మూడేళ్ళ పాపదగ్గర నుంచి, అరవై ఏళ్ళ ముసలమ్మ దాకా, పద్నాలుగేళ్ళ కుర్రాణ్ణి చూసి భయపడుతున్నారంటే అనాగరికత ఎంత ముదిరిపోయిందో చెప్పలేము. దీనికి కారణం ఏమిటని ఎవరైనా క్షణం ఆలోచిస్తే 'చెత్తసాహిత్యం, అంతకన్నా మించిన చెత్త సినిమాలు' అని అందరూ చెబుతారు. స్కూలు పిల్లల ప్రేమకథలూ, ముసలమ్మలు తిప్పుకుంటూ చేసే నాట్యాలూ ఎంత పెడదారిపట్టిస్తున్నాయో ప్రజల్ని, అందరికీ తెలిసినా ఎవ్వరూ దీన్ని ఆపడానికి ప్రయత్నించడంలేదు" ఈ మాటలే వర్ష వినేలా గట్టిగా అన్నాడు.
"అవును పార్ధూ! ఈ రెండు సాధనాలూ డబ్బున్నవాళ్ళ గుప్పెట్లో బందీగా వున్నయ్. వాళ్ళ ధ్యాసల్లా వాళ్ళ లాభనష్టాల లెక్కలూ, అడ్డదారిగానైనా కీర్తి సంపాదించి సన్మానాలు చేసుకోవడం, పదవులు పొందడం - అంతే! డబ్బిచ్చి ఈ విలాసాలు, విన్యాసాలు చూసే పిచ్చిజనం వున్నంతవరకు సెక్సు, హింసా - ఇలా ఉద్రేకపరిచే కథలనూ, సినిమాలనూ చూపిస్తూనే వుంటారు." భయంతో వణికిపోతూ, మేఘన బుగ్గల్ని నిమురుతూ పార్థూ చేతులని గట్టిగా నొక్కి పట్టుకుంది వర్ష.
ఆమె భయం అర్ధంచేసుకున్న పార్థూ, ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించాడు. "అందరూ అలా వుంటారా? పర్ పర్ టెడ్ ఫెలోస్, బ్రూట్స్ ఎవరో తప్ప. కమాన్! నీ మూడ్ ని మార్చుకో. అలా బయటికెళదాం పద" అంటూ మేఘనని ఎత్తుకోబోయిన పార్థుకి తన చేతులని అడ్డంగా పెట్టి తనే ఎత్తుకుంది వర్ష.
"వర్షా! ఏమిటిది? ప్రపంచంలో అనేకం జరుగుతున్నాయి. అన్నింటికీ అన్నీ మనకి వర్తించేలా చేసుకుంటే బతకలేము. అపోహలు మాను. నన్ను అనుమానిస్తున్నావా? మన చిట్టితల్లి మన కడుపు పంట! అది నీకెంత ప్రాణమో నాకూ అంతే! ఆ దరిద్రుడెవడో అలా చేశాడని, అందరు తండ్రులూ అలాగే వుంటారని అనుకోవడం అవివేకం. దరిద్రపు రోజుల్లో బతుకుతున్నాం కనుక, మనిద్దరం కలిసి బయటి ప్రపంచంవల్ల ఏ హానీ కలగకుండా చూసుకుందాం పద. అలా టాంక్ బండ్ వరకూ వెళ్ళొద్దాం. మేఘనకి బెలూన్ కొందాం" అంటూ మేఘనని వర్ష చేతిలోంచి తీసుకుని, కార్లో కూర్చోబెట్టాడు. మంత్రముగ్ధలా అతడి మాటలువింటూ, అతడి వెనకే నడిచి కార్లో కూర్చుంది. ఎర్రటి మారుతీ కారు, తారురోడ్డుకి అద్దిన తిలకంలా, రఁయ్ మని దూసుకుపోయింది.
మేఘన బెలూన్ కొంటూంటే అంటిపెట్టుకునుంచున్న వర్ష....విగ్రహాల దగ్గర ఆడుకుంటానని మేఘన మొరాయిస్తే, తను చెయ్యిపట్టుకుని నడిపిస్తూ కంటికిరెప్పలా అంటుకు తిరుగుతూన్న ఆ మాతృహృదయపు ఘోష ఎవరికీ అర్ధమవుతుంది? ఆ తల్లి గుండెలో ఎన్ని సముద్రాలు పొంగుతున్నాయో, ఎన్ని రైళ్ళు పరుగెడుతున్నాయో, ఆమె తలమీద ఎన్ని పిడుగులు పడుతూన్నట్టు వున్నాయో వర్ణించడం ఏ కవికీ చాతకాదేమో!....ఆలోచిస్తూ వర్ష భుజంమీద చెయ్యివేశాడు ప్రేమగా, జాలిగా, ఊరడిస్తూన్నట్టుగా! వర్ష ఉలిక్కిపడి చూసింది. "వర్షా! చదువుకున్నదానివి, అన్నీ తెలిసినదానివి, నువ్వే ఇలాబేలగా అయిపోతే ఎలా? చదువు సంధ్యలు లేనివాళ్ళు, అనాగరికులూ అలా పైశాచికంగా ప్రవర్తిస్తే అసలు, బతుకునే చూసి భయపడుతూ బతకడం కష్టం. అయితే, ఆ ప్రభావం మనమీద పడకతప్పదు. అటువంటి మృగాలకి బుద్దిచెప్పేరోజు, అటువంటి సాహిత్యాన్నీ చిత్రాలనూ అందిస్తూ అశ్లీలతకు నీరుపోసి పెంచుతూ, మానవత్వాన్ని, మానవతా విలువల్నీ మంటగలుపుతూన్న బూతురాయుళ్ళకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. గ్రామాలలోని యువతులు చీపురుకట్టలూ, రోకటి బండలూ తిరగేస్తే నేటి సారా ఉద్యమంకన్నా తీవ్రస్థాయిలో ఈ వ్యవస్థ మారిపోతుంది. మీ ఆడవాళ్ళందరూ ఐక్యం కావాలి! ఈ దుర్ఘటనలను ఆపే శక్తులు కావాలిగాని మీరు ఇలా భయపడిపోతూ, వొణికిపోయే అబలలు కాకూడదు! పద, ఏదైనా హోటల్ కెళ్ళి డిన్నర్ చేసి, మేఘనకి ఐస్ క్రీం తినిపిద్దాం" అంటూ కారు వైపు నడిపించాడు వర్షని చెయ్యిపట్టుకుని, మేఘనను ఎత్తుకుని పార్థు.
ఆ ఉపదేశం బాగా పనిచేసినట్టుంది వర్షకి. ఏదో ఆలోచిస్తూ, ఒక నిర్ణయానికొచ్చిన దానిలా, ధైర్యంగా కారులో కూర్చుంది.
పార్థూ ఆమెకేసి క్రీ గంట చూశాడు.
ఆ చూపులో చూపు కలుపుతూ చిన్నగా నవ్వింది వర్ష.
ఆ క్షణంలో వర్ష ఒక వనితగా, బేలగా కనిపించలేదు పార్థూకి.
ఒక సంస్థగా, ఒక శక్తిగా అనిపించింది!
కారు ట్యాంక్ బండ్ చల్లని గాలిని పీల్చుకుంటూ, జనాన్ని తోసుకుంటూ ముందుకు సాగిపోయింది.
