Previous Page Next Page 
శారదా అశోకవర్ధన్ కథలు పేజి 21


                                                      21. అమ్మమ్మల అందాల పోటీ !
    సృజనా బబితా వొచ్చి తాము నిర్వహించబోయే పడుచు అమ్మమ్మల పోటీకి తనని జడ్జిగా పిలవడం ఆనందాన్నీ ఆశ్చర్యాన్నీ కలిగించింది.  ఒకరకంగా  మామూలుగా  నిర్వహించే  మిస్ ఇండియా, మిస్ ఆంధ్రా, మిస్ కర్ణాటకా ఇలాంటి పోటీలు  తనకి ఇష్టమనిపించదు. ఫలానా  ఈ డ్రెస్సులోనే రావాలీ అనే రూలు  పెట్టకపోతే, ఎవరికిష్టమైన డ్రెస్సులో  వాళ్ళు, మినీఫ్రాక్స్, మినీస్కర్టూ ఇలా అనేకానేక అర్ధనగ్నమైన దుస్తుల్లో వొస్తారు. 'శరీరపు వొంపుసొంపులు చూపించడం, వేదికమీద తప్పకుంటూ నడవడమే, అందాలపోటీకి అర్హత,' అనుకుంటారు చాలామంది. నిజానికి తనూ  అలాగే అనుకునేది చాలాకాలం అరవింద. నిజానికి దానికి ఇరవై ఆయిదు మార్కులు మాత్రమేనని తను జడ్జీగా వెళ్లేంతవరకూ తెలీదు. మిగిలిన డెబ్బై అయిదుమార్కులూ, తన గురించి తాను చెప్పుకోవడం, తన అభిరుచుచేమిటో తన ఉద్యోగమేమిటో, తనలక్ష్యం ఏమిటో చెప్పుకోవాలి స్పష్టంగా! అక్కడే చాలామంది  అవుటయిపోతారు. తెచ్చిపెట్టుకున్న  పోకడతో  మాట్లాడడానికీ, అదొక స్టయిలనుకుని  భ్రమపడతారు. అక్కడే ఒస్తుంది తంటా! సహజత్వాన్ని కోల్పోయి, నాటకంలో  ఒక పాత్రలా కనిపిస్తారు. ఇక్కడ ఫెయిలయితే  యాభై మార్కులు పోతాయి. ఇక మిగిలిన  ఇరవై అయిదూ, ఆర్గనైజర్లు  చమత్కారంగా వేసే చిక్కుప్రశ్నలకి, చిటుక్కున సమాధానం చెప్పగలిగి వుండాలి. ఇది వారి సమయస్పూర్తికీ, చురుకుదనానికీ పరీక్ష. ఇందులో  నెగ్గినవారే బహుమతికి అర్హులు.
    అరవిందకి ఆ పోటోలో  కూర్చున్నంతసేపూ  భలే ఆనందంగా వుంది. మిస్ ఆంధ్రా, మిసెస్ ఆంధ్రా, ఇలా రకరకాల  పోటీలు  విందిగానీ నలభై ఐదూ యాభైమధ్యన  వున్న  "గ్రానీస్ ఆఫ్ ఆంధ్రా...." అనేపోటీ  తమాషాగా అనిపించింది. తమాషా  యేమోగానీ, ఈ పోటీకి  పెట్టిన మొదటి బహుమతి లక్షా, రెండవ బహుమతి, డెభైఅయిదువేలు, మూడవబహుమతి యాభై వేలు, పది పాతిక వేల రూపాయలు కన్సొలేషన్ బహుమతులు, అసలు "ఈ అమ్మమ్మల  బహుమతులెందుకు పెట్టారర్రా" అని అడిగితే, అమ్మాయి పెళ్ళయి వెళ్ళిపోగానే నిరుత్సాహపడుతూ, అందులోనూ అబ్బాయిలు లేని వాళ్ళయితే మరీ ఒంటరితనాన్ని ఫీలవుతూ  వుంటారు అలాకాక వారినీ ఏదో విధంగా  బయటికి లాగి  ప్రోత్సహించడానికే  ఈ పోటీలు పెడుతున్నామనీ, ఈ పోటీలో బామ్మలు పాల్గొనడానికి  అర్హులుకారనీ, ఏవేవో  కండిషన్లు పెట్టారు. వారు ఒంటరి తనాన్ని మర్చిపోవడానికి పోటీకి వొచ్చినట్టు నా కనిపించలేదు. అందరినీ ఆకర్షించింది లక్ష రూపాయలు. కనీసం కన్సొలేషనొచ్చినా  పాతికవేలు. ఈ బహుమతికి జిల్లాలనుంచీ, గ్రామాలనుంచీ కూడా ఎందరో వొచ్చారు.
    అచ్చతెలుగు అమ్మమ్మలాగా, ట్రెడిషనల్ గా రావాలని వారు ప్రకటనలో రావడంవల్ల, హవాయి చెప్పులూ, మొహానికి ఒంటికీ చక్కగా పసుపూ, రూపాయి కాసంత బొట్టూ, గచ్చకాయంత ముడి నుంచీ గుండ్రాయంత  ముడి వరకూ సిగచుట్లూ, ఎవరిని ఎలా  సెలక్టు చెయ్యాలో తికమకపడుతూ  వుంటే, ఆ పనిని ఒక కోటేశ్వరుడైన పురుష పుంగవుడికి ఇచ్చారు. ఆయనగారు ఠపీమని  రెండు వందల మందిని  క్షణంలో తీసిపారేసి, పాతిక మందిని సెలక్టు చేశారు. వారు రెండో రౌండులో, "నా మొగుడు దేముడు. అతడి స్ఫూర్తితోటే నేనీ పోటీలో  పాల్గొన్నాను. నా కూతురూ, నా  అల్లుడూ  కూడా నన్నెంతో ప్రోత్సహించారు. వారికి క్రుతజ్ఞతా పూర్వకంగా నాకు లక్ష రూపాయలొస్తే, తలాపాతిక వేలూ  ఇచ్చి మిగిలిన పాతికా  మా మనువడికీ, మనవరాలికీ ఇస్తానని చెప్పాను....వాళ్ళు ఎంత సంతోషించారో .... చెప్పడానికి మాటలు లేవు" అంటూ చేతులూ కళ్ళూ వొళ్ళూ తిప్పుకుంటా చెప్పిందావిడ.
    మరొకావిడ, నైటీలో ఒచ్చేసింది. "ఈ రోజుల్లో పనివాళ్ళు దొరకడంలేదు. అన్ని పన్లూ మనమే చేసుకోవాలి. పైగా, రాకరాక అమ్మమ్మ ఇంటి కొచ్చే బిడ్డకి ఏ పనీ  చెప్పలేము కదా. మనమే చెయ్యాలి. చీరా, లంగా అవన్నీ కాళ్ళకి తట్టుకుంటూవుంటాయి. ఒళ్ళంతా నైటీతో వుంటే పన్లు చేసుకోవడం సులభం అందులో తప్పేమిటీ? నన్ను  మా వారూ, మా అమ్మాయీ  అందరూ ప్రోత్సహిస్తారు. అసలు నన్నిక్కడికి ఎంత ప్రోత్సహించి పంపించారో" అంటూ వెళ్ళిపోయింది.
    అరవింద మనసు ఎటో పోయింది. ఏమిటీ ఈ ఆడవాళ్ళు? అందరూ తనని ప్రోత్సహించి పంపించారుట, ఎందుకని?  అందరి కళ్ళముందూ మెదిలేది. లక్ష....నోట్ల కట్టలు.... ఒక్కరోజు కాస్త బిడియం వొదిలేసి  లక్కును  పరీక్షించుకుంటే  లక్ష, పైగా లక్ష సంపాదించాలంటే, ఎంత కష్టపడాలి? పేకాటా, రేసుల్లో  కూడా బుర్రబద్దలు కొట్టుకుంటే తప్ప ఆట సాగదు.  అందుకే మగాళ్ళు హాయిగా  ప్రోత్సహించారు. అయినా ఆడవాళ్ళ మనస్తత్వం ఏమిటో అర్ధం కాలేదు అరవిందకి. ఒక పక్క స్వాతంత్ర్యం కావాలంటారు. అది పురుషుడే మనకిస్తున్నాడు అని పొంగిపోయి, అతనికి పాదాభివందనం చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఎలాంటి స్వాతంత్ర్యం కావాలి? వాక్ స్వాతంత్రమా? ఆర్ధిక స్వాతంత్రమా? లైంగిక స్వాతంత్రమా? విద్య, వివాహం, బిడ్డలను కనడం, ఎన్నో వున్నై. అవన్నీ  కాక ఏదో అర్ధం కాని తికమకలో పడిపోతున్నారు. 
    "మావారు ప్రోత్సహించారు. నేనొచ్చానూ  అని చెప్పడం ఆయన తనకి స్వాతంత్ర్యం ఇచ్చారన్న  సంతోషమా? తను పాల్గొన్నందుకు సంతోషమా? వాళ్ళకే తెలీని అయోమయా వస్థ. పైగా....లక్ష రూపాయల నోట్ల కట్టలు. నిజంగా  అవి చేతికొచ్చాక, భర్తకీ, బిడ్డకీ. మనవాళ్ళకీ ఇస్తారో, వారే వుంచుకుంటారో  తెలీదు. కానీ లక్ష కట్టలు అందరి కళ్ళల్లోనూ తిరుగుతున్నయ్, రంగుల రాట్నంలా.
    వీరే ఇలా వొచ్చినప్పుడు, అర్ధనగ్నంగా, విచ్చలవిడిగా నటించే సినిమా స్టార్ల గురించి, అలా వొచ్చే వ్యాపార ప్రకటనల గురించి హేళనగా మాట్లాడ్డం ఎందుకూ? అందరికీ వొళ్ళు చూపించో, కళ్ళు చూపించో  డబ్బుకావాలి. ఒకసారి ఒక వేశ్యని ఒక జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తుంటే  ఆమె ఇలా చెప్పిందిట - "నేను చేసే పనిమీద నాకెంతో  గౌరవం వుంది. మీకెందుకు  చిన్నచూపు? పెట్టుబడి పెట్టి  ఎందరో ఎన్నో వ్యాపారాలు చెయ్యడంలేదూ? నేను నా శరీరాన్ని  మదుపుగా  పెట్టి సంపాదించుకుంటున్నాను."
    ఆ మాటలకి ఆ జర్నలిస్టుకి మతిపోయి, ఏం చెప్పాలో తెలీక తూర్పు తిరిగి దణ్ణం పెట్టాడట.
    అరవింద ఆలోచనలకి బ్రేకు పడింది.
    మూడవ రౌండులో ముగ్గురు సెలక్టయ్యారు. లక్ష రూపాయలూ  గుడివాడ గృహిణి శ్రీమతి సుబ్బాయమ్మ కొచ్చాయి. హాలంతా  చప్పట్లు ఆమె సంతోషంతో  ఊగిపోతోంది. ఒక పద్యంలో శ్రీశ్రీగారన్నట్టు, పదహారేళ్ళ బాలుడు కన్నుకొడితే, అరవై ఏళ్ల ముసలమ్మ సిగ్గుపడిపోయి, పళ్లూడిన ఆ ముసలమ్మ చీర కుచ్చెళ్లు సర్దుకుందిట. అలాగే ఆవిడ పదిసార్లు పమిట చెంగుని సరిచేసుకుంటూ  పదహారేళ్ళ పడుచులా నుంచునుంది. పద్నాలుగేండ్ల సినీనటి కలువబాల, "మిసెస్ గ్రానీ....అమ్మమ్మా" అనే కిరీటాన్నీ మెడకి బ్యాండునీ తగిలించింది. డజను కెమెరాలూ, రెండు  జతల వీడియోలూ  గబగబా ఫోటోలు  తీసేశాయి. అలాగే వరసగా అన్ని బహుమతులవాళ్లూ వచ్చేశారు.  వేదికంతా ఫోటోగ్రాఫర్లూ, వీడియోవాళ్ళే! అంతా కోలాహలం! జనం....జనం....! ఎక్కడ చూసినా మనమూ వెళితే బాగుండేది. ఒక్కరోజులో లక్ష రూపాయలు ఎలా వస్తాయి?' ఇవే మాటలు.
    అరవిందకి గతం  గుర్తుకొచ్చింది. కాలసముద్రంలో ఎన్ని మార్పులు? గద్వాల చీరల ఎడ్వర్ టయిజ్ మెంట్ కోసం ఆ చీరెలో ఫోటోలు కావాలని ఎంతో మర్యాదగా ఒక పెద్దమనిషి ఇంటికొచ్చి అడిగితే, అమ్మా, నాన్నా, అమ్మమ్మ ససేమిరా కాదని అతణ్ణి పంపించేసి, అతను వెళ్ళిపోయాక తనని ఎన్ని తిట్లు తిట్టారో తలుచుకుంటే  ఇప్పటికీ ఏడుపొస్తోంది.
    అరవింద ఆ రోజు పాల్గొన్న  అమ్మమ్మల  నందరినీ  చూసింది. ఎంత మార్పు? అమ్మమ్మలంటే  నూనోడుతూ చెదిరిపోయిన జుట్టూ, నలిగిపోయిన బట్టలూ, వంటింటికి పరిమితమైపోయే నాటి మనుషులు కారు. కొత్త పాతాల కలయికతో మేలుగా తయారయిన అమ్మమ్మలు. నారీలోకానికే ఆదర్శమూర్తులు. తన బిడ్డకి బిడ్డలు పుట్టగానే  తన ఆశలూ, ఆదర్శాలూ  మాసిపోవాలా? మర్చిపోవాలా? అసభ్యంగా లేనంతవరకూ, అసహ్యాన్నీ - జుగుప్సనీ రేకెత్తించనంత వరకూ  ఏ వయస్సులోనైనా సరదాగా  వుండొచ్చును. ఇలా ఏమిటేమిటో ఆలోచిస్తూన్న అరవింద, అందరూ వెళ్ళిపోతూవుంటే తనూ సెలవు తీసుకుంది.
    "మారే కాలంతో  మనుషులు మారాలి! అందుకేనేమో, ఏ ఎండకా గొడుగు పట్టాలి అన్న సామెత పుట్టింది" అనుకుంటూ  ఇల్లు చేరుకుంది. ఆ క్షణంలో తను  ఇంట్లో కాలు పెడుతూ  వుంటే, పోటీకి జడ్జిగా వెళ్ళినట్టుకాదు, పోటీలోనే తను పాల్గొని ప్రయిజు తెచ్చుకున్నంత సంబరం వేసింది.    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS