Previous Page Next Page 
మహావృక్షం పేజి 22

అందుకే అనూష ఆ దంపతులకి గారాల పుత్రిక....ఆమె ఆడిందిఆట, పాడింది పాటగా పెంచినా,నడవడికలో,ప్రవర్తనలో భ్రమరాంబ క్రమశిక్షణ పాటించింది. చదువు విషయంలో ఫణిభూషణరావు ఖచ్చితంగా వుండడంతో అనూష మంచి క్రమశిక్షణగల, తెలివైనా, చురుకైన అమ్మాయిగా ఎదిగింది.
ఆటల్లో, చదువులో కూడా తనంతటిది లేదన్న పేరు తెచ్చుకుంది. ఫణిభూషణరావు నేర్పింది కొంత అయితే, ఆమెకి కూడా స్వతహాగా చదువు పట్లఎంతో శ్రద్ద ఏర్పడటంతో టెన్త్ క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది అప్పటిదాకా తన కూతురు బాగా చదువుకోవాలన్నాడేకానీ,ఏం చదివించాలో ఇదమిద్దంగా నిర్ణయించుకుని ఫణిభూషణరావుతన కూతురు స్టేట్ ఫస్ట్ రావడంతో ఆమెని డాక్టర్ ని చేయాలని నిర్ణయించుకున్నాడు....ఆయన ఆలోచనకి కొందరు స్నేహితులు కూడా మద్దతివ్వడంతో ఇంటర్ అనూషని బై.పి.సి తీసుకొమ్మని చెప్పాడు.
ఆయన మాట తుచ తప్పకుండా పాటించింది అనూష....ఇంటర్ కూడా డిస్టింక్షన్ రావడం, మెడిసిన్ లో సీటుకోసం ఎంట్రన్స్ రాయడం ఏం.బి.బి.యస్ లో చేరడం అంతా అనుకున్నట్టుగా జరిగిపోయింది. మెడిసిన్ లో చేరాక అనూష ఆలోచనల్లో అనూహ్యమైనా మార్పోచ్చింది.....చదువుతున్న సబ్జెక్ట్స్, చెప్తున్న ప్రోపెసర్స్ ఆమెలో వైద్యంపట్ల, వైద్యంవృత్తిపట్ల ఒక ఆరాధన కలగచేశాయి....
తండ్రికి మాటకి ఎదురుచేప్పలేక, ఆయనమీది గౌరవంతో ఏం.బిబి.యస్ లో చేరినా,చదువు ప్రారంభించాక, అందులో వున్న అనందం తెలిసింది.చేస్తున్న ప్రయోగాలు, కొత్త ఉత్సహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుండేవి ఇంకా ఏదో తెలుసుకోవాలని, ఇంకా ఏదో చేయాలని తపన కలుగుతుండేది.
మెడికల్ పుస్తకాలు పట్టుకుని, ఇరవై నాలుగు గంటలూ చదువుతూ కూర్చోడం, రకరకాల అనుమానాలను ప్రొఫెసర్స్ దగ్గరకు వెళ్ళి తెలుసుకోడం ఓ తపస్సులా చేస్తుండేది. అప్పుడే ఆమె తపస్సుని భగ్నం చేస్తూ పరిచయం అయ్యాడు ప్రశాంత్ కుమార్.
సరిగ్గా మొదటి సంవత్సరం పూర్తి అయి రెండో సంవత్సరంలో చేరిన తొలి రోజులు....
రోజుకో కారులో, ఖరీదైనా దుస్తుల్లో అందంగా, ఆకర్షణీయంగా   కాలేజీకి వచ్చే ప్రశాంత్ కుమార్  అంటే స్టూడెంట్స్ అందరిలో ఒక ప్రత్యేక భావం, గౌరవం అభిమానం, ఆకర్షణ వుండేవి. అతని చూట్టూ ఎప్పుడూ పదిమంది మూగివుండేవాళ్ళు. కోటీశ్వరుడు,నగరంలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయిన మాధవరావుకి ఎకైకాపుత్రుడు....మెడిసిన్ లో మొదటిసీటు అతనికిచ్చాకే, మిగితావారికి సీట్లు ఇచ్చారు.
ఆ విషయం కాలేజీ మొత్తానికి తెలుసు. అది చాలా సహజమైనా విషయంగా భావించారంతా. ప్రశాంత్ చాలా అందమైనా యువకుడు. డబ్బు తెచ్చిన నిగారింపు తో తళతళా మెరిసిపోతుండేవాడు.అతని స్నేహంకోసం అబ్బాయిలేకాక, అమ్మాయిలు కూడా చాలా మంది తపిస్తుండేవాళ్ళు.ప్రశాంత్ కూమార్ కి డబ్బు, అంతస్తు,అందంతో బాటు,తెలివితేటలు కూడా వున్నాయి. కానీ కష్టపడే తత్వం మాత్రం లేదు. అందుకే అతను డబ్బుతో సీటు కొనుక్కున్నాడు.
అతనికి తనపట్ల ఆకర్షితులవుతున్న వాళ్ళని చూస్తుంటే  చాలా గర్వంగా వుండేది....అందరితో స్నేహంగా మెలిగేవాడు....వాళ్ళద్వారా తన నోట్సులు ఎప్పటికప్పుడు తయారుగా వుంచుకునేవాడు. అతని నోటి నుంచి ఏ కోరిక  బైటకి వచ్చినా, తీర్చడానికి అందరూ  సిద్దంగా వుండే వాళ్ళు....
ఇంతటి ఆకర్షణీయమైనా వ్యక్తిని పట్టించుకోకుండా వున్నది ఓకే ఒక వ్యక్తి....ఆమె అనూష...ప్రశాంత్ కుమార్ అంటే ఎంత అభిమానం వుండేదో,అనూష అన్నా అంతే  అభిమానం వుండేది మిగతా స్టూడెంట్స్ కి...దానిక్కారణం ఆమె చాలా అందమైందే కాదు...ఎంతో తెలివైంది...ఎప్పుడూ శ్రద్దగా క్లాసెస్ అటెండ్ అవడం,కొత్త  కొత్త  ఆలోచనలతో,సందేహాలతో ప్రొఫెసర్లను ఆకర్షించి, వాళ్ళలో కూడా కొన్ని కొత్త ఆలోచనలకి ఆస్కారంఇస్తుండేది....ఆమె అడిగిన సందేహాలు తీర్చడానికి ప్రొఫెసర్లు మళ్ళీ పుస్తకాలను తిరగవేస్తుండేవాళ్ళు....ఆమె ద్వారా తను క్కూడా కొత్త విషయాలు తెలుస్తాయని చాలా మంది తెలివైనా స్టూడెంట్స్ ఆమెతో సన్నిహితంగా మసలేవాళ్ళు....ఆమె అంటే స్టూడెంట్స్ కేకాక, ప్రొఫెసర్లక్కూడా అభిమానం.....
అయితే కొందరు మాత్రం ఆమెని చెదపురుగు అనేవాళ్ళు....అలాంటి వాళ్ళలో  ప్రశాంత్ కూమార్   ఒకడు...వాళ్ళిద్దరూ మొదటి సంవత్సరం లో ఎక్కువగా మాట్లాడుకోలేదు. హలో అనే పలకరింపుతో తప్ప.... ఒక్కోసారి ఆమె నిర్లక్ష్యం అతడి అహాన్ని దెబ్బతీస్తుండేది....మెడికల్ కాలేజ్ మొత్తం తనని హీరోలా చూస్తూంటే ఈమేకి గర్వమా నన్ను పట్టించుకోదు అనుకునేవాడు...ఆమెకంత గర్వం అయితే నాకేం అనుకుని, తానూ పట్టించుకోలేదు...
అయితే, మొదటి సంవత్సరం ఫలితాల్లో అనూష ఒక్కాసారిగా ఎదిగిపోయింది....ఆ ఒక్క కాలేజీలోనేకాక, నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఆమె సాధించిన విజయం మోగిపోయింది....హెడ్ అఫ్ ది కార్డియాలజీ హరిశ్చంద్రగారు అనూషని కార్డియాలజీస్టు కావాల్సిందిగా ఆశీర్వదించి, ఆ రోజునుంచీ ఆమెని ప్రోత్సాహంచటం ప్రారంభించారు...
ఆ సంఘటనతో ప్రశాంత్ కూమార్ కి కూడా ఆమెపట్ల ఒక ఆరాధనా భావం కలిగింది_ అతనంతట అతనుగానే ఆమెని పలకరించి, అభినందనలు అందచేశాదు....
ఆనూషకూడా స్నేహపూర్వకంగా స్పందించింది....
"కంగ్రాచ్యులేషన్స్ ఆనూషగారూ...ఇన్ని రోజుల్నించీ నేనే ఈ కాలేజీకి హీరోని అనుకున్నాను...అఫ్ కోర్స్ నేననుకోలేదు. వీళ్ళంతా నన్ను అలా అనుకునేలా చేశారు....ఇప్పుడు మీ ముందు నేను చాలా గిల్టీగా ఫీలవుతున్నాను...."అన్నాడు.
"ఎందుకు గిల్టీగా ఫిలవ్వడం" మీకేం తక్కువ?" మృదువుగా అంది అనూష.
"తెలివితక్కువ...."గల గలా నవ్వాడు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS