Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 22


    "నీకాలం విలువ... నువ్వు తీసుకునే డబ్బు మాకు తెలియజెప్పావు. అంతకంటే మాకేం అక్కరలేదు. అయిదేం ఖర్మ... పదివందలు తీసుకో" అన్నాడు సామంత్ ఆమె అందచందాల్ని పరిశీలనగా చూస్తూ.

 

    "మాటంటే మాటే... ఆ మాటమీదే వుండాలి. వెయ్యి యిస్తానన్నారు ఇప్పుడే. మాట తప్పరుగా?" ఆ అమ్మాయి ఆత్రుతగా అంది.

 

    "మన మాటకి తిరుగేలేదు" సామంత్ స్థిరంగా అన్నాడు.

 

    "అడ్వాన్స్ గా అయిదొందలు యిప్పించండి" అందామె ఆనందంగా.

 

    "ఇవ్వవోయ్ కత్తుల కనకారావు" దబాయింపుగా అన్నాడు.

 

    అప్పటికే తిక్క ఎక్కి వున్న కనకారావు విసురుగా లేస్తూ "పిచ్చ పిచ్చగా వుందా? ఖర్చులు పెట్టుకుని ఐదొందలని చెప్పి ఈమెను తెచ్చాడు నా మనిషి. నువ్వేమో అడ్డగోలుగా ఆమె రేటు పెంచి అన్నమాట తప్పని హరిశ్చంద్రుడిలా ఫోజు కొట్టావ్. ఎవడి జేబుకి చిల్లుపడుతుంది?" అన్నాడు.

 

    "మరోమాట మాట్లాడకుండా అడ్వాన్స్ ఐదొందలు ఇవ్వు. ఆడపిల్ల ముందు నాపరువు తీశావంటే నీ కాళ్ళు విరగ్గొడతాను" సామంత్ శాంతంగానే అన్నాడు.

 

    "ఇవ్వను...ఇవ్వను గాక ఇవ్వను"

 

    కనురెప్పపాటులో సామంత్ శివంగిలా కనకారావుకేసి దూకి అతని గొంతు పట్టుకున్నాడు.

 

    అతనంత చురుకుగా కదులుతున్నాడని కాని, అలా చేస్తాడని కాని ఊహించని ఆ యువతి, ఆమెను తీసుకువచ్చిన వ్యక్తి, కనకారావు- ఎవ్వరూ ఊహించలేదు. కనకారావు ఊపిరందక గిజగిజ లాడుతున్నాడు. మిగతా యిద్దరూ ఏం చేయాలో తెలీక చేష్టలు దక్కి నిల్చుండిపోయారు శిలల్లా.

 

    "నేను సరదాగా ఉన్నంత వరకే వుంటాను. మాట తేడా వచ్చినా, అడ్డదిడ్డంగా వ్యవహరించినా పీక పిసికి చంపేస్తాను. నా ముందు ఎదురు సమాధానం చెప్పిన ఎవడూ కాలో, చెయ్యో త్యాగం చెయ్యకుండా ఇంత వరకు వెళ్ళలేదు. సరదాగా మాట్లాడుతున్నానని నా భుజాలెక్కి స్వారీ చేయాలనుకున్నావో మరిక నువ్వు మిగలవు!" అప్పటికే కనకారావు గుడ్లు తేలయడంతో వదిలేశాడు సామంత్.

 

    ఇప్పుడు కనకారావు కళ్ళలో చావు భయం, అందోళనా తొంగిచూశాయి.

 

    "అమాయకురాలైన ఒక యువతిని, ఆమె నాయనమ్మను మోసం చేయడానికి మీరిచ్చినంత ఎమౌంట్ కి నేనొప్పుకోవాలి. నన్ను అకారణంగా హింసించిన దుర్మార్గుడు ఎస్.ఐ. నరసింహాన్ని శిక్షించడానికి కూడా మీరు నిర్ణయించిన ఎమౌంట్ కే ఈమె ఒప్పుకోవాలి. ఇలా ప్రతిసారీ మీ మాటే నెగ్గించుకుంటూ నా అహాన్ని దెబ్బ తీశారో అప్పుడు చూపిస్తాను నా సత్తా ఏమిటో..."

 

    సామంత్ వున్నట్టుండి అంతా కోపిష్టిగా మారతాడని, అతని మనస్తత్వంలో అంత తీక్షణత వుందని కాని ఊహించకపోవడంతో కనకారావు తొలిసారి షాక్ తిన్నాడు.

 

    మౌనంగా జేబులోంచి అయిదువందల నోట్లు తీసి ఆ యువతికి అందించాడు.

 

    "మరీ ఆడవాళ్ళ దగ్గర కూడా ఇంత పీనాసిగా వుంటే ఎలాగోయ్ కత్తుల కనకారావు?" నవ్వుతూ అన్నాడు సామంత్.

 

    అంతలోనే కోపాన్ని మర్చిపోయి నవ్వుతూ మాట్లాడుతున్న సామంత్ ని చూసి మరోసారి షాక్ తిన్నాడు కనకారావు.

 

    ఇదెలా సాధ్యం?

 

    ఇతనికి కోపం వస్తే ఆ కోపం తాలూకు ఛాయలు కొద్దిసేపయినా నిలబడవా?

 

    "నేను గంటలో తిరిగి వచ్చేస్తాను. ఈలోపు నువ్వేం కంగారుపడవద్దు" అని ఆ యువతికేసి చూసి తనతో రమ్మన్నట్టుగా సైగ చేస్తూ ఆ గదిలోంచి బయటకు నడిచాడు సామంత్.

 

    ఆ యువతి సామంత్ వెనుకే మంత్రించినా దానిలా వెళ్ళిపోయింది.


                                                      *    *    *    *


    సరిగ్గా పై సంఘటన జరిగిన గంటకి పోలీస్ స్టేషన్ లో ఫోన్ రింగయింది.

 

    ఆ సమయానికి ఎస్.ఐ.నరసింహం తలవంచుకొని ఏదో రాసుకుంటున్నాడు.

 

    పక్కనే వున్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్.ఐ. ఫోన్ ఎత్తుతాడేమోనని ఒకింతసేపు ఆగాడు.

 

    అలాంటి సూచనలేం కనిపించక పోవడంతో తనే వెళ్ళి ఫోన్ తీసి "త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ హియర్" అన్నాడు వినయంగా.

 

    "ఆయన్నున్నారా?" ఓ స్త్రీ కంఠం మార్దవంగా వినిపించింది.

 

    "ఆయనా... ఆయనెవరు!" బిత్తరపోతూ అడిగాడు కానిస్టేబుల్.

 

    "ఆయనే..." ఆమె కంఠంలోని తియ్యదనం చిత్రంగా అనిపించింది కానిస్టేబుల్ కి.

 

    ఎవరీమె? ఎస్.ఐ. ఇలాకీనా? లేక పాతకేసా? ఈ గొంతు ఎప్పుడూ విన్నట్లు లేదే?! ఫోన్ ని చెవికానించుకొని ఆశ్చర్యపోతున్న ఆ కానిస్టేబుల్ పేరు సత్యం.

 

    "చెప్పమ్మా... ఆయనెవరు? లాకప్ లో వున్నాడా? పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్నాడా?" సత్యం మర్యాదగానే అడిగాడు.

 

    "ఛీ...పో... నాకు సిగ్గుబాబు... ఎలా చెప్పను?" అందామె.

 

    సత్యం ముసిముసిగా నవ్వుకుంటూ "అంత సిగ్గయితే ఎవరికని ఫోనివ్వను? చెప్పమ్మా ఫర్వాలేదు."

 

    "నేను చెప్పను పో..." అని వినిపించింది ఆవేపు నుంచి.

 

    "ఇదెక్కడి సోద్యమమ్మా తల్లి... ఎవరు కావాలో చెప్పమంటే ఆయనా అంటావు. ఆయనెవరంటే పుట్టెడు సిగ్గంటావు. ఎలా చావను? పోనీ ఆయన పేరులో మొదటక్షరం చెప్పు" సత్యం ఎవరితో మాట్లాడుతున్నాడా అని పక్కనున్న కానిస్టేబుల్స్ ఆశ్చర్యపోయి చూస్తున్నారు.

 

    ఎస్.ఐ. నరసింహం ఇవేవీ పట్టనట్లు డైరీ రాసుకుంటూ వెళుతున్నాడు.

 

    "ఎన్" అందామె ఆవేపు నుంచి.

 

    "ఎన్నా? నారాయణ?"

 

    "ఛీ...ఛీ..."

 

    "నాగులా?"

 

    "ఛా...ఛా..."

 

    "నూకరాజా?"

 

    "దిక్కుమాలిన పేర్లన్నీ చెబుతావేం?" ఆవేపు నుంచి కసురుకోవడం వినిపించి సత్యం బుర్ర గోక్కుంటూ "ఎన్...కాదు, ఎస్ కదూ? ఎస్ అయితే సత్యం" అన్నాడు కావాలనే.

 

    "నీ పేరులోని మొదటి అక్షరం ఎస్. అవునా?" నవ్వుతూ అందామె ఆవేపు నుంచి.

 

    సత్యం ఉలిక్కిపడ్డాడు.

 

    దొరికిపోయిన దొంగలా నాలిక కరుచుకొని "ఎలా కనిపెట్టావు?" అన్నాడు అంతకంటే అమాయకంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS