Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 21


    మొన్న నా ముందు గేదె పచ్చగా , నవనవలాడే గడ్డిని కురుకు కరుకుమని మేస్తోవుంటే చూస్తో కూచున్నాను. సగం తెగిన ఆ గడ్డి తీక్షణమైన బాధ నా నరలలోనే తప్ప ఆ గడ్డికి లేదంటారా, శాకాహార గర్వంధులారా? మృగాల కంఠాలు తెగినప్పుడు తన్నుకుంటాయే ఆ బాధంతా మీ మనస్సుల్లోనే గాని,  కంఠం తెగిం తరవాత,  మెదడు వేరైనా తరవాత బాధ ఎట్లా వుంటుంది! మీ గొప్ప కోసం మీ అబద్దపు ప్రచారం గాని! పైగా ఆవు చాల సాధువు. జీవహింస చేయ్యదంటారు౧ పిచ్చి కని పట్టుకునే పిల్లిని తరుముతారు. ఈ సుందర లోకంలో యీ నవనవలాడే గడ్డినంతా ధ్వంసం చేసే యీ ఘోర ఘాతుక మృగాల్ని గోవుల్ని ఎక్కడ చూస్తె అక్కడ వెంటనే హత్య చెయ్యాలంటాను నేను! లోకమే హత్యామందిరం. దాంటో ఒకటి సాధువు. ఒకటి క్రూరము. ఒకటి శాకాహారి , ఒకటి మాంసాహారి. ఏమిటీ వెర్రి విభజన! అమాయకంగా భూమి అడుగున నివసించే పురుగు కుటుంబాలని అమాంతం , భర్త నించి భార్యని, తల్లి నించి పిల్లని విడదీసి మింగే యీ కోళ్ళని చంపాలా! చంపి రూపు లేకుండా వేముకలతో సహా, కూరవొండి నమిలి మింగేయ్యాలా!
    ముఖ్యంగా సౌందర్యంలో , యీ అశాంతిని కలిగించే శక్తి విశేషంగా వుంది. ఆలోచించగా ఏమనిపిస్తుందంటే యీ సౌందర్యాన్ని ఆకర్షకంగా చేసే సూత్రం వుందే , దాంటో సౌందర్యం నించి మనసుని , సౌందర్యాన్ని మించి, ఆ వస్తువుకి ఆ సౌందర్యాన్ని కల్పించే శక్తి దగ్గిరికి , యీ బాధద్వారా దృష్టిని మళ్ళించే ప్రయత్నం వుందేమో! ఈ జీవశక్తి మల్లేనే మనసు కూడా నిరంతరమూ evolve ఎవాల్వు కావాలని యీ సృష్టి ఉద్దేశ్యం ఐ వుంటుంది. అందువల్లనే దేనిలోనూ తృప్తి పడక , వూరికే అశాశ్వతమై ఎప్పుడూ మారే ఆశలతో, ఆరాటపడుతూ వుంటుంది మనసు. చేతికి దొరకగానే తళతళ మెరిసే నక్షత్రం కూడా పిచ్చిగాజు ముక్కగా మారుతుంది, లేకపోతే పెద్ద మంటై వెళ్ళని కాలుస్తుంది. ముఖ్యం స్త్రీ సౌందర్యం. మనం పొందే , చివరికి అద్భుతమైన రసికుడు పొందగల , అనుభవం తరవాత కూడా -- 'ఇంక ! ఇంకేం చెయ్యను?' అనే నిరాశ తోస్తుంది. ఈనాడు చాలామందికి తోచదు ఆ నిరాశ. ఎందుకంటె స్త్రీ సౌందర్యం విలువలేదు, వాళ్ళ వేళ్ళల్లో! నిలవ కలిగిన నాడు తప్పదు యీ బాధ.
    ఈ అసంతుష్టి, యీ అన్వేషణ, సౌందర్యాన్ని వెతికి తెచ్చుకుంటారు, తెచ్చుకుని త్వరలో వొదిలి కొత్తదానికి వెతుకుతారు. దీన్నే ప్రపంచం చంచలత్వమంటుంది - ఇది artistsలో (అంటే సౌందర్యారాధకులలో) ఎక్కువగా వుంటుంది. సౌందర్యం ఎవరిని కదిలించలేదో, ఎవరికి సౌందర్యం చాలా స్వల్పవిషయమో, వాళ్ళకి అర్ధం కాదు కాని బాధ! తక్కిన వాళ్ళ మల్లె సుఖంగా బతకాలని , కుటుంబాలు చెయ్యాలని, ఆస్తీ కీర్తి సంపాయించాలని లేక కాదు. చెయ్యలేడు. లోపలి అగ్ని నిలవనీదు. ఎండమావులమల్లె పిలుస్తో తీసుకుపోతుంది. ఎండమావులని తెలిసి కూడా నడుస్తాడు కళ్ళు మూసుకు ధ్యానిస్తో. వేశ్యల ముంగురులలో, మోసకత్తెల అధరామృతాలలో, తాగుడులో, పిచ్చిలో , మూర్ఖుడై బాధ నివారణ కోసం ప్రయత్నిస్తాడు. వీళ్ళని లోకపు వెలుగు కాగాడాలని వేగుచుక్కల్ని, చీలుస్తుంది, నవ్వుతుంది, తరుముతుంది, వెర్రి లోకం. ఈ artists మనసులో విలువలు వేరు. ఆశలూ , స్వప్నాలూ అనంతం. ఆ గుణం వాళ్ళు ఆరాధించే సౌందర్య దేవతలోనే వుంది.
    కొన్ని వస్తువులు అసలు అందంగాను; కొన్ని అందవికారం గానూ ఎందుకు కనపడాలీ? సౌందర్య శాస్త్రకారులు అనేక కారణాలు చెపుతారు. వాటికేం గాని- మొత్తానికి అందాన్ని మనస్సు కల్పించుకుంటోంది. మనస్సుని మార్చిన కొద్ది, ఇదివరకు కనపడని అందాల్ని చూడగలుగుతామేమో! అంతేకాదు. ఇదివరకు అందవికారంగా కనపడేవి ఇప్పుడు అందంగా కనపడడమూ, అందంగా వున్నవి , ఇంకా అందంగా కనపడడమూ సంభవించవొచ్చు. ఆలోచించగా ఆలోచించగా ఒక plano ప్లేన్ లో అందవికారమనేది వుండదేమో, అంతా అందమే తోస్తుందేమో అనుకుంటాను. జేర్రిని చూస్తె చాలా అసహ్యం నాకు! (తెనాలి 'జెర్రి' నిన్ను చూస్తె కాదు. నీవు జేర్రివి కావు jerry వి) భయం కూడా. కాని నా (feelings) ఫీలింగ్స్ నించి విడతీసి ---చాలా కష్టమది - జేర్రిని విడిగా లోకంలో ఒక వస్తువుగా చూస్తె , జెర్రి గంభీరమైనది, అందమైన జీవి. కాని పూర్వజన్మనించో, నా చిన్నతనం నుంచి నా పూర్వలనించో యీ భయాన్ని నా మనసు తెచ్చుకుంది. అట్లానే యీ అందాల ఆకర్షణ కూడా యుగయుగాల నించి నా మనసు నేర్చుకుంది క్రమక్రమంగా.
    అంతేకాదు మనం దుర్మార్గం, నీచం, పాపం, అంటామే ఆ గుణాలన్నీ కూడా మంచి గుణాలేనెమో! మంచిగుణాలే, స్తలకాల భేదాలవల్ల అట్లా చేడ్డవైపోయినాయి. డబ్బు దాచుకోడం మంచిదే ; పూడ్చి పెట్టడం తప్పిపోయింది. ఒక్క స్త్రీ మీది కామం మంచిదే. రెండో స్త్రీ మీదిది చెడ్డడయింది. మనకు కలిగే లాభనష్టాలనించి గునాల్లోని మంచి చెడ్డల్ని నిర్ణయిస్తాము. మనకి ఉపయోగపడెట్టు అబద్దం చెపితే త్యాగం. మనకి అపకారం కలిగేట్టు నిజం చెపితే కూరత్వం. ఈ గుణాల విభజన మనసు నేర్చుకున్న అలవాటు. కాలమూ, దూరమూ, పెద్దా, చిన్నా, యివన్నీ మన మనసు చిన్నతనంలో నేర్చుకున్న అలవాట్లు. అవన్నీ వుత్త కంటి - చేతి (eye and hand) భ్రమలంటే నమ్మడం కష్టం. ఈ అందాలూ గుణాలు, పుణ్యాలూ అంతే.
    సృష్టి సౌందర్యానికి స్త్రీ సౌందర్యానికీ భేదాలు చెపుతారు కొందరు మిత్రులు. స్త్రీ సౌందర్యంలో వాంఛ వుంటుందిట సృష్టి సౌందర్యంలో వాంఛ వుండుదుట. కాలం గడిచిన కొద్ది నాకు భేదం కనిపించడంలేదు. ఈ సౌందర్యమంతా వొక్కటే ప్రతి చోటా కన్ను కన్పించుకొంటున్న ఇంద్రజాలం ; చాలా సుకుమారమైన, వాంఛనీయమైన , ఇంద్రజాలం. ఇంద్రజాలమని తెలిసి నా కూడా మాయ చెదిరిపోనీ, అనందం వీడని, ఇంద్రజాలం. సౌందర్యమూ, ఆనందమూ, మాయ కావు. అందవికారమూ, అసహ్యమూ, మాయ - అన్నీ సుందరమైన వస్తువులు. వాంఛనీయమైనవి ఐ పోవాలి మనసుకి . స్త్రీ నించి గాని, దేని నించి గాని విరక్తి కాదు కావలసింది . ప్రతి దానిలోనూ ఆసక్తి కావాలి. ఆ అభివృద్ధి స్త్రీ నించి పొందే ఆనందాన్ని ఆకాశపు నీలత్వంలోంచి , నీళ్ళ చల్లదనంలోంచి , గడ్డి మెత్త దనం లోంచి , పువ్వుల మెరుపులోంచి పొందాలి. ఇవన్నీ స్త్రీ అందం అంత ఆనందాన్ని నాకు యివ్వాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS