భూమిని, సూర్యుడు కాల్చిన స్తలాల , మానవుడు తవ్విన ప్రదేశాల, గాయాల్ని యీ కొత్త పచ్చిగడ్డి కప్పి వోదార్చింది. ఈ వానలకి ఎడారిలాగై పోయిన యీ సీను కొత్త అందాలతో కలకల లాడుతోంది. చివరికి యీ బురద తాలూకా కూడా, ఏమీ ఆకర్షణ లేదనుకున్న భార్య ఒకరోజు ఆకుపచ్చ చీర కట్టుకుని ఎన్నడూ లేని శృంగారాన్ని ఎరుపు తెచ్చుకున్నట్టుంది. అట్లా చూస్తె ఎప్పుడో వొకప్పుడు ఎట్లాగో ఓలాగు ఎక్కడో అక్కడ అందంగా కనపడని దేశమూ, స్త్రీ వుండదనుకుంటాను. సహారా లోనూ టండ్రాలలోనూ కూడా భయంకరమైన అందం వుంది కద? అట్లానే జుమ్మాలోనూ , తాటకిలోనూ, చిన్నమ్మలోనూ, పూతనలోనూ వుండదా? మొన్ననే ఎవరో చెపుతున్నారబ్బా , పూతన రొమ్ము మీద కృష్ణుడు కూచుని ఆడుకునే దృశ్యం చాలా కాలం మనసుని బాధించిందని!
నా వుద్యోగమూ తనిఖిలూ మరిచి , బస్సులోంచి దూకి ఆ గడ్డిలో పడుకోవాలనిపిస్తుంది. ఆ గడ్డిలో చీమలూ, పురుగులు, అక్కడక్కడ ముళ్ళూ , అడుగున బురదా, యివన్నీ ఉన్నాయని తెలీక పోలేదు . ఐనా ఆ ఆశ పోదు. సౌందర్యం మీది ప్రేమ అట్లాంటిది. భర్త హరీ, తోటి నీతి భోధకులూ ఎంత మొత్తుకుంటే ఏం లాభం? -- వుత్త మాంసమనీ , చర్మపు పై మేరుగనీ, రోగాలనీ, భర్తలతో తగాదాలనీ , అందమూ, సంతోషమూ, స్నేహమూ, మోహమూ ఇట్లాంటి భావాలు ఒక రకం. త్యాగమూ, భయమూ, పాతివ్రత్యమూ, జెలసి, దేశభక్తి, దేవుడూ , ఇట్లాంటివి రెండో రకం. ఇవన్నీ శాస్త్రరీత్యా పరిశీలించి చూస్తె , నిజం కావనీ , కల్పతాలనీ, ఆధారం లేని స్తేన్టి మెంట్లని తెలుస్తుంది. కాని మొదటి రకం భావాలలో వాస్తవత్వం లేదని తెలుసుకుంటే జీవితం సారవిహీనం నిష్పలం, దుర్భరమౌతుంది. రెండో రకం భావాలలోని అసత్యం తెలుసుకుంటే జీవితం సౌఖ్యప్రదమౌతుంది.
కాని యీ రసాలనీటినీ, రెండు రకాల వాటికి సంబంధం. వుంటే రెండూ కలిసి వుంటాయి. నాశనం చేస్తే రెండూ పోతాయి. వేదాంతం వీటినన్నిటినీ , లోకాన్ని కూడా కలిపి , అతని మాయ అనేసింది- ఇవన్ని మాయ అనుకునే వేదాంతిలో సహా. వయస్సు కూడా యీ లోకంలోని పదార్ధాలని , అణువుల చేరిక అనీ, వాటి గుణాలన్నీ మనసు కల్పించే అలవాట్లనీ నిర్ణయించింది.
తర్కం వల్ల. శాస్త్రం వల్ల, విజ్ఞానాభిసృద్దికై , నిజస్వరూపాన్ని మనసులో తెలుసుకుంటారే గాని , తిండీ, చెత్తా అంతా అణువు లేననీ, తన్ను మోహించిన స్త్రీ కుళ్లే మాంసమనీ, ఆ మాంసం పురుగులనీ, ఎవరూ ప్రవర్తించరు. ఆకాశమనేది , రంగుల నేవీ, ఏమీ లేవని 'సయస్సు' ఎంత ఘోషించినా, ఏమి లేని వాటి వంక చూడడం ఎందుకు అని వర్జించే మూడుడు వుంటాడా? తేలుకుడితే, 'ఇదంతా మాయ' 'తేలు మాయ' అనే వేదాంతిని చూశారా? ఎందుకంటె ప్రపంచమంతా మాయ అయినా, అనుభవం మాయ కాదు. ఆ అనుభవాన్ని కలిగించే అందాలు, విచారాలు, అంతకన్న మాయ కావు. 'నేను' వుండడం వాస్తవమయితే, యివన్నీ వెంటనే వుంటాయి. 'నేను ' లేదంటావా? అని నన్ను ఖండించడానికి నువ్వు లేవు. లేకుండా పో ముందు. తరవాత విమర్శిద్దువు గాని.
ఈ సృష్టి, యీ సౌందర్యం ఎంత ఆకర్షకంగా వుంటుందో అంత బాధ పెడుతుంది. మనస్సునే కాదు --- ఆ బాధ నరాల్ని లాగడం Feelఫీలవుతాను. (అయ్యంకి వెంకట రమణయ్య గారు నన్ను యింగ్లీషు మాటలు వ్రాయ వొద్దన్నారు. వ్రాస్తే తెలుగు లిపిలో కూడా వ్రాయమన్నారు. ఈ feel అనే మాటని ఎట్లా వ్రాయమంటారో! ఇప్పుడు అయన పెద్ద నవ్వు పెద్ద మీసాల్లోంచి తప్పించుకొని చెవుల్లోకి చేరడం వినపడుతోంది) Walter pater వాల్టర్ పేటర్ తాను నిగ్రహాల్నీ , పటాల్నీ చూస్తో ఇంకే ఆనందమూ కోరకుండా జీవితం గడపవొచ్చంటాడు. కాని ఈ అందమంతా నాకు బాధ . అందవల్లనే అందమైన ప్రదేశాలనీ మనుషుల్నీ చూడాలని వుండదు. ఈ పొలాలలో పనిచేసే కుర్రాళ్ళ కండరాల మీద ఎండ మెరిసేప్పుడు దగ్గిరికి పోయి చూస్తో నుంచోవాలనిపిస్తుంది. కాని ఆనందం వల్ల కాదు, బాధ వల్ల. సైకాలజీలో బాధలో అనందం వుందన్నారు. పుండు చుట్టూ గోకడం లాగు. అట్లాంటిదేమో! కాదు -- బాధ , ఆనందమూ ఐక్యమౌతాయే- యీ ద్వందాలు - ఆ ఆధ్యాత్మీక స్వరూపం యీ సౌందర్యం. కాని వాల్టర్ పేటర్, కళ నించి శుద్ధ ఆనందాన్ని పొందవొచ్చునంటాడు. నా స్వభావం అతనినించి వేరొ లేక నా art- sense కళాభిరుచి (రామణయ్య గారూ నన్ను చాలా తిప్పలు పెడుతున్నారు మీరు) యింకా అభివృద్ధి చెందాలో! చేతులు లేని వీనస్ విగ్రహాన్ని గంటల కొలది రోజుల కొద్ది అట్లానే చూసి దీపం దగ్గిర కీటకాలవలె విడవలేక (దీపం దగ్గిర కీటకాలని చూస్తె నాకు చాలా యిర్ష్యా , ఎంత అనందమో , ఎంత ఆకర్షనో! అంతం ఆ దీపంలోనే -- ఆనందమయమైన మృత్యువులో . అట్లా స్త్రీలో మాడిపోగలిగితే ! ఏమో జగత్ ప్రేయసిలో (ఊర్వసి లోకాదు, క్రిష్ణశాస్త్రి గారూ) అట్లానే భగ్గుమని లీనమైపోతామేమో!) ఆగి, చివరికి పిచ్చెక్కిన రసికులున్నారట. ఆ వీనస్ బొమ్మను ఆ కంఠం కిందినించి తొడలపై వరకు చూసిన కొద్ది పిచ్చెక్కి నట్టవుతుంది. నాకు కూడా! ఏమిటీ బాధ అని తర్కించగా తర్కించగా సౌందర్యంలోనే ఆ గుణం వుందనిపిస్తుంది. నేను కాదు వాల్టారు స్థితికి రావలసింది. ఆ పెటరే , నా స్థితికి రావాలి. సౌందర్యాన్ని, పాటలో కాని, పటం లో గాని , సృష్టిలో గాని, మనిషిలో గాని ఆనందిస్తున్నా మంతారే, వాళ్ళు ఎంతవరకు ఆనందిస్తున్నారో ఎవరికీ తెలీదు. మనం తీసుకోగలిగింది మన సంస్కారం మీద ఆధారపడి వుంటుంది. ఈ రసానుభవం ఒకరిని ఇంకొంతో పోల్చి తూచి ఎక్కువ తక్కువల నిర్ణయించడానికి వీలులేనిది. ఎవరికి వారు తమ అభివృద్దిని కొలుచుకోవలిందే. ఈ విషయం తెలీకనే యీ వాదనలూ, తర్కాలూ తగాదాలూ. Tastes లో appreciations లో, experiencess లో , తగాదా లాడడమంత బుతక్కువ ఇంకోటి లేదు. కాని గొప్ప మేదావంతులే బుద్దిమంతులే చేస్తో వుంటారు ఆ పని.
ఆనందించే గుణం హెచ్చిన కొద్ది ఒక stage లో సౌందర్యం బాధపెట్టడం ప్రారంభిస్తుంది అనిపిస్తుంది. నా అనుభవాన్ని. ఇతర కళారాధకుల అనుభవాన్ని పట్టి చూస్తె వీరి తరువాత stage లో గొప్ప అనందం గా మారుతుందో, అసలే సుఖ బాధలు లేకండా మాయమవుతుందో!
ఈ Life on earth యీ సౌందర్య విద్యలో నిరంతరానేషణలు చేస్తోందేమో , self improvement కోసం అందునల్ల నేనేమో ఏ వొస్తువులోనూ కూడా చిరమై తృప్తినిచ్చె గుణమూ లేదు, ఏ ప్రాణిలోనూ తృప్తి పడే స్తిమితమూ లేదు. ఈ లోకంలో ఏ వస్తువుకి కూడా చిరమైన తృప్తినిచ్చే గుణం లేదు. చివరికి జడత్వంలో కూడా. ఎందుకంటే యీ జడత్వం, యీ రాళ్ళు, యీ మట్టి , తిరిగి తిరిగి యీ గడ్డిలోకి విచ్చి, పొంగి బద్దలై జీవితాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు (సైయిన్సు వోప్పుకోదులెండి) కనిపిస్తుంది. ఏ శక్తో ఆ గడ్డిని సృష్టించి జీవనాన్ని కల్పిస్తున్న సౌఖ్యాన్ని పొందుతున్నట్టు తోస్తుంది.
