తిట్టిన తిట్టు తిట్టకుండా తిడ్తా
"బర బర బర బర..."
ఒకటే శబ్దం!
శాంతమ్మకి విసుగేసింది. వంటింట్లోంచే గట్టిగా కేకేసింది.
'ఒరేయ్ నానీ... ఏంట్రా ఆ శబ్దం... వెధవ రేడియో... వెధవ రేడియోనీ... దాన్ని సరిగా ఎడ్జస్టు చేసి తగలడు..."
"ఆ బర బర శబ్దం రేడియో చేస్తుంది కాదమ్మా." హాల్లోంచే అరుస్తూ సమాధానం చెప్పాడు నానిగాడు.
"మరేంట్రా ఆ వెధవ శబ్దం వెధవానీ..." వంటింట్లోంచే మళ్లీ అరిచింది శాంతమ్మ.
"నాన్నారు వళ్ళంతా గోక్కుంటున్నారే... ఇక్కడి నుండి నానిగాడు అరిచాడు.
వంటింట్లోంచి శాంతమ్మ హాల్లోకి వచ్చింది. అక్కడ ఆమె భర్త తింగరయ్య ఈజీ చైర్లో కూర్చుని తీరుబడిగా ఒళ్ళు గోక్కుంటున్నాడు.
"ఏంటండి అంతిదిగా గోక్కుంటున్నారు... ఫిడేలో ఏదో వాయిస్తున్నట్టు అంది శాంతమ్మ.
"ఏం చెయ్యమంటావ్... చెడ్డ దురదగా ఉంది!"అన్నాడు బర బరా గోళ్ళతో ఒంటిని రక్కేస్కుంటూ.
"అంత దురదగా ఉంటే డాక్టరు దగ్గరికెళ్లొచ్చుగా?... చర్మం ఊడొస్తుంది చాల్లెండి..."
ఉన్నట్టుండి నానిగాడు కిందపడి దొర్లి దొర్లి ఏడవడం మొదలెట్టాడు.
"ఏంట్రా... ఇందాకేగా డబ్బులు పట్టుకెళ్ళి చాక్కెట్లు కొనుక్కోచ్చుకున్నావ్?..." అంది శాంతమ్మ.
నానిగాడు సమాధానం చెప్పకుండా గది ఈ మూల నుండి ఆ మూలకి ఆ మూల నుండి ఈ మూలకీ దొర్లి దొర్లి ఏడవసాగాడు.
"చాక్కెట్లన్నీ నమిలేశావా?... ఇంకా కావాలా?"
"ఊహు..."
"మరెందుకలా ఏడుస్తున్నావ్?" విసుక్కుంది శాంతమ్మ.
"మరేమో నాన్నారట్ట గోక్కుంటే చర్మం ఊడ్తుందన్నావ్ గా?" అన్నాడు ఏడుపాపి కళ్లు తుడుచుకుంటూ నానిగాడు.
తింగరయ్యకి చాలా సంతోషం కలిగింది.
"మా నాయనే... మా నాయనే... నాకు బాధ కలుగుతుందని ఏడుస్తున్నావా?" అన్నాడు నానిగాడి వంక ప్రేమగా చూస్తూ.
"అదేం కాదు. నీ చర్మం ఊడ్తే నాక్కావాలి! నేను దాంతో సంచి కుట్టించుకుంట... మరి నా స్కూలు సంచి చిరిగిపోయిందిగా!..." అన్నాడు కళ్లు తిప్పుతూ.
తింగరయ్య కళ్ళు తేలేశాడు.
"అది కాదమ్మా... చర్మం ఊడ్డం అంటే మరీ అంతిదిగా ఊడదు... ఊర్కే కాస్త రేగుతుందంతే..." అన్నాడు వాడి వంక కాస్త చిరాగ్గా చూస్తూ.
అంతే. ఆ సమాధానం వినగానే నానిగాడు మళ్ళీ గదిలో ఈ మూలకీ ఆ మూలకీ ఘొల్లుమని ఏడుస్తూ పొర్లడం మొదలు పెట్టాడు.
"సరే అంటే మీ సొమ్మేం పోయింది? వాడిని ఊర్కే అట్టా ఏడిపిస్తారు?..." కయ్యిమంటూ మొగుడి మీద లేచింది శాంతమ్మ.
"సర్లేరా బాబూ... అట్టాగే... నా చర్మం ఊడ్తే దాంతో నీకు స్కూలు సంచి కుట్టిస్తాలే!" బుజ్జగిస్తూ నానిగాడితో అన్నాడు తింగరయ్య.
నానిగాడు ఏడుపాపి అడిగాడు.
"మరి దాని మీద రంగు రంగు దారాల్తో పువ్వులు ఎంబ్రాయిడీ చేయిస్తావుగా?"
"స్కూలు సంచి మీద పువ్వులు ఎంబ్రాయిడరీ చేయిస్తే ఏం బాగుంటుందిరా?..." మొహం చిట్లిస్తూ అడిగాడు తింగరయ్య.
"వా..." నానిగాడు మళ్లీ నేల మీద పొర్లడం మొదలు పెట్టాడు.
"హబ్బా... అలాగే అనొచ్చు కదండీ... వాడిని ఏడిపిస్తే మీకేమొస్తుందీ?..." శాంతమ్మ మళ్ళీ భర్త మీద విరుచుకుపడింది.
"అలాగే అలాగే... సిల్కు దారంతో ఎంబ్రాయిడరీ చేయిస్తా..." అన్నాడు తింగరయ్య నెత్తి కొట్టుకుంటూ.
నానిగాడు అది వినగానే పడిపడి నవ్వాడు.
"మరేమో నాకేమో బెల్టు కూడా - చేయించాలి" అన్నాడు సంబరంగా.
"అలాగే... అలాగే..." పళ్ళు కొరుకుతూ అన్నాడు తింగరయ్య.
"మా బాబే... మా బాబే... ఇంతప్పట్నుండే వీడికెన్ని తెలివితేట్లో?" అంటూ మెచ్చుకుంది శాంతమ్మ నానిగాడిని.
"ఊ... వాడి తెలివితేటల్ని నువ్వే మెచ్చుకోవాలి?..." అన్నాడు బర బర గోక్కుంటూ.
"ఆ వెధవ గోకుడు ఇంకాపి వెంటనే డాక్టరు దగ్గరకెళ్ళండి..." అంది.
తింగరయ్య వెంటనే డాక్టరు దగ్గరికెళ్ళాడు.
"ఆ!ఏమిటీ మీ ట్రబులూ?" అని అడిగాడు డాక్టరు చొక్కా ఎత్తి నడుంమీద బర బరా గోక్కుంటూ.
తింగరయ్య ఆశ్చర్యంగా చూశాడు.
"హర్రే!... భలేగుందే!!..." అన్నాడు.
"ఏంటి భలేగుంది?... మీరెప్పుడూ ఎవరు గోక్కోగా చూళ్లేదా అంత ఇదైపోతున్నారు? ఆ?" కోపంగా చూస్తూ అడిగాడు డాక్టరు.
"అది కదండీ... మీకున్నదే నాకూ ఉంది...హి హి"అన్నాడు తింగరయ్య నవ్వుతూ.
"ఏంటి? తామరా?" అన్నాడు డాక్టరు.
తను పడే బాధే ఎదుటి మనిషి పడ్తున్నాడనగానే తన జాతి మనిషనే అభిప్రాయం కలిగి కాస్త అప్యాయంగా తింగరయ్య వంక చూశాడు.
"తామరా?... నాకు?... హబ్బే లేదే!!!" అన్నాడు తింగరయ్య.
"లేకపోతే గజ్జా?..."గోక్కుంటూ అడిగాడు డాక్టరు.
"ఊహు..." గోక్కుంటూనే సమాధానం చెప్పాడు తింగరయ్య.
"మరేంటి మీ ప్రాబ్లెమ్?"
"చెప్తాను గానీ... మీ క్లినిక్ లో స్థంబం ఏదైనా ఉందా?... అర్జంట్..." అన్నాడు తింగరయ్య కంగారుగా కుర్చీలోంచి లేచి నిలబడ్తూ.
"వరండాలో ఉందిగా... అయినా ఎందుకూ?... కొంపదీసి మిమ్మల్నేదైనా కుక్క కరిచిందా?" అన్నాడు డాక్టరు కంగారుపడ్తూ.
"హిహి... భలేవారే... అట్టాంటిదేం కాదులే..." అని వరండాలోకి పరిగెత్తాడు తింగరయ్య.
డాక్టరుకీ కంగారుపుట్టి తింగరయ్య వెనకాలే వరండాలోకి పరుగెత్తాడు.
తింగరయ్య స్థంభం సమీపించి వెనక్కి తిరిగి డాక్టరు వంక చూసి నవ్వాడు డాక్టరు గుండె గుభేల్ మంది.
కానీ డాక్టరు పొరబాటు పడినట్టు కాకుండా తింగరయ్య స్థంభానికి వీపు ఆనించి పైకీ కిందికీ పదిసార్లు జారాడు. ఎలక్ట్రిక్ పోల్ కి గేదె తన శరీరాన్ని రుద్దుకునే విధంగా.
తన పని అయిపోయాక స్తంభాన్ని వదిలిపెట్టి డాక్టరు దగ్గరికి నవ్వుకుంటూ వచ్చాడు. ఇప్పుడతని మొహంలో చచ్చేంత రిలీఫ్ కనబడింది.
