Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 19

                                                      నీళ్ళ ట్యాంకరొచ్చింది-నీళ్ళు పట్టుకోండి!
    బసవరాజు ఈజీ చైర్ లో కూర్చుని తీరుబడిగా న్యూస్ పేపరు చదువుకుంటున్నాడు.
    ఇంతలో అతని భార్య రత్నాబాయ్ వచ్చి అతని ముందు డ్యాన్సాడసాగింది.
    ధన్ ధన్ మని శబ్దం అవుతుంటే ఏంట్రా నాయనా ఈ శబ్దం అని పేపర్లోంచి తలెత్తి చూసిన బసవరాజు తెగ సంబరపడిపోయాడు.
    "హమ్మదొంగా!... నా కిన్నాళ్లూ చెప్పలేదేం? అయితే నేనాఫీసు కెళ్ళాక డ్యాన్సు నేర్చుకుంటున్నా వన్నమాట?... హబ్బో...హబ్బో... బాగానే చేస్తున్నావే!!" అన్నాడు.
    భర్త మాటలు వింటూనే రత్నాబాయ్ ఒంటికాలిమీద కయ్... మని లేచింది.
    "ఏంటీ?... నేను కోపంతో చిందులు వేస్తుంటే మీకు డ్యాన్సాడ్తున్నట్టుందా?..." అంది మండి పడ్తూ.
    "కోపమా?... దేనికీ?!" అయోమయంగా ప్రశ్నించాడు బసవరాజు.
    "అది కూడా నేను చెప్పాలా... ముందా షర్టు తీసిపారెయ్యండి... లుంగీ విప్పిపారెయ్యండి... బనీసు కూడా తీసిపారెయ్యండి..."
    అది వింటూనే బసవరాజు సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు.
    "ఛీ... అప్పుడేనా?... రాత్రికి చూస్కుందాంలే..." అన్నాడు.
    "మీ మోహానికి ఆ సర్దాకూడాను... నోర్ముయ్యండి! మిమ్మల్ని బట్టలిప్ప మంది అందుక్కాదు."
    "మరి?..." అయోమయంగా అడిగాడు బసవరాజు.
    "ఎందుకేమిటి?... కసరత్తు చేయొద్దూ?... ఈ వేళ నీళ్ళట్యాంకరు వచ్చేరోజూ!..."
    బసవరాజు నాలుక కొరుక్కున్నాడు.
    "అవును కదూ?... ఆ విషయమే మర్చిపోయా..." అని బట్టలు విప్పి అవతల పారేసి డ్రాయరుతో బస్కీ దండలు తియ్యడం మొదలు బెట్టాడు.
    అప్పుడే వాళ్ళబ్బాయి నాలుగేళ్ళ టింగు ఆ గదిలోకి వచ్చాడు.
    "అమ్మా... నాన్నారు ఇలా బట్టలిప్పి నిల్చుంటే అచ్చు ఎలుగుబంటిలా ఉన్నారు కదే!... హమ్మో!... ఒంటినిండా ఎంత బొచ్చో!!... హిహి..." అన్నాడు సంతోషంతో చప్పట్లు కొడ్తూ.
    "మొన్నటి వారం స్కూల్లో పిక్నిక్ కి వెళ్ళినప్పుడు అక్కడ జూలో ఎలుగుబంట్లు అచ్చు నాన్నారిలానే ఉన్నాయ్...హిహి..."
    "నేను ఎక్సర్ సైజులు చేసేప్పుడు వీడ్ని గదిలోకి రానివ్వొద్దని నీకు చెప్పానా?... ఇలాగైతే నేను ఎక్సర్ సైజు చేయనంతే!..." అంటూ అరిచాడు బసవరాజు.
    "ఏంటో చిన్నపిల్లాడు అన్నమాటల్ని కూడా పట్టించుకుని గింజకుపోతారు... ఒరేయ్! నువ్ బయటికెళ్ళు ఆడుకో"... అని టింగుని బయటికి తరిమింది రత్నాబాయ్.
    "ఇంక ఎక్సర్ సైజు చెయ్యడం ఆపెయ్ నా?" అని అడిగాడు బసవరాజు మెల్లగా మస్కా కొడ్తూ.
    "అప్పుడే ఆపేస్తే ఎలా?... ఇంకాస్సేపు చెయ్యండి..." గుడ్లురిమి  చూసింది రత్నాబాయ్.
    బసవరాజు నిట్టూర్చి గుంజీళ్ళు తీయడం మొదలుబెట్టాడు. అలా మరో పది నిమిషాలు ఎక్సర్ సైజులు చేశాడు.
    "ఇహ చాల్లే బట్టలేస్కోండి... అవతారం చూళ్ళేక చస్తున్నా... మళ్ళీ నీళ్ళట్యాంకరు వచ్చి వెళ్ళిపోయినా పోతుంది..." విసుక్కుంది రత్నాబాయ్.
    బసవరాజు బట్టలేస్కున్నాడు. తరువాత రత్నాబాయ్ అతనికి పాలు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇచ్చింది.
        "ఆ తోపులాటకి తట్టుకుని నీళ్ళు తేవాలంటే బలం కావాలి!" అంది.
    కోడిగుడ్డు తిని పాలు తాగాడు బసవరాజు.
    ఇంతలో అప్పారావని వాళ్ళింటికి బంధువులాయన వచ్చాడు. అతనకి ఆ ఊళ్ళో కోర్టు పని ఉందీ వచ్చాడు.
    రాండ్రాండ్రి అన్నయ్యగారూ... సరిగ్గా సమయానికి వచ్చారు.... అంటూ బసవరాజుకి అప్పారావుకి చెరికోబిందె ఇచ్చింది రత్నాబాయ్.
    "ఇదెందుకు?!" ఆశ్చర్యంగా బిందె పుచ్చుకుంటూ అడిగాడు అప్పారావు.
    "ఎందుకేమిటి?... ఇప్పుడు నీళ్ళ ట్యాంకరు వస్తుంది... నీళ్ళు తేడానికి. చుట్టాలొచ్చినా స్నేహితులొచ్చినా ఎవరి నీళ్ళు వాళ్లు తెచ్చుకోవాల్సిందే!..."
    అప్పారావు బిందె నేలమీద పెట్టి తన బ్రీఫ్ కేసు అందుకున్నాడు.
    "మీ ఇంట్లో దిగుతే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది గానీ... నేను హోటల్లో దిగుతాను చెల్లమ్మా హిహి"అన్నాడు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అప్పారావు.
    "భలేవారే అన్నయ్యగారూ ... మీరు సమయానికొచ్చారు... ఈ టైమప్పుడు వెళ్లిపోతానంటే ఎలా ... ఆ!... హహ..." అని ఆయన చేతిలోంచి బ్రీఫ్ కేసు లాక్కుని బిందెని పెట్టింది.
    అప్పారావు ఆముదం తాగినట్టు మొహం పెట్టాడు.
    "ఊ... ఊ... ఇంక పదండి..." అని రత్నాబాయ్ ఇద్దర్నీ బయటికి తరిమింది.
    బసవరాజు, అప్పారావు బిందెలు పుచ్చుకుని రోడ్డుమీద పడ్డారు. కాస్త దూరం వెళ్ళాక అక్కడ చచ్చేంత జనం ఉన్నారు. ఒకటే సందడిగా ఉంది.ఒక పక్కబొమ్మలు, బుడగలూ అమ్మే కుర్రాళ్ళున్నారు. ఇంకో పక్కన కాలక్షేపం బఠానీలూ, వేర్సెనక్కాయలూ,ఇస్క్రీములు, మిరపకాయ బజ్జీలు అమ్మేవాళ్లున్నారు.
    "హర్రే!... నేను మంచి సమయానికే ఈ ఊరొచ్చాను...! ఇక్కడేదో జాతర జరుగుతున్నట్టుందే... ఇక్కడ కాస్సేపాగి జూసి వెల్దామా?" సంబరంగా అన్నాడు అప్పారావు.
    "జాతరేం కాదు!... మనం ఎలాగూ ఇక్కడే ఆగాలి!... వీళ్ళందరూ నీళ్ళట్యాంకరు కోసం ఎదురుచూస్తున్న జనం..." సమాధానం చెప్పాడు బసవరాజు.
    ఆ సమాధానం విన్న అప్పారావు మొహం పాలిపోయింది.
    "పోనీ నేనిప్పుడు హోటల్లో దిగునా?" అన్నాడు.
    "నీళ్ళు పట్టుకెళ్ళాక అలాగే దిగుదువుగానీ.. వట్టి చేతుల్తో వెళ్తే ఆవిడ ఊర్కోదు."
    అప్పారావు నొసలు మీద కొట్టుకుని బిందె చెంగున పెట్టుకుని నిలబడ్డాడు.
    ఇంతలో నీళ్ళ ట్యాంకరు రానే వచ్చింది. దాన్ని అల్లంత దూరంలో చూడగానే తోపులాట మొదలయ్యింది.
    "గుభీ... గుభీ... గుభీ..." అని శబ్దాలు రాసాగాయ్!
    "ఏంటా శబ్దాలు?" ఆశ్చర్యంగా అడిగాడు అప్పారావు.
    "గుంపులో గుద్దుకుంటున్నారు!" చెప్పాడు బసవరాజు.
    అప్పారావు గుండెలు గుభేల్ మన్నాయ్.
    "క్యూలో నిల్చోండి... క్యూలో నించుటే తప్ప నీళ్ళు ఇవ్వను!" అంటూ అరిచాడు. ట్యాంకర్ తో వచ్చినతను.
    అంతే!... క్యూలో ముందు నిల్చోదం కోసం మళ్ళీ దెబ్బలాట మొదలయ్యింది.నేను ముందొచ్చానంటే నేను ముందొచ్చాను అంటూ ఒకర్నొకరు తోసుకోసాగారు.
    ఇంతలో ఒకాయన పచ్చి బూతులు మాట్లాడ్తూ అక్కడికి వచ్చాడు. అతని బూతులు విని అందరూ సిగ్గుతో చచ్చిపోయి."ఛీ... ఛీ... పాడు" అంటూ అతనికి దారి ఇచ్చారు. అతను బిందెతో నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు.
    "ఎవరాయన. అంత ఘోరమైన బూతులు మాట్లాడుతున్నాడు?" అంటూ అడిగాడు అప్పారావు బసవరాజుని.
    "ఆయన ఈ కాలనీవాడేలే... రాజకీయాల్లో తిరుగుతుంటాడు... అందుకే బూతులు మాట్లాడ్డం బాగా అలవాటైపోయింది..." చెప్పాడు బసవరాజు.
    ఆ రాజకీయాలాయన వెళ్ళిపోయాక క్యూలో ముందు నిల్చోడానికి మళ్ళీ తోపులాట మొదలైంది. అప్పారావు, బసవరాజు కూడా గుంపులోపడి జనాన్ని తోయడం మొదలుబెట్టారు.
    "ఆడాళ్ళమధ్య బిందెలు పట్టుకుని ఆడంగుల్లా వస్తారేం?... కాస్త దూరంగా జరగండి" అంటూ ఒకావిడ వీళ్ళిద్దర్నీ తిట్టింది. అప్పారావు ఆవిడ మాటలు విని బాధపడ్డాడు.
    "నాకేం బాధ లేదు... నాకిద అలవాటేగా హిహి" అన్నాడు బసవరాజు.
    తరువాత మళ్ళీ నీళ్ళు ముందుపట్టుకోవడం గురించి తోపులాట మొదలైంది,అక్కడ చొక్కాలు చిరిగిపోతున్నాయ్... చీరలు ఊడిపోతున్నాయ్... క్రాపులు రేగిపోతున్నాయ్... కొప్పులు ఎగిరిపోతున్నాయ్.
    ఆ టైంలో ఇద్దరు పోలీసులు వచ్చి లాఠీలు అదిలిస్తూ అందర్నీ క్యూలో నిల్చోబెట్టారు.
    ఇద్దరికి రెండు బిందెల నీళ్ళు ఇచ్చాక ట్యాంకర్ లో నీళ్ళు అయిపోయాయ్.
    "ఏంటయ్యా ఇది?... ట్యాంకర్లో తెచ్చేది రెండు మూడు బిందెల నీళ్ళేనా?"
    అంటూ అరిచారు జనం.
    "చాల్లేవయ్యా!... మేమంత తెలివితక్కువ దద్దమ్మలం అనుకున్నావా ఏంటి?... ట్యాంకర్ నిండానే నీళ్ళు తెచ్చాం... కానీ అంత దూరం నుండి రోడ్డు పొడుగునా నీళ్ళు ధారగా కార్చుకుంటూ వచ్చాం కదా?... అందుకే మూడు బిందెలనీళ్ళే మిగిలాయ్!" అన్నారు నీళ్ళ ట్యాంకర్ తో వచ్చిన మనుషులు.
    అది విని అందరూ తెల్లబోయారు.
    ఆ రాత్రికి బసవరాజుకి, అప్పారావుకి ఇంట్లో భోజనం లేదన్న సంగతి వేరేగా చెప్పనక్కర్లేదని అనుకుంటూ.
                                                                          *   *   *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS