Previous Page Next Page 
మహావృక్షం పేజి 2

చెదరని చిరునవ్వు కరుణ నిండిన కళ్ళు ఆభరణాలుగా నిరాడంబరంగా,హుందాగా వుండే అనూషకోసం పేషంట్లు కూడా ఎదురు చూస్తుంటారు.
కారు ఆదర్శనగర్ సమీపించింది. ఓ మేడముందు కారాపింది. వసుధ డోర్ తీసుకుని దిగి,"థాంక్యూ మేడమ్....గుడ్ నైట్ "అంది.
"గుడ్ నైట్ "అని అనూష కారు స్టార్ట్ చేసింది. సెక్రటేరియట్ ముందునుంచి, లుంబినీపార్క్  మీదుగా కారును పోనిస్తోంది.
అడపాదడపా కార్లు, స్కూటర్లు రయ్యిన దూసుకుపోతున్నాయి. కుడిపక్క విద్యుద్దీపాల కాంతిలో మెరిసిపోతోన్న హుసేన్ సాగర్, ఎడంపక్క అందంగా నగిషీలు దిద్దుకుంటున్న ఎన్టీఆర్ ఘాట్ ని పరికస్తూ నింపాదిగా డ్రైవ్ చేయసాగింది.
ట్యాంక్ బండ్ ని పర్యాటక కేంద్రంగా, అందంగా తీర్చిదిద్దిన ఎన్టీఆర్ కి మనసులోనే అంజిలి ఘటించింది.
కారు నెక్లెస్ రోడ్డ్ వైపు తిప్పింది.కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి, పెళ్లికూతురిలా ముస్తాబు చేసుకున్న ఆ రోడ్డు ఇంకా  పెళ్ళి కూతురులాగే కళకళలాడుతోంది. అక్కడక్కడా యువజంటలు ప్రపంచాన్ని మరచిపోయి, హత్తుకుని కూర్చున్నారు. కొన్ని కార్లు మెల్లిగా తిరుగుప్రయాణం మొదలుపెట్టాయి.
రోడ్డుకి ఎడంపక్క గుబురుగా పెరిగిన పిచ్చిచెట్ల వెనకాల రైలు పట్టాలు. ఇంకా ఈ రోడ్డులో తగనంత సెక్యూరిటీ,అరేంజ్ మెంట్లు ఎందుకు చేయలేదో అనుకుంది.ఈ పిల్లలంతా ఇంత రాత్రివేళ ఇలాతిరుగుతున్నారంటే దీనిని నాగరిగత అనాలా? విచ్చలవిడితనం అనాలా? అని నిట్టూర్చింది.
కాస్సేపు కారాపి ఆమెకి కూడా అక్కడ కూర్చోవాలనిపించింది. ఓ పక్కగా కారాపి, లాక్ చేయబోతుండగా వినిపించింది ఏదో శబ్దం. ఉలిక్కిపడింది.ఏమిటా శబ్దం? పిచ్చిచెట్ల మధ్యలోంచి వస్తోంది. కొంచెం జాగ్రత్తగా వింది అది పసిపిల్ల ఏడుపులా అనిపించింది.మళ్ళీ చెవులు రిక్కించి వింది.పసిపిల్ల ఏడుపే, సందేహం లేదు.
అనూష కారు దిగి అటు వైపు కి నడిచింది.ఏడుపు వినిపిస్తోన్నవైపు అయిదారడుగులు వేసింది. కాళ్ళకేదో మెత్తగా తగిలింది.చటుక్కున కాలు వెనక్కి తీసుకొని తలవంచి కిందకు చూసింది. పసిబిడ్డ....
మైగాడ్! మతి పోయినట్టుగా అనిపించింది.చలికి వణుకుతూ సన్నగా ఏడుస్తోంది బిడ్డ.
ఇంకా కళ్ళు కూడా తెరవని పసిగుడ్డు.ఎవరీ రాక్షసులు ? ఇంత నిర్దాక్షిణ్యంగా వదిలి ఎలా వెళ్ళారు? ఈమధ్య చెత్తకుండీలో పసిబిడ్డ, రోడ్డుపక్కన పసిబిడ్డ, డ్రైనేజీ పైపుల్లో పసిపిల్లల శవాలు ఇలాంటి వార్తలు విపరీతం అయిపోయాయి.
విచ్చలవిడిగా తిరగడం, కాలు జారడం. ఎంత ఆధునికత పెరిగినా ప్రకృతితో సవాలు చేయలేరుకదా. ఫలితంగా ఇలాంటి దారుణాలు చేయడం. అనూషకి ఆ క్షణంలో ఆ పసిబిడ్డని అక్కడ వదిలివెళ్ళిన వాళ్ళమీద విపరీతమైన కోపం వచ్చింది. వంగి బిడ్డని అందుకుంది. వెచ్చగా ఆమె గుండె మధ్యకి చేరిన బిడ్డ చటుక్కున ఏడుపు ఆపేసింది.
అనూష బిడ్డకి సంబంధించిన వాళ్ళెవరన్నా కనిపిస్తారేమోనని చుట్టూ చూసింది. దగ్గర్లో ఎవరూలేరు. అందరూ కూడా పచ్చికమీద కూర్చుని హుస్సేన్ సాగర్ వైపు చూస్తూ కబుర్లతో చుట్టుపక్కల పరిసరాలను పట్టించుకోవడంలేదు. తను ఎత్తుకుని పారిపోతుందని ఎవరైనా వస్తే! అనూష ఓదు నిమషాలు అక్కడే నిలబడిపోయింది. ఎవరూ కనిపించలేదు. ఆమెనెవరూ గమనించలేదు. ఎవరిగోల వారిదే అన్నట్టుగా తిరుగుతున్నారు. నెమ్మదిగా వెనక్కి తిరిగింది. అప్పుడు వినిపించింది కాళ్ళకింద నలిగిన ఎండుటాకుల శబ్దం. గిరుక్కున మళ్ళీ చెట్లవైపు తిరిగింది శబ్దం  ఆగిపోయింది. అనూషకి కొద్దిగా భయం కలుగుతున్నా కంట్రోల్ చేసుకుంటూ "ఎవరక్కడ " అంది గట్టిగా.
సన్నగా వెక్కిళ్ళ శబ్దం వినిపించింది. అనూష ఆలశ్యం చేయకుండా ముందుకు అడుగేసింది మళ్ళీ ఎండుటాకుల శబ్దం వినిపించింది. ఈసారెవరో పరిగెడుతున్నట్టుగా పాదాల చప్పుడు. అనూష కొంచెం వేగంగా నడిచి, శబ్దం వచ్చినవైపు తిరిగింది ఒకే ఒక్క క్షణం....ఆ క్షణం అనూషది కాకపోయివుంటే ఆ అమ్మాయి పారిపోయి వుండేది. గాలికి ఎగిరిన ఆమె చీరచెంగు పట్టుకుంది. ఆ అమ్మాయి  చివ్వున వెనక్కి తిరిగి నీరసంగా అంది. "ప్లీజ్....వదలండి నన్ను....మీకు దణ్ణం పెడతాను ."
అనూష వదల్లేదు. ఆ చీరచెంగు అలాగే పట్టుకుని, ఆమె దగ్గరగా నడిచి చేయిపట్టుకుంది "ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావిక్కడ?"
ఆమె మాట్లాడలేదు. ఏడవసాగింది. అనూష ఇంక తాత్సారం చేయకుండా అంది" రా నాతో ఊ త్వరగా."
ఆమె కదల్లేదు. అనూష  చేయిపట్టి లాక్కొచ్చి గబగబా కారు దగ్గరికి వచ్చి డోర్ తీసి, ఆమెని సీటుమీదకి తోసింది.
బిడ్డని ఆమె ఒడిలో పడుకోబెట్టి, డోర్ వేసేసింది. రింగ్ దగ్గర కూర్చుని ఒక్క ఉదుటున కారు స్టార్టు చేసింది. కారు విమనాశ్రమం వెనక వైపు వున్న ఓ కాలనీలో వున్న బిల్డింగ్ ముందు ఆగింది.
అప్పటిదాకా అనూష ఏమీ మాట్లాడలేదు. కారు శబ్దం విన్న వాచ్ మేన్ పరిగెత్తుకొచ్చి గేటు తీశాడు. కారు గేటు లోపలికి తీసుకెళ్ళి ఆపింది. వాచ్ మేన్ ఇంటి తలుపు తాళంతీశాడు. బైటవరండాలో, హాల్లో లైట్లువేశాడు అనూష ఆ అమ్మాయి భుజంమీద చేయివేసి "దిగు" అంది.
ఆమె పలకలేదు. ఆమె భుజంపట్టి కుదిపింది. అయినా సమాధానం లేకపోవడంతో పల్స్ చూసింది. ఆమె బాగా అలసిపోయినట్టుంది, దాదాపు స్పృహ తప్పినట్టు వుంది. కళ్ళు మూసుకుంది కానీ, పూర్తిగా అపస్మరకంలో లేదు. మాట్లాడడానికి, లేవడానికి శక్తి లేనిదనిలా సీటులో వెనక్కి వాలి పడుకుంది. ఆమె చేతులు మాత్రం ఒళ్ళో వున్న బిడ్డమీద అప్యాయంగా చుట్టుకుని వున్నాయి.
అనూష వాచ్ మేన్ ని పిలిచి సాయం పట్టమని ఆమెని, బిడ్డనీ తీసుకొచ్చి బెడ్ రూమ్ వైపు నడిచింది. పాపని పడుకోబెట్టి, ఆమెని కూడా మంచం మీదకి చేరుస్తూ చూసింది. ఆమె చీర పూర్తిగా పాడైపోయి ఉంది. ఆమెకి విషయం అర్థమైంది.
వాచ్ మేన్ ని కారు పోర్టికోలో పెట్టమని చెప్పి పంపించేసింది. ఆ అమ్మాయిని బలవంతంగా లేపి చీర మార్చింది. పల్స్ చూసి అప్పటికప్పుడు ఇవ్వాల్సిన మందులు తన కిట్ లోంచి తీసింది. ఆమెని మంచంమీద పడుకోబెట్టి కిచెన్ లోకి వెళ్ళి పాలు వెచ్చబెట్టి తీసుకొచ్చింది. మళ్ళీలేపి మందులు వేసి, పాలు తాగించింది. పాలు పూర్తిగా తాగకుండానే ఆమె తిరిగి మంచం మీద వాలిపోయింది.

 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS