Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 2


    "ఎక్కడికో బయల్దేరారు" అన్నాను. వారి ముస్తాబు చూచి ఊహిస్తూ, లోనికి ఆహ్వానిస్తూ!
    "స్వర్గానికి కాదురా బడుద్ధాయి. దుర్గానికి" అని సవరించాడు రమణ.
    "అది మనకు ఉత్తి దుర్గమే కాని, ఆచార్లుకి స్వర్గమే కదరా!" అంటూ వివరించాడు స్నేహితుడు.
    "ఒకరికి స్వర్గామైనా, మరొకరికి దుర్గమైన అదేకదా నేడు మనం పయనించే మార్గం" అన్నాడు మరొకడు.
    "ఏమిటోయ్ రమణా అలాగైపోయావు" అన్నాను నేను.
    "వీడి కవిత్వం విన్నప్పుడల్లా నాకు వాంతులు రావటం రివాజు" అన్నాడు రమణ. స్నేహితుడు మాడిపోతున్న ముఖాన్ని మామూలు రంగులోకి మార్చుకుంటూ 'నెల తప్పినా వాంతులొస్తాయి' అన్నాడు సాగదీస్తూ.
    ఘోరమైన ఈ ప్రతి జోకు (రిపార్టీ) విన్నాక మాకెవ్వరికి నవ్వూ రాలేదు. ఏడుపూ రాలేదు. నల్లమందు మ్రింగినవాళ్ళల్లా ముఖాలు పెట్టుకుని ఉండిపోయాం.
    అంతటితో కవిగారి జోకుల కావ్యపఠనం ఆగిపోయింది. హమ్మయ్య! ఈ పూటకి బతికిపోయినట్లే!
    "ఈరోజు కొండవీడు దుర్గానికి విలాసయాత్ర పెడుతున్నాం" అన్నాడు మొదటి మిత్రుడు.
    "విలాసయాత్ర కాదురా వెధవాయి విహారయాత్ర అన్నాడు కవిమిత్రుడు ప్రూఫ్ రీడర్ ఫోజు కొడుతూ.
    "మీ జోకుల పర్వం కొండవీటి చాంతాడులా పెరిగిపోతోంది. ఇహ నోళ్ళు ముయ్యండి" అన్నాడు రమణ. అందరూ సద్దుమణిగాక నేను మాట్లాడటం ప్రారంభించాను.
    "భాయీ! నేనొక మాట చెపుతాను వింటారా?"
    "వినం. నువ్వు మమ్మల్ని భాయీలూ అని పిలవాలి. సంబోధనా బహువచనం" సవరించాడు కవి.
    "ఒరే! కఫీ! వాడు చెప్పేదేమిటో వింటావా? తోక కొయ్యమంటావా?" అని ఉరిమాడు మూర్తి. అంతటితో కపిగారు తోక ముడిచారు. నేను చెప్పాను, అంత్య నిష్టూరం కంటే ఆదినిష్టూరం మేలని!
    "ఆకలి దప్పులమాట ఎరుగనివాళ్ళు మాత్రమే కొండవీడు చూడటానికి అర్హులు. అది సిమ్లాయో, డార్జిలింగో కాదు. కొండవీడు మాత్రమే."
    "ఆకలిదప్పులు లేకపోవటానికి మేము ఋషిపుంగవులమా?" అన్నాడు కవి మాట మధ్యలో అడ్డంవస్తూ.
    "కావాలన్నప్పుడల్లా గారెలూ, కోరినప్పుడల్లా చెగోడీలూ దొరకవని ఆచార్లుగారి అభిప్రాయం" వివరించాడు మూర్తి. కవికి సమాధానం రమణే చెప్పటం రివాబు కనుక.
    "మరి మంచినీళ్ళ మాటో?" సాగదీశాడు కవి.
    "నువ్వు త్రాగాటానికే కాదు. నిన్ను నిలువునా ముంచటానికి సరిపడా నీళ్ళుంటాయక్కడ. ఇహ నోర్మూసుకొని విను" అన్నాడు మూర్తి. కవి సలహా పాటించాడు.
    "ఏనుగుల దోవలో అమృతప్రాయమైన నీళ్ళు దొరుకుతాయి. కొండమీది కోనేరు లోతు తెలియదు. కాని ఈదటం తెలిసిన వారికి అక్కడ చాలా ఉత్సాహంగా ఉంటుంది" అన్నాను.
    మరో విచిత్రమైన విషయం కూడా ఉన్నదక్కడ. ఏనుగులశాలా, గుర్రాల చావడీ, నేతికొట్టూ వీటికి దగ్గరగా వుండే కోనేరులో తామర పూవులే పూస్తాయి. రాణివాసానికి ఎదురుగా వుండే కోనేరులో కలువపూవులు మాత్రమే పూస్తాయి. ఈ రెండింటికీ సంబంధం లేకుండా విడిగా ఆ కాలంలో సామాన్య ప్రజలు వుపయోగించిన కోనేరు మరొకటి వుంది. దానిలో ఏ పూలూ పూయవు.
    ఈ విచిత్రమేమిటో ఈ కాలం వారెవరికీ అర్థం కాదు. మన పూర్వులు దాచివెళ్ళిన అద్భుతాలలో ఇదొకటి. మూలగూరమ్మ దేవాలయానికి ఎదురుగా వుండే వీరకల్లులు మరీ విచిత్రమైనవి అని రెడ్డి రాజుల కాలంలో ప్రజల యోగక్షేమాలకై ప్రాణత్యాగం చేసిన మృతవీరులవి. ఇప్పటికీ ధీరులవలె నిలబడి చరిత్రను చాటిచెపుతూ వుంటాయి" అన్నాను. నా వివరణ మిత్రుల్ని ఆకర్షించినట్లే ఉంది. అయితే తప్పకుండా వెళ్ళవలసిందే" అన్నాడు మౌనంగా కూర్చున్న మరో మిత్రుడు.
    మూర్తి అమితోత్సాహంతో ప్రయాణానికి సమాయత్తమయ్యాడు. కవిగారు రివ్వున బాణంలా బజార్లోకి దూసుకుపోయాడు.
    మేము ఆశ్చర్యం నుండి తేరుకోకముందే పెద్ద సంచితో వచ్చి మా ముందు వ్రాలాడు.
    "ఏమిటోయ్ కవీ గాడిద బరువు మోసుకొచ్చావ్?" ప్రశ్నించాడు మూర్తి కవిని దెబ్బతీయాలనే సత్సంకల్పంతో. "నీకోసమే" అన్నాడు కవి తగ్గటం అలవాటు లేనట్లు. "ఇంకా నయం గాడిదలకోసమే అన్నావు కావు" మూర్తి "ఔను నీకోసమే" అన్నాడు మళ్ళీ. కవిగారు అప్పుడు కాని ఆ జోకును త్రిప్పికొట్టాడని అర్థంకాలేదు మూర్తికి. అలాగే నోరు తెరిచేశాడు రమణ.
    ముగ్గుర్నీ బయటకు నడిపించి రూముకు తాళం వేశాను. కాలినడకన బయలుదేరాం పర్వాతారోహక బృందంలా. కొండవీడు మాకు ఐదారుమైళ్ళకన్నా దూరం లేదు. కొండ మీద అన్నీ చూడాలంటే మరో అయిదారు మైళ్ళు నడవాల్సి ఉంటుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS