Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 3


    కొండమీద వెనుకటి కోటలు, రెడ్డిరాజుల రాచనగరులకు పోయేందుకు సువిశాలమైన రోడ్డు వుంది. అది ఆ కాలంలో వారు నిర్మించుకొని వుపయోగించుకొన్నదే. ఆ బాట వెంట పైకి వెళ్ళేటప్పుడు మనకు గొప్ప అనుభూతి కలుగుతుంది. ఆ బాట వెంటనే క్రింద నగరంలోకి వచ్చి మామిడి సింగన్న ఎన్నో రాచకార్యాలు నిర్వహించేవాడు. ఆ బాట వెంటనే త్వరగా రామయ్య గుర్రమెక్కి పన్నులు వసూలు చేసి ఖజానాలో వప్పగించేవాడు. ఆ బాట వెంటనే కాటయ వేముడు, హరహరాంబికను విజయనగరం నుండి చేకొని వచ్చాడు. కుమార గిరిరాయలకు నృత్యనివాళి సమర్పించేందుకు లకుమాదేవి ఆ బాట వెంటనే రాకపోకలు సాగించేది. లకుమాదేవి రాకకై ఎదురుచూస్తూ కుమారగిరి ఆ రాజమార్గంలోని ప్రతి రాయినీ పలకరించేవాడు.
    కొండవీటి పతనానికి కారకుడయిన పన్నెండు సంవత్సరాల పసికందు లింగమనీడు ఆ బాట వెంటనే పోయి కోటను ముట్టడించాడు, అంతటి చారిత్రక ప్రసిద్ధి కలిగిన బాట అది. ఆ బాటవెంట నడిచేటప్పుడు శరీరం పులకాంకితమైందంటే ఆశ్చర్యమేముంది?
    కొండవీడు దుర్గాన్ని చూడదలచినవారు ఎవరికైనా ముందుగా "దొంగల దేముడు"గా పిలువబడే దొంగ ఆంజనేయస్వామిని చూడాలి. నా చిన్నతనంలో కొండవీటిలో వున్న మా తాతగారింటికి వెళ్ళినప్పుడు నాకు ఈ దొంగల దేవుడయిన ఆంజనేయస్వామిమీద చాలా ఆసక్తి వుండేది. కత్తులబావిగా పిలువబడే చీకటి కోనేరుగాని, నందికంత పోతురాజు కటారికి కాటయ వేముని తలను గుచ్చి ఎత్తి స్థాపించిన గృహరాజ భవనానికిగాని నేను అంత ప్రాముఖ్యత ఇచ్చేవాడిని కాను. నాలాగే ఎందరో దొంగాంజనేయుణ్ని ప్రేమించేవారు. కొండవీడు దుర్గానికి వెళ్ళేదారిలో ముందుగా తగిలే చానుగొండ మొత్త దాటగానే "దొంగల దేము"ని దర్శనమౌతుంది. అదొక పెద్దలోయ. లోయలో రాతిపలకపై చెక్కిఉన్న ఆంజనేయస్వామి. అది అత్యంత ఆకర్షణీయమైన దృశ్యం. కొండవీటి రెడ్డిరాజుల కాలంలో కొండలలో దాగివున్న దొంగలు తమకు అపాయం కలగకుండా ఉండగలందులకు ఆంజనేయస్వామిని పూజించేవారు అప్పుడు. ఆ తరువాత అది ఉత్త రాతిపలకపై విగ్రహంగానే ఉండేది. ఆ తర్వాత నరసారావుపేట జమీందారుగారికి ఆ స్వామిమీద భక్తి కలిగింది. సహజంగా జమీందారులు కూడా దోచుకు తినే స్వభావం కలవాళ్ళే కనుక ఆ స్వామికి ఆలయం కట్టాలన్న కోరిక కలిగింది. రాజు తలిస్తే దెబ్బలకేం కొదువ. వెంటనే స్వామి చుట్టూ పునాదులు తీయించారు. మరునాడు పనివాళ్ళు వెళ్ళి చూస్తే పునాదులు పూడ్చివేయబడి వున్నాయి. ఆ రాత్రి దొంగలు చేసిన పని కాబోలు. జమిందారుగారు నాలుగైదుసార్లు ప్రయత్నించారు. ఫలితం మామూలే. దానిలో విసుగెత్తిపోయిన జమీందారుగారు దొంగలకు ఒక విన్నపం వ్రాసి స్వామి పాదాలవద్ద పెట్టించారు. స్వామివారికి ఆలయం మీరయినా (దొంగలైనా) కట్టండి, లేదా మమ్ములను కట్టనివ్వండి అని ఆ విన్నపం సారాంశం. మరునాడు పగలు వెళ్ళి చూస్తే స్వామివారి పాదాల దగ్గిరే సమాధానం వ్రాసి పెట్టుంది.
    "త్వరలో మేమే ఆలయాన్ని నిర్మించబోతున్నాం" అని అహా ఏమి చెప్పుకోవాలి. ఆ దొంగల దైవభక్తిని. అప్పటినుండి ఆ చుట్టుప్రక్కల జరిగే దొంగతనాలలో విచిత్రమైన మార్పు వచ్చింది.
    ఎప్పటిలాగా డబ్బు దస్కం పోవటం లేదు. సున్నమూ, ఇటుకలూ, కలపా వగైరా పోవటం ప్రారంభమైంది. దొంగతనంలో వచ్చిన ఎవల్యూషన్? ఆ విధంగా దొంగిలించబడిన వస్తువులతో అక్కడి దేవాలయం పూర్తికూడా అయింది. వస్తువులు పోగొట్టుకున్నవారు కూడా అది గమనించారు. కాని స్వామి కార్యం కనుక మళ్ళీ అవన్నీ పీకి పోగులు పెట్టి ఎవరివి వారు తెచ్చుకోలేదు. అవన్నీ దొంగల దేముడికే వదిలేసి ఊరుకున్నారు భయంతో. ఆ దేముడి దర్శనం చేసుకుని కాని ఎవరూ కొండవీడు చూచేందుకు పోరు. అక్కడి దొంగల్లో ఒక నీతి కూడా ఉండేది. ఆ స్వామి దర్శనానికి వచ్చేవారిని వారు దోచుకోరు. ఎంత విచిత్రం. ఏ రాజ్యాంగమూ చేయలేని పనికదా. అక్కడకు పోగానే రమణకూ కవికీ యుద్ధకాండ మళ్ళీ ప్రారంభమైంది. అలుపూసొలుపూ లేని మాటల యుద్ధం. "దొంగాంజనేయస్వామీ! ఇదుగో నీ సోదరుడొచ్చాడు ఆశీర్వదించు" అంటూ కవిని చూసాడు మూర్తి. "ఆంజనేయస్వామీ! నేను నీ సోదరుడిని (కోతిని) అయితే వీడు నా సోదరుడు. వీడినికూడ ఆశీర్వదించు" అంటూ నమస్కరించాడు కవి.
    ఎలాగూ నేను మీ పూర్వుడివే కదా! అన్నట్లు ఆంజనేయస్వామి చిరునవ్వుతో మౌనంగా చూస్తున్నాడు. ఆ కొండవీటి కోనలో ముగ్గురు కోతుల మధ్య నేనూ మా నోరు విప్పుని మరో స్నేహితుడూ నవ్వకుండా ఉండలేకపోయాం.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS