Previous Page Next Page 
శారదా అశోకవర్ధన్ కథలు పేజి 17


            

                               17. జారుడు మెట్లు
    మెడ మీద పడ్డ చెయ్యిని ఉలిక్కిపడి తోసేసి వెనక్కి తిరిగి అరిచింది మూడేళ్ళ అరవింద   "దొంగ ..... దొంగ ....పట్టుకోండి!" అంటూ కేకలు పెట్టింది అరవింద తల్లి సుభద్ర.
    క్షణంలో జనం గుంపుగా చేరిపోయారు.
    అందులో పిక్కబలం  ఉన్న కొందరు  పరుగెత్తి ఆమెని పట్టుకున్నారు.
    "దొంగముండా! గొలుసు కాజేద్దామనుకున్నావా?" కండబలం ఉన్న యువకుడొకడు తన ప్రతాపాన్నంతా చూపిస్తూ ధబేల్న కొట్టాడు.
    ఆ దెబ్బకి 'అమ్మా' అని మూలిగిన ఆమె పిచ్చిదానిలా జనాన్ని చూడసాగింది. మాసిన చీర, చిరిగిన జాకెట్టు, చింపిరి జుట్టు. ఆమెకు ముప్పయ్యేళ్ళుండొచ్చు.
    'ఓ....ఇదా! ఇక్కడికీ వచ్చిందా? మొన్నా పక్కవీధిలో 'బాలరాజు....బాలరాజూ' అంటూ ఎంతో పరిచయం ఉన్న మనిషిలా నా చెయ్యిపట్టుకుంది. ఒక్కటి తగిలించి తప్పుకున్నాను. లేకపోతే జేబులో పర్సుకొట్టేసేదే! ఇప్పుడు ఆవిడ మెడమీద చెయ్యేసిందంటే.... గొలుసు కాజేద్దామనే.... ఆడది కదా అని ఊరుకోకూడదు" అన్నాడొక పెద్దమనిషి, గుంపులోంచి అందరికీ కనపడేలా తోసుకుంటూవచ్చి.
    "ఆడదని జాలిపడకూడదండోయ్! ఆ తర్వాత సొమ్ములు పోగొట్టుకున్నాక అందరూ మనమీద జాలిచూపే పరిస్థితి తెచ్చుకుంటాం. ఇలాంటి వాళ్ళ వెనక పెద్ద గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు ముసలాళ్ళనీ, పసిపిల్లల్ని  కూడా అడ్డం పెట్టుకొని  ఈ పన్లన్నీ  చేయిస్తుంటారు" అన్నాడు మరొకతను.
    "ఇవాళ లేచిన వేళ మంచిదే. నా బిడ్డ గొలుసు మాకు మిగిలింది" అంది గొలుసావిడ సుభద్ర. 
    ఆమె మాటతో జనానికి  దొంగతనం సంగతి గుర్తొచ్చి. మళ్ళీ పిచ్చి చూపులు చూస్తూన్న స్త్రీని చితకబాదారు.
    వీళ్ళందరినీ  తోసుకుంటూ  ఏం జరిగిందో చూద్దామని  ముందుకొచ్చిన  జాన్ ఆమెను చూసి కంగారుపడ్డాడు. ఆ కొడుతున్న వాళ్ళ దగ్గరికెళ్ళి  "ఆగండి! ఈమె మీకేం హాని చేసిందని అలా చితకబాదుతున్నారు?" అడిగాడు.
    "నువ్వెవడివయ్యా?" జాన్ మీదకి చెయ్యెత్తాడొకడు.
    "దీని గ్యాంగ్ వాడై ఉంటాడు" అన్నారెవరో.
    "నాలుగు తగిలించండి వాడిక్కూడా!" మరో గొంతు. కొన్ని చేతులు లేచాయి జాన్ మీదకి.
    అందరినీ ఒక్క తోపు తోశాడు జాన్.
    "ఈమె దొంగకాదు - పిచ్చిది. మీలో ఎవరి దగ్గర దొంగతనం  చేసిందని  కొడుతున్నారు? చెప్పండి!"
    వెంటనే ఎవరూ మాట్లాడలేదు.
    "ఇదిగో, ఈ పిల్ల మెడలో  గొలుసు కొట్టేయబోయింది" అన్నాడో కుర్రాడు.
    "ఆ పిల్లని చూసి మీద చెయ్యి వేసినంతమాత్రాన 'దొంగ' అని ముద్రవేయకండి. ఈమె తన భర్త, పిల్లలు కనిపించలేదని పిచ్చిదయింది. వాళ్ళని వెతుక్కుంటూ  తిరుగుతోంది. ఈ పాప వయసు పిల్ల ఈమెకు  ఓ కూతురుంది. తన కూతురిని ఈ పాపలో  చూసుకొని భ్రమపడింది. అంతే!" అంటూ జాన్ తన జేబు రుమాలు తీసి, ఆమె తలకు తగిలిన దెబ్బకు కట్టుకట్టాడు. అప్పటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. రక్తం బాగా పోయింది. ఆమె నాడీ బలహీనంగా కొట్టుకొంటోంది.
    "సావిత్రి....తిండి తిని ఎన్నిరోజులయిందో!" తనలో గొణుక్కున్నాడు జాన్.
    "ఈమె మీకు తెలుసా?" అడిగిందొకావిడ.
    "ఆఁ....ఇంతకు ముందు వీళ్ళ  కుటుంబం మా ఇంటిదగ్గరే ఉండేది. ఏడాదిన్నర క్రితం తలో దిక్కు అయి చెదిరిపోయారు!" అన్నాడు జాన్. 
    "ఆ పిచ్చిది చచ్చేలా ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసికెళ్ళండి!" జనంలోంచి  అరిచారెవరో.
    జాన్ ఆలోచనల్లోంచి  తేరుకున్నాడు.
    ఆటోని పిలిచి "గాంధీ ఆస్పత్రికి పోవాలి!" అన్నాడు.
    ఆటోలో సావిత్రిని  పడుకోబెట్టి  తానూ ఎక్కాడు. ఆటో కదిలింది. అంతవరకు  విడ్డూరంగా చూస్తున్న జనం ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు.
                                                              *    *    *
    తల్లి తండ్రీ ఎవరో తెలీని వయసు నుండీ సావిత్రి పల్లెటూళ్ళో మేనమామ దగ్గర పెరిగింది. దిక్కులేని అనాధలా, పనిమనిషిలా ఆ ఇంట్లో అన్నిరకాల కష్టాలను అనుభవిస్తూ పెరిగి పెద్దదైన సావిత్రిని బాలరాజుకిచ్చి పెళ్ళిచేసి చేతులు దులిపేసుకున్నాడు సావిత్రి మేనమామ.
    బాలరాజుని పెళ్ళాడి పట్నం  చేరుకున్న  సావిత్రి జీవితం కొత్తమలుపు తిరిగింది. గతంలో  తాను అనుభవించలేకపోయిన సుఖాలనూ, జల్సాలను అందుకోవాలనే తాపత్రయం పెరిగింది. పట్నంలోని  నాగరికతా వాతావరణం ఆకర్షణలకు  లోనయింది సావిత్రి.
    ఒక ప్రయివేటు కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తూన్న  బాలరాజు  తనకొచ్చే తక్కువ జీతంతో సంసారాన్ని  నెట్టుకురావటానికే  నానాయాతనలు పడుతుంటే, సావిత్రి సరదాలు తీర్చటం అతనికి కష్టసాధ్యమనిపించింది బతిమాలి, బామాలి సావిత్రికి నచ్చజెప్పి  తన దారికి తెచ్చుకున్నాడు బాలరాజు. పరిస్థితుల్ని అర్ధం చేసుకొని, సరిపెట్టుకోవటం అలవాటు చేసుకుంది సావిత్రి.
    ఐదేళ్ళలో  వారికి ఇద్దరు పిల్లలు కలిగారు - ఒక కొడుకు, ఒక కూతురు. పిల్లలతోపాటు వారికి ఆర్ధిక ఇబ్బందులూ పెరిగాయి.
    బాలరాజు పిల్లల్ని  బాగా చదివించాలనే  తాపత్రయంతో  అందినచోటల్లా అప్పులు చేశాడు. తమ దారిద్ర్యం కనిపించకుండా  ఎంత పొదుపుగా  కుటుంబం నడపాలన్నా సావిత్రికి కష్టసాధ్యం అయింది. బాలరాజు ఆ బాధ్యత సావిత్రి మీదే వేసేశాడు.
    పక్కవీధి కిరాణా దుకాణదారు  కామరాజు మొదట్లో సావిత్రికి అడిగినన్ని సరుకులిచ్చి ఆదుకున్నాడు. ఆ సహాయం వెనుక దురుద్దేశపూర్వకమైన కాంక్ష ఉన్నట్లు సావిత్రికి తర్వాత్తర్వాత అర్ధమయింది. 
    ఇంటి కవసరమైన సరుకులకోసం దుకాణానికి  వెళ్ళినప్పుడల్లా కామరాజు కవ్వింపుచేష్టలు, ద్వంద్వార్ధ సంభాషణలు, తినేసేట్టు చూసే చూపులు సావిత్రికి ఒంటిమీద జెర్రులు పాకినట్లనిపించేది.  కానీ, ఎంతో సహనం వహించేది. 'తన అవసరం - తప్పదు' అని సరిపెట్టుకొని  కామరాజు వెధవ్వాగుడు పట్టించుకోకుండా ఓ చిరునవ్వు నవ్వి వచ్చేసేది.
    ఇద్దరు పెళ్ళాలని వదిలేసి, ఒంటరిగా ఉంటున్న  కామరాజు సావిత్రిలోని బలహీనతని కనిపెట్టాడు.
    ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సావిత్రి ఒంటరిగా ఉండగా వచ్చాడు కామరాజు. బాకీ డబ్బులు అడగడానికొచ్చాడని భావించిన సావిత్రి. 'ఇంకా డబ్బు చేతికందలేదు. అందిన వెంటనే తీర్చేస్తా'నని కామరాజుకి నచ్చజెప్పబోయింది.
    కామరాజు వెకిలిగా నవ్వాడు.
    "నీ చేతికి డబ్బు అందటం జరిగేపనికాదు. నీవు నా బాకీ తీర్చటం ఈ జన్మలో జరగదు. నీవు అడిగినప్పుడల్లా  సరుకులిచ్చాను. నీ పిల్లలకి, మొగుడికి రోగాలు, రోష్టులు వచ్చినప్పుడల్లా  వైద్యానికని  డబ్బులిచ్చి ఆదుకున్నాను. ఒకటా, రెండా.... అయిదు వేలు! ఎక్కడ తీరుస్తావ్? నీ ప్రాణాలు అమ్మినా అంత డబ్బురాదు." అన్నాడు కామరాజు.
    సావిత్రికి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు.
    "నీకు అవసరానికి నేను ఆదుకున్నాను. మరి నా అవసరానికి ఆదుకుంటే నీ రుణం తీర్చుకుంటాను!" అన్నాడు కామరాజు తలుపులు మూసి, గడియపెడ్తూ.
    "ఏమిటి?" అంది సావిత్రి కంగారుగా.
    "ఆడదిక్కులేని మగాడి అవసరం....నీకు తెలీదా?" అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు కామరాజు.
    సావిత్రి చెయ్యి విదిలించుకొని, చాచి చెంపమీద కొట్టింది.
    కామరాజు చెంప రుద్దుకుంటూ ఓ విషపు నవ్వు నవ్వాడు.
    "సావిత్రీ! ఒక్కసారి నా కోరిక తీర్చినంతమాత్రాన  నీ శీలం కొత్తగా పోయేదేమీలేదు. నీవు ఇద్దరు పిల్లల తల్లివి. నా మాట వింటే మీ దారిద్ర్యాన్ని కడిగేస్తాను. నీకు కావలసినవన్నీ  కొనిపెడతాను. మన సంబంధం రెండో కంటివాడికి తెలీదు. నీ పిల్లలు బాగా చదువుకొనేందుకు ఏర్పాట్లు  చేస్తాను. పైగా నా బాకీ కూడా తీర్చనక్కరలేదు."
    సావిత్రి దూరంగా  జరిగి అలా చూస్తూ నిలబడిపోయింది. కామరాజు ఆమెకు ఆలోచించటానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ అన్నాడు:
    "ఎన్నాళ్ళు కష్టపడి గాడిద చాకిరీ చేసినా నీ మొగుడు అంతకు మించి సంపాదించలేడు. నా బాకీ కోసం మిమ్మల్ని  కోర్టుకి ఎక్కించానంటే మీ బతుకులు రోడ్డున పడతాయి. తిండి కూడా దొరకని గడ్డు పరిస్థితి వస్తుంది. నీ మొగుడి ఉద్యోగం ఊడుతుంది. ఎవరూ తిరిగి పని ఇవ్వరు. నీ పిల్లలు అడుక్కు తినాల్సివస్తుంది. అలాంటి పరిస్థితి ఎందుకు చేతులారా తెచ్చుకోవటం, నా మాట వింటే నువ్వూ, నీ పిల్లతో సుఖపడతారు" అంటూనే కామరాజు సావిత్రి నోరునొక్కి గట్టిగా కౌగలించుకున్నాడు.
    సావిత్రి పులినోట చిక్కిన లేడిలా గిలగిలలాడింది. ఎంతోసేపు గింజుకుంది.
    కామరాజు పశుబలం ముందు ఆమె శక్తి పనిచేయలేదు, కామరాజు ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.
    కొన్ని విష నిముషాలు దొర్లిపోయాయి.
    కామరాజు కామవాంఛకు సావిత్రి బలైంది.
    నిశ్శబ్దంగా కన్నీళ్ళు  కారుస్తూ కూర్చున్న సావిత్రిని చూసి వెకిలిగా నవ్వాడు కామరాజు.
    "సావిత్రీ! అనవసరంగా ఎందుకేడుస్తావ్? ఈ విషయం ఇతరుల కెవరికీ తెలీదు. గుట్టుచప్పుడు కాకుండా నువ్వూ ఊరుకుంటే  నీకే మంచిది. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే నీ మొగుడొచ్చి ఏమిటని అడిగితే నువ్వు జరిగింది చెప్పాల్సివస్తుంది. నీ మొగుడు ఆవేశంతో నన్ను చంపటానికి వస్తాడు. నేను అందుకు సిద్ధంగానే ఉంటాను. నన్ను చంపబోయాడని  కేసుపెట్టి  జైలుకి పంపుతాను. దిక్కులేని నువ్వు అప్పుడైనా నాకు శాశ్వతంగా లొంగిపోవాల్సివస్తుంది, ఆత్మాభిమానంతో నువ్వు  ఆత్మహత్య చేసుకున్నావనుకో - నీ పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు. అందుకే మన వ్యవహారం రహస్యంగా ఉంచావనుకో, నీ కుటుంబ ఖర్చులకు ఎలాంటిలోటు లేకుండా  చూసుకొనే పూచీ నాది. కళ్ళుతుడుకొని, జుట్టు దువ్వుకో.  నీ మొగుడొచ్చేసరికి నవ్వుతూ కనిపించు" అంటూ తలుపులు తీసుకొని వీధిలోకి  వెళ్ళిపోయాడు కామరాజు. కడుపునిండా లేడిమాంసం తిన్న పులిలా తృప్తిగా.
    ఆ రోజే సావిత్రి జీవితం కష్టాల కడలిలోకి  దొర్లింది; నైతిక పతనానికి దారి తీసింది.
    ప్రతిరోజూ కామరాజు సావిత్రి ఒంటరిగా ఉండగా వచ్చేవాడు. 'మనమధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి నీ మొగుడికి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. వాడు జైలు కెళతాడు నీ పిల్లలు వీధుల పాలవుతారు' అని భయపెట్టి, సావిత్రిని నిస్సహాయురాలిని చేసి, ఆమెను ఆక్రమించుకొనేవాడు.
    బాలరాజు కీ విషయం చెప్పుకోలేక, దాచలేక నరకయాతన పడేది సావిత్రి. కామరాజు 'బ్లాక్ మెయిలింగ్' తట్టుకోలేక ఒక్కోసారి చచ్చిపోదామనుకొనేది. మళ్లీ పిల్లలు కళ్ళముందు కదులాడి ఆ ప్రయత్నం విరమించుకొనేది. ఆ సంఘర్షణలతో సతమతమై పూర్తిగా అలసిపోయిన సావిత్రి, ఇక ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయింది.
    తన జీవితమంతా  పరిస్థితులకు  అనుగుణంగా ఒదిగిపోవటంతోనే సరిపోయింది అనుకుంది.     
    బాల్యంలో మేనమామ, అత్తా కలసి పనిమనిషికంటే  హీనంగా చూసినా ఓపికగా తలవంచుకు చాకిరీ చేయటం అలవాటు చేసుకుంది. తిండి సరిగా పెట్టకపోయినా  ఆకలిని భరించటం అలవాటు చేసుకుంది. పెళ్ళయ్యాక  తన కోరికల గుర్రాలకు కళ్ళెం వేసి, భర్త నచ్చచెప్పగా  దారిద్ర్యాన్ని తీయగా అనుభవించటం అలవాటు చేసుకుంది. కామరాజు బెదిరింపులు  విని నిస్సహాయురాలై రోజూ అతనికి లొంగిపోవటం అలవాటు చేసుకొంది.
    సరిగ్గా  అలాంటి సమయంలోనే  రాంబాయమ్మ రంగంలో ప్రవేశించింది.
    పట్టుచీర, జరీ జాకెట్టు, మెళ్ళో కాసుల దండ, బంగారు గాజులు, నోట్లో కారా కిళ్లీతో ఎర్రగా  నవ్వుతున్న  రాంబాయమ్మ  కప్పను మింగటానికి వచ్చిన ముసలి పాములా  ఉంది.
    కామరాజుతో సంబంధం తెగతెంపులు  చేసుకోమనీ, అతను నీ ఇంటికొచ్చి  వెళ్తుంటే ఎవరికైనా అనుమానం కలుగుతుందని. అది అంత శ్రేయస్కరం కాదనీ నచ్చజెప్పింది. నీలాంటి పేద మహిళల  కోసం నేను అప్పడాల ఇండస్ట్రీ పెట్టాననీ, రోజూ ఉదయమే వచ్చి సాయంత్రం దాకా పనిచేస్తే చేతినిండా డబ్బులేనని, ఒకరికి భయపడుతూ చేయాల్సిన పని కాదని 'లాజిక్' గా చెప్పి ఒప్పించింది రాంబాయమ్మ.
    ఆ మర్నాడే బాలరాజుకి నచ్చజెప్పి  సావిత్రి రాంబాయమ్మ  అప్పడాల కంపెనీలో చేరింది. అలా అక్కడ చేరిన సావిత్రికి తనలాగే  అనేకమంది  స్త్రీలు అక్కడ పనిచేస్తూ కనిపించి తృప్తిగా  శ్వాస పీల్చుకుంది.
    కానీ, ఆ తృప్తి ఎంతోసేపు మిగలలేదు. అప్పడాల కంపెనీ పేరుతో వ్యభిచారం గృహం నడుపుతున్న రాంబాయమ్మ తనలాగే  ఎంతోమంది ఆడవాళ్ళ బలహీనతల్ని  ఆసరాగా  తీసుకొని ఆ ఊబిలోకి దించి, వాళ్ళ రక్త మాంసాలతో  వ్యాపారం చేస్తుందని అర్ధమయింది.
    నైతికంగా  మరింత  లోతుకి  దిగజారిపోయిన సావిత్రి క్రమేణా ఇంకా కూరుకుపోసాగింది. ఆ పరిస్థితులకు  కూడా  అలవాటు పడిపోయిన సావిత్రి బాలరాజుతో  నటనా జీవితం గడుపుతూ పిల్లలను  కాపాడుకోగలుగుతున్నానని తృప్తిపడసాగింది.
    రాంబాయమ్మ  అప్పడాల  కంపెనీ ముసుగులో  వ్యభిచారగృహం నడుపుతుందని  రిపోర్టులు అందుకొని, ఓ రోజు  పోలీసులు దాడి జరిపి, అక్కడున్న స్త్రీలను అరెస్టుచేసి తీసుకెళ్ళారు.
    ఈ విషయం తెలిసి బాలరాజు  పరుగున  పోలీసు స్టేషన్ కి వచ్చాడు.
    "నా సావిత్రి అలాంటిది కాదు. ఎవరో కావాలని ఈ కేసులో  ఇరికించారు. నా మాట నమ్మండి!" అంటూ ఇన్ స్పెక్టర్ తో మొరపెట్టుకొని, బతిమాలాడు.
    "వీళ్ళందరినీ  అనుమానం మీద అరెస్టు చేయలేదు. వ్యభిచరిస్తుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్నాం. వెధవపని చేసిన వాళ్ళెవరు చేశామని ఒప్పుకోరు. మీరిక వెళ్ళండి!" అంటూ ఇన్ స్పెక్టర్ బాలరాజుని చివాట్లేసి, బైటికి గెంటించేశాడు. సావిత్రిని చూడటానికి, పలకరించటానికి  కూడా వీలు కల్పించలేదు. 
    సావిత్రి తన బతుకు పబ్లిక్ అయినందుకు  సిగ్గుతో  కృంగిపోయింది. బాలరాజుకి మళ్ళీ ముఖం చూపించలేకపోయింది.
    జరిమానా చెల్లించి తన మనుషులను విడిపించిన  రాంబాయమ్మ ఆ ఊర్నించి తన మకాం మార్చేసింది.
    "వ్యభిచారణిగా ముద్రపడి జైలుకెళ్ళిన  నిన్ను చూసి నీ మొగుడు అసహ్యించుకుంటాడు. నిన్ను వీధిలోకి  తన్ని గెంటేస్తాడు. నీ పిల్లల్ని పలకరించనీయడు. నీవు ఇంటికి వెళితే  మీ పిల్లల్ని  అందరూ వెలియాలి పిల్లలని ఎగతాళి చేస్తారు ఇంటికెళ్ళి నీవు ఏం సుఖపడతావ్? కష్టాలు, కన్నీళ్ళు తప్ప.... మనశ్శాంతి  ఉండదు. నాతో వచ్చేయ్. బతికినంత కాలం రాణిలా ఉండొచ్చు". అని ప్రలోభపెట్టింది.
    సావిత్రికి రాంబాయమ్మ  మాటలు  సబబుగానే తోచాయి రాంబాయమ్మతో వెళ్ళిపోయింది.
    బాలరాజు సావిత్రి కనిపించక పిచ్చెత్తిపోయాడు. ఆమె కోసం ఊరూరూ తిరిగాడు.
    'సావిత్రికి అన్యాయం జరిగిపోయింది. ఆమె నెవరో మోసం చేసి అపవాదు అంటగట్టారు. నా సావిత్రి దేవత' అంటూ పలవరించేవాడు.
    ఎదురింటి జాన్ అతనికి ధైర్యం చెప్పేవాడు. 'నీ సావిత్రి తిరిగివస్తుంది. దిగులుపడకు. మేమూ వెతుకుతాము' అని నచ్చజెప్పేవాడు.
    బాలరాజు ఊళ్ళ మీద తిరిగేటప్పుడు అతని పిల్ల లిద్దర్నీ జాన్ తన ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకొనేవాడు.
    సావిత్రి నైతిక పతనంగురించి  జాన్ కి చూచాయగా తెలిసినా, ఆ విషయం ఏనాడూ  బాలరాజుతో చెప్పలేదు. అతనికి ఆమె మీదున్న ప్రేమ - తన మాటల్ని నమ్మనివ్వదని అతనికి తెలుసు.
    ఒకరిద్దరు బాలరాజుతో  సావిత్రి శీలం చెడిన ఆడదని చెప్పి, అతని చేతిలో తన్నులు తిన్నారు.
    "నా సావిత్రి దేవత. ఎవరెన్ని  చెప్పినా  నేను నమ్మను. నా సావిత్రి తన నోటితో ఒప్పుకుంటేనే అది నిజమని నమ్ముతాను. ఎవరో మోసగాళ్ళ కుట్ర. మా అన్యోన్యత చూసి ఓర్వలేనివాళ్ళు చేసిన పని!" అనేవాడు.
    బాలరాజు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఎక్కడో దూరంగా మరో పనిలో చేరాడు. ఆ చోటునుంచి ఇల్లు మార్చేసి పిల్లల్ని తీసుకొని  వెళ్ళిపోయాడు.
    వాళ్ళు వెళ్ళిపోయే రోజున  బాలరాజు  స్థితిలో  చూసి జాన్ కళ్ళు నీళ్ళు పెట్టుకున్నాడు. 'సావిత్రి పట్ల అతనికిగల ప్రేమ అపారం. పిల్లల పట్ల, బాలరాజు పట్ల కూడా సావిత్రికి కూడా అంతకు రెట్టింపు ప్రేమ ఉంది. ఎంతోకాలం ఆమె పిల్లల్ని, భర్తని విడిచి దూరంగా ఉండలేదు' అనుకున్నాడు జాన్.
    సంవత్సరన్నర గడిచింది. బాలరాజు ఒకటి రెండుసార్లు జాన్ ఇంటికి వచ్చి సావిత్రి ఏమైనా  కనిపించిందేమోనని  కనుక్కొని వెళ్ళాడు. మనిషి బాగా చిక్కిపోయి జబ్బు మనిషిలా  తయారయ్యాడు. పిల్లలు కూడా తల్లిమీద దిగులు పెట్టుకొని  అనారోగ్యం పాలయ్యారని చెప్పాడు బాలరాజు. ఎక్కడుంటున్నావని అడిగితే 'నా మనసు నిలకడగా లేదు. నేను ఎక్కడా నిలకడగా ఉండలేకపోతున్నాను' అన్నాడేగాని బాలరాజు జాన్ తో అడ్రసు చెప్పనే లేదు.
    "జాన్! నా సావిత్రి వేశ్యకాదు. నేను నమ్మను. మీరు ఎవరి మాటలూ నమ్మకండి!" అని గొణిగి వెళ్ళిపోయాడు బాలరాజు.
    అతని పరిస్థితి చూసి జాన్ చాలా జాలిపడ్డాడు. అతనికి సావిత్రి మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదు, ఇంకా పెరిగింది అనుకున్నాడు జాన్.
    జాన్ ఓ రోజు బజారుకెళ్ళి  తిగిరి వస్తుంటే  రోడ్డుమీద  పరుగెడుతూ ఓ పిచ్చిది కనిపించింది. పిల్లలు రాళ్లు విసురుతూ, అల్లరి చేస్తూ వెంట తరుముతున్నారు.
    ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపించి జాన్ గబగబా అడుగులు వేసి, పిల్లల్ని తరిమేశాడు. దగ్గరగా చూసినప్పుడు  జాన్ ఆమెను గుర్తుపట్టాడు.
    ఆమె సావిత్రి!
    ఎలా ఉండేది ఎలా మారిపోయింది! జుట్టు విరబోసుకొని ఉంది. మాడు మీద  కొన్ని వెంట్రుకలు  రాలిపోయి బట్టతలలా ఉంది. ముఖమంతా మచ్చలతో వికారంగా ఉంది. మట్టికొట్టుకుపోయిన  చీర, చిరిగిన జాకెట్టు, గాజుల్లేని మొండి చేతులు.
    జాన్ కి గుండెల్లోంచి సన్నని వణుకు బైలుదేరింది. ఏదో అర్ధంకాని ఆవేదన అతని హృదయాన్ని  పిండేసింది.
    'ఎలాంటి సావిత్రి ఎలా అయిపోయింది?' మళ్ళీ అనుకున్నాడు.
    ఆమె తనని గుర్తుపట్టలేదు. ఉండుండి 'బాలరాజూ!' అని అరుస్తోంది. 'నా బిడ్డలు ఏరీ?' అని గొణుగుతోంది.
    జాన్ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. మెల్లగా సావిత్రిని మంచి మాటలు చెప్పి తన ఇంటికి తీసికెళ్ళాడు.
    సావిత్రికి  అప్పుడు గుర్తుకు వచ్చింది. తాము ఉన్న ఇంటిచుట్టూ తిరిగి చూసింది.
    "బాలరాజు ఏడి? నా బిడ్డలేరి?" అని అరవసాగింది.
    జాన్ ఆమెకి లీలగా గుర్తొచ్చాడు. జాన్ ని నిలదీసి అడిగింది సావిత్రి: "నా బాలరాజు, నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి."
    "బాలరాజు  నీమీద ప్రేమచావక నిన్ను వెతుక్కుంటూ  పిచ్చివాడిలా ఊరూరూ తిరిగాడు. పిల్లలు దిగులు పెట్టుకున్నారు. ఊళ్ళోనే ఉన్నారు. కానీ ఎక్కడున్నారో తెలీదు" అని చెప్పాడు జాన్.
    "సావిత్రీ! ఇంతకాలం ఏమయ్యావ్? ఎక్కడి కెళ్ళావ్?" అడిగాడు జాన్.
    "నేను చేసిన పాపాలకి తగినశిక్ష  అనుభవించాను. బాలరాజుని మోసం చేశాను. నేను పతనమయ్యాను. రోగాలతో నా ఆరోగ్యం, అందం అంతా క్షీణించింది. రాంబాయమ్మ నన్ను బైటికి తరిమేసింది. నా చివరిక్షణాల్లో అయినా బాలరాజుని కలిసి నా తప్పులు చెపి క్షమించమని అడిగి ప్రశాంతంగా ప్రాణాలు వదులుతాను. లేకపోతే నా ఆత్మకు శాంతి ఉండదు. నా బాలరాజు ఎక్కడున్నాడో నేనే వెతుక్కుంటాను" అని అంటూ రోడ్డుమీదికి పరుగెత్తింది సావిత్రి.
    "సావిత్రి తాను చేసిన పాపాల్ని బాలరాజుతోచెప్పి క్షమించమని అడుగుతానంటోంది. బాలరాజు సావిత్రి తన నోటితో తాను తప్పు చేశానని చెప్తేగాని నమ్మనని అంటున్నాడు విచిత్రమైన పరిస్థితి" అనుకున్నాడు జాన్.
    సావిత్రి ఈ ప్రాంతంలోనే ఉండగా బాలరాజు కలిస్తేబాగుండు ననుకున్నాడు జాన్.
                                                               *    *    *
    ఆటో గాంధీ ఆసుపత్రి దగ్గర ఆగింది.
    జాన్ కి అక్కడ తెలిసినవాళ్ళు ఉన్నారు.
    సావిత్రిని వార్డ్ లోకి తీసుకెళ్ళారు.
    డాక్టర్ చూశాడు. దెబ్బలకి వెంటనే కట్లు కట్టారు, చాలా రక్తంపోయింది. తిండి లేకపోవటంవల్ల బాగా నీరసించిపోయింది.
    ఉన్నట్లుండి సావిత్రికి ఊపిరి పీల్చటం కష్టమైంది. ఉండి ఉండి ఎగిరెగిరి పడుతోంది. కళ్ళు తెరిచింది. కొన ఊపిరితో కొట్టుకొంటోంది ఆ కంట్లో వెలుగు. జాన్ కి ఆ చూపులు  గుండెల్లో  కలుక్కుమని  గుచ్చుకున్నాయి.
    "నా బాలరాజుని చూపించవూ?" అంటూన్నట్లున్నాయి ఆమె కళ్ళు.
    ఏం చేయాలో పాలుపోలేదు.
    నర్స్ డాక్టర్ ని పిల్చుకురావటానికి  కంగారుగా వేరే వార్డుకి పరుగెత్తి పది నిముషాలైంది. డాక్టర్ రాలేదు. నర్సూ రాలేదు.
    జాన్ లో కలవరం బైలుదేరింది.
    'డాక్టర్!' అని గొణుక్కుంటూ గది బైటికి వచ్చి వరండాలో పరుగెడుతూ ఒక మనిషిని గుద్దేశాడు.
    అప్పుడు చూశాడు జాన్.
    అతను బాలరాజు!!
    "బాలరాజూ! ఇక్కడికెలా  వచ్చావ్?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "పాపకి జ్వరం....పదిరోజుల్నుంచి  తగ్గటం లేదు. ఇక్కడ చేర్పించాను. ఏం?" అడిగాడు బాలరాజు. పక్కనే బాలరాజు అతని కొడుకు కూడా ఉన్నాడు.
    "బాలరాజూ! సావిత్రి కనిపించింది. నీకోసం, పిల్లలకోసం వెతుక్కుంటూ  కలవరిస్తూ పిచ్చిదయిపోయి తిరుగుతోంది!" అన్నాడు జాన్.
    బాలరాజుకి ఒక్కసారి గుండె కొట్టుకోవటం ఆగి కొట్టుకోసాగింది.
    "నా సావిత్రి కనిపించిందా?! ఎక్కడా?" గట్టిగా అరిచాడు బాలరాజు.
    "ఈ పక్కవార్డ్ లోనే ఉంది. చావుబతుకుల్లో ఉంది. నీతో ఏదో చెప్పాలనుకుంటోంది. త్వరగా రా!" అంటూనే పరుగెత్తాడు జాన్.
    పిల్లాడి చెయ్యి పట్టుకొని, జాన్ వెంట పరుగెత్తాడు బాలరాజు.
    మంచంమీదున్న సావిత్రి దగ్గరికి  "సావిత్రీ!" అని అరుస్తూ పరుగున వెళ్ళాడు బాలరాజు.
    అంతే, షాక్ తిన్నవాడిలా అలాగే బొమ్మలా నిలబడిపోయాడు.
    సావిత్రి కళ్ళు తెరిచి ఉండి, శూన్యంలోకి చూస్తుండిపోయాయి ఆ కళ్ళు. ఆమె నిర్జీవంగా  పడి ఉంది. ఆమె ప్రాణాలు ఎప్పుడో అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
    "సావిత్రీ!" అంటూ ఆమె శవంమీద పడి బోరున విలపించాడు బాలరాజు.
    "చివరి చూపుకి, మాటకి నోచుకోలేకపోయాను. నేను దురదృష్టవంతుణ్ణి సావిత్రీ!" అని గుండె లవిసేలా  ఏడుస్తున్నాడు బాలరాజు.
    పక్కనున్న  అతని కొడుకు కూడా తల్లి చనిపోయిందని  మాత్రమే కాక, బాలరాజు రోదనకు కదిలిపోయి  ఏడుపు మొదలెట్టాడు.
    "నిన్ను గురించి ఎందరో ఎన్నో విధాలుగా చెప్పినా నేను నమ్మలేదు సావిత్రీ! నీ నోరారా, నేను అలాంటి పని చేయలేదని చెప్తే విని తృప్తిగా ప్రాణాలు వదలాలని అనుకున్నాను. చివరికి ఇలా నిన్ను నిర్జీవంగా చూడాల్సి వచ్చిందా సావిత్రీ?" అంటూ ఆమె పై వాలిపోయాడు బాలరాజు.
    "బాలరాజూ! దేవుడు చాలా చిత్రమైన వాడయ్యా! బతికుండగా ఆమె మిమ్మల్ని చేరలేకపోయినా, చచ్చి చేరుకుంది. కానియ్యి....మిగతా కర్మకాండ అంతా నీ చేతులమీదుగానే జరగాలి. ఇదే చివరి ఋణం. లే....పైకి లే!" అని బాలరాజుమీద చెయ్యివేసిన జాన్ అదిరిపడ్డాడు. బాలరాజు అచేతనంగా పడి ఉన్నాడు. అతనెప్పుడో సావిత్రిని చేరుకున్నాడు!
    క్షణంలో ఆకాశం మేఘావృతమైంది. నల్లమబ్బులతో ముసుగు సుందరిలా  అదొక రకమైన అందంతో చల్లగా  ఉంది. మరుక్షణం - బాలరాజు, బిడ్డల కోసం గుండెపగిలి రోదించిన సావిత్రిలా పిడుగుపడి వర్షం ప్రారంభమయింది.
    "ఒకరికొకరు  'చివరి పలుకు' కి   అందుకోకుండా  అనంతవాయువుల్లో కలిసిపోయారు" అనుకున్నాడు జాన్. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS