Previous Page Next Page 
శారదా అశోకవర్ధన్ కథలు పేజి 16

           
                              16. తుమ్మముల్లు
    హైదరాబాద్ నగరంలో  సత్యన్నారాయణరాజుగారి  పేరు విననివారు లేరు. ఇటు వనపర్తి, అటు గద్వాల మొదలుకుని నగరం నాలుగు వైపులా ఆయనకీ పొలాలూ, స్థలాలే! ఎన్ని ఎకరాల విశాలమైన భూములున్నాయో అంతకంటే విశాలమైన గొప్ప  హృదయం వుంది. ఎవరు కష్టపడుతూన్న  చూడలేని దయార్థ్ర హృదయముంది. దానకర్ణుడు, ధర్మరాజు - ఇవీ అతడి బిరుదులు అలా అని ఏవీ దుబారా ఖర్చులు చేసేవాడు కాదు. తనను నమ్మిన వారికీ, తాను నమ్మినవారికే ప్రాణమిచ్చేవాడు. భగవంతుడితడికి  అంత ఐశ్వర్యాన్నిచ్చినా' కొంతైనా  మంచి ఆరోగ్యాన్నివ్వలేదు బ్లడ్ ప్రెషరూ, షుగరూ అన్నీ వ్యాదులే. అప్పుడప్పుడే చేతి కందుతూన్న  కొడుకులచేత  ఆస్తి వ్యవహారాల బాధ్యతల నిచ్చి అంత చిన్న  వయస్సునుంచే  ఇబ్బంది పెట్టడం, భావ్యం కాదనుకునేవాడతను. అందుకే డాక్టరు పరీక్షలు చేయించుకుంటూ, మందులు తీసుకుంటూ, తనే అన్ని చోట్లకీ వెళ్లేవాడు. అతనికి ప్రాణస్నేహితుడు కనపర్తి పాండురంగారావు. ఎక్కడికి వెళ్ళినా  అతణ్ణికూడా  వెంట తీసుకెళ్ళేవారు సత్తన్నారాయణరాజుగారు. ఒక రోజున  హయత్ నగర్ అవతల ద్రాక్షతోటకి వెళ్ళి ఒస్తూవుంటే  గుండె నొప్పి వొచ్చి విలవిల్లాడిపోయారు. "రాజూ! సరాసరి ఆసుపత్రికే పోదాం" అంటూ 'నిమ్స్' కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు  పాండురంగారావుగారు. "సమయానికొచ్చారు! హీ.... ఈజ్....అవుటఫ్ డేంజర్" అని డాక్టర్ సుబ్బారావుగారన్నప్పుడు  రాజుగారికి పాండు ఒక దేముడిలా, తనకి ప్రాణదాతలా  కనిపించేడు. అతడిపట్ల  సద్భావం మరింత ఎక్కువయింది. ఆ రోజే పాండు కుటుంబ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు రాజుగారు. పాండుకి ఇద్దరాడపిల్లలు పెళ్ళికి ఎదిగివున్నారనీ, సంబంధాలు కుదిరినా డబ్బులేక వాయిదా వెయ్యవలసి వొచ్చిందనీ, పిల్లలింకా  చదువుల్లోనే వుండి ఎవ్వరూ చేతికంది రాలేదనీ తెలుసుకున్నారు రాజుగారి హృదయం నవనీతంలా  కరిగిపోయింది. అంతే. తన ఆస్తిపాస్తులన్నీ  చూసుకోవడానికి  నెలకి పది వేల జీతంలో కస్టోడియన్ గా నియమించారు. కన్నీటితో  అతడి పాదాలు కడిగాడు పాండురంగారావుగారు.
    ఆనాటినుంచీ  లెక్కలూ డొక్కలూ  అన్నీ పాండురంగారావుగారే  చూసుకోవడం మొదలెట్టారు. రాజుగారికి బోలెడంత రెస్టు. టైమ్ ప్రకారం భోం చెయ్యడం, నిద్రపోవడం, రేడియో వినడం లేదా  అలా కాస్సేపు  విహారానికెళ్ళొచ్చి మళ్ళీ రెస్టు హైదరాబాదు నుంచి  తన నివాసాన్ని  తన తండ్రి తాతల ఊరు చిన్న పల్లెటూరు వనపర్తికి మార్చుకుని, అక్కడొక ఆలయాన్ని నిర్మించే ప్రయత్నంలో మునిగిపోయారు. పాండురంగారావే ఆర్కెల్లకో  ఏడాదికో  వెళ్ళి రాజుగారు  వద్దంటూన్నా వినక, లెక్కలన్నీ  ఏ కరువు పెట్టేవారు.
    ఒక రోజు  రాజుగారి పెద్ద కొడుకు విధేయ పాండుగారు  చెబుతూన్న  లెక్కలన్నీ  విని తండ్రికేసి  ఆశ్చర్యంగా చూశాడు. పంటలు పండ లేదనీ రైతులు శిస్తు కట్టలేదనీ ఏవేవో చెప్పి అతడు వెళ్ళిపోయాక  విధేయ తండ్రి నడిగేడు. "మీరొక్కసారి  స్వయంగా  వెళ్ళి అన్నీ చూసి రారాదూ" అని. విధేయ పాండురంగారావుగార్ని  అనుమానిస్తున్నాడని అర్ధం చేసుకున్నాడు. "నాకు ప్రాణస్నేహితుడూ, ప్రాణాన్ని కాపాడిన నావాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి పెద్దలను గౌరవించడం నేర్చుకో! అనవసరంగా ఎవర్నీ అనుమానించకూడదు, ఏ ఆధారాలూ లేకుండా" అంటూ  ఏవేవో చెప్పి మెత్తగా చీవాట్లేశారు.
    కాలచక్రంలో రెండు క్యాలండర్లు మారాయి....
    ఆరోజు హైదరాబాదులో  ఒక మంత్రిగారి కొడుకు  పెళ్ళికి అనుకోకుండా బయలుదేరారు రాజుగారు. తనతో పెద్దకొడుకు విధేయని కూడా తీసుకెళ్లారు. కారు నగర మధ్య నుంచి  దూసుకుపోతూ  వుంటే కొన్ని సంవత్సరాల తరవాత హైదరాబాదొస్తూన్న రాజుగారు ఆనందంతో చిన్న పిల్లాడిలా కారులో కిటికీ వైపు కూర్చుని  రోడ్డునీ రోడ్డు కిరువైపులావున్న కట్టడాలనీ చూస్తూ, "ఊరు ఎంత మారిపోయింది?" అన్నారు. "అవును" అన్నాడు విధేయ ముక్తసరిగా. మూడంతస్థుల ఆకు పచ్చని మేడా, దాని పక్కనే వున్న ఆధునిక పద్ధతిలో  అత్యంత రమణీయంగా కట్టిన సినిమా థియేటరూ రాజుగారికి  చాలా నచ్చాయి. "ఎంత బాగున్నాయి! ఎవరు కట్టారో?"   అన్నారు రాజుగారు. "మీ స్నేహితుడు పాండురంగారావుగారు" అన్నాడు విధేయ. "అవునా?" ఆశ్చర్యపోతూ అడిగారాయన. "అవును బాబుగారూ! ఇట్లాటివి ఆయనగోరికి అయిదో ఆరో వున్నాయంట. అబిడ్ రోడ్లో అయిదు నక్షత్రాల హోటలు ఉదయ్ గూడా ఆయనదే నంట" అన్నాడు డ్రైవర్. రాజుగారికి మతిపోయినట్టయింది. కూతుళ్ళ పెళ్ళిళ్ళకు డబ్బులేదన్న పాండుకి ఇంత ఆస్తి ఎలా వొచ్చింది? విధేయ కేసి చూశాడు. విధేయ తలవంచుకున్నాడు. కారు రఁయ్ మని దూసుకుపోయి  శ్రీనగర్ కాలనీలోని  సత్యసాయి నిగమాగమం దగ్గర ఆగింది. కళ్యాణ మండపం విద్యుద్దీపాలతో  దేదీప్యమానంగా వెలిగిపోతుంది. వందలాది కార్లు బారులు తీరిన సైనికుల్లా రోడ్డు కిరువైపులా పార్క్ చేసి వున్నయ్. వొచ్చే పోయే జనాన్ని పోలీసులు అదుపు చెయ్యలేకపోతున్నారు. పోలీసు బ్యాండులో 'రాజాకి ఆయేగీ బరాత్' వాయిస్తున్నారు. సన్నాయిలో 'సీతమ్మ పెళ్ళికూతురాయెనే' వినబడుతోంది. మొత్తానికి ఆ ఆవరణ అంతా కోలాహలంగా, పట్టుచీరల రెపరెపలతో, సుగంధ ద్రవ్యాల - పసుపు కుంకుమల సువాసనలతో నిండిపోయింది. డ్రైవర్ కారుని మెట్లదాకా తీసుకెళ్ళి  ఆపి కారు డోరు తెరిచాడు. విధేయ రాజుగారి చెయ్యిపట్టుకుని దింపి లోపలికి తీసుకెళ్ళాడు. మంత్రిగారు స్వయంగా ఎదురుపడి రాజుగారికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్ళారు. రాజుగారు ఖాళీగా వున్న ముందు వరుసలో వున్న సీటు చూసి కూర్చున్నారు. అతని దృష్టి పక్కనున్న అతని మీద పడింది. మామూలుగా అయితే అటూ ఇటూ చూసేవారు కాదు గానీ, అత్తరువాసన గుప్పున కొట్టేసరికి  అటు చూశారు. సన్నని మల్ మల్ పంచ, మల్ మల్ లాల్చీ. అంగవస్త్రం, నల్లగా ధగధగా మెరుస్తూన్న  జోళ్లూ, వేస్టు కోటూ - ఏ మంత్రిగారో అని తిరిగి చూశారు రాజుగారు. కళ్ళు మూతపడలేదు! నోట మాటరాలేదు! పిచ్చివాడిలా తానున్న పరిసరాలు కూడా మరిచిపోయి అటే చూస్తుండిపోయారు. గుండెలో  నొప్పి! ముళ్ళుగుచ్చుకున్నంత  నొప్పి. "అబ్బ!" అన్నారు మెల్లగా కళ్ళు మూసుకుని. విధేయ "ఏమయింది నాన్నగారూ?" అంటూ పరుగెత్తుకొచ్చాడు. అత్తరు వాసన దూరమయింది! "నమ్మకద్రోహీ!" మెల్లగా సణుగుతూ  అన్నారు. 'మంగళ తంతునానేనా' మంత్రాలు మైకులో వినిపిస్తున్నాయి. అక్షింతలు వర్షంలా  రాలాయి. ఒక్కొక్కరే లైనుగా వెళ్ళి మంత్రిగారికి కరచాలనం చేసి అభినందనలు తెలుపుతూ వెళ్ళిపోతున్నారు. రాజుగారు మెల్లగా విధేయ సహాయంతో వెళ్ళి మంత్రిగారిని కలిసి, పెళ్ళికొడుకుకి తెచ్చిన బహుమతిని అందజేసి  కారెక్కారు. కారు తిన్నగా వెళ్ళి లాయర్ రంగనాథంగారింటి ముందు ఆగింది. విధేయ కళ్ళల్లోకి  ప్రేమగా చూస్తూ, "ఈ పని నువ్వు ఆ రోజున నన్ను హెచ్చరించినప్పుడే  చెయ్యవలసింది. తుమ్మచెట్టు మీద పంచె ఆరవేసుకున్నాను" అంటూ విధేయతోపాటు లోపలికెళ్ళారు.        *
                                                                                                                           (స్వాతి వారపత్రిక 1995)     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS