"కానీ..."
"ఇప్పుడు నేను మీకు లెక్చరిచ్చే అవకాశం ఇవ్వకండి."
ఆమె కాదనలేకపోయింది.
సరిగ్గా పన్నెండు గంటలకి అయిదు నిమిషాలు ముందుగా అన్నిటికంటే చివరగా ఓ ఎంట్రీ అందింది.
అందులో పార్టిసిపెంట్స్ పేర్లు ఆదిత్య, ప్రణయ.
ఆ వార్త ఎంత వేగంగా యూనివర్శిటీని చుట్టుముట్టిందీ అంటే ఆదిత్య అంగీకారం సూరి బృందంలో అసాధారణమయిన ఉత్తేజాన్ని కలిగించింది.
అయితే శౌరి అమితంగా కలవరపడిపోయాడు.
దానిక్కారణం ప్రణయ.
* * *
యూనివర్శిటీ నుంచి సరాసరి ఇంటికి వచ్చాడు శౌరి.
ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఎన్నిక చేయాల్సిన క్విజ్ పెయిర్ డిసైడ్ కావటానికి నిర్వహిస్తున్న కాంపిటేషన్ కి మిగిలింది మరో రెండు గంటలు మాత్రమే.
అప్పటికే సుధీర్ మాట మీద క్విజ్ మాస్టరుగా వుండే ఇంజనీరింగ్ హెడ్ రాధాకృష్ణగార్ని కలిశాడు శౌరి.
కాని సహాయాన్ని అందించలేనన్నాడు.
రేపో మాపో వైస్ ఛాన్సలర్ కావడానికి శౌరి సహాయం చాలా అవసరమని తెలిసినా 'క్విజ్ క్వశ్చనీర్' ఇవ్వలేకపోవడానికి కారణం ఇంకా ఆ కవరు వైస్ చాన్సిలర్ దగ్గరే సీలు చేసి వుండటం.
అప్పటికీ ప్రయత్నించాడు కూడా.
"డాడీ మా ప్రబంధ గెలవాలని చాలా ఆసక్తిగా వున్నారు" తన తండ్రి ముఖ్యమంత్రి సుమా అన్న విషయాన్ని పరోక్షంగా తెలియచెప్పాడు. మీతో మాట్లాడమన్నారు కూడా.
మరో ఏడాదిలో వీసీ అయ్యే అవకాశమున్న రాధాకృష్ణ చాలా కలవరపడ్డాడు. "ఇప్పటికీ మీ సిస్టర్ నెగ్గుతుందని నా సిక్స్త్ సెన్స్ చెబుతూంది."
"కాని మరో పక్క ఆదిత్యతోపాటు మీ ప్రణయ కూడా వుంది" తన భయాన్ని వ్యక్తం చేశాడు.
"నేను ప్రణయతో మాట్లాడతాను.
శౌరి అసహనంగా చూశాడు.
"నేను చెబితే వింటుంది"
"ఏం చెబుతారు?" ఠక్కున అడిగిన శౌరికి వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు రాధాకృష్ణ.
"అయినా ఈ పంతాల్లోకి ప్రణయ అడుగు పెట్టడమేమిటి? రాధాకృష్ణగారూ! మీరేం చేస్తారో నాకు తెలీదు. ఏం చెప్పుకుంటారో తెలీదు. ప్రణయని అసలు పోటీకి రాకుండా చేయగలిగితే సంతోషిస్తాను. ఆ తరువాత పరిణామాలు ఎలా వుండేదీ మీకు తెలీనిది కాదు" అల్టిమేటమ్ చెప్పి బయటకు వచ్చాడు శౌరి.
రాధాకృష్ణ సందిగ్ధంలో పడిపోయాడు. నిజానికి ప్రణయకి ముందే చెప్పాడు ఈ పోటీల్లో పాల్గొనడం తనకు నచ్చని విషయమని తేలిగ్గా కొట్టేపారేసింది. గట్టిగా శాసించడానికి సాహసం చేయలేడు. అసలు అలాశాసించడానికి ప్రణయ తన అన్న కూతురే తప్ప తన కూతురు కాదు. ప్రణయ తన ఇంట్లో వుండేది మరో దారిలేక కాదు.
ఎలా? ప్రబంధ గెలుపుకోసం తానెలా సాయపడటం? తన కెరీర్ కి సంబంధించిన ఈ సమస్య గురించి రాధాకృష్ణ చాలా ఆందోళనపడుతున్న సమయంలో...
కారులో శౌరి పక్కన కూర్హ్సున్న సుధీర్ అడిగాడు. "అసలు ప్రణయ గురించి నువ్వు పదే పదే ఎందుకు కంగారుపడుతున్నావో అర్ధంకావడం లేదు."
శౌరి చూసిన చూపుతో తత్తరపడ్డాడు సుధీర్.
"అదికాదు... మీ చెల్లి ప్రబంధ కూడా ఈ రాష్ట్రం మొత్తంలో."
పూర్వంలా ఈ పొగడ్తని ఎంజాయ్ చేయలేదు శౌరి. "సుధీర్! నీకే చరిత్రా లేదు కాబట్టి ఓడినా, గెలిచినా నీకొక్కటే. కాని ప్రబంధ తెలివైనదయినా మొండిది. అందుకే ఈసారి ఓటమిని తట్టుకోలేదని భయపడుతున్నాను."
"అసలు ఓడే ప్రసక్తి లేదుగా?"
"ఆదిత్య ఏమిటో ఆరోజు చూశావు. కాని ప్రణయ ఏమిటో నీకు తెలీదు" సుధీర్ రెట్టించకపోయినా శౌరి చెప్పాడు. ప్రణయ ఎవరో కాదు. తెలుగు, ఇంగ్లీషు దినపత్రికల యజమాని చంద్రశేఖరరావుగారి అమ్మాయి"
ఉలిక్కిపడ్డాడు సుధీర్. పత్రికాధిపతిగా, పెద్ద పారిశ్రామికవేత్తగా ఆయన స్థాయి గురించి తెలిసిన సుధీర్ ఇంకా నమ్మలేకపోతున్నాడు.
"అయినా ఈ విషయం అంత గోప్యంగా వుంచిందేం?"
"గోప్యంగా ఉండటం ఆమెకిష్టం గనుక"
"పబ్లిసిటీ అంటే అస్సలు గిట్టదన్నమాట."
"ఎస్."
"కాని అంతమాత్రంచేత ప్రణయ తెలివయినదీ అని ఎలా అనుకోగలం?"
"ప్రణయ ప్రతి సమ్మర్ వెకేషన్ కీ లండన్ వెళుతుంది"
అర్ధంకానట్టు చూశాడు.
"అయితే?"
"అందుకే ఆమె తెలివయినదీ అనడం లేదు నేను" అరక్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు శౌరి. "సమ్మర్ లో ఎనిమిది వారాలపాటు బిబిసిలో నిర్వహించే 'క్విజ్ కిడ్' ప్రోగ్రామ్ చాలా పాప్యులర్ ఫీచర్. అది నిర్వహించేది ప్రణయ...."
"వ్వాట్?"
"ఓ ఇండియన్ గాళ్ కి ఇంత గౌరవం ఎలా దక్కిందీ అనకు. అక్కడ పత్రికలు రాసినదాన్ని బట్టి ప్రణయ ఓసూపర్ ఇంటెలిజెంట్ గాళ్..."
అబ్బురంగా చూస్తుండిపోయాడు సుధీర్.
* * *
"డియర్ ఫ్రెండ్స్!"
డయాస్ పైన క్విజ్ మాస్టర్ స్థానంలో నిలబడ్డ ప్రొఫెసర్ రాధాకృష్ణ కిక్కిరిసిన ఆడిటోరియం కేసి చూస్తూ అన్నాడు. "ఇది.... రాష్ట్రంలోని యూనివర్శిటీల మధ్య జరగబోయే కాంపిటీషన్స్ కీ ఆంధ్రా యూనివర్శిటీ నుండి ఓ జంటని ఎన్నుకునే రోజు."
