నిజమే! క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపెంట్స్ ఎంట్రీస్ ని అందించడానికి మిగిలింది మరో రెండు గంటలు మాత్రమే.
* * *
"మీరా?" నిశ్చేష్టుడిలా చూశాడు ఆదిత్య.
కింగ్ జార్జి హాస్పిటల్ కార్డియాలజీవార్డుకి అభిముఖంగా నిలబడ్డ ఆదిత్య ప్రణయ అక్కడికి రావడంతో ఆశ్చర్యపోయాడు.
ఉదయం పదకొండు గంటల సమయాన హాస్పిటల్ చాలా సందడిగా వుంది.
అప్పటికి సరిగ్గా పధ్నాలుగు గంటలుగా నిద్రాహారాలు మాని నాన్నమ్మ ఆరోగ్యం కోసం కలవరపడుతున్న ఆదిత్య, మానసికంగా ఎంతనలిగిపోతున్నదీ అర్ధంచేసుకుంటూ అడిగింది మీ "నాన్నమ్మగారికెలాగ వుంది?"
"టెస్ట్ రిజల్ట్స్ ఇంకా రాలేదు" నెమ్మదిగా అన్నాడు.
ఆదిత్యకి జ్ఞానం తెలిశాక నాన్నమ్మ విషయంలో ఇలా ఆందోళన చెందడం ఇదే తొలిసారి.
వయసు ఉడిగినా యంత్రంలా ఉత్సాహంగా కదులుతూ తమకే ఆసరా కాగలిగింది కానీ, ఏ రోజూ మంచం పట్టి ఎరగని మనిషామె.
తల్లిదండ్రులు లేని లోటు ఇంతకాలం తెలీకుండా పెంచిందే తప్ప వున్నట్టుండి ఆ లోటేమిటో యిప్పుడే తెలిసేట్టు చేస్తుంటే దిక్కుతోచనట్లు కంగారు పడుతున్నాడు.
అతడు పెరిగింది చాలా చిన్న ప్రపంచంలో అక్కడ లేమి వున్నా దాని వునికికి అర్ధంలేకుండా చేసింది లక్ష్మమ్మ చాలా సమస్యల్ని చిరునవ్వుతో గెలుస్తూ బ్రతుకుని ఒక స్ఫూర్తిగా మార్చి ఇన్నాళ్ళూ ఇద్దర్నీ బ్రతికించుకుంది.
"మనిషి పెరగడానికి పెద్ద ఉద్గ్రంధాల ఆసరా అక్కరలేదు ఆదిత్యా! మీ నాన్నమ్మలాంటి ఒక వ్యక్తి సంపర్కముంటే చాలు."
అప్పటికీ ఆదిత్య మాట్లాడలేదు.
"ఇనెవిటబుల్ ఇష్యూస్ అంగీకరించాలి తప్ప కాదని కుమిలిపోయినా ఫలితం శూన్యం పరిష్కరించలేని సమస్య ఏర్పడినప్పుడు ఇట్ కెనాట్ బి ఆదర్ వైజ్ అనుకోవాలి."
"కానీ నాకీ ప్రపంచంలో చాలా ప్రశ్నలకు జవాబులా కనిపించింది నాన్నమ్మ మాత్రమే" ఓ పసికందులా కంపించిపోతున్నాడు.
"FOR EVERY AILMENT UNDER THE SUN
THERE IS A REMEDY OR THERE IS NONE
IF THERE BE ONE TRY TO FIND IT
IF THERE BE NONE NEVER MIND IT"
ఓ రైమ్ ని గుర్తుచేసుకుంటూ నిర్వేదంగా అంది ప్రణయ. "మీకు తెలియదని ఈ రైమ్ ని చెప్పలేదు ఆదిత్యా! ఇట్స్ లైఫ్. యథాతథంగా అంగీకరించాలి" ఆమె జాప్యం చేయలేదు. అడగాలనుకున్న విషయానికి సూటిగా వచ్చింది. "ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే మీరు కాంపిటీషన్ లో పాల్గొనడం లేదని సూరి చెప్పగా తెలిసింది."
"ఇష్టం లేదు అందులోనూ ఈ స్థితిలో పార్టిసిపేట్ చేయడానికి అసలు మనస్కరించడం లేదు."
"అన్నిటినీ మనసులోకి తీసుకుంటే అవకాశాలు చేజారిపోతాయి. ఏడాది పొడుగునా చదివాక తలనొప్పిగా వుందని ఎగ్జామ్ కి వెళ్ళడం మానేయం."
"కానీ ఇది తలనొప్పిలాంటి సమస్యకాదు."
"కావచ్చు మీరు ఇక్కడ వుండి చేసేదేముంది?" నిజాయితీగా నచ్చచెప్పింది. "పేషెంట్ కి కావాల్సింది డాక్టర్ల పర్యవేక్షణ. మీ మనోవేదన కాదు."
"కానీ..."
"మిస్టర్ ఆదిత్యా! నాకు తెలుసు మీరు చేయాల్సింది నేను చెప్పడమంత సులభం కాదని. కాని ఒక్క విషయం మీ జీవితం కూడా వడ్డించిన విస్తరికాదు. ఎప్పుడో గతి తప్పాల్సిన స్థాయి నుంచి మీ నాన్నమ్మగారి మూలంగా ఈ స్థాయిదాకా నడిచింది. అసలు ఇంతకాలమూ ఆమె సాగించిన పోరాటం కూడా మీ పురోభివృద్దికోసమే తప్ప పతనానికి కాదుగా? ఒక వేళ తన అనారోగ్యం మీ అవకాశాన్ని ఇలా దెబ్బతీసిందని తెలిస్తే ఆమె మాత్రం హర్షిస్తుందనుకున్నారా?"
"అసలు ఈ కాంపిటీషన్ అంత ముఖ్యమెలా అవుతుంది ప్రణయా?"
"ఒక చిన్న గెలుపు చాలా గెలుపులకుకరణమవుతుంది. ఒక్కోమారు జీవితాన్నే మలుపు తిప్పుతుంది అసాధారణంగా ఆదిత్యా! మీ మీద మరొకరికి ఎంత అధికారం వుందో నాకు తెలియదు కాని, అసలు మీ పేరు ఇన్ క్లూడ్ చేయడంకోసం ఎన్ని వందలమంది విద్యార్ధులు పోరాడారో మీరు వూహించలేరు. కారణమున్నా కాని వాళ్ళందర్నీ నిరాశపరిచే హక్కు మీకు లేదు ప్లీజ్! నా మాట వినండి."