"యస్సర్! అప్పట్లో జపనీయులు తయారు చేసిన కారు బియ్యపు గింజ సైజులో వుంటే , నేను తయారు చేసింది కేవలం ఆవగింజ సైజులో వుంది! ' అని ఆవగింజ సైజులో వున్నా మైక్రో మినీ కారుని ఒక దోస గింజ మీద పెట్టి , స్టార్ట్ చేశాడు అసిస్టెంటు అనుచర్ పక్కనే వున్న స్క్రీన్ ప్రకాశవంతంగా అయింది. ఆవగింజసైజులో వున్న ఆ కారు దోసగింజమీదే వృత్తాకారంగా పరిగెత్తడం స్కీన్ మీద కనబడుతుంది.
"గుడ్!" అన్నాడు సైంటిస్ట్ జ్ఞాని.
గొంతు సవరించుకుని అన్నాడు అసిస్టెంట్ అనుచర్.
"సర్! ఇవాళ నాకేదో విశేషం చూపిస్తానని చెప్పారు మీరు."
"అవునవును -- రాబోటిక్స్ లో కొత్త ఎక్స్ పెరిమెంటు - ఇన్నాళ్ళు సిద్దాంతరీత్యా మాత్రమే సాధ్యమనీ, ఆచరణలో అసాధ్యమనీ అనుకుంటున్న దానిని నేను నిజంచేశాను అనుచర్" అన్నాడు సైంటిస్టు జ్ఞాని , తృప్తిగా.
అనుచర్ మొఖంలో ఉత్సుకత కనబడింది. బాస్ ఇంకా ఏం చెప్తాడా అన్నట్లు ఆత్రంగా చూస్తున్నాడు.
గంభీరంగా చెప్పడం మొదలు పెట్టాడు సైంటిస్టు జ్ఞాని.
"నేను నోనోబోట్ ని చేశాను అనుచర్!"
"ఓహ్! నోనోబొట్!! నేను చూడొచ్చాసార్?" అన్నాడు అనుచర్.
నవ్వాడు జ్ఞాని. "చూపులకి కనబడితే అది నోనో బొట్ ఎట్లా అవుతుంది అనుచర్? నోనోబొట్ అంటే మిల్లిమీటర్ లో వెయ్యో వంతు సైజులో ఉండే సూక్ష్మమైన రాబోట్ అని నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు తయారు చేసిన ఆవగింజ సైజు కార్లో ఇలాంటి రోబోలు ఓ గుంపుగా కలిసి కూర్చుని పిక్ నిక్ వెళ్ళవచ్చునన్నమాట!" అన్నాడు జ్ఞాని, నవ్వుతూ . "అనుచర్ ! మనం నోనోబొట్ ని తయారు చేస్తాం -- మనం నోనోబొట్ లతో ఏం చేయించవచ్చో వర్ణించు?"
టీచర్ ప్రశ్న అడిగితే, తనకు కంఠతా వచ్చిన జవాబును గబగబా అప్ప చెపుతున్నట్లుగా అన్నాడు అనుచర్.
"నోనోబోట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయ్ -- ముఖ్యంగా మెడికల్ ఫీల్డు లో! సూక్ష్మమైనవి కాబట్టి, ఒక్కొక్క రోబో శరీరంలోని ఒక్కొక్క కణాన్ని పట్టుకుని దాన్ని కూలంకషంగా చెక్ చేసి, ఆ కణం గనక అనారోగ్యంగా వుంటే, దాన్ని రిపెయిర్ చేసి ఆరోగ్యవంతంగా మారుస్తాయి. మాములుగా అయితే, ఎన్ని రకాల మందులు ఇచ్చినా కూడా శరీరంలో ఉన్న ప్రతి కణమూ కూడా పూర్తిగా ఆరోగ్యవంతం కావడం అనేది కష్టం! వంట్లో ఏదో మూల ఏదో ఒక రోగం ఉంటూనే ఉంటుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా పూర్తీ ఆరోగ్యం అనేది సాధించడం సంభవమే కావచ్చును గానీ ఆ టెక్నాలజీ డెవెలప్ కావడానికి కనీసం ఇంకో పదేళ్ళు పడుతుంది" అన్నాడు అనుచర్ గుక్క తిప్పుకోకుండా.
"ఇదే నేను తయారు చేసిన నోనోబొట్ అనే మైక్రో మినీ రోబోట్ !' అన్నాడు సైంటిస్టు జ్ఞాని ప్రకాశవంతంగా వున్న స్కీన్ వున్న వైపు చూపిస్తూ.
సూక్ష్మాతి సూక్షమైన నోనోబొట్ ని లక్ష రెట్ల సైజుకి మాగ్నిఫై చేస్తే ఎట్లా వుంటుందో స్క్రీన్ మీద కనబడుతుంది.
మానవాకారంలోనే వుంది ఆ రాబోట్. దానికి తల ఉంది. కళ్ళూ, నోరూ ముక్కూ చెవులూ ఉన్నాయి. మొండెం వుంది. కాళ్ళూ చేతులూ వున్నాయి.
"మిల్లిమీటర్ లో వెయ్యో వంతు సైజు ఉండే ఈ రోబో తలలో మెదడు లాంటి ఏర్పాటు వుంది. వంట్లో నాడీ మండలం కూడా వుంది " అన్నాడు సైంటిస్టు జ్ఞాని.
అసిస్టెంట్ అనుచర్ కళ్ళప్పగించి చూస్తున్నాడు. తెరమీద ఒక మానవ శరీరం తాలుకూ ఒక కణం కనబడుతుంది. రక్తంలో ఉండే ఎర్రకణం అది. దానికి బహుశా హిమోగ్లోబిన్ సరిగా అందకపోతూ ఉండి ఉండాలి. శరీర ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ఒక పోలీసులాగా చురుకుగా ఉండాల్సిన ఆ కణం చాలా డల్ గా కనబడుతోంది.
దాన్ని పరిశీలనగా చూసింది కణం కంటే కూడా సూక్ష్మరూపంలో ఉన్న నోనోబొట్ . దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్లుగా తిరిగి, అన్ని కణాల నుంచి దాన్ని గమనించింది. ఊహించడానికి వీలుకానంత సూక్ష్మాతి సూక్షమైన ఒక బయోలాజికల్ కిట్ ని బయటికి తీసింది. దానితో ఆ యెర్రరక్తకణానికి శతకోటి పరీక్షలు చేసింది.
తర్వాత ఒక ఎక్స్ పర్ట్ సర్జెన్ ఆపరేషన్ చేస్తున్నట్లుగా ఎన్నో పద్దతులలో ఆ కణానికి చికిత్స చేసింది.
కొద్ది క్షణాల తర్వాత ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఎర్రెర్రగా కనబడింది ఆ కణం!
'ఆపరేషన్ సక్సెస్" అన్నాడు సైంటిస్టు జ్ఞాని ఉద్వేగంగా.
ఆ తర్వాత మరో కణం దగ్గరికి వెళ్ళింది నోనోబోట్ . దాన్ని టెస్ట్ చేసి, అది బాగానే ఉందని తేల్చుకుంది. ఇంకో కణం దగ్గరికి వెళ్ళింది. దాన్లో ఉన్న లోపాలని కరెక్టు చేసింది.
"గ్రేట్ సర్!" అన్నాడు అసిస్టెంట్ అనుచర్ సగర్వంగా చూశాడు సైంటిస్ట్ జ్ఞాని. ఒక మనిషి శరీరంలోకి ఇంజేక్టు చేయబడిన అసంఖ్యాకమైన నోనోబోట్ లు శరీరంలోని ప్రతి కణాన్ని పరిశీలించి , అవసరమైన అడ్జస్టుమెంట్స్ చేస్తాయి. దాంతో బాడీ కంప్లీట్ గా ఆరోగ్యవంతం అవుతుంది.
"వండర్ పుల్!' అన్నాడు అసిస్టెంట్ అనుచర్.
"వండర్! నోనోబోట్ ల వల్ల ఇంకా చాలా రకాల ఉపయోగాలు వున్నాయి."
"యస్సర్! ఈ లెక్కన వీటిలో ఇంజనీరింగ్ ఫీట్సు కూడా చేయించవచ్చును కదా!" అన్నాడు అనుచర్.
"బాగా ఊహించావ్!"
మనం ఫీడ్ చేసే ఇన్ ఫర్మేషన్ ని బట్టి వీటిని మైక్రో మినీ డాక్టర్లు గా ఎట్లా ఉపయోగిస్తామో, అట్లాగే, మైక్ర్రో మినీ ఇంజనీర్లుగా ఉపయోగించి భారీ ప్రాజెక్టుల నిర్మాణాల దగ్గర్నుంచీ , వంద అంతస్తులూ , రెండొందల అంతస్తులు ఆకాశ హర్మ్యలదాకా కూడా అన్నిటినీ నిర్మింపచేయవచ్చు" అన్నాడు జ్ఞాని.
"ఇంకాస్త డిటెయిల్డుగా చెప్పండి సార్!" అన్నాడు అనుచర్ ఉత్సాహంగా.
"చెప్తా చెప్తా ! ఈ నోనోబోట్ లలో ఇంకో స్పెషాలిటీ ఏమిటంటే , ఇవి అచ్చం తనలాగే ఉండే రోబోలను అసంఖ్యాకంగా తయారు చేసుకోగలవన్నమాట! ఉదాహరణకి మనం ఇప్పుడు ఈ భూమి మీద వున్న అతి ఎత్తయిన బిల్డింగ్స్ మించి, దాని తాతలాగ ఏ నాలుగొందలు అంతస్తులు ఎత్తో వుండే ఒక స్క్రే స్కేపరు కట్టదలచుకుంటాం.
అనుచర్! నీకు తెలుసు -- అంత ఎత్తు వుండే బిల్డింగులు -- అవి కాంక్రీటుతో కట్టినవి అయినా సరే -- గాల్లో అటూ ఇటూ వూగుతూ వుంటాయి. ఎత్తు వలన గాల్లో వూగడం అనేది ఎలాగూ తప్పదు. అయినా ఆ ఊపుకి అవి విరిగి కిందపడిపోకూడదు - కదా! అట్లా లెక్కవెయ్యాలి. ఆ బిల్డింగులని అట్లా డిజైన్ చెయ్యాలి.
'అంటే ఒకసారి ఇన్ ఫర్మేషన్ ఫీడ్ చేసి మనకు ఎట్లాంటి బిల్డింగు కావాలో చెబితే ఈ రోబోలు ఇంజనీరింగ్ కాలేక్యులేషన్సూ - డిజైనింగ్ అదంతా తమంతట తామే చూసుకుంటాయంటారా"
"ఆహా! ఈ భూలోకంలో చెదపురుగులు , అత్యద్భుతమైన అర్కిటేక్కులూ , ఇంజనీర్లు అని చెబుతారు. కోటాను కోట్ల సంఖ్యలో వున్న ఈ మైక్రో మినీ రోబోలు చెద పురుగుల్లాగా చకచకా వందల అంతస్తుల ఎత్తూ, ఉన్న ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తాయన్నమాట. ఆ నిర్మాణానికి ఎన్నేసి కోట్ల రోబోలు కావాలో అవే లెక్క వేసుకుంటాయి. అన్నేసి రోబోలని అవే తయారు చేసుకుంటాయి కూడా! " అన్నాడు సైంటిస్టు జ్ఞాని.
"ఫాంటాస్టిక్!" అన్నాడు అసిస్టెంట్ అనుచర్.
"నిజమే! కానీ -- ఇక్కడొక డేంజరుంది " అన్నాడు సైంటిస్టు జ్ఞాని, మిస్టీరియస్ గా.
* * *
