మనసులోనే వాళ్ళ మాటలని మననం చేసుకుంటున్నాడు డ్రైవరు . మళ్ళీ ఓనరుగారికి అప్పజెప్పాలి గదా! అందుకని ?
"ఈ ఆఫీసరు గారు శృంగార పురుషుడన్నమాట!" అనుకున్నాడు డ్రైవరు. అతని పెదిమల మీద అదో రకమైన నవ్వు మెరిసింది. "అయినా నాకెందుకులే " అనుకున్నాడు మళ్ళీ.
రాజు హనుమంతుతో గుసగుసగా అన్నాడు . "హనుమంతూ -- ఇదిగో ! ఈ డబ్బు తీసుకో! నీ కొడుకు , నీ కూతురు నీ దగ్గరికి వచ్చేలా చేసే బాధ్యత నాదీ! ధైర్యంగా వుండు " అన్నాడు.
గుడ్లెంబడి నీళ్ళు కుక్కుకుంటూ , వంగి రాజు కాళ్ళకి దణ్ణం పెట్టాడు హనుమంతు.
అతన్ని వారించి, సృష్టితో వచ్చి లారీ ఎక్కాడు రాజు.
వాళ్ళని కాబిన్ లో కూర్చోమన్నాడు డ్రైవరు. వద్దని లారీ వెనుక కలప దుంగల మీద కూర్చున్నారు ఇద్దరూ.
"వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వీళ్ళకి ఇచ్చారా - అబ్బో ! మీరు మోడర్న్ డే రాబిన్ హుడ్ !" అంది సృష్టి. మెల్లిగా రాజు వేపు ప్రశంసా పూర్వకంగా చూస్తూ.
చిన్నగా నవ్వి , "దుష్ట శిక్షణా -- శిష్ట రక్షణా! అవునా ? కానీ, నేను అంత పెద్ద మాటలకు అర్హుడిని కాను -- వుండబట్టలేక తోచింది చేయడం -- అంతే !" అన్నాడు.
"వూరికి వుపకారం చేయడం మాట అటుంచి , ఉపకారికి అపకారం చేయడమే లోకనీతి అయిన ఈ రోజుల్లో, కనీసం ఎవరికీ అపకారం చేయకుండా బతకడం కూడా ఒక గొప్ప క్వాలిఫికేషన్ అయిపోయిన ఈ రోజుల్లో తోటిమనిషి గురించి ఆలోచించే వాళ్ళు తక్కువైపోతున్నారు గదా -- మీరు సంథింగ్ స్పెషల్ !' అంది సృష్టి. మాటల కోసం వెదుక్కుంటూ.
లారీ వెనుక పేర్చిన కలప దుంగల మీద కూర్చుని ఉన్నారు ఇద్దరూ. దార్లో కొమ్మలు అడ్డం వచ్చినప్పుడల్లా కొద్దిగా వంగి, వాటిని ఒడుపుగా తప్పించుకుంటున్నారు.
సూర్యుడి కిరణాలు ఎత్తుగా ఉన్న చెట్ల మధ్య నుంచి వాళ్ళ మీద పడుతున్నాయి.
కొద్దిగా కిందికి వంగి , డ్రైవర్ ని అడిగాడు రాజు.
"ఇదిగో ! నీపెరేమిటి?"
"సురేష్ సార్" అన్నాడు డ్రైవర్.
"నువ్వు రోజూ అడవిలోకి వస్తావా సురేష్?"
"వారానికి రెండు ట్రిప్పులు సార్!"
"సురేష్!"
"సార్!"
"ఈ సోకాల్డ్ రాక్షసుడు నీకేప్పుడయినా కనబడ్డడా?"
"రాక్షసుడు వున్నాడు సార్!" అన్నాడు సురేష్ దృడంగా.
"నువ్వు చూశావా?"
"నాకు రెండు సార్లు కనబడ్డాడు సార్!"
"ఆ రాక్షసుడు ఎట్లా వున్నాడు సురేష్?"
"పాతిక ఎలుగు బంట్లని కలిపి ఒకే ఎలుగుబంటిగా చేస్తే ఎట్లా వుంటుంది సార్.....సెంట్ పర్సెంట్ అట్లాగే వున్నాడు సార్"
"ఎంత ఎత్తు ఉంటాడు సురేష్?"
"ఎంత తక్కువయినా ఇరవై అడుగుల ఎత్తు ఉంటాడు సార్!"
"ఇరవై అడుగులా! ఎంత బరువు ఉండవచ్చు ?"
"ఎంత లేదన్నా వెయ్యి కిలోలు ఉంటాడు సార్!"
"ఇంకా నీకు తెలిసింది చెప్పు "
"ఒక్కొక్క అంగ రెండు గజాలుగా వేస్తూ నడుస్తాడు సార్!"
డ్రైవర్ సురేష్ మాట్లాడుతుంటే అంత దూరానికి కూడా నాటుసారా వాసన గుప్పున వస్తోంది. తను పొదల్లోకి వెళ్ళి హనుమంతుతో మాట్లాడుతున్నప్పుడు ఇతను డోసు వేసుకుని ఉండాలి.
మెల్లి మెల్లిగా సురేష్ గొంతు మారుతోంది. మాట తడబడుతోంది.
"అయినా భయం లేదు సార్ .... నా లారీ మడ్ గార్డుకి కట్టిన నిమ్మకాయలు చూశారా సార్.... అవి మా ఊరి భేతాళుడు గారు కట్టినవి సార్! భేతాళుడు గారు వంద శవపూజలు చేశాడు సార్! శవ పూజ చేస్తే అటు గొప్ప రాజకీయ నాయకుడు కావచ్చు సార్ -- లేదా ఇటు భూతాలకీ , పిశాచాలకీ నాయకుడు కావచ్చు సార్.....లేదా గొప్ప ఫారెస్ట్ కాంట్రాక్టరు కావచ్చు సార్...మా ప్రోప్రయిటర్ నా కొడుకు సార్......."
ఆ తర్వాత వినలేని బూతుల్లోకి దిగిపోయాడు సురేష్.
ఇంతకీ, ఈ సురేష్ రాక్షసుడిని చూసిన సంగతి నిజమా?
లేక -
త్రాగుడు మైకంలో వాగిన వాగుడా?
కాసేపు ఆలోచనలోనే ఉండిపోయి, తర్వాత నిదానంగా తలెత్తి సృష్టివేపు చూశాడు రాజు.
సృష్టి కూడా అతని వైపే చూస్తోంది.
చూపులు కలవగానే నవ్వింది ఆమె.
"రాక్షసుడి సంగతేనా ?" అంది మృదువుగా.
నవ్వాడు రాజు.
"ఒక రాజకుమారుడు చందమామ కధల్లోలాగా, రాక్షసుడిని వెదుక్కుంటూ వెళ్ళడంలా ఉందనుకుంటున్నాను ?" అంది.
"అంతే గదా మరి ?" అన్నాడు రాజు.
"జానపద కధల్లోని రాక్షసుడు లాంటి వాళ్ళు కాకపోయినా , జెయింట్స్ వుండడం ఆశ్చర్యం కాదు " అంది సృష్టి.
"అంటే..."
సాలోచనగా అంది సృష్టి.
"నేను అంత్రోపాలజిస్టుని. ఇట్లాంటి విషయాల్లో నాకు అభిలాష వుంది. అనుభవమూ వుంది. మనకి ఇప్పటిదాకా అంతుపట్టని విశేషాలు కొన్ని వున్నాయి. మనకి అర్ధం కానివన్నీ ఫ్రాడ్ అనిగానీ, మోసం అని గానీ, చాదస్తాలు, మూడ నమ్మకాలు అని గానీ కొట్టి పారేయడం మనకి అలవాటు. ఇవాళ్టి దాకా మనకు తేలిసిందే సైన్సు అనీ, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదని వాదించే వాళ్ళు కొందరుంటారు. నిజం ఏమిటంటే, సృష్టి రహస్యాలన్నీ మనకి ఒక్కసారిగా తెలియవు. సీరియల్ నవలలో లాగా మన విజ్ఞానం ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతూనే వుంటుంది."
విని కాసేపు మౌనంగా ఉండిపోయి 'సరే! మనకి అంతు బట్టని విషయాలు ముఖ్యంగా ఈ సోకాల్డ్ రాక్షసులకు సంబంధించినవి -- ఏమిటి?" అని అడిగాడు రాజు.
"చెబుతాను . అమెరికాలో టెన్నీసీ రివర్ ఉందా -- దాని ముఖద్వారం దగ్గరి ప్రాంతంలో కొన్ని అడుగుజాడలు కనబడ్డాయి. ఆ పాదాల గుర్తుల సైజు ఏమిటో తెలుసునా ?
ఒక్కొక్క పాదం పదహారు అంగుళాల పొడుగు వుంది.
వేళ్ళ దగ్గర పదమూడు అంగుళాల వెడల్పు ఉంది. మడమ కింద ఐదంగుళాల వెడల్పు ఉంది .. అట్లాగే మిసిసిపీ నదికి పడమటి దిక్కున పదిన్నర అంగుళాల పొడుగూ , నాలుగంగుళాల వెడల్పూ ఉన్న జెయింట్ పాదాల గుర్తులు ఉన్నాయి. అవి ఎప్పటివీ! ఇప్పటికీ రెండు కోట్ల డెబ్బయ్ లక్షల సంవత్సరాల క్రితంవి.
