Previous Page Next Page 
రక్తచందనం పేజి 14


    "థాంక్యూ సార్....?" అంది మహిమ ఒకింత మొహమాటపడుతూ.
    "నీకెంత కావలిస్తే అంత తీసుకో. బట్ వీరూకి సంబంధించిన వార్తల్ని మా పేపర్ కి ఇవ్వాలి. అయినా ఇదంతా ఎందుకమ్మా....? మా పేపర్ లో స్టాఫ్ రిపోర్టరుగా చేరిపోరాదు....? నెలకు రెండువేలకు పై చిలుకు వస్తుంది. రాసినా రాయకపోయినా జీతం టంచన్ గా వస్తుంది.... ఏమంటావ్....?" అభిమానంగా అన్నాడాయన.
    మహిమ నవ్వింది అందంగా....అందమైన పలువరుస మెరిసేలా నవ్వింది.
    "ఏదన్నా అడిగితే నవ్వుతావు. నో అని చెప్పటాన్నికూడా ఎంతో అందంగా వ్యక్తం చేస్తావు. రాష్ట్ర ప్రభుత్వం వీరూ విషయంలో తీవ్రమయిన చర్యలే తీసుకోవచ్చు. వాటిని కూడా ఆరాతీస్తే బావుంటుంది. ఏది ఏమైనా ఇకపై జాగ్రత్తగా వుండు...." అన్నాడు. ఆ రోజు పేపర్ లో వచ్చిన వార్తకి రెమ్యునరేషన్ ఇవ్వమని ఫైనాన్స్ మేనేజర్ కి రాస్తూ.
    "నిన్నరాత్రి డి.జి.పి., సి.సి.ఎఫ్., హోం మినిష్టర్ సి.ఎం. రెసిడెన్స్ కి వెళ్ళి సమాలోచనలు జరిపారు. నిన్నరాత్రి ఏడున్నర గంటలకు టి.వీ.లో ఆ వార్త వచ్చింది. ఆ వార్త వచ్చాకే వాళ్ళు వెళ్ళారు. చీఫ్ సెక్రెటరీ, ఫారెస్ట్ మినిష్టర్ కూడా సి.ఎం.ని కలిశారు. ఈరోజు సదాశివపేటలో వున్న డి.జి.పి. ఇంటికి సి.సి.ఎప్. చంద్రశేఖర్ వెళ్ళి రెండు గంటలు సమాలోచనలు జరిపారు. ఏదో జరగబోతోంది.... కొత్త పథకం సిద్ధమవుతోందని నా అనుమానం.
    అదేమిటనేది ఇన్వెస్టిగేషన్ కి ఆటంకం కలుగుతుందని వాళ్ళు చెప్పరు. మనమూ రాయకూడదు. అప్పుడు మనకు కావలసింది వీరూ వెనుక ఉండి కథ నడిపిస్తున్న ఘరానా వ్యక్తుల బయోడేటాలు, ఫారెస్టు పోలీసు శాఖల నిజాయితీ స్థాయి...." అంది సాలోచనగా.
    ఆ వయస్సుకే అంత నిశితమైన పరిశీలనగా శక్తి ఎలా వచ్చిందనే రెసిడెంట్ ఎడిటర్ ఆశ్చర్యపోయారు.
    "కొల్లెగాళ్, సిల్విక్కల్, సత్యమంగళం, బర్గూర్ అడవులు మైసూర్ జిల్లా పరిధిలోకి వస్తాయి. సో....మైసూర్ కొత్త పథకానికి కేంద్రస్థానం అయి ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు బోర్డర్ లోనే వీరూ ఎక్కువగా తన కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటాడు. మైసూర్ జిల్లా బోర్డర్ దాటితే తమిళనాడుకి చెందిన పెరియార్, ధర్మపురి జిల్లాల పరిధిలోకి వెళ్ళే అవకాశం వుంది.
    హొగెనెకల్ ఫాల్స్ ప్రాంతంలో కావేరి నది తమిళనాడుని కర్ణాటకని విడగొడుతుంది. అవన్నీ వీరూ సంచరించే ప్రాంతాలు.
    ఖచ్చితంగా ఈ విషయంలో తమిళనాడు ఫారెస్ట్ విభాగం, కర్ణాటక ఫారెస్టు, పోలీసు విభాగాలకు సహకరిస్తేనే వీరూ మీద వల పన్నటం సాధ్యం.
    సో....తమిళనాడు గవర్నమెంట్ స్ట్రాటజీ ఏమిటో కూడా తెలుసుకోవాలి.
    వీరూ స్వగ్రామం కర్ణాటకలోని గోపీనాథం. అయినా వాళ్ళ తాత ముత్తాతలు తమిళనాడుకి చెందిన ధర్మపురి జిల్లానుంచి వలస వచ్చినవారే. వీరూకి ఇప్పటికి ధర్మపురి జిల్లాలో బంధువులున్నారు.
    వీటన్నిటినీ బట్టి ఆలోచిస్తే అస్పష్టమైన మెలిక ఏదో ఉందనిపిస్తోంది. కొద్దిగా టైం తీసుకొని ఫాలో అప్ స్టోరీ రాస్తాను...." అంది మహిమ లేస్తూ.
    "రేపు మా పేపరు బాగా అమ్ముడుపోవాలని లేదా? మా పేపర్ మీద ఆసక్తి తగ్గిందా?" నవ్వుతూ అడిగాడు రెసిడెంట్ ఎడిటర్.
    "నో....నో....అదేంలేదు. ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టాలి గదా....?"
    "ఇప్పుడు నువ్వు చెప్పిందే ఇన్ఫర్మేషన్. వీరూ తమిళనాడుకి చెందినవాడని, అతని తాతముత్తాతలు ధర్మపురి జిల్లాకి చెందినవారని చెప్పావే....వాటినే వివరంగా రాస్తే మంచి వార్తవుతుంది" అన్నాడాయన ఉత్సాహంగా.
    మహిమ నవ్వి లేచింది.


                            *    *    *    *


    సమయం రాత్రి పదకొండు గంటల పది నిముషాలు....
    భైరవీ నోటిలో కాగితాన్ని తీసి చదివాడు కరియా.
    సరీగ్గా పదకొండు గంటల పదిహేను నిమిషాలకు లారీలు బయలుదేరాలి....11-45కి లారీలు తారురోడ్డు ఎక్కాలి. సరీగ్గా అదే సమయానికి వేలాయుధం లారీలు ఆ ప్రాంతానికి వస్తాయి. ఐదు కలసి అలంబడికేసి సాగిపోవాలి. లారీలకు సహాయంగా ఎవరూ వెళ్ళనక్కరలేదు_అని ఉందా కాగితంలో.
    కరియా ఉలిక్కిపడ్డాడు అది చదివి....
    ఆ ప్రమాదకరమైన రూట్ ని యజమానరే ఎందుకు ఎన్నుకున్నట్లు? పైగా రక్షణ లేకుండా....?!
    మాదప్ప అనే రేంజర్ పరిధిలోవున్న అటవీ ప్రాంతమిది. కౌదల్లీ రేంజ్ నుంచి అలంబడి రేంజ్ లోకి ఎంటరయ్యే దగ్గర ఒక ఫారెస్టు చెక్ పోస్టుంది. అనుమానం వస్తే రేంజర్ ఆ చెక్ పోస్టులోనే మకాంచేసి అటునుంచి వెళ్ళే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తాడు.
    మాదప్ప స్ట్రిక్టు ఆఫీసర్ అని ప్రతీతి. ఎలా అని మదనపడుతూనే లారీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కరియా.
    అడవిలో పర్చుకొని వున్న నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ లారీలు స్టార్టు అయ్యాయి. లైట్స్ వెలిగాయి. అప్పటివరకూ ఉనికి లేకుండా నిశీధిలో కలిసి వున్న లారీలు వాటి ఉనికిని తెలుపుకుంటూ బయలుదేరాయి.
    సరీగ్గా అదే సమయానికి మరోవైపు నుంచి వేలాయుధం లోడ్ చేయించిన లారీలు బయలుదేరాయి.
    భయానకంగా వున్న అడవి అంతర్భాగంలో వీరూ నిర్ధేశించిన లక్ష్యానికేసి వేగంగా దూసుకుపోతున్నాయి.
    ఆ శబ్దానికి చెట్లపై విశ్రాంతి తీసుకుంటున్న పక్షులు రెక్కల్ని టపటప లాడిస్తున్నాయి. లారీల హెడ్ లైట్స్ కాంతిలో ఆకాశంలోకి ఎదిగిన చెట్లు జడలు విరబోసుకున్న దయ్యాల్లా వున్నాయి.
    సన్నటి తారురోడ్డు జడపాయలా అనంత దూరాలకు సాగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆ లారీ డ్రైవర్లకు అలా అర్ధరాత్రుళ్ళలో సరుకును తరలించటం అలవాటే అయినా అప్పుడప్పుడు ఒణికిపోతుంటారు. గంభీరంగా ఉండే ఆ పరిసరాల్ని చూసి.
    అరగంట ప్రయాణించాక రెండు లారీలు ఆగిపోయాయి. ఇంజన్స్ ఆఫ్ చేసి, లైట్స్ ని ఒకటికి రెండుసార్లు వెలిగించి ఆర్పి చీకటిలో కలిసిపోయి ఎదురు చూడసాగారు.
    వేలాయుధం పంపే లారీలకు అదే సంకేతం. "మిగతా మూడు లారీలు ఇంకా రాలేదే....?" ఒక క్లీనర్ డ్రైవరుని అడిగాడు.
    "ఈపాటికి వస్తుంటాయి....అయినా ఈసారి లారీలతో తన అనుచరుల్ని వీరూ పంపించలేదేమిటి?" లారీ డ్రైవర్ బీడీ వెలిగించుకుంటూ అనుమానం వ్యక్తం చేశాడు.
    "అతని ఎత్తు ఏమై వుంటుందో ఎవరికి తెలుసు? ఈ రూట్ లో వున్న చెక్ పోస్టు దగ్గర మాదప్ప ఉంటే మన గతి అంతే....లారీల్లోంచి దూకేసి అడవిలో కలిసిపోవటమే...." క్లీనర్ ఒకింత భయపడుతూ అన్నాడు.
    ఇద్దరిమధ్య తిరిగి నిశ్శబ్దం అలుముకుంది.
    ఉన్నట్లుండి ఓ కణుసు హృదయవిదారకంగా కేకపెట్టింది.
    ఆ ఇద్దరూ, వెనుక లారీలోని ఇద్దరు ఒక్కక్షణం భయంతో బిగుసుకుపోయారు.
    కణుసు కేక పులి ఆగమనానికి సంకేతం. లారీ డోర్స్ ని లాక్ చేసి చీకట్లోకి బిక్కు బిక్కుమంటూ చూస్తూ కూర్చున్నారా నలుగురు.
    కాలం క్రమంగా నిశ్శబ్దంలో కరిగిపోతోంది.
    క్రూరమృగాలకు నెలవయిన ఆ దట్టమైన అడవిలో అర్దరాత్రి గడపవలసి రావటం జీవితాల్ని టాస్ చేయటమే.
    కణుసు తిరిగి అరవలేదు.
    పులి గాండ్రింపు వినపడలేదు.
    వారిలో పెరిగిన నాడీవేగం ఒకింత తగ్గింది. అంతలో దూరంగా లారీలు వస్తున్న శబ్దం వినిపించింది. ఆపైన హెడ్ లైట్స్ కనిపించాయి. ఈ లారీల్లోని వాళ్ళు అలర్ట్ అయిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS