సాహసి
ఎగిరించకు లోహవిహంగాలను!
కదిలించకు సుప్త భుజంగాలను!
ఉండనీ,
మస్తిష్కకులాయంలో!
మనోవల్మీకంలో!
అంతరాళ భయంకర
ప్రాంతరాలనా నీ విహారం?
ముళ్ళదారినా నీ సంచారం?
పలికించకు మౌనమృదంగాలను!
కెరలించకు శాంత తరంగాలను!
హృదయంలో దీపం పెట్టకు!
మంత్రనగరి సరిహద్దులు ముట్టకు!
9-7-1934
* * *
