10
నా భర్తా, నేనూ సినిమాకి వెళ్ళిన వారం రోజులకి నా భర్త స్నేహితుడు, అతని భార్యా ఇంటికి వచ్చారు. అతను వాళ్ళతో మాట్లాడుతూ ముందుగదిలో కూర్చుని వున్నాడు. ఆదివారం, అందులోనూ పనివేళ అవడంచేత, నేను పని చేసుకుంటూనే మధ్య మధ్యలో వాళ్ళ సంభాషణలో పాలుపంచుకుంటున్నాను. నేను నా బట్టలన్నీ పిండేసి, ఆరేసుకుని బకెట్ తో వెనుక తలుపుగుండా వస్తున్నాను.
"రా, ఇలా కూర్చో. పని ఎప్పుడూ వుండేదే కదా!" అన్నాడు నా భర్త.
నాకు చిరాకేసింది. అర్థం చేసుకోడేంటి ఈ మనిషి? పని ఎప్పుడూ వుండేదేనట. పని సరే, నాకు టైమ్ వుండాలి కదా అని మనస్సులోనే విసుక్కున్నాను.
ఆ వచ్చినావిడ "ఫర్లేదులేండి పాపం! ఆవిడ ఏదో పనిలో వున్నారు. రోజూ టైమ్ దొరకదు కదా మరి!" అంది.
ఆవిడకున్న జ్ఞానం కూడా కట్టుకున్నవాడికి లేదు కదా అనుకున్నాను. అయినా మొహమాటానికి వచ్చి వాళ్ళ ముందు కూర్చున్నాను.
"ఎందుకు ఫర్లేదండీ? ఎంత రోజూ ఆఫీసుకి వెళ్ళినా ఏ రోజు పని ఆ రోజు తప్పదుకదా, కొత్తగా ఆదివారంరోజు ఏం పుట్టుకొస్తాయి? అయినా మీరు పూర్తి చేసుకురాలేదేంటి?" అంటున్నాడు.
నాకు ఒళ్ళు మండిపోయింది. మాలో మేం ఎంత పోట్లాడుకుచచ్చినా, బయటివాళ్ళ ముందు ఇలాంటి ఎకసక్కెం మాటలు దేనికి?
ఆ సాయంత్రం అడిగా నతన్ని- వాళ్ళముందు ఎందుకలా అవమానకరంగా మాట్లాడారని.
"నేనా? ఎప్పుడూ! నాకేం గుర్తు లేదే" అన్నాడు. అతని మొహం చూస్తే నిజంగానే అతనికి గుర్తులేదేమోననే సందేహం కలిగింది. ఈ మనిషింతే. ఇతనికి సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ నెస్ లేదు. ఇతనికే కాదు, చాలామంది మొగుళ్ళకి వుండదు. ఆ సెన్స్ వున్న మొగుడు దొరకడమంత అదృష్టం మరేదీ లేదు. అలాంటి వాళ్లకు భార్యాపిల్లల ఆనందమే పరోక్షంగా తమ ఆనందం కూడా అని తెలిసి వుంటుంది. 'ఫలానా వ్యక్తి తమ సొంతం' అన్న భావన భర్తకుంటే, స్త్రీ క్కూడా భర్తపట్ల ఆరాధనా భావాన్ని పెంచుతుంది.
అయితే ఈ రకం చిన్న చిన్న సంఘటనలు మా మధ్య మళ్ళీ అడ్డుగోడలు సృష్టించకుండా వుండాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థించేదాన్ని.
* * *
నా బావగారికి నేను సూచించిన ఆగ్రో టెక్ షేర్లు బాగా లాభించాయట. అయిదొందల షేర్లమీద దాదాపు ఐదువేలు లాభం వచ్చిందట. ఆ రోజు ఇంటికి స్వీట్స్ పట్టుకొచ్చాడు. ఇంట్లో అందరూ బాగా సంతోషించారు. నా ఆడపడుచైతే "హాయిగా ఏ కన్సల్టెన్సీయో పెట్టు వదినా! ఈ ఉద్యోగం ఏం చేస్తావులే?" అంది. నా తోడికోడలుతో సహా అందరూ నన్ను అభినందించారు. ఆ సందర్భంలో అతను నా ఆడపడుచుకు ఓ డ్రెస్ తీసుకొచ్చాడు. "థ్యాంక్యూ అన్నయ్యా!" అని ఆ అమ్మాయి వాళ్ళన్నయ్యని ముద్దు పెట్టేసుకుంది.
నేనీ హంగామా అంతా ఆశ్చర్యంగా, కించిత్తు గర్వంగా చూస్తుంటే "ఇదిగో నీకు.... స్పెషల్ గిఫ్ట్!" అంటూ ఓ పెద్ద పాకెట్ చేతికి అందించాడు.
నేను మొహమాటంగా అందుకున్నాను. అంతమందిలో అతను నాకు ప్రత్యేకించి గిఫ్ట్ అందిస్తూంటే నా భర్త, అత్తగారు, ముఖ్యంగా తోడికోడలు ఏమనుకుంటారోనని నాకు బెరుకుగా వుండింది. అయితే నా భయాలన్నీ అర్థరహితం అన్నట్టు అందరూ ఏమనుకోకపోగా, పాకెట్ ఓపెన్ చెయ్యమని అడిగారు. నా భర్త ఆ దారాలన్నీ తెంపేస్తుంటే నేనతనికి సాయపడ్డాను. గుండ్రంగా వున్న అదేంటో నాకు కానీ, అక్కడ వున్న ఎవరికి కానీ అర్థం గావట్లేదు. చివరి రేపర్ తీసేసి అదేంటో చూసిన నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. చిన్న, అందమైన, ఖరీదైన షాండిలియర్. ట్యూబ్ లైట్ కాంతిలో అది తళుకులీనుతుంటే నేను చిన్న పిల్లలా సంబరపడ్డాను. అందరూ బావుంది బావుందని అతని సెలక్షన్ ని మెచ్చుకున్నారు. నా భర్తకూడా "బావుందన్నయ్యా! ఇదే తేవాలని నువ్వెందుకనుకున్నావ్?" అని అడిగాడు. దానికతను ఏం జవాబు చెప్తాడా అని నేనూ కుతూహలంగా ఎదురు చూశాను. అతడు మంద్రస్వరంతో "మీరప్పుడు కొనుక్కున్న బెడ్ లైట్ మా రూమ్ లోనే వుండిపోయింది కదా! దానికి బదులుగా ఇంకా మంచిది ఏదైనా అప్పుడే ఇవ్వాలనుకున్నాను. ఇప్పటికి సందర్భం కుదిరింది" అన్నాడు.
ఎప్పటి విషయమో అతను అంతలా గుర్తుంచుకున్నందుకు నాకు సంతోషం కలిగింది. అది అతని గదిలోనే వుండిపోయినందుకు నేను చేసిన రాద్ధాంతం గుర్తొచ్చి నాకు సిగ్గు కలిగింది. తన అన్నయ్య నుంచి అలాంటి జవాబు రాగానే నా భర్త నాకేసి చూసిన చూపు ఈ జన్మలో మరిచిపోలేను.
కళ్ళతోనే నా భర్తకి క్షమాపణ చెప్పుకున్నాను.
నా బావగారూ, భర్తా కలిసి మా గదిలో సీలింగ్ కి మధ్యగా దాన్ని ఫిక్స్ చేశారు. లోపల చిన్న లేతరంగు బల్బు అమర్చారు. ఆ బల్బు, ట్యూబ్ లైట్ వెలుతురు పరావర్తనం చెంది గోడలంతా వింత వింత డిజైన్లతో చమ్కీలు, అద్దాలతో కుట్టిన చీరలా కనిపించాయి. ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి, కేవలం బల్బు మాత్రమే వెలిగిస్తే, నాగదంతా ఏ ఫైవ్ స్టార్ బెడ్ రూం లాగానో, సినిమా చూపించినట్లుగానో డిమ్ గా, సెక్సీగా, కోజీగా గోచరించింది. నేనది చూసుకుని చూసుకుని మురిసిపోతూంటే నా భర్త "చూశావా, మా అన్నయ్య మనస్సు! మనుష్యుల్ని అర్థం చేసుకోవడంలో నీకు ఎప్పుడూ తొందరపాటే" అన్నాడు. 'నిజమే' అన్నట్టు తలూపాను.
11
నేను వెహికలంటూ కొంటే, కైనెటిక్ హోండానే కొనాలని ఎప్పుడో నిశ్చయించుకున్నాను. ముందు డిపాజిట్ కడితే- నెల నెలా ఇంతని యివ్వొచ్చని స్పెషల్ ఆఫర్ వచ్చింది. ఆ రోజే ఆఖరి రోజట. ఆలస్యంగా తెలిసింది. ఆ మాత్రం డబ్బు నా దగ్గర వుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అది కొనేయడానికే నిర్ణయించుకున్నాను.
డిపాజిట్ తాలూకు చెక్ షోరూంలో ఇచ్చేసి రసీదు తీసుకుని ఇంటికి వచ్చాను. బండి రిజిస్ట్రేషన్ కూడా షాపువాడే చేయించి పెడతాననడంతో గొప్ప రిలీఫ్ కలిగింది. ఇంటికి వచ్చిన తరువాత మా అత్తగారికి మామూలుగా ఓ మాట చెప్పాను.
ఆవిడ ఏం అనలేదు. "అబ్బాయిని అడిగావా?" అని మాత్రం అడిగింది. నాకావిడ భావం అర్థంకాలేదు. "అడగడానికి ఏముందండీ ఎలాగూ కొనాలనుకున్నానని ఆయనకి తెలుసు. ఇప్పుడు కంపెనీ వాడు ఏదో స్పెషల్ ఆఫర్ అంటున్నాడు. ఈ రోజే ఆఖరి రోజట. ఈ టైంలో అది వదులుకోవడం అంటే తెలివైన పనేం కాదు" అన్నాను. ఆవిడ "అలాగా, మంచిపని చేశావులే" అనేసి వూరుకుంది.
ఎలాగూ రెండు రోజుల్లో బండి ఇంటికి వస్తుంది. అది నా భర్తకి సంభ్రమంగా చూపించాలనుకున్నాను. నేనతనితో ఆ విషయం చెప్పకపోవడానికి ముఖ్య కారణం అది. కానీ అలాగని మా అత్తగారితో చెప్పాలంటే మొహమాటం వేసి చెప్పలేదు.
* * *
ఐదున్నర ప్రాంతంలో నా భర్త ఇంటికి వచ్చాడు. టీ తీసుకొస్తుండగా అంది నా అత్తగారు - "అమ్మాయ్! బండి కొనుక్కుంటున్న విషయం అబ్బాయితో చెప్పు!" అని. నేను విస్తుపోయి చూశాను. అంత లౌక్యంగా అలా అనేస్తుందని నేను వూహించక పోవడం నా పొరపాటు. నా ప్లానంతా పాడుచేసినందుకు నా కొక్కసారిగా ఒళ్ళు మండిపోయింది.
అంతలో నా భర్త అడిగాడు- "ఏం బండి?" అని.
నేను చచ్చినట్లు చెప్పక తప్పలేదు. నా అత్తగారి కిచ్చిన సంజాయిషీ అంతా ఇతనికీ ఇచ్చుకున్నాను. "ఫర్లేదు... మంచి పనే చేశావు" అని అంటాడనుకున్నాను.
కాసేపటివరకూ అతనేం మాట్లాడలేదు. తర్వాత మెల్లిగా అడిగాడు. "ఇప్పుడా బండి కొనడం అంత అవసరమా?"
నాకో క్షణం అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు.
"అదేంటి? అవసరమని ఎప్పుడో అనుకున్నాం కదా! రోజూ బస్సులతో సమస్య అయిపోతోంది. మీకు తెలీనిదేముంది?" అన్నాను.
"నిజమే.... కానీ ఇప్పుడు మరింత ముఖ్యమైన అవసరాలు ముందుంచుకుని దీనికి డబ్బు తగలెయ్యడం కరెక్టేనంటావా?" అనడిగాడు.
నాకు బాధ కలిగింది. "దానిక్కావలసిన డబ్బు నా దగ్గరుంది. మిగతాది నెలసరి వాయిదాలలో తీర్చేయాలి. అదీ నేనే చూసుకుంటాను. మీరు డబ్బు ఇస్తారన్న నమ్మకంతో నేనేం దిగలేదు దీంట్లోకి" అన్నాను.
ఎంతలేదన్నా నా గొంతులో రోషం ధ్వనించింది. అతనదేం పట్టించుకోనట్టు "నన్ను నమ్ముకుని నువ్వు డిపాజిట్ కట్టావని నేనేం అనుకోలేదులే. కానీ నీ డబ్బే అయినా దీనికి ఖర్చు పెట్టడం అంత అర్జెంటా అని అడిగానంతే" అన్నాడు.
నాకతని ఉద్దేశ్యమేంటో అర్థంకానట్టు అతని మొహంలోకే చూస్తున్నాను. "చూడూ! చెల్లాయి పెళ్ళి పెట్టుకున్నాం. దానికి ఎంత ఖర్చవుతుందో చెప్పలేం. ఈ సమయంలో సాధ్యమైనంతగా పొదుపు చెయ్యాలిగానీ ఇలాంటి ఖర్చులు పెట్టుకుంటారా?" అన్నాడు.
దూరంగా కూర్చుని నా అత్తగారు వత్తులు చేసుకుంటోంది. అయినా ఆవిడో చెవి ఇటే పడేసిందని నాకు తెలుసు.
నాకు ఎన్నడూ కలగనంత ఆవేశం కలిగింది. "పొదుపు... పొదుపు చెయ్యాలిట ఈయన చెల్లెలి పెళ్ళికి! అయినా పొదుపు గురించి ఈయన నాకా చెప్పేది? పూటకి మూడు రకాల కూరలు చేసి చెత్తకుండీలో పారేసే అతగాడి తల్లికీ; పూజలు, వ్రతాలని హారతి పాడేసే అతని వదినకీ; సినిమాలు, షోకులని తిరిగే అతని చెల్లెలికీ చెప్పుకోమను. నేను బస్సుల్లో తిరిగి చచ్చీచెడీ ఇంటికి వచ్చి పడి కూడబెడుతూన్న డబ్బు ఈయన అవసరాల కివ్వాలా?"
... అవన్నీ అందామనుకున్నాను. కానీ నాకెందుకో సంస్కారం అడ్డొచ్చింది. ముఖ్యంగా మా అత్తగారు మా మాటలు చెవులొగ్గి వింటోందని నాకు తెలుసు. అయినా అన్నాను. "నేనారోజు- రీసెర్చి చేసుకుంటాను. కొంచెం డబ్బు సమకూర్చమంటే కుదరదని ఖండితంగా చెప్పేశారు. ఇప్పుడు నేను కష్టపడి కూడబెట్టుకుంటూన్న డబ్బు కావాలని అడగడానికి మీకు మనసెలా ఒప్పిందీ?" అని. ఇలా మాట్లాడటం వల్ల నా భర్త దగ్గర సరే, నా అత్తగారి దగ్గర కూడా శాశ్వతంగా మంచి స్థానం కోల్పోతానన్న విషయం తెలిసినా. కడుపుమంట నన్ను వూరుకోనివ్వలేదు. అతనూ కోపం తెచ్చుకుంటాడనుకున్నాను.
కానీ అదేం లేకుండా "అవునూ...ఏది అవసరమో దానికే ఖర్చుపెట్టాలని నేనప్పుడు చెప్పాను. ఇప్పుడూ చెప్తున్నాను" అన్నాడు.
"అవసరమా? ఎవరి అవసరం మీకు అవసరంలా తోస్తుంది?" నా స్వరం. నాకే తీవ్రంగా వినిపించింది.
"పోనీ నా అవసరమే అనుకో. అది నీది కూడా కాదా?" అనడిగాడు.
"తప్పకుండా అవుతుంది. కానీ నా అవసరం కూడా మీది అని మీరు అనుకున్నప్పుడు" అన్నాను.
"అయితే, ఇప్పుడేమంటావ్?" అనడిగాడు.
"నేను కొత్తగా అనేదేం లేదు..." నేను మాట్లాడుతూండగా తలుపు చప్పుడు విన్పించి అక్కణ్ణించి కదలడం ఇష్టంలేకపోయినా తప్పదన్నట్లుగా లేచి వెళ్ళిన నా అత్తగారిని చూసి తిరిగి నేను చెప్పేది కొనసాగించాను.
"నేను చచ్చీచెడీ కూడబెట్టింది మీకివ్వాలని కాదు. అలా చెయ్యాల్సి వస్తుందని ముందే తెలిసుంటే బస్సుల్లో తిరిగే బదులు ఆటోల్లో కాలేజీకి వెళ్ళేదాన్ని. మీ బండిమీద తీసుకెళ్ళమని మిమ్మల్ని అడుక్కుని, మీరు కాదంటే బస్ స్టాప్ దాకా కన్నీళ్ళతో పరిగెట్టేదాన్ని కాదు. ఆకలేస్తే హోటల్ కెళ్తే ఖర్చు అయిపోతుందేమో అని టీతో సరిపెట్టుకోకుండా హోటల్లో దర్జాగా తినేసొచ్చేదాన్ని...." నా కంఠం రుద్ధమయింది.
