Previous Page Next Page 
అనైతికం పేజి 13


    ...కారు ఇంటి ముందాగింది. దాన్ని అతను పార్క్ చేస్తూంటే నేను లోపలికి నడిచాను. నేను వెళ్ళేసరికి నా అత్తగారు చారులో పోపు పెడుతోంది. నా భర్త తల్లితో కబుర్లు చెపుతున్నాడు. నా ఆడపడుచు సోఫాలో బోర్లా పడుకుని 'ఫెమినా' చదువుతోంది. నా తోడికోడలు మిక్సీలో ఏదో రుబ్బుతోంది. నేను చెప్పులు విప్పుతుంటే అందరూ ఒకసారి తలెత్తి చూసి తమ తమ పనులలో పడిపోయారు. నాలో తిరిగి ఆ అపరాధభావం ప్రవేశించింది.

 

    మేమిద్దరం కలిసి వచ్చామన్న విషయం అర్థమయితే వాళ్ళు ఏమనుకుంటారోనన్న బెరుకు కలిగింది నాకు. నా బావగారు మాత్రం తన షూ లేసులు విప్పుకుంటూ "మా ఇద్దరికీ టీ" అన్నాడు వంటింట్లోకి వినబడేలా.

 

    నా భర్త "అలిసిపోయావనుకుంటాను" అన్నాడు.

 

    అతడి మొహంలో వ్యంగ్యం ఏమైనా వుందేమోనని పరిశీలించాను. కానీ అదేం కనపడలేదు. అతని మొహం ప్రసన్నంగా వుంది. నేను నా బావగారితో కలిసి రావడం ఎవరికీ విడ్డూరంగా అనిపించలేదనీ, పైగా నా ఆలస్యానికీ కారణం 'ఆయన' అని తెలిసి ఒక విధంగా వాళ్ళు నిశ్చింతగా వున్నారనీ నాకనిపించింది. ఆయనంటే వాళ్ళందరికీ వున్న గురి నన్ను మరొకసారి చకితురాలిని చేసింది. 'ఈ గొప్పతనమంతా వాళ్ళది కాదు. ఆ గౌరవాన్ని అలా నిలబెట్టుకోగలిగిన అతడిది' అనుకున్నాను.

 

    ఆ ఆలోచనే ఆయన ఇచ్చిన సలహా గురించి నన్ను ఆలోచించేలా చేసింది. ఆ రాత్రి నాకు సరిగా నిద్రపట్టలేదు.

 

    అసలు నా భర్తకూ, నీకూ ఎందుకిలాంటి దూరం ఏర్పడింది అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను.

 

    ఈ సమాజంలో ఏర్పడ్డ రీతి రివాజులని బట్టి పెళ్లవగానే నేను పుట్టింటిని పరాయి గృహం చేసుకుని ఈ అత్తింటిని నా ఇల్లుగా అంగీకరించాను. 'స్త్రీకి భర్తే సర్వస్వం. మంచైనా, చెడైనా జీవితాంతం అతడే నాకు తోడు' అని మనసారా నమ్మాను. కాబట్టే నా ఇంటి పేరు కూడా మార్చుకున్నాను. తన భార్య ఎలా వుండాలని నా భర్త కోరుకున్నాడో అలా వుండడానికే ప్రయత్నిస్తూ వచ్చాను. అయినా అతడికి నా పట్లా, నాకు అతడిపట్లా విముఖత ఏర్పడటానికి కారణం ఏమిటి?

 

    పెళ్ళి అనేది స్త్రీకయినా, పురుషుడికయినా జీవితంలో ఒక మలుపు! అన్నాళ్ళూ ఒంటరిదయిన జీవితం, మరో వ్యక్తితో ముడి పడి జంటగా సాగిపోవాల్సిన ఒక ప్రయాణానికి ఆరంభం! కాని ఈ సమాజంలో చాలా మంది భర్తల్లాగే నా భర్తా 'భార్య'గా నా బాధ్యతల గురించి ఆలోచిస్తున్నాడు తప్ప, నాకూ హక్కులనేవి వుంటాయని అంగీకరించలేక పోతున్నాడు. పెళ్ళితో తన జీవితం ఒక మలుపు తిరిగిందని, అప్పటివరకు తల్లిదండ్రులతో, తోబుట్టువులతో వున్న బంధం కొంత సడలి భార్యకి ప్రాముఖ్యం పెరిగిందన్న వాస్తవాన్ని అతడు గ్రహించలేక పోతున్నాడు. అతడిలాగే నేను ఆ కుటుంబం కోసం స్వసుఖాలని త్యాగం చేసి అందులోనే ఆనందాన్ని వెతుక్కోవాలని భావిస్తున్నాను. నా బావగారన్నట్లు అది అతడిలో బలహీనతగా భావించి అర్థం చేసుకుని మార్చుకోగలిగితే అతడు మంచి భర్త అవుతాడు. మా బావగారన్నట్టు అతడు చాలా మంది మగవాళ్ళ కంటే మంచివాడు!

 

    నేను సిన్సియర్ గా మా భార్యాభర్తలిద్దరి మధ్యా తిరిగి మంచి సఖ్యత నెలకొల్పాలని నిశ్చయించుకున్నాను. అది చెయ్యాలంటే ముందుగా నా మంచి ఉద్దేశ్యం అతడికి మాటల్లోకాక చేతల్లో చూపించాలి. ఈ నిర్ణయం తీసుకున్నాక నాకు బాగా నిద్రపట్టింది...

 

    పొద్దుటే మా అత్తగారితో పాటు లేవడం ఎలాగూ అలవాటయిపోయింది. సాధ్యమైనంత వరకూ నేను ఇంటిలో వుండే కాస్త సమయంలోనే ఇంటిపనులన్నీ పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. బట్టలు ఉతకడం లాంటి పనులు కూడా వర్కింగ్ డేస్ లోనే ఏ రోజు కారోజు కానిచ్చేస్తున్నాను. దానివల్ల ఆదివారాలు, సెలవు రోజుల్లో పొడులు దంపుకోవటం, వెచ్చాలు తెప్పించుకుని బాగుచేసుకోవడం లాంటి పనులు చేసుకోవచ్చని నా ఆలోచన.

 

    ఇంతకుముందులా సమయం ఎక్కువ తీసుకునే పనులకి వేరేవాళ్ళ సాయం కోసం ఎదురుచూడట్లేదు. పైగా నేను పని చేస్తున్న సమయంలో ఎవరెవరు విశ్రాంతి తీసుకుంటున్నారా అనే బాధ అసలు కలగటం లేదు. వేరేవాళ్ళ గురించి పట్టించుకోవడం మానేశాను. నా బాధ్యతని నేను అందరిలా అవతలికి నెట్టేయకుండా ఏ ఫిర్యాదులూ లేకుండా నిర్వర్తించాలనుకున్నాను.

 

    పనులు అంతలా నెత్తినేసుకోవడం వల్ల శరీరం చాలా అలసిపోయినట్లుగా తోచినా, నేను చివరివరకూ ఉల్లాసంగానే వుండడానికి ప్రయత్నించేదాన్ని. అలసట అనేది మానసికమైనదని నాకు అప్పుడు అర్థమైంది.

 

    నా వైఖరిని మార్చుకోవడం నా భర్తకి బోలెడంత రిలీఫ్ ని కలిగించిందనుకుంటాను. అలాగని నేనప్పుడే ఆయనతో ప్రేమగా మాట్లాడటం కానీ, ఆయన నన్ను సంతోషపరచడం కానీ ఏం జరగలేదు. అది అంత త్వరగా జరగదని నాకు ముందు తెలుసు. అయినా నేను కావాలనుకున్నది క్రమబద్ధమైన మార్పు. అంతేకాదు. శాశ్వతమైన రిజల్టు కూడా. నా అంతట నేను మాత్రం ఆయనకు శారీరకంగానైనా దగ్గరవడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే మా ఇద్దరికీ మధ్య వున్న అపార్థాలు తొలగిపోతే, ఆయనకు నేనంటే ఇష్టం ఏర్పడుతుందని నాకు తెలుసు.

 

    ఇంతకాలమూ ఆయనకు నచ్చినట్లుగా వుండటమనేది నా జీవన సరళికీ, ఆలోచనా విధానానికీ విరుద్ధమైనదని, అలా వుండవలసి వచ్చినప్పుడల్లా గొడవపడేదాన్ని. కానీ ఇప్పుడనిపిస్తోంది ఇది నా సంసారం. దీన్ని నేనెలాగూ దూరం చేసుకోలేను. కలిసి బ్రతుకుతూన్నప్పుడు గొడవలు పడే బదులు రాజీపడితేనే లాభమేమో! అదే కదా నా బావగారైనా నాకు చెప్పింది!

 

    ఆ రోజెందుకో నేను ఇంటికి మామూలుకంటే ముందే వచ్చేశాను. నా భర్తకూడా ముందే వచ్చేశాడు. ఇంట్లో నా అత్తగారు తప్ప మరెవరూ లేరు. ఇద్దరం టీ తాగేసి విశ్రాంతిగా నడుంవాల్చినప్పుడు కాస్సేపటి తర్వాత అతనడిగాడు "సినిమాకెళ్దామా?" అని.

 

    నాకో క్షణం నేను వింటున్నది 'నిజమేనా' అనే సందేహం కలిగింది. తిరిగి అతనే అడిగాడు, "చెప్పు...వెళ్దామా, వద్దా?" అని. నేను ఆనందంగా 'సరే' నందామనుకున్నాను. కానీ మా అత్తగారు మధ్యలో ఏదైనా అడ్డుపుల్ల వేస్తుందేమో అనే భయం వుండడంవల్ల "ఇంట్లో ఏదైనా పనుందేమో, కనుక్కోవాలి" అన్నాను.

 

    "కనుక్కుందాం. ఏదో రొటీన్ పనయితే వెంటనే చేసేసుకుని వెళ్ళిపోదాం. లేదంటే పని వాయిదావేద్దాం" అన్నాడు నవ్వుతూ.

 

    నేను వెంటనే ఒప్పేసుకున్నాను. నా అత్తగారు ఏ మెలికా పెట్టలేదు. కానీ, కూరలు మాత్రం తరిగి పెట్టేసి వెళ్ళమంది. చకచకా ఆ పని పూర్తి చేసి తయారయిపోయాను. నేను నా పెళ్ళితాలూకు తెల్లటి పోచంపల్లి పట్టుచీర, ఎర్ర బార్డరుది కట్టుకున్నాను. అసలు శోభనందే కట్టుకుందామనుకున్నాను కానీ మొహమాటమేసింది. అద్దంలో నా ప్రతిబింబం నాకే ముచ్చటేసింది.

 

    పెళ్ళి నన్ను శారీరకంగా ఏం మార్చలేదు (మానసికంగానూ మార్చలేదేమో, అందుకే అన్ని గొడవలూనూ). నేనిప్పటికీ అంతే నాజూగ్గా వున్నాను. చాలామంది లాగా నాకు పొట్టా, ఒళ్ళూ పెరగలేదు. అయినా మేం తిన్నగా సంసారం చేసింది మాత్రం ఎంతనీ?

 

    మేము వెళ్ళిన సినిమా "సీ నో ఈవిల్. హియర్ నో ఈవిల్'. చాలా మంచి హాస్య చిత్రం. అంతర్లీనంగా అవిటితనం తాలూకు విషాదం కూడా మేళవించి తీసిన అద్భుతమైన చిత్రం. సినిమా ఆద్యంతమూ చాలా ఎంజాయ్ చేశాను నేను. నా భర్త కూడా మంచి మూడ్ లో కనిపించాడు. పక్కనే వుండి అతను కూడా జోకులేస్తుంటే నాకు చాలా సరదా కలిగింది. ఎన్నో రోజుల తర్వాత మేమిద్దరం పెళ్ళయిన కొత్తల్లోలా సరదాగా గడిపాం.

 

    భోజనాలయాక, మేము తెచ్చిన స్వీట్స్ అందరం తిన్నాం. నా తోడికోడలు నన్నూ, నా చీరనీ, నా అలంకరణనీ, న ముఖంలో కన్పించే కొత్త మెరుపునీ నిశితంగా గమనిస్తున్నట్లు తోచింది నాకు. ఆ ఆలోచన వచ్చాక నాకు అందరి ఎదుటా కాస్త సిగ్గు కలిగింది. నా బావగారు మాత్రం సంతోషిస్తున్నట్లుగా కనిపించాడు. అతని కళ్ళలో నా గురించిన ప్రశంస తొణికిసలాడింది.

 

    టేబుల్ తుడిచేసి, చేతులకి వున్న తడిని టవల్ కి అద్దుకుంటూ గదిలోకి ప్రవేశించిన నాకు బీరువాలోంచి కొత్త దుప్పటిని తీసి పరిచి, దానిమీద పూలు చల్లుతూన్న నా భర్త కనిపించాడు.

 

    కిటికీ మీదున్న స్టాండుకి అగరువత్తి వెలుగుతోంది. మంచానికి వున్న చెక్కమీద నా కోసం కొన్న మల్లెపూల దండ సిద్ధంగా వుంది. నా పెదవులమీద నవ్వు విరుస్తూంటే, అతని ఏకాగ్రతని భంగం చేయటం ఇష్టంలేక నిశ్శబ్దంగా వెనుతిరిగి వచ్చేశాను. బ్రష్ చేసుకుని ముఖం కడుక్కుని కుంకుమ దిద్దుకుని నా గదిలోకి అడుగు పెడితే లాల్చీపైజమాతో వెల్లకిలా పడుకుని నా కోసమే ఎదురుచూస్తున్న భంగిమలో నా భర్త.

 

    వెనక్కు తిరిగి తలుపు గడియ పెట్టాలన్నా కదలనని మొరాయించే పాదాలు నేలకి అతుక్కుపోయినట్టు ఆ గుమ్మం దగ్గరే నిలబడిపోయాను. నన్నే చూస్తున్న అతని కళ్ళల్లో కోరికని, చిలిపితనాన్ని కళ్ళెత్తి చూడాలని మనస్సు గోల పెడుతున్నా, ఏం జరిగిందో ఏమో రెప్పలు లేవనంటున్నాయి.

 

    "సిగ్గా?" అతనడుగుతున్నాడు. నేను తలెత్తలేదు. అతనే లేచి దగ్గరకు వచ్చాడు. నా గుండె జల్లుమంది. మొదటిసారిలా... అవును మొదటిసారిలా మరి అన్ని అపార్థాలూ, గొడవల తర్వాత అంత పరస్పర కోరికతో, ప్రేమతో...!

    అతనొకచెత్తో నా భుజం చుట్టేసి, మరో చేత్తో గొళ్ళెం పెట్టేశాడు. నన్నతను మంచం కేసి నడిపించుకుని వెళ్తూంటే, కలలోలా నడిచి వెళ్ళాను. అతను నన్ను కూర్చోబెట్టి, మల్లెదండ చేతిలోకి తీసుకుని "నాకు నీ జడలో పెట్టాలనే వుంది కానీ పెట్టడం రాదు. ఏమనుకోకుండా నువ్వే ఆ పని చేస్కోవాలి మరి" అని నా కందించాడు.

 

    నాకు నవ్వొచ్చింది. నేనా పూలు తలలో తురుముకోవడం పూర్తయ్యాక అతను పెద్దలైటు ఆఫ్ చేసి, బెడ్ లైటు వేశాడు.

 

    అతను నన్ను దగ్గరకు తీసుకుని అతి మెల్లిగా పడుకో బెడుతుంటే నాకు కళ్ళు అర్థ నిమీలితాలయ్యాయి.

 

    కిటికీ అవతల నవ్వుతోన్న జాబిల్లి...

 

    సారీ .... చెప్పను.

 

                                  *    *    *

 

    ఆ సంఘటన మమ్మల్ని కొంతవరకు దగ్గర చేసింది. మా ఇద్దరిమధ్యా గ్యాప్ కొంతగ తొలగిపోయిందన్న భావం నాలో కాస్తంత నిశ్చింతనీ, హుందాతనాన్నీ నింపింది. నా నడక, నడత, మాటలు, చేతలు ఓ విధమైన నమ్మకంతో నిండి వున్నట్లు నాకే అన్పించింది. బహుశా భవిష్యత్తుని గురించిన నమ్మకం వల్లేమో అది. ఎవరేమనుకున్నా ఓ విషయం చెప్పదలచ్చుకున్నాను. భార్యాభర్తల మధ్య 'రొమాన్స్' కన్నా గొప్ప కమ్యూనికేషన్ లేదు.

 

    నేను నాకు వచ్చిన జీతంలోంచి కొంచెం మాత్రం ఇంట్లో ఇచ్చి, కొంత నా అవసరాలకి వుంచుకుని, మిగతాది బ్యాంక్ లో వేయసాగాను.

 

    అలా ఆదా చేసిన డబ్బుతో ముందుగా ఓ స్కూటర్ కొనాలని నా ఆలోచన. ఇంటికీ, కాలేజీకి పదిహేను కిలోమీటర్ల దూరం. బస్సులు కరెక్టుగా టైంకి మాత్రమే వున్నాయి. ఒక బస్సు మిస్సయ్యామంటే ఇక రెండు మూడు బస్సులు మారి, టైమ్ కి చేరలేక నానా అవస్థలు పడాలి.

 

    ఆలస్యమైన రోజు నన్ను కాలేజీ దగ్గర దింపమని నా భర్తని ఎన్నోసార్లు అడిగాను. అతనికి టైమ్ వుంటే డ్రాప్ చేస్తాడు. లేదంటే కుదరదని చెప్పేస్తాడు. ఉసూరుమంటూ పరిగెట్టాలి. ఆటోలకు పెట్టాలంటే మనసొప్పదు. అయినా అవో పట్టాన దొరకవు. అన్ని కష్టాలు పడాల్సిచ్చినప్పుడు అతనిమీద పీకల దాకా కోపం వచ్చేది. నా కోపానికి కారణాలు చిన్నవిగా కనపడవచ్చు. కోపం అనేది మానసికస్థాయి. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి వుంటుందనుకుంటాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS