Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 13

 

    "బాబూ, ప్రసాద్ అనే పిలుపు; ఒంట్లో నిన్నటి కన్నా బాగుంది కదూ! అని నా కోసం కలవరపడే హృదయం ; పక్కలో కూర్చుని తల నిమిరి , 'మరేం గాభరాపడకు. రేపు నర్మాలు కొస్తుంది.'  అని ధైర్యం చెప్పుతూ చెంపలూ, మెడలూ , పల్సూ పట్టి చూచేవారు -- ఆ స్పర్శ లోని అభయం -- నా కెక్కడ లభ్యమౌతాయి, గోపాలం?' బరువుగా కళ్ళు మూసుకుని బాధగా నిట్టూర్చి, రెండు క్షణాలు గడిచిన తరవాత మళ్ళీ అన్నాడు ప్రసాదరావు.
    "ఏ దుర్ముహూర్తన్న జోగయ్య ఉద్యోగం విషయంలో మాలో బేధాభిప్రాయాలు వచ్చాయో కాని, రోజుకి రోజూ మా మధ్య మనస్పర్ధలూ వచ్చేశాయి. ఎప్పుడైనా తప్పకపోతే అత్యవసరంగా రెండు మూడు మాటలు దొర్లేవి. అలా అయన తప్పించుకు తిరగడం నాకు చాలా బాధ అనిపించేది. అంతకన్నా ఇంట్లో పెట్టి నాలుగు తన్ని, మాములుగా 'బాబూ ప్రసాదం!' అని పిలిచే బాగుండుననిపించేది. ఆయనా మానసికంగా బాధపడుతున్నారని గ్రహించాను, అదే టైములో చూడు! మండే నిప్పులో నెయ్యి వంచినట్టు నాకూ, రాజమ్మ కీ ఏదో అక్రమ సంబంధముందనీ, అందుకే జోగయ్య తరపున మామగారితో తగువు తెచ్చుకున్నాననీ సృష్టించారెవరో. ఆ మాట మీ అక్కయ్య చెవిని పడింది. అప్పటికి ఆమె మామూలు మనిషి కాదు. వాసు కడుపులో ఉన్నాడు. అమృతమయమైన మా అనురాగం లో, భూతల స్వర్గమే అనుకున్న మా దాంపత్య జీవితంలో కాలసర్పం విషం కక్కింది. మీ అక్కయ్య నన్ను గాడంగా ప్రేమించింది , గోపీ! ఆ ప్రేమే ద్వేషంగా మారింది. ప్రేమే ద్వేషంగా మారినప్పుడా మనిషి తాను పతనమై ఎదుటి మనిషిని హింసిస్తుంది. అడుగడుగునా విసుగు, నన్ను చూస్తూనే చిరాకు పడిపోయేది...."
    'అసలే కారణం లేకుండానే అక్కయ్య మిమ్మల్ని అపార్ధం చేసుకుందా?" అతని మాటల మధ్యలో అడిగాడు గోపాలం, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.
    "చెప్పుడు మాటలు ఆమె నమ్మలేడనే అనుకుంటాను. అప్పుడప్పుడెవో మాటల్లో రాజమ్మ ప్రసక్తి తెచ్చి కవ్వించేది. నాకు చాలా భాధ అనిపించేది. అలాటి అనుమానానికి నీ హృదయంలో చోటియ్యకు , మధూ! అని మృదువుగా మందలించేవాణ్ణి . మీ అక్కయ్య కు నెలలు నిండాయి. ఇంక తానేలాగూ రాదనీ, నేనూ, జోగయ్య, రాజమ్మా సినిమాకి వెళ్ళాం. నంబర్ల ప్రకారం రాజమ్మ , నేనూ ఒకరి పక్కన ఒకరం  కూర్చున్నాం . రాజమ్మ సందడిగా మాట్లాడే మనిషి. మేం ఫ్రీగా ఏవో చర్చించి నవ్వుకుంటూ మాట్లాడు కున్నాం పిక్చరు బిగినయ్యే వరకూ . ఇంటర్ వెల్ లో లైట్లు వెలిగాయి. యధాలాపంగా వెనక సీట్ల వైపు చూశాను. మీ అక్కయ్య, రాజూ ఉన్నారు. రాజు నా వైపు ఎర్రగా చూశాడు. మీ అక్కయ్య ఉదాసీనంగా తల వంచి 'ఇంటికి పోదాం , రాజూ' అంటూ లేచి నిలుచుంది. అప్పటి నా హృదయందోళన వర్ణనాతీతం. యాంత్రికంగా నేనూ వాళ్ళ వెనకే ఇవతలికి వచ్చాను.
    "మీరెందు కొచ్చేశారు?' రోషంగా ఎర్రబడ్డ కళ్ళలో నీరు తిరుగుతుంటే అంది మీ అక్కయ్య నా వైపు చురుగ్గా చూస్తూ. నాకు మాట రాలేదు. తప్పుచేసి దొరికి పోయినట్టు దిమ్మెర పోయాను" అంటూ రెండు క్షణాల తరవాత పేలవంగా నవ్వి అన్నాడు: "మరేముందిక! మీ అక్కయ్య అనుమానం దృడమైంది. ఆమె పరుషంగా హద్దులు మీరి మాట్లాడడం నేను చెయ్యి చేసుకోవడం- ఇల్లు నరకమైంది గోపీ! ఎంతయినా తల్లిదండ్రులు సహించగలరా? వారి సమక్షంలో వారు ప్రేమించి గౌరవించే మీ అక్కయ్య బాధా, యాతనా , ఆమె రోదనా విని సహించలేక పోయారు. మమ్మల్ని సమర్ధతతో ఓ దారికి తేలేక ఆరు నెలలు వృధా ప్రయత్నం చేసి ఆ నిర్ణయానికి వచ్చారు. నన్ను మీ అక్కయ్యా, అందరూ చాలా అసహ్యించుకున్నారు, గోపీ! నాలొ మొండితనం అలానే ఉండేది."
    'అయితే మిమ్మల్ని ఊరకనే అనుమానించారంటారా?' అదోలా నవ్వుతూ అడిగాడు గోపాల్రావు.
    "లేదు!" నెమ్మదిగా అన్నాడు ప్రసాదరావు.
    "మరి?' ఆశ్చర్యంగా అతని మొహం లోకి సూటిగా చూస్తూ అన్నాడు గోపాల్రావు.
    "మీ అక్కయ్య ఎప్పుడు నన్ను అసహ్యించుకుని తూలనాడి నన్ను తాక నివ్వలేదో ఆనాటి నుంచీ రాజమ్మ తో సంబంధం ఏర్పరచుకున్నాను. తానలాటి మనిషని అందరికీ తెలుసుగా? మరి కష్టమేముంది? అందరి మాట నిజం చేశాను." ఆ గొంతులో మొండితనం.
    ఇద్దరి మధ్యా మౌనంగా కొన్ని క్షణాలు దొర్లిపోయాయి. ఒకటే సిగరెట్లు కాల్చి పారేస్తున్నాడు గోపాల్రావు.
    ఉపోద్ఘాతం లా చిన్నగా దగ్గి అన్నాడు ప్రసాదరావు."మానసికంగా విసిగిపోయిన మనిషి ఏదో సుఖం, ఏదో విశ్రాంతి కావాలని తపిస్తూ , అవి కావాలని ఏ పనైనా , ఎంత తప్పిదమైనా ఒప్పుగానే భావిస్తాడేమో! నేను తప్పు తోవన నడుస్తూ  క్షణ క్షణం  అడ్డు నిలిచి వారించే మీ అక్కయ్య ని హింసించే వాణ్ణి. అంతే, గోపీ, అప్పటి ఆ మనిషిలోని బలహీనత అంత గుడ్డిది."
    మరి కొన్ని క్షణాలు ఇద్దరి మధ్యా బరువుగా దొర్లాయి. చర్చి గంటలు పది కొట్టాయి.
    "చాలా రాత్రయింది.... ఇంటి నుంచి వెళ్ళాక నేనేం చేసెనని నీ ప్రశ్న కదూ? మీ ఇంటి నుంచి నేరుగా రాజమ్మ ఇంటి కెళ్ళాను. అప్పటికే ఏవో గుసగుసలాడుతున్నారు వాళ్ళు. వాళ్ళింట్లో నాకు చనువుంది గా?గదిలో చతికిలబడి రెజిగ్నేషన్ కాగితం వ్రాశాను. ప్రావిడెంటు ఫండ్ , అప్పటికి నాకు రావాల్సిన జీతం మీ అక్కయ్య పేర వ్రాశాను. జేబు తడుము కున్నాను. మూడు రూపాయలు ఉన్నాయి. నాకు పిచ్చేత్టిన ట్టవుతుంది. చావాలనుకున్నాను. మీ కుటుంబం మంద్రర్నీ చంపెయ్యలనుకున్నాను. చాలా ఆలోచనలు ఆవేశంగా దొర్లిన తరవాత రాజమ్మ ను పెళ్ళి చేసుకుని మీ అక్కయ్య ని ఎడిపించాలనుకున్నాను." అలిసినట్టు ఊపిరి పీల్చాడు ప్రసాదరావు.
    "జోగయ్యా!' అరిచినట్టు పిలిచాను. చేతులు నులుముకుంటూ భయం భయంగా వచ్చాడు జోగయ్య. 'ఈ కాగితం ఆఫీసులో ఇచ్చేయ్. మీ అక్కయ్యా, నేనూ ఈ వేళ వెళ్ళిపోతున్నాం.' అన్నాను. 'అదెలా కుదురుతుంది?' అన్నాడు టక్కున జోగయ్య తడబడుతూన్న గొంతు సవరించుకుంటూ. "ఏది కుదరదు?' అని అసహనంగా అరిచాను. "ఏదీ కుదరదు!" నిర్లక్ష్యంగా అన్నాడు జోగయ్య. ఆ గొంతు దృడంగా ధ్వనించింది నాకు. అతని చెంప మీద బలంగా కొట్టాను. "నీ నుంచి కదరా నేను నాశనమయ్యాను' అంటూ. 'మాటలు తిన్నగా రానియ్యండి. ఒళ్ళు అదుపులో ఉంచుకోండి. ఈ ఇంట్లో మిమ్మల్నేం చేసినా మీకు దిక్కు లేదు. జాగ్రత్త.' అన్నాడు జోగయ్య నిలువునా కోపంతో వణికిపోతూ. నన్ను జన్మలో విడిచి పెట్టనని కబుర్లు చెప్పే రాజమ్మ, 'అవతలికి పంపెయ్యరా, తమ్ముడూ' అంది. నా కళ్ళ పొరలు తొలగాయి. దిమ్మెర పోయి తెల్లబోయి చూస్తున్న నా భుజం పట్టి అవతలికి నడిపిస్తూ, 'మమ్మల్ని ఇలా బతకనియ్యండి, బాబూ. మరి మా గడప తోక్కకండి. మీ కాగితం పోస్టు ద్వారా పంపించుకోండి. దయచేసి మా అక్క జోలికి రాకండి. ఇదివరకు సంగతి వేరు. ఈవేళ ఇంత రభస జరిగాక నాబోటి వాణ్ణి మా అక్క లాటి దాన్ని ఏమైనా చేస్తారు మీ మామ' అంటూ వీధిలో వదిలి తలుపు భళ్ళున వేశాడు నన్ను చూస్తూనే వంగి నమస్కరించే జోగయ్య. భార్య, ఉంపుడు కత్తే, వారి ఆత్మీయులు నన్ను ఒకలాగే సన్మానించారు. ఇంకేం  కావాలి, గోపీ నా బతుక్కి? ఇంకేలాటి అవమాన ముంటుంది మనిషి-- అభిమాన మున్న మనిషి మాగిపోవడానికి? గుండెల నిండా సంసారిక జీవితాన్ని ఏవగించుకున్నాను. రెజిగ్నేషన్ కాగితం ఆఫీసుకి పోస్టు చేశాను. వేలి ఉంగరం షాపులో అమ్మి, తిరుపతి వెళ్ళాను" అంటూ ఆవలించి చిటికెలు వేస్తూ, "ఇంకొంచెం ఉంది, విను" అన్నాడు ప్రసాదరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS