Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 13


    "ఏం జోరులే పిన్నీ - పెద్ద వాళ్ళు గౌరవమూ, హోదా అంటూ పట్టుకుని ప్రాకులాడుతుంటే - మేమా  పెద్దవాళ్ళని పట్టుకుని ప్రాకులాడుతున్నాం అంతే ----' అన్నాడు రాజారావు.
    "డబ్బు సర్దుబాటయిందా-----"
    "నాన్నగారి సంగతి నీకు కొత్తకనుకనా -- నిమ్మకు నీరెత్తినట్టున్నారు. నిన్న మేమొచ్చాం. ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి -----' పిన్ని దగ్గర వాడే ప్రతి మాటనూ అతి జాగ్రత్తగా అలోచించి ఉపయోగిస్తున్నాడు రాజారావు.
    అతని మాటలు ఆశించిన ప్రయోజనాన్నందజేశాయి -----" "మీ నాన్న మాత్రం ఏం చేస్తాడ్రా - ఎక్కణ్ణించి తెస్తాడు చెప్పు ?" అంది వెంకట్రామయ్యను వెనకేసుకు వస్తూ నీలవేణి.
    "నిజమే పిన్నీ - అయన మనసు మంచిది. అందుకే ఏదో విధంగా పనులు సానుకూలమవుతున్నాయి. ఒక పెళ్ళికి సరిపడ డబ్బు ఒక్కసారి పోగుచేయ్య గల శక్తి ఆయనకు లేదు. మాకు మాత్రం అంత డబ్బెక్కన్నించి వస్తుంది చెప్పు - మేమేమన్నా బాబయ్యగారిలా కాంట్రాక్టు లు చేస్తున్నామా - ఏదో మామూలు ఉద్యోగాలు ...."
    నీలవేణి ముఖం వెలిగింది -----"ఎడిశావులే - మాటలు నేర్చావు. మీ ఉద్యోగాలకేం - ఈవేళ కాకపోతే రేపైనా లక్ష నిలవేయాల్సిందే ."
    "చాల్లే - ఏదో నాలుగువేళ్ళూ నోట్లోకి పొతే చాలని మేమను కుంటున్నాం - మీ అయన కాంట్రాక్టరు కాబట్టి లక్ష అన్నమాట అంత సులువుగా నీ నోట్లోంచి వచ్చింది. కలలో కూడా లక్ష గురించి ఆలోచించం మేము...."
    నీలవేణి ఉత్సాహంగా ----"మన లక్ష్మీ పెళ్ళి విషయం ఎంత వరకూ వచ్చిందో చెప్పు -------" అంది.
    మన లక్ష్మీ అని నీలవేణి అనగానే రాజారావు కుత్సాహం వచ్చింది -----" ఆ విషయమే నాన్నగారు చాలా బాధపడుతున్నారు పిన్నీ - ఆరువేల రూపాయలు అర్జంటుగా కావలసోచ్చాయి. ఆ డబ్బు గురించి పెళ్ళి ఆగిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. నిన్నడుగుదామని నేనేంటే రెండు మూడ్రోజుల క్రితమే వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడైనా ఈ ముక్క చెప్పలేదు. ఒక్కసారిగా ఇంత డబ్బు కావాలంటే తను మాత్రం ఎక్కణ్ణించి తీసుకువస్తుందీ - అని ఆయనంటున్నారు.....'
    'అరువేలా ?" అంది సాలోచనగా నీలవేణి.
    "అవును, ఆ సొమ్ము నీకో లెక్కలోది కాదనీ - నీ అకౌంట్లో పాతికవేలకు తక్కువ కాకుండా ఎప్పుడూ డబ్బుంటుందని చెబితే అయన నమ్మరే ----' అన్నాడు రాజారావు.
    "నిజమేననుకో - కానీ ఉన్న పళంగా ఆరు వేలంటే .......బాబయ్య గారు.....' నసిగింది నీలవేణి.
    రాజారావు గంభీరంగా అన్నాడు -----' ఇదే సొమ్ము ఎక్కడైనా అప్పుగా తెచ్చుకోగల పరపతి మాకుంది పిన్నీ --కానీ నీ చేయి చల్లనిది. నా పరీక్ష ఫీజు నీ డబ్బుతో కట్టాను. నా ఉద్యోగానికి అప్లికేషన్ నీ డబ్బుతో పెట్టాను. ఆ చల్లని చేయే - మేము తొలిసారిగా మా ఇంట్లో చేస్తున్న శుభకార్యానికి సహాయపడాలన్నది నా అభిలాష. అంతగా నీకు డబ్బు ఇబ్బంది అనుకుంటే - ఇప్పుడు మాత్రం కాదనకు. ఈరోజు అరువేలూ ఇచ్చేసేయి. ఎలాగో అలా లేదనకుండా ఇచ్చేసేయ్. లక్ష్మీ పెళ్ళి కాగానే నీకు నేను మా ఇల్లు తాకట్టు పెట్టయినా నీ బాకీ తీర్చేస్తాను. లక్ష్మీ పెళ్ళికి నీ డబ్బు ఉయోగపడాలన్న కోరికతో నీ దగ్గరకు వచ్చాను- కాదనవద్దు పిన్నీ."
    రాజారావీ మాటలు మనస్పూర్తిగా అన్నాడు. మాట పెళుసైనా నీలవేణి మనసు మంచిది. ఆమె నిండు మనసుతో డబ్బిస్తే అది లక్ష్మీకి శ్రీరామరక్షకాగలదని అతను నమ్మేడు.
    నీలవేణి క్షణం అలోచించి టయిమ్ చూసుకుంది. "బ్యాంకు మూసేయడానికింకా అరగంట టయిముంది. పద బాబాయిగారితో మాట్లాడి - త్వరగా బ్యాంకుకు వెడదాం ---" అంది.
    రాజారావు మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. పిన్ని దేవత అనుకున్నాడతను మనస్సులో. ఇద్దరూ బాబాయి గారి దగ్గరకు వెళ్ళారు . అయన లాంచన ప్రాయంగా పలకరించాడు. తనకు ప్రస్తుతం డబ్బు ఇబ్బందీమీ లేదనీ -- వీలుని బట్టి నెమ్మదిగా ఎప్పుడో బాకీ తీర్చుకోవచ్చుననీ అయన చెప్పాడు.
    వెంకట్రామయ్య నీలవేణి బ్యాంకుకు వెళ్ళారు. రాజారావు బాబయ్యగారితో కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. గంటలో వెంకట్రామయ్య నీలవేణి తిరిగి వచ్చారు. రాజారావుకు అరువేలూ అందాయి.
    'ఇంకా చాలా పనులున్నాయి. నువ్వు చేసిన ఈ మేలు మరిచిపోలేను - ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను --' అని అక్కణ్ణించి బయట పడ్డాడు రాజారావు.
    "పిన్ని దేవత -' అన్నాడు రాజారావు రోడ్డు మీదకు వచ్చేక.
    'అందులో సందేహమేమీ లేదు. కానీ దైవ సంకల్పమున్నప్పుడన్నీ అలా కలసి వస్తాయి ...." అన్నాడు వెంకట్రామయ్య.
    రాజారావుకు చాలా కోపం వచ్చింది కానీ మాట్లాడలేదు. తండ్రి చెప్పిన దానిలో నిజం లేకపోలేదు. లక్ష్మే పెళ్ళికి డబ్బు ఒక పెద్ద సమస్య అవుతుందని ఈరోజు కొన్ని గంటల క్రితం వరకూ కూడా అంతా వర్రీ అవుతున్నారు. తాత్కాలికంగానే అయినప్పటికీ ఆ సమస్య పువ్వులా విడిపోయింది. ఈ బాకీ ఎలా తీర్చాలి అన్న విషయం తర్వాత ఆలోచించుకోవచ్చు. తండ్రి చెప్పినట్లు దైవ సంకల్పముంటే ఏదో విధంగా తనకు డబ్బు లభించవచ్చు.
    ఒక సమస్య తీరిపోవడంతో తను కూడా తండ్రి దైవ సంకల్పం మీద ఆధారపడే మనస్తత్వానికి దిగిపోతాడేమోనని రాజారావుకు క్షణ మాత్రం భయం వేసింది.
    "రేపు బయల్దేరి హైదరాబాద్ వస్తున్నట్లుగా ఒక టెలిగ్రాం ఇద్దాము....' అన్నాడు రాజారావు.
    ఇద్దరూ పోస్టాఫీసుకు వెళ్ళి టెలిగ్రాం ఇచ్చి అక్కణ్నుంచి రిక్షాలో రాజమండ్రీ వెళ్ళారు.
    వంట బ్రాహ్మణుల గురించి అయిదారు చోట్ల ప్రయత్నాలు చేశారు. అందరూ ఆ తేదీలలో బుక్కయి పోయినట్లు తెలిసింది. అయినా ప్రయత్నాలు మానకుండా తిరగడంలో ఒకాయన దొరికాడు. అయన చాలా కండిషన్స్ పెట్టాడు. ముందుగారాడట. పెళ్ళి రోజునే వస్తాడట. అరిశలు తను చేయడట. వడ్డన చేయడం తన డ్యూటీ కాదట. కూరలు వగైరాలు తరగడం తన జట్టులోని వాళ్ళు చేయరట పై పనులన్నింట్లోనూ సాయం కావాలిట.
    "ఇంతకీ తమరు వంట చేస్తారా?" అన్న అనుమానాన్ని బహిర్గతం చేయడానికి రాజారావుకు మర్యాద అడ్డొచ్చింది. 'అసలే మనింట్లో మొదటి శుభకార్యం - ఇలాంటి జట్టును పెట్టుకుంటే లేని పోనీ గొడవలు రావచ్చు ---' అన్నాడు వెంకట్రామయ్య నిజమే ననిపించింది రాజారావుకు.
    మరొకాయనకు ఖాళీ ఉన్నట్లే ఉంది కానీ ఊళ్ళో లేడు. రేపు రమ్మందాయన భార్య. సరే - అదృష్టాన్ని రేపే పరీక్షించుకుందామనుకుంటూ రాజారావు, వెంకట్రామయ్య మళ్ళీ ధవళేశ్వరం వచ్చి -- ఆనకట్ట దారిని - తమ స్వగ్రామం చేరుకున్నారు.
    వాళ్ళు గుమ్మంలో అడుగు పెట్టగానే -- "సత్తెప్ప దొరకలేదురా - మినపప్పు రేపాడించాలి ---' అంది పార్వతమ్మ. తన బాధ్యత నెంత సీరియస్ గా తీసుకున్నదీ కొడుక్కు తెలియజేయాలన్నది ఆవిడ తపన.
    విరజ మాత్రం ఆత్రుతగా ఇతర విషయాల కోసం ఎదురు చూస్తోంది. జరిగినదంతా ఆమెకు వివరించాడు రాజారావు ---" అంతా బాగానే వుంది కానీ - వంట బ్రాహ్మణుల విషయంలో అభాసుపాలై పోతామేమోనని భయంగా వుంది వదినా -----' అన్నాడతను.
    'అదే -చెప్పడం మరిచిపోయాను- కాకినాడ నుంచి నీ మామగారుత్తరం రాశారు. కార్దులే- అంతా చదివేశాం . ఇదివరలో నువ్వాయనకు నీ పెళ్ళికాయన కుదుర్చుకున్న వంట బ్రాహ్మణులు - లక్ష్మీ పెళ్ళికి వస్తారేమో అడగమని రాశావుట కదా - అర్జంటుగా ముహూర్తం తేదీ తెలియబర్చమని వ్రాశారు --- బ్రాహ్మలు కుదిరినట్లే అనుకోమని వ్రాశారు....." అంది విరజ.
    రాజారావు ఉత్తరం అందుకుని చదివాడు ---"చాలా బాగుంది రేపు శ్రీకాంత్ ని కాకినాడ పంపించి ముహూర్తం తేదీ తెలియబర్చాలి . ఉత్తరం రాస్తే ఆలశ్యం కావచ్చు. ఓ పాతిక రూపాయలు అడ్వాన్సుగా ఇవ్వడం కూడా మంచిది ---' అన్నాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS