ప్రతి విషయాన్నీ అయన - అవసరమేననుకొండి కానీ వద్దనుకుంటే మానేయవాచునండి - అంటూ వచ్చాడు. ఆఖరికి వధూవరులు లేకుండా కళ్యాణం జరిపించవచ్చుననే పద్దతిలో మాట్లాడేడాయన. అయన ధైర్యంగా తమతో మాట్లాడాలంటే తండ్రి అక్కడుండకూడదని గ్రహించాడు రాజారావు. వెంకట్రామయ్య కూడా చూదాయగా విషయాన్నర్ధం చేసుకుని అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
'సోమతాజులు గారూ - మేము కుర్రాళ్ళం . పెళ్ళి కాస్త ఘనంగానే జరిపించాలనుకుంటున్నాం. అవసరమైన తంతులన్నీ అనుభవజ్ఞులు మీరే వివరించి చెప్పాలి....' అంటూ రాజారావాయన్ను అడిగేడు. అప్పటికి సోమయాజులు యదాస్థితికి వచ్చి చకచకా -----మంగళసూత్రం , మట్టెలు, కొబ్బరి బొండాలతో సహా అవసరమైన లిస్టులు తయారు చేసి ఇచ్చి -----"మాములుగా పెళ్ళిళ్ళలో జరిగే తంతులూ, అవసర వస్తువులూ చెప్పాను. దీన్ని బట్టి మీ కార్యక్రమం వేసుకోండి -----" అన్నాడు.
సోమయాజులు వెళ్ళిపోయాక రాజారవూ విరజా కూర్చుని లెక్కలు వేశారు. అందులో ముఖ్యంగా తేలిన ఖర్చులు బట్టలు, పెళ్ళి కొడుక్కు అయిదారు సందర్భాలలో బట్టలు పెట్టవలసి వుంది. మీరనుకున్నదాన్నిబట్టి సూట్లయినా పెట్టవచ్చు. పంచేల చాపయినా ఈయవచ్చునన్నాడు సోమయాజులు. మంగళసూత్రం . మట్టెలు మినహాయిస్తే మిగతావాటిలో కొద్దిగా ఇత్తడి సామాను- ఇతర పూజా ద్రవ్యాలు, కర్పూరం, దండలు వగైరాలున్నాయి. అవన్నీ సుమారు వంద రూపాయలలో సమకూరవచ్చును.
వెంకట్రామయ్యగారిని పిలిచి - ముగ్గురూ డబ్బు లెక్క వేశారు. సోమయాజులు గారిచ్చిన లిస్టు ప్రకారం ఖర్చు వెయ్యి రూపాయలవుతుంది. అప్పగింతల బట్టలకు వేయి రూపాయలకు పైగా అవుతుంది. భోజనాలకు మూడు రోజులకూ కనీసం మూడు వేలేనా అవుతుందని అంచనా వేశారు. ఇంకా దక్షిణలు, ప్రయాణాలు, పని మనుషులు , వంట బ్రాహ్మణులు వగైరా వగైరాలన్నీ కలిపి రెండు వేలు అవవచ్చు. అనగా పెళ్లి ఖర్చు కట్నంతో కలిపి సుమారు పదిహేను వేలవరకూ డేకవచ్చు.
"మన దగ్గర తొమ్మిది వేలుందనుకోవచ్చు" అంది విరజ.
"అయితే ఇంకో ఆరువేలు పోగు చెయ్యాలి -----' అన్నాడు సాలోచనగా రాజారావు.
వెంకట్రామయ్య దైవ సంకల్పం గురించి ఆలోచిస్తున్నాడు.
క్షణం అలోచించి - "మరే మార్గమూ లేదు. ఈ సమయంలో మనల్ని అదుకోగలది పిన్ని మాత్రమే " అన్నాడు రాజారావు.
"నేనూ అదే అనుకుంటున్నాను" అన్నాడు వెంకట్రామయ్య.
ఆశ్చర్యంగా అనుమానంగా చూసింది విరజ వాళ్ళిద్దరి వంకా.
"పిన్ని మనసు చాలా మంచిది. అందులోనూ ఇటువంటి శుభకార్యమంటే సంతోషంగా యిస్తుంది. అదీకాక - పిన్ని చేయి మంచిది. ఆ డబ్బు వినియోగపడితే లక్ష్మీ కాపురం కూడా చల్లగా వుంటుంది -----' అన్నాడు రాజారావు.
"బాగానే వుంది. ముందుగా ఒక్క మాటయినా చెప్పకుండా హటాత్తుగా ఆరువేలు కావాలంటే ఎవరు మాత్రం సర్ధగలరు ?" అంది విరజ.
"మీ పిన్నిప్పుడు ధవళేశ్వరంలో వుంది. రెండ్రోజుల క్రితమే నేను వాళ్ళింటికి వెళ్ళాను కూడా. లక్ష్మీకి పెళ్ళి కుదిరిందని తెలిసి చాలా సంబరపడింది కూడా -----' అన్నాడు వెంకట్రామయ్య.
రెండ్రోజుల క్రితం నీలవేణిని కలుసుకుని కూడా డబ్బు ప్రసక్తి తీసుకురాని వెంకట్రామయ్య మనస్తత్వం గురించి అలోచించి ప్రయోజనం లేదని తెలిసుండి రాజారావు మరోసారి బాధపడ్డాడు.
'ఇంకా ఏమైనా అందా?" అనడిగేడు రాజారావు.
"ఆ పెళ్ళికి చాలా ఖర్చవుతుందనుకుంటాను - ఆనంది - అవును - అన్నీ కుర్రాళ్ళు చూసుకుంటారన్నాను --" అన్నాడు వెంకట్రామయ్య.
కొంప ముంచారే అనుకున్నాడు రాజారావు . పిన్ని సాయం చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకునేందుకా మాటలు చాలు మరి ----- అనుకుంటూ అతను తన బుర్రలో పిన్నితో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాడు.
విరజ అక్కణ్ణించి లేచి భోజనాల గదిలోకి వెళ్ళింది. రాజారావూ అమెననుసరించాడు. ఇద్దరూ పార్వతమ్మ దగ్గర కూర్చున్నారు.
"నాకేదో భయంగా వుంది. ఒక్కపనీ అవలేదు "-----అంది భయంగా విరజ.
"ఏం భయపడకండర్రా- పనులవకపోవడమేమిటి ? దొడ్లో బూడిద గుమ్మాడికాయలు కాస్తే - రెండు వేల వడియాలు పెట్టాను. రెండ్రోజుల్లో పూర్తిగా ఎండిపోతాయి. పెళ్ళికి వడియాలు సిద్దమనుకొండి ----' అంది పార్వతమ్మ నిశ్చింతగా.
పార్వతమ్మది విచిత్ర మనస్తత్వం. ఆవిడకు పెద్ద పెద్ద విషయలాట్టే పట్టవు. తనకు సంబంధించినంతవరకూ పనులై పొతే బాధ్యత తీరినట్లే భావిస్తుందావిడ.
"వడియాలతో తీరిందా - ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా వున్నాయి ---' అన్నాడు రాజారావు.
"నాకూ తెలుసు. రేపు సత్తెప్పకు కబురు పెడతాను. మినప్పప్పోడించి తీసుకొస్తాడు. ఒకరోజులో అప్పడాల సంగతి తెల్చేస్తాను .........' అంది పార్వతమ్మ.
ఈసారి రాజారావు చిరాగ్గా ,ముఖం పెట్టి -------'అమ్మా, అప్పడాలూ, వడియాలు లేకపోతే పెళ్లాగిపోదు కానీ - అంతకంటే అవసరమైనదాని గురించి అలోచిస్తునాం -----' అన్నాడు.
"అటు మా పుట్టింటి వైపు కానీ ఇటు మా అత్తంటివైపు కానీ అప్పడాలూ, వడియాలు లేకుండా పెళ్ళిళ్ళు జరగలేదు. అవి లేకుండా పెళ్ళి జరిపిద్దామని మీరు చూస్తున్నారేమో -- నేను సాగనివ్వను ---' అంది పార్వతమ్మ తీవ్రంగా.
రాజారావుకు నవ్వొచ్చి ---"ఎలాగో అలా అప్పడాలు కూడా చేసి ఈ పెళ్ళి ఆగిపోకుండా చూడవే ---" అన్నాడు. అప్పటికి పార్వతమ్మ శాంతించింది -----" వంట బ్రహ్మలోస్తారు గదా అని కానీ - మిఠాయి కూడా నేనే చేసేయగలను - పిల్లల్ని సాయం పెట్టుకుని --------" అంది.
రాజారావుకు హటాత్తుగా ఇది పెళ్ళిళ్ళ సీజననీ వంట బ్రాహ్మణులు దొరకడం కష్టమనీ గుర్తుకొచ్చింది . వెంటనే పరుగున తండ్రి దగ్గరకు వెళ్ళి ----" వంట బ్రాహ్మణుల్ని మాట్లాడేరా ?" అనడిగాడు.
వెంకట్రామయ్యకు చాలా కోపం వచ్చింది ---------"ఏమిట్రా మీ కంగారు ---పెళ్ళి కింకా ఇరవై మూడు రోజులుంది --- " అన్నాడాయన.
ఆ విషయం మాత్రం బాగా గుర్తుంచుకున్నారనుకున్నాడు మనసులో ఉక్రోషంగా రాజారావు. ఇరవై మూడు రోజులు గడవడం పెద్ద కష్టం కాదు. కష్టమంతా ఆ ఇరవై మూడురోజుల్లోని ప్రతి క్షణాన్ని సక్రమంగా వినియోగించుకుని ఖర్చు పెట్టిన డబ్బుకో అర్దాన్నివ్వడం లోనే వుంది. మర్నాడు వంట బ్రాహ్మణుల పని కూడా చూడాలని గట్టిగా అనుకున్నాడు రాజారావు.
9
"ఎరా - ఎప్పుడొచ్చావ్ -----పెళ్ళి ఏర్పాట్లేలా ఉన్నాయ్-----" అంటూ పలకరించింది నీలవేణి.
"నిన్ననే వచ్చాను. పెళ్ళి ఏర్పాట్ల విషయంలోనే నీ దగ్గర కొచ్చాను -----' అన్నాడు రాజారావు.
సంభాషణలో పాల్గొనడం తన కిష్టం లేదన్నట్లుగా అక్కణ్ణించి లేచి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య.
"ఏడు వేల అయిదు వందలు కట్నమిస్తూన్నారటగా - జోరుగానే ఉంది వ్యవహారం ---' అంది నీలవేణి.
