శిశువు - శ్రీశ్రీ
వంగపండు ప్రసాదరావు
ఓ.....!
ప్రజల బాధలోడా !
ప్రాణాలు పోయినోడా !
శ్రీశ్రీ కుర్రవాడా !
బతుకుల్ని రాసినోడా!
బందూకును నమ్మినోడా !
|| ఓ- ప్రజల ||
1
నమ్మలేని - మాటగాని || శ్రీశ్రీ కుర్రవాడా ||
లోకమల్ల - వచ్చిందీ ,,
సచ్చిపోయి - పుడితివనీ ,,
సాటింపు - వచ్చిందీ ,,
ఆ మాటా - ఆలకించి ,,
ఆపూటా - గానాక ,,
సుత్తిబట్టి - నోడు గాని ,,
రత్తమింత - గక్కినాడు ,,
కొడవలెత్తి - కోసినోడు ,,
కొర్రు బారి - పోయినాడు ,,
గొడ్డలెత్తి - నరికినోడు ,,
గెంజిగటక - మానినాడు ,,
పేదవాడు - బీదవాడు ,,
పేగులోను - ఏడిసేడు ,,
సాహిత్యం - సదివినోలు ,,
సంబరాలు జరిపినారు || ఓ- ప్రజల ||
2
నువు సచ్చిపోయిన - సంగతినీ || శ్రీశ్రీ కుర్రవాడా ||
అటుజూడు - ఇటుజూడు ,,
పులితోలు - గప్పుకొని ,,
గాడిదెలూ - వచ్చినాయి ,,
నాగుబాము - తోలుకప్పి ,,
వానపాము - లొచ్చినాయి ,,
మాటజూసి - పాటజూసి ,,
పోరాడే బాట - జూసి ,,
నిన్ను చూచి - వన్నె చూచి ,,
మేనమావ - అంటారట ,,
మేనరికం - జేత్తరాట || ఓ- ప్రజల ||
3
మట్టి మనిషి దుక్కుజూసి || శ్రీశ్రీ కుర్రవాడా ||
మోటరెక్కి - ఎల్లినోడు ,,
రాతిరేల - బారులోను ,,
బీరుబుడ్డి - తాగినోడు ,,
పగటిపూట - ఫ్యాక్టరీలో ,,
రక్తాన్ని - పిండినోడు ,,
ఎక్కడున్నడో - ఎరగనోడు ,,
నీ కళ్లూ - పీకుకోని ,,
లోకాన్నీ - జూతరాట ,,
నీ నెత్తురు - రాసుకోనీ ,,
ఎర్రజండ - పడతరాట ,,
తెల్ల జెండ - పట్టుకోనీ ,,
సోషలిజం - తెత్తరాట ,,
నీ ఎముకలు - కొరుక్కోనీ ,,
ఏల్తారు - దేశామట ,,
నమ్ముతావ - నా తండ్రీ ,,
లంజకొడుకులన్న మాట || ఓ- ప్రజల ||
4
పుట్టినోడు - దక్కడనీ || శ్రీశ్రీ కుర్రవాడా ||
దక్కనోడు - పుట్టడనీ ,,
నీ సేవా - నీ తోవా ,,
సిరకాలం ఉండుననీ ,,
నువ్వురాసె - రాతలన్ని ,,
నువ్వు పాడె - పాటలన్ని ,,
తెలుగు తల్లి - ఈ పూటా ,,
ఒడిలోను - జోల గట్టి ,,
పాడుతేంది - నీ పాట ,,
సావు డప్పు - సెంకలెట్టి ,,
తొలి బిడ్డవు - నువ్వా నీ ,,
తొలి నవ్వువు-నువ్వాని ,,
నీ అల్లరింక - సెల్లెననీ ,,
ఆవలించి - తాగ మనీ ,,
కంటి నుండి - నెత్తురు నీ ,,
కడిగి నీకు పడతందీ || ఓ- ప్రజల ||
5
నీకు చావేటీ - బతుకేటీ || శ్రీశ్రీ కుర్రవాడా ||
ముదరేటీ - లేతేటీ ,,
వయసేటీ - వరసేటీ ,,
నాసిన్న కొడుకు - నిన్ను గానీ ,,
తాతంటడు - తండ్రంటడు ,,
నా పెద్ద కూతురు - నిన్ను గానీ ,,
మావంటది - మనసంటది ,,
మా అభ్యుదయం - అత్తగారు ,,
అల్లుడువని - నిన్నంటది ,,
మా భావకవి - బావగారూ ,,
బావమరది - వరసంతడు ,,
మా సినిమాల - సినబాబూ ,,
సెమ్కీలు - కొడతంటడు ,,
మా ప్రెస్సు మిల్లు - పెద నాన్నా ,,
కాళిదాసు - కవివంతడు ,,
ఎవరిమీ - అనుకున్నా ,,
యినకున్నా - కనకున్నా ,,
మహాజనం - నిన్ను గాని ,,
మా కవివని - అంతండ్రూ || ఓ- ప్రజల ||
6
నువ్వు సింకి సొక్క -దొడుక్కోని || శ్రీశ్రీ కుర్రవాడా ||
సిల్లులన్ని - కళ్లు జేసి ,,
రాసిన - నీ అచ్చరంలో ,,
రాలుగాయలు - పుడతండ్రు ,,
నీ ఖడ్గసృష్టి - పట్టుకోని ,,
కాయితాలు - తిప్పిజూసి ,,
సదువుకున్న - స్టూటెంటులు ,,
కత్తులు - మడతెడతండ్రు ,,
మహాజనం - అంతగాని ,,
మహా రాత - చేతబట్టి ,,
మాట మాట - సదువుకోని ,,
మంటలయ్యి - మండుతండ్రు ,,
పొలంలోను - రైతన్నా ,,
మిల్లు లోను - కూలన్నా ,,
నీ సిరి సిరి - మువ్వలుగట్టీ ,,
సిందులేసి - దూకుతుండ్రు ,,
ప్రపంచాన్ని - తెలిసినోడ ,,
పేదల్లో ఉన్నవాడ || ఓ- ప్రజల ||
7
నీ ప్రాణం - దాసుకున్న || శ్రీశ్రీ కుర్రవాడా ||
నీ వల్లూ - కుల్లి పోయి ,,
విను వీధీ - ఎల్లినావ ,,
వీరుడవూ - అయ్యినావ ,,
పాట రాసిన - పాణిగ్రాహి ,,
పక్కన - నువు జేరినావ ,,
శ్రీకాకుళం - వీరులున్న ,,
సోటుకు - నువ్వెల్లినావ ,,
తెలంగాణ శూరులున్న ,,
ఊరుకు నువ్వెల్లినావ ,,
ఆనాటీ - భగత్సింగ్ ,,
ఆలింగం - జేసినాడ ,,
తెలుగు బిడ్డ - రామరాజు ,,
హారతులూ - బట్టి నాడ ,,
కారల్ మార్క్స్ - వచ్చి నిన్ను ,,
కౌగిలించి - అడిగినాడ ,,
ఆలతోటి - జేరి నువ్వు ,,
అక్కడ - ఒక సభపెట్టీ ,,
భరతమాత - నక్సలైటు ,,
బాధలన్ని జెప్పినావ || ఓ- ప్రజల ||
( 'చేతన' భిలాయి నగర్, యుగకవి శ్రీశ్రీ సంస్మరణ సంచిక ఆగస్టు, 1983)
