Previous Page Next Page 
రక్తచందనం పేజి 12


    హీరోని సాఫ్ట్ గా, మంచివాడిగా చూపించిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర పరాజయం పాలవుతున్నాయి. ఎందుకని? మనుషుల్లో మంచితనం నశించిందా? మానవత్వం మృగ్యమైపోయిందా? లేదు వారిలో పేరుకుపోతున్న అసంతృప్తి, అసహనం, కసి, కోపం, ఉక్రోషం, నిస్సహాయత వారిని అలా నెగెటివ్ సైడ్ కి వెళ్ళేలా చేస్తున్నాయి.
    అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రజలు వీరూని అసహ్యించుకోవటం, ద్వేషించటం మానేసి హీరోయిక్ ఇమేజ్ ని అతనికి జోడిస్తున్నారు.
    మన సుఖ సౌఖ్యాల కోసం, శాంతి భద్రతల కోసం ఖర్చుపెట్టవలసిన ప్రభుత్వాలు ఒక వ్యక్తిని పట్టుకొనేందుకు తమ శాఖల్ని మేపుతున్నాయి అని ఏవగించుకున్నారు.
    ఆ రోజు ఆ న్యూస్ వేసిన పేపర్స్ అన్నీ హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి.
    అందుకు కారణం ఒక యువతి....
    మొదటి నుంచి వీరూకి సంబంధించిన వార్తల్ని రాస్తూ వస్తున్న ఫ్రీలాన్స్ క్రైమ్ రిపోర్టర్ మహిమ_ ఆరోజు ఓ ఇంగ్లీషు డైలీలో రాసిన న్యూస్ స్టోరీ ఆ రోజు ఆ పేపర్ కి మరింత గిరాకి ఏర్పడేలా చేసింది.
    ఏ మాసివ్ మేన్ హంట్ ఫర్ ఓవర్ త్రీ ఇయర్స్ హేజ్ నాట్ ఈల్డెడ్ రిజల్ట్స్....?
    నిజంగా, నిజాయితీగా పట్టుకోవాలనుకుంటే పట్టుకోలేరా పోలీసులు....?
    అతన్ని దాచిపెడుతున్న ఘరానా మనుషులెవరు?
    తెరవెనుక ఉన్న పెద్ద వ్యక్తులెవరు? అంటూ తొలిసారి మహిమ ఆ ఇష్యూని కొత్త మలుపు తిప్పింది.... సరికొత్త అనుమానాలకు, ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.
    మొట్టమొదటిసారి అందరి కనుబొమలు ఆశ్చర్యంతో పైకి లేచాయి?....కొత్త కోణం....న్యూ డైమన్షన్....?
    అంతవరకు ఏ రిపోర్టర్, ఏ పత్రికా ఆ వైపు దృష్టిని సారించలేదు.
    ప్రభుత్వంలోని వ్యక్తులే అతనికి సహకరించకపోతే ఆఖరిక్షణంలో ఎలా తప్పించుకుపోతున్నాడు? ఇన్ ఫర్మేషన్ ఎలా అందుతోంది....?
    మన పోలీసుల నిజాయితీల స్థాయి మనకి తెలీదా? రహస్యంగా ఒక నేరస్థుడ్ని పట్టుకొనేందుకు బయలుదేరే పోలీస్ అధికారే ఆ నేరస్థుడికి ఫోన్ చేసి బేరం కుదుర్చుకొని నేను మరో అరగంటలో వచ్చేస్తున్నాను అని చెప్పే సంఘటనలు ఎన్నో....ఎన్నెన్నో....ఇలా వివరణాత్మకంగా రాసింది మహిమ.
    అదెక్కడో తగలరానిచోట తగిలి తనకే ముప్పు ఏర్పడుతుందని ఆ న్యూస్ స్టోరీని రాసేటప్పుడు ఆమెంత మాత్రం ఊహించలేదు. ప్రోబ్ చేస్తున్నానన్న ఉత్సాహం....అసలు నేరస్థులు ఎవరన్న సత్యాన్ని కనుక్కొనేందుకు పడిన వృత్తిపరమైన తపన....సత్యశోధనాపరమైన జిజ్ఞాస ఆమెని ప్రమాదాల గురించి ఆలోచించుకోనివ్వలేదు.
    మహిమ....
    అందమైన మహిమ....
    అసాధారణమైన తెలివితేటలున్న మహిమ....
    వృత్తిపరమైన బెదిరింపుల పట్ల నిర్లక్ష్యాన్నీ, వృత్తిపట్ల నిజాయితీని వ్యక్తంచేసే మహిమ_సన్నగా, దృఢంగా, ఆరోగ్యంగా, ఐదడుగుల నాలుగంగుళాల ఎత్తులో రాయల్ గా కనిపిస్తుంది. చూపుల్లో అమాయకత్వం....
    రాతల్లో, పరిశీలనలో, పరిశోధనలో అపార మేధాసంపత్తి....నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి తీరాలనే సింగిల్ మైండెడ్ నెస్...తనను తాను కాపాడుకొనేందుకు వ్యక్తంచేసే పొగరుబోతూతనం.... ఆత్మస్థయిర్యం....ఆత్మవిశ్వాసం....గంటల తరబడి విశ్రాంతి, నిద్రాహారాలు లేకుండా శ్రమించగల శారీరక, మానసిక దారుఢ్యం .... నిశితమైన పరిశీలన....ఆలోచనల్లో పరిపూర్ణత.... స్ట్రాంగ్ విల్....ఆమె సొత్తు....
    ఎమ్.ఏ. సోషియాలజీ పూర్తిచేసిన మహిమకి మొదటినుంచి జర్నలిజం మీద అపరిమితమైన ఆసక్తి....ఆమె ఆసక్తిని గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైరయి ఇంట్లో ఉంటున్న ఆమె తండ్రికానీ, వంట గది వదిలిరాని తల్లికానీ కాదనలేదు. లేక లేక కలిగిన కూతురనో....మహిమ ఒక్కతే తమ సంతానమనో ఆమె ఇష్టాన్ని దేన్నీ వాళ్ళు కాదనలేదు.
    మహిమ యూనివర్సిటీలో ఉండగా ఒక వ్యక్తి నేరస్థుడు ఎలా అవుతాడని రాసిన నాలుగు పరిశోధనా వ్యాసాలే ఆమెకు అటువంటి ప్రెస్టేజియస్ నేషనల్ డైలీతో సంబంధాలు ఏర్పడేలా చేశాయి.
    ఎవరినైనా క్షణాల్లో మంచిచేసుకొని తనకు కావాల్సిన ఇన్ ఫర్మేషన్ ని రాబట్టుకోగల ఆమె నేర్పు.... నిజాన్ని రాయవలసివచ్చినప్పుడు చూపే నిజాయితి, నిర్భీతి_ఎవరికీ, దేనికి జంకని మొండితనం, తన పనితప్ప మరి దేని గురించి ఆమెని అందరికి అభిమానపాత్రురాలిగా చేశాయి.
    ఆ ఇంగ్లీషు డైలీ రెసిడెంట్ ఎడిటర్ కి ఆమె అంటే ఎంతో అభిమానం.
    ఆ రోజు వచ్చిన న్యూస్ స్టోరీ చివర 'మహిమ' అని ఉండటం అందరి దృష్టికి వచ్చింది.
    దాని రియాక్షన్ మరో చోట ఉద్రిక్తతని సంతరించుకుంది.


                           *    *    *    *


    సదాశివపేటలో ఉన్న కర్ణాటక డి.జి.పి. దేవదాసు ఇంటి బయట హడావిడిగా ఉంది.
    లోపల ఆఫీసు రూమ్ లో దేవదాసు, కర్ణాటక చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ చంద్రశేఖర్ సమావేశమయి ఉన్నారు. బయట డ్రైవర్స్, గార్డ్స్ నిశ్శబ్దంగా నిరీక్షిస్తున్నారు.
    ఆ ఇద్దరూ ఎప్పటినుంచో మంచి మిత్రులు.
    ప్రతిరోజు సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్ లో కలుస్తుంటారు. వారు అనుభవిస్తున్న ఉద్రిక్తత గురించి, వేస్తున్న పథకాల గురించి, మంత్రుల నుంచి వచ్చే ఒత్తిడి గురించి చర్చించుకుంటుంటారు.
    ఆ ఇద్దరూ తమ వృత్తి ధర్మాన్ని నీతి, నిజాయితీలతో నిర్వహించేవారే. అందుకే ప్రశాంతంగా ఉండలేకపోతుంటారు.
    "ఏం చేద్దాం....? సి.ఎం. బాగా కోపగించుకున్నారు....ఏదో ఒకటి మనం చేయాలి" చంద్రశేఖర్ సాలోచనగా అన్నాడు.
    "ఏదో ఒకటి చేసి లాభం లేదు చంద్రా! ఈసారి సీరియస్ గా చేయాలి...." అన్నాడు దేవదాసు  గంభీరంగా.
    ఇద్దరికీ యాభై ఏళ్ళ వయస్సు దాటిపోయింది.
    ఇద్దరూ ఎన్నో సమస్యల్ని, ఎందఱో నొటోరియస్ క్రిమినల్స్ ని చూసినవారే. వార్ని అదుపులోకి తీసుకొని శిక్షపడేలా చేసినవారే.
    కానీ ఇప్పుడు ఇద్దరూ కలసి ఎదుర్కోవలసినది_అదుపులోకి తీసుకోవలసింది అతి ప్రమాదకరమైన వ్యక్తిని. అసాధారణమైన తెలివితేటలు గల ఫారెస్ట్ స్మగ్లర్ నని ఆ ఇద్దరికీ తెలుసు, అతనంత తేలిగ్గా దొరకడని కూడా వారికి తెలుసు.
    అందుకే వారి నరనరాన ఉద్రిక్తత గూడుకట్టుకొని ఉంది.
    ముఖ్యమంత్రికి, మంత్రులకు వివరాలు....పడిన కష్టాలు వినే ఓపికుండదు. ఫలితం ఏమిటన్నదే వారికి కావల్సింది....
    "అదేదో నువ్వే చెప్పాలి. ఎందుకంటే మా డిపార్ట్ మెంట్ చేసి కొంతమంది అతనికి భయపడుతున్నారు. ఇంకొంతమంది ప్రలోభపడుతున్నారు. మరికొంతమంది నిరాసక్తలో మునిగిపోయారు" చంద్రశేఖర్ నిర్ధారిస్తూ అన్నాడు.
    "ఈ రోజు పేపర్స్ చూశావా....?" డి.జి.పి. ప్రశ్నించాడు.
    "చూశాను....ఎంక్వైరీ కూడా చేశాను. సెంట్రల్ నుంచి మనకు బదులు వచ్చింది. మనకి తప్ప ఎవరికీ తెలీదు, తెలిసే అవకాశం కూడా లేదు. నిన్నరాత్రి టి.వీ.లో ఆ వార్త రావడంతో పత్రికలవాళ్ళు రంగంలోకి దిగి ఆరాతీసి ఈరోజు పేపర్స్ లో వేశారు. టి.వీ.కి తెలియజేసిందెవరో తెలీదు. ఏది ఏమైనా మనకి మరికొన్ని అక్షింతలు...."నిరాసక్తంగా అన్నాడు చంద్రశేఖర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS