"నీబాబుది. పోయిన జన్మలో అక్కడ వదిలేసి వెళితే ఈ జన్మకి దాన్ని నేను బాగుచేసి తెచ్చుకున్నాను..." అంతే వేళాకోళంగా అన్నాడు సామంత్.
కనకారావు ఆ రిటార్ట్ కి ఒకింత కలవరపడ్డాడు.
"ఇక వెళ్దామా...?" తేరుకుంటూ అన్నాడు.
తలూపాడు సామంత్.
కనకారావు కారెక్కాడు.
అది మరుక్షణంలో ముందుకు దూకింది.
సామంత్ ఎక్కడికన్నట్టు కుడిచేతిని గాల్లో ఊపుతూ ప్రశ్నించాడు.
"కుతుబ్ షాహి సమాధులు" అన్నాడు కనకారావు సీరియస్ గా.
స్పీడ్ గా వెడుతున్న కారు సడన్ బ్రేక్ తో ఆగిపోయింది.
ఉలిక్కిపడ్డాడు కనకారావు.
"సమాధులేమిటి...?" అన్నాడు సామంత్ తీక్షణంగా రోడ్డు వంకే చూస్తూ.
"నాకో గొయ్యి రెడీగా వుందక్కడ. అందుకని" గట్టిగానే అన్నాడు కనకారావు.
"చచ్చినవాడ్ని పూడ్చి పెట్టడమే రాదు నాకు. ఇక నిన్నెలా పూడ్చిపెట్టను...? అయినా ఏదో వేషం అన్నావు. స్వరూపం మారిపోవాలన్నావ్. పృథ్వీరాజ్ కపూర్ లెవెల్లో నటించాలన్నావ్... మరలా సజీవ సమాధి అవుతానంటావేం? ఇంతకీ ఆ పిల్లిగడ్డమోడు ఏడి...?" అర్థం కానట్టు అడిగాడు సామంత్.
కనకారావు తల పట్టుకున్నాడు.
"పోనీలే తలనొప్పి తగ్గాక సమాధి అవుదూగాని - ఆ కనిపించే మెడికల్ షాప్ ముందు కారాపనా...?" సామంత్ సీరియస్ గా అంటున్నాడో, వేళాకోళమాడుతున్నాడో అర్థంకాక పిచ్చెక్కినట్టు చూశాడు కనకారావు.
కారు తిరిగి బయలుదేరింది.
మసబ్ టాంక్, సరోజినీదేవి దాటి న్యూబోంబే హైవేలో దూసుకుపోతోంది.
"నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదేం? ఆ పిల్లిగడ్డమోడు ఏడి...?"
"ఎవరు పీటరా...?"
"పీటరో జాటరో... ఏడి వాడు...?"
"అతను నాకు బాస్! అతన్ని వాడు వీడు అని నా ముందే అనవద్దు!"
"ఓ పనిచెయ్. నువ్వు కారు డ్రైవ్ చెయ్. నేను వెనకసీట్లో కూచుంటాను."
"ఎందుకు?"
"నాముందు అనవద్దన్నావుగా! వెనక కూచుని అంటాను..."
"అబ్బా... చంపేస్తున్నావయ్యా బాబు"
"అంత మొండి ప్రాణమా నీది?"
"అంటే...?" కనకారావుకి సామంత్ తో మాట్లాడడం కష్టంగా వుంది.
"చంపేస్తున్నావయ్యా బాబు అన్నావుగా... చంపేసినా చావకుండా చంపడాన్ని కూడా ఎదుర్కొంటున్నావుగా..."
"ఓరి నాయనో..." అన్నాడు తిరిగి తల పట్టుకోబోతూ ఆగిపోయి.
"మూడో కంటికి తెలీకుండా ఈ డ్రామా ఆడాలన్నావ్... తిరిగి మరొకడ్ని పిలుస్తావేం?" సామంత్ దబాయించాడు.
"మూడోవాడ్నా...?!"
"అవును"
"ఎవర్ని?"
"ఓరి నాయనో అన్నావుగా... నాయనలయినా సరే మన మధ్యకు రాకూడదుగా? మాటంటే మాటే...
తప్పులు చేసే నీలాంటోడ్ని ఆ పిల్లిగడ్డమోడు ఎలా పెట్టుకున్నాడు?"
"పిల్లి గడ్డమోడు కాదు పీటర్... పీటర్" అన్నాడు కనకారావు ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని.
"పీటర్ ఏమిటి మర్యాద లేకుండా... నువ్వు అతని దగ్గర ఉద్యోగం చేస్తున్నావ్. పీటర్ గారు... పీటర్ గారు అనాలి"
కారు కమాన్ దాటింది.
కనకారావుకి సామంత్ పీకపిసికి చంపెయ్యాలన్నంత కసిగా వుంది.
"ఇక నేనేం మాట్లాడనయ్యా..." కనకరావు తెగేసి చెప్పాడు.
"మాట్లాడకపోతే నేనేం చెయ్యాలో నాకెలా తెలుస్తుంది?"
"సైగల ద్వారా చెబుతాను"
"ఆదివారం మధ్యాహ్నం టి.వి.లో వార్తలు చదివినట్టు మూగసైగలు చేస్తే నాకు చిరాకు"
కారు లంగర్ హౌస్ దాటింది.
"మాట్లాడవేం?" సామంత్ రెట్టించాడు.
"ఇది గజెల్ కారు అరవై సంవత్సరాల క్రితం మోడల్. అంత స్పీడ్ గా తోలతావేం? ఎక్కడివక్కడివి ఊడిపోతే నీకు యాభయ్యే పోయేది! నాకు..." కనకారావు ఉలికిపడి ఆపైన మాట్లాడలేదు.
"ఊ...నీకు...ఎంత....?"
"నేను చెప్పను... అలాంటివన్నీ చెప్పాలని అగ్రిమెంట్ లో లేదు. నోరు మూసుకుని కారు నడుపు..." అన్నాడు కనకారావు విసిగిపోతూ.
వెంటనే కారాగిపోయింది.
ఎందుకు కారాపావన్నట్టు తల ఎగరేస్తూ ప్రశ్నించాడు కనకారావు.
మాట్లాడకుండా సామంత్ సైగలు చేయసాగాడు. కనకారావుకేం అర్థం కావడంలేదు.ఏమిటి విషయం అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు. సామంత్ తన నోటిని, కారు స్టీరింగ్ ని చూపిస్తూ పెదాలు కదిలించాడు.
"ఓరి దేవుడో... ఇంతకంటే నాలుగు మర్డర్స్ చెయ్యడం తేలిక. లాకప్ హింసని మించిపోయింది నీ హింస" అన్నాడు నుదురు కొట్టుకుంటూ.
"నాకు నోటికీ, చేతులకి, కాళ్ళకి ఏదో అవినాభావ సంబంధం వుంది. మాట్లాడకపోతే అవి పనిచేయవు. అవి పనిచేయకపోతే కారెలా నడుస్తుంది?"
కనకారావు దీనంగా చూశాడు సామంత్ కేసి.
"నాతో వేషం వేయిస్తానని చెప్పి రూట్ మారుస్తున్నావేమిటి?"
"రూట్ మార్చానా?"
"అవును...వేషమని ముందు చెప్పి నాలుగు మర్డర్స్ అంటున్నా వేమిటి? అలాంటి పనులు నేను చెయ్యను. ఏదో డబ్బున్నవాళ్ళు చేసే చిన్న తప్పుల్ని నామీద వేసుకొని నా కాలానికి విలువ కట్టుకుంటున్నాను. అంతేగాని మర్డర్స్,గిడ్డర్స్ అన్నావంటే నావల్ల కాదు" సామంత్ దూరంగా కనిపిస్తున్న కుతుబ్ షాహి టూంబ్స్ ని చూస్తూ కారుని స్లో చేస్తూ అన్నాడు.
"మాట వరసకు అన్నానయ్యా బాబు. నన్ను వదిలెయ్యవయ్యా బాబు" కనకారావు ప్రాధేయపడ్డంత పనిచేసాడు.
"ఈ పథకంలో పని చేస్తున్నందుకు నువ్వెంత తీసుకుంటున్నావో చెప్పు"
"నేను చెప్పను"
"చెప్పవా?"
"చెప్పనుగాక చెప్పను" కనకారావు మొండిగా అన్నాడు.
"నీతో చెప్పిస్తాను"
"అసాధ్యం"
"చూసుకుందామా?"
"చూసుకుందాం"
