Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 11


    "ఈ రోజు మా అమ్మ చేతి భోజనం తిన్నట్టుంది మాకు. మా వంటల్లాగే వున్నాయి రుచులన్నీ సీతమ్మగారూ! మా అమ్మకీ నచ్చింది మీ వంట. ఆవిడ ఈ రోజు ఒక ముద్ద ఎక్కువే తింది. ఇంక మేం నిశ్చింతగా వెడతాం." ఆ రోజు మధురి సీతమ్మ కూడా వుండి ఇల్లంతా తిప్పి ఏ సామాన్లు ఎక్కడెక్కడున్నాయో అన్నీ చూపించింది. తన తల్లి అనసూయమ్మ రోజూ కట్టుకునే బట్టలు, ఆవిడ పూజ గది, రోజూ వినే భక్తి పాటల కేసెట్లు, టూ ఇన్ వన్ అన్నీ చూపించి అప్పచెప్పింది. "ఇంక ఈ ఇల్లు మీది అనుకోండి" అంది వీధి తాళం చెవులు అప్పజెబుతూ.
    "మీ నమ్మకం నిలబెడతానమ్మా!" అంది సీతమ్మ తాళాలు అందుకుంటూ.
    మర్నాడు తొమ్మిది గంటలకి ప్రయాణం. సామాన్లు సర్దుకుని అంతా కాస్త ఆలస్యంగానే పడుకున్నారు. ఐదు గంటలకి అలారం పెట్టారు. అలారానికి పావుగంట ముందే లేచింది సీతమ్మ. అలవాటుగా అందరూ లేచి కాలకృత్యాల్లో పడ్డారు. ఇంత హడావిడి జరుగుతున్నా, టైము ఆరు దాటుతున్నాగానీ అనసూయమ్మ గాఢనిద్రలోనే ఉంది. అది గాఢనిద్ర కాదని అందరికీ అర్థమయ్యేసరికి ఇల్లంతా గందరగోలంగా తయారైంది. ప్రయాణాలు ఆగిపోయాయి. ఫోన్లు,హడావిడి, జనం... ఊరంతా తరలివచ్చింది. అనాయాస మరణం! ఎంత అదృష్టం అన్నారంతా. బతికినన్నాళ్లు రాణిలా బతికింది. వెళ్లేటప్పుడు అంత దర్జాగానూ వెళ్లింది. రావల్సిన వాళ్ళొచ్చారు. పిల్లలిద్దరూ దగ్గరే ఉన్నారు. కనుక కార్యక్రమం వెంటనే జరిగిపోయింది. ఈ గలాభా మధ్య యాంత్రికంగా అన్నింట్లో అందరికీ సాయపడుతున్న సీతమ్మకి తన పరిస్థితి ఏమిటో తనకే అర్థం కానంతగా ఆవిడ బుర్ర మొద్దుబారిపోయింది.
    "మేం వెళ్లి అంతదూరం నుంచి మళ్లీ రానవసరం లేకుండా, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా అమ్మ తన దారి తను చూసుకుంది. మంచాన పడి ఎవరిచేతా చేయించుకోకుండా ఇలాంటి సునాయాస మరణంతో హాయిగా వెళ్లిపోయింది. బహుశా, మేం ఆమెకోసం పడే ఆరాటం, వదిలి వెళ్లలేని నిస్సహాయస్థితి చూసి మీరంతా హాయిగా నిశ్చింతగా వుండండి నాయనా! అన్నట్టు వెళ్లిపోయింది" కొడుకు కళ్లు తుడుచుకుంటూ అన్నాడు.
    "అమ్మని ఎలా వదలి వెళ్లాలి? అంతదూరం నుంచి తరచూ ఎలా రాగలం? అని తల్చుకున్నప్పుడల్లా చాలా దిగులుగా వుండేది. ఇప్పుడింక ఆ దిగులే లేకుండా చేసింది" మాధురి రుద్ధకంఠంతో అంది.
    "ఆవిడ మహాతల్లి, సునాయాసంగా దాటిపోయారు. ఆవిడకి సేవ చేసుకునే అదృష్టం నాకు లేకపోయింది. ఇప్పుడింక నా గతేమిటి బాబూ!" మూడో రోజు కాస్త సావకాశంగా అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో తన మనసులో దొలిచే ప్రశ్న బైట పెట్టింది సీతమ్మ.
    "అవునండీ, మీరు అనకముందే నా మనసులోనూ అదే మాట మెదులుతోంది. 'అయ్యో పాపం! మనల్ని నమ్మి ఇల్లు వదిలి వచ్చారు. ఇప్పుడేం చెయ్యాలి?" అని నేనూ ఆలోచిస్తున్నానమ్మా!"
    "బాబూ, ఇంక ఇప్పుడు నా కొడుకు ఇంటికి వెళితే నా బతుకింకా హీనమై పోతుంది. ఎవరికైనా చెప్పి నాకింత దారి చూపండి. ఏ అనాధాశ్రమంలోనైనా ఫరవాలేదు."
    "చూస్తానమ్మా! మా మామయ్యకి, తెలిసినవారికి చెప్పి ఏదో ఒకటి ఏర్పాటు చేసే వెళతాను. ఈ పది రోజులు మీ సాయం మాక్కావాలి. మీ పెద్దరికం, సలహా, సహాయం అవసరం. ఈ దినకార్యక్రమాలు పూర్తికానీండి" హామీ ఇచ్చాడు మాధవ్.
    
                                                                                      *  *  *

    సీతమ్మ కష్టాలకి కరిగిపోయి, ఆ దేముడే పంపినట్టు ఇంటి పురోహితుడు వచ్చి "బాబూ! మన వెంకటేశ్వరస్వామి గుడి పెద్ద పూజారిగారు గుడిలో రెండుపూటలా నైవేద్యం పెట్టడానికి ఎవరన్నా మంచిమనిషి కావాలన్నారు. వెంటనే నాకు మీ మాట గుర్తొచ్చింది. ఆవిడకి అభ్యంతరం లేకపోతే, గుడిలోనే వుంటూ ఆ దేముడికి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. పూజారిగారి భార్యే ఇన్నాళ్లు ప్రసాదాలు చేసేవారు. ఆవిడ పోయాక ఆయన అవస్థ పడుతున్నారు. ఆయనకీ వయసు అయిపోయింది. ఏ బాదరబందీలు లేకుండా, గుడిలోనే ఉంటూ ఈ పని చేయగలిగినవారు కావాలిట. రోజూ పులిహోరా, దద్దోజనం, చక్రపొంగలిలాంటి నైవేద్యాలు రెండుపూటలా ఆయన చెప్పినట్టు చేయాలి" అన్నాడు పురోహితుడు.
    "ఆమె చేయగలరనే అనుకుంటున్నాను. ఏమ్మా, ఏమంటారు?" అని అడిగాడు మాధవ్.
    "అయ్యో! వంటలు చేసిన చేతులు బాబూ ఇవి. ఆ దేముడికి నైవేద్యం చేసే భాగ్యం దొరకడం నా అదృష్టం అనుకుంటాను. తప్పకుండా ఈ పని నాకు ఇప్పిస్తే మీ మేలు మరచిపోను. నిశ్చింతగా ఆ భగవంతుని సన్నిధిలో ప్రశాంతంగా నా జీవితం వెళ్లిపోతే అంతకంటే ఏం కావాలి?" ఆరాటంగా అంది.
    "గది ఇస్తారు. జీతం వుంటుంది. మీరు వంట చేసుకోవచ్చు. ప్రసాదాలు ఎలాగో వుంటాయి. రోజుకి రెండు మూడు కిలోల పైనే బియ్యం ప్రసాదాలు చెయ్యాల్సి వుంటుంది. పర్వదినాల్లో ఇంకా ఎక్కువే. ఉదయం, సాయంత్రం కాస్త పని. మిగతా..."
    "ఏమయినా, ఎంతయినా చేస్తాను. ఈ సంసారబాధ్యతలు, చాకిరీ తప్పింది, ఆ దేవుడి సాన్నిధ్యం దొరికింది. ఆ మహాతల్లికి సేవ చేసే అదృష్టం దొరకలేదు గానీ, ఆవిడవల్ల నాకింత మేలు జరిగింది బాబూ! ఇదంతా మీ దయే! ఆ దేముడే మీ ద్వారా నాకీ అవకాశం కల్పించాడనుకుంటాను. 'కొడుకింట్లో చాకిరీ చేయవు గానీ, ఇంకొకరింట్లో నౌకరి చేసేందుకు దిగజారావా?' అని కొడుకు ఎత్తి పొడవకుండా ఆ భగవంతుడే ఈ దారి చూపించాడు."
    "అయితే ఈవాళే వెళ్లి ఆయన్ని కలవండి, అన్నీ మాట్లాడుకోండి" అన్నారు శర్మగారు.
    "అలాగే సాయంత్రం నేనే తీసికెళ్లి మాట్లాడి ఆయనకి అప్పగించి వస్తే నా బాధ్యత తీరుతుంది" అన్నాడు మాధవ్.
    రెండు చేతులెత్తి ఆ దేముడికీ, మాధవ్ కీ చెమర్చిన కళ్లతో నమస్కారం చేసింది సీతమ్మ.

                                                                                             (నవ్య, 25 ఏప్రిల్ 2018)

                                                *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS