"చాలు బాబూ! అంత మాటన్నారు. నాకొక మంచి నీడ, అమ్మగారికి తోడు దొరికింది. ఈ నీడన నా రోజులు వెళ్లిపోతే చాలు" దండం పెట్టి అంది.
"మీ గురించి మీరేమీ చెప్పలేదు. మీ వివరాలు చెప్పండి. పిల్లలున్నారా మీకు?" అడిగింది మాధురి.
"ఉన్నారమ్మా, నాకూ మీలాగే ఓ కొడుకు, కూతురు ఉన్నారు. నా భర్త చాలా చిన్నప్పుడే పోయారు యాక్సిడెంట్ లో. అప్పటినుంచీ రెక్కల కష్టం మీదే వంటలు చేస్తూ పిల్లల్ని పెంచాను. ఆస్తిపాస్తులు లేవు. పిల్లల్ని చదివించి ఓ దారికి తెచ్చాను. కూతురు పెళ్లి చేశాను. కొడుకుని శక్తికి మించే చదివించాను. పెళ్లి చేశాను."
"మరి, మీ అబ్బాయి, కోడలు ఉండగా ఇలా ఎందుకు ఇంట్లోంచి వచ్చేస్తున్నారు? వాళ్లేమైనా అభ్యంతరం చెపుతారేమో!" సందేహంగా అడిగింది మళ్లీ.
"చెపుతారమ్మా! తప్పకుండా నన్ను వెళ్లనీయరు. రాత్రింబవళ్ళు జీతం బత్తెంలేని చాకిరీ చేసే నమ్మకమైన మనిషి వాళ్లకి మరొకరు ఎక్కడ దొరుకుతారమ్మా? కానీ ఇంక నా ఈ అరవై ఏళ్ల వయసులో అంత శ్రమ తట్టుకోలేక, కాస్త ప్రశాంతంగా, విశ్రాంతిగా మిగిలిన జీవితం గడపాలనిపించింది. రాత్రింబవళ్ళు చాకిరీ చేసి చేసి, ఇటు వంట, ఆడపిల్లలు, రోజంతా అన్నన్ని బాధ్యతలు నెత్తిన వేసుకుని మోయలేక, పనులు చేయలేక నలిగిపోయి ఈ నిర్ణయానికి వచ్చాను."
"మరి మీ అబ్బాయికి మీరిక్కడ ఉన్నారని తెలిసివచ్చి ఏదన్నా గొడవ చెయ్యరు గదా!" అన్నాడు మాధవ్.
"అదంతా నేను చూసుకుంటాను బాబూ! రేపు తెల్లారగనే వస్తాను. ముందుగా చెపితే అడ్డు చెప్పవచ్చు. వచ్చాక నాల్గురోజులు పోయాక చెపుతా."
"సరే, అదంతా మీరు చూసుకోండి మరి. మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే పాస్ బుక్, ఆధార్ కార్డు తెచ్చుకోండి. ఈ పనికి మీకు ఎంత ఇమ్మంటారో చెప్పండి. ఇంట్లో అన్ని వస్తువులూ వాడుకోండి. భోజనం సరేసరి. అమ్మకి బోలెడు చీరలున్నాయి. సగం వాడినవి తీసుకోండి. సబ్బు, నూనెలు సహా మొత్తం మీ ఖర్చంతా మాదే. ఇవన్నీ కాకుండా జీతంగా మీకు ఎంత కావాలో చెపితే..."
"మీ ఇష్టం బాబూ! నాకు భవిష్యత్తులో ఏదన్నా అవసరానికి అంటే నీ మందులకి వాటికి కావల్సివచ్చే విధంగా, నాదంటూ కొంత డబ్బు ఉండేట్టు చూడండి. ఇక్కడ ఈ ఇంతినీ, మిమ్మల్నీ చూసిన తర్వాత నాకు కావాల్సిన ప్రశాంతత దొరుకుతుందనిపించింది. ఇంక మీరేం ఇచ్చినా నేనేమీ అడగను. నా డబ్బు బ్యాంక్ లో వేసే ఏర్పాటు చెయ్యండి. చిల్లర ఖర్చుకి కాస్త చేతిలో పెట్టండి. అంతకంటే నాకేం కావాలి?" నిజాయితీగా అడిగింది సీతమ్మ.
"సరే, ఏడాదికి ఒక లక్ష రూపాయలు మీ పేరన బ్యాంక్ లో వేస్తాం. మిమ్మల్ని చూడగానే మాకు భరోసా, నమ్మకం కలిగాయి. మా అమ్మని మీకు అప్పచెప్పి మేం నిశ్చింతగా వెళ్లొచ్చు అనిపించింది. ఇంటిమనిషిలా అనిపిస్తున్నారు. ఆ నమ్మకం నిలబెట్టుకుని ఆమె చివరి రోజులు ప్రశాంతంగా గడిచేందుకు సహాయం చెయ్యండి. సరేనా! ఆవిడని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ భవిష్యత్తుని మేము చూసుకుంటాం" అన్నాడు మాధవ్.
"ఇంతకంటే నాకు ఇంకేమీ అక్కరలేదు బాబూ! ఆ మాట చాలు. రేపు ఉదయం వచ్చేస్తాను" అని నిలబడి అందరికీ నమస్కారం చేసింది సీతమ్మ.
"మంచిది. రేపు మీకు అన్నీ చూపించి, ఎల్లుండి మేం వెళ్లిపోతాం. మా ప్రయాణాలు ఏర్పాటు చూసుకుని మీకన్నీ అప్పగించి వెళతాం" అన్నాడు మాధవ్.
* * *
రాత్రి అందరూ పడుకున్నాక నిశ్శబ్దంగా తన బట్టలు, సామాన్లు రెండు షోల్డర్ బ్యాగుల్లో సర్దుకుని తెల్లారి ఐదున్నరకల్లా గుమ్మం దాటి ఆటోమేటిక్ తాళం ఉన్న తలుపు లాగి ఇంట్లోంచి బయటపడింది సీతమ్మ.
'ఆదివారం సెలవు కాబట్టి బాగా పొద్దెక్కేవరకు ఎవరూ నిద్ర లెవరు. ముందుగా చెప్పి బయలుదేరితే నానా యాగీ చేస్తాడు కొడుకు. తనను లోపల పెట్టి బయట తాళం వేసుకుని వెళ్లినా వెళతారు. అందుకే తనకు ఇదొక్కటే దారి' అనుకుంది సీతమ్మ. మనసుకి కష్టంగానే అనిపిస్తోంది. కానీ తప్పదు! తన కష్టాన్ని, తన శ్రమని గుర్తించి కనీస ఓదార్పు, సానుభూతి కూడా చూపించడు కొడుకు. ఇంట్లో గాడిద చాకిరి చేస్తున్నాగానీ 'మా అమ్మని ఇంటి పట్టున ఉండి పిల్లల్ని చూసుకోమన్నాం. అంతేగా! ఇందులో ఏం కష్టం ఉందనీ' అనుకుంటారు వాళ్లు. 'ఇద్దరం కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం. ఎవరి కోసం? మనకోసమేగా! ఇది మన ఇల్లే గదా, వాళ్లు ఆవిడ మనవలే గదా! ఆవిడ బయటివాళ్లకెవరికో చేయడం లేదుగా' అనుకుంటారు వాళ్లు.
'వంటపని చేయడం ఒక ఎత్తు. రోజంతా ఏడాది లోపు పిల్లాడు, మూడేళ్ల పిల్ల చేసే అల్లరి తట్టుకుంటూ, వాళ్ల అవసరాలు చూస్తూ, వాళ్లకి అన్నం తినిపిస్తూ, తాగిస్తూ ఆలనాపాలనా చూసుకోవడం మరో ఎత్తు. తనకు ఒక్క క్షణం విశ్రాంతి లేదు. టీవీలో చిన్న ప్రోగ్రాం కూడా చూడలేదు. కాసేపు అలసిన శరీరానికి విశ్రాంతి లేదు. పూజ, నమస్కారం, గుళ్లూ గోపురాలు, ఇరుగమ్మ, పొరుగమ్మ, ఆఖరికి ఓ పేపరైనా చదువుకునే తీరిక లేని చాకిరి తనది. ఈ కాలం పిల్లలకు తినిపించడానికి, తాగించడానికి గంటలగ్గంటలు పడుతుంది. ఒక్కమాట అనకూడదు, కసరకూడదు. ఇల్లంతా ఎంత సర్దినా అంతే! సాయంత్రం కోడలుగారు వచ్చేసరికి "ఏమిటీ కొంప! కాస్త సర్దలేరా?" అని మొహంమీదే అడుగుతుంది. తల్లి రాగానే పిల్ల వాటేసుకుని "మమ్మీ! చూడు మమ్మీ! బామ్మ నన్ను తిట్టింది. ఇలా చేయి పట్టుకుని లాగింది. కోప్పడింది" అంటూ కంప్లైంట్లు.
ఇక దాంతో "పిల్లల్ని కాస్త ప్రేమగా చూడాలి. అలా కసురుకుంటే ఎలా?" అని మొహం చిట్లింపులు. పోనీ తను ఇంటికి వచ్చిన తర్వాతైనా కాస్త పిల్లల్ని చూస్తుందా? అప్పుడు కూడా మళ్లీ తనమీదే భారం. "మామ్మనడుగు, మామ్మ అన్నం పెడ్తుంది వెళ్లు. వీడికి పాలు పట్టండి" అంటూ మంచమెక్కి కూర్చుని పురమాయింపులు. కొడుకు ఇవన్నీ చూసినా పట్టించుకోడు. 'ఇంట్లో మనిషి... చేయకేం చేస్తుందిలే!' అనుకుంటారు. 'ఈ ఇంటికోసం అరవై ఏళ్లు చాకిరీ చేసింది తను. ఈ కొంపకి, ఈ మనుషులకి చేసిన చాకిరి చాలు. ఈ ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా, కాస్త విశ్రాంతిగా తన కోసం తను బతికే చోటు దొరికింది చాలు.'
* * *
