Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 11


    అసలు అనూష పెళ్లి సమయంలో ఇంటినుంచి ఎందుకు పారోపోయినట్టు? శ్రీపతి చెప్పలేదు. తను అడగలేదు. అనూషలో లోకజ్ఞానం తెలియని ఆడపిల్లేమీ కాదు అనిపించింది.
    ఈసారి ఆమె ఎదురుపడితే ఆమెను ఎలా ఒప్పించాలో, శ్రీపతికి ఎలా అప్పచెప్పాలో క్షణం ఆలోచించాడు వీరేష్.
    అతని ఊహలలో ఇంకా ఎటువంటి పథకం రూపుదిద్దుకోలేదు.
    ప్రస్తుతం అతన్ని వేధిస్తున్నదంతా సంపాదకీయంలో పోలీసుల మీద వచ్చిన దుమారమే!
    సురేఖ కేసులో రహస్యాన్ని తను కనుక్కో గలిగితే ధైర్యంగా అటు ప్రెస్ కూ, అటు ప్రజలకూ సమాధానం తను చెప్పగలడు.
    సురేఖ కేసులో దర్యాప్తు నిమిత్తం బయలుదేరాడు వీరేష్.


                                 *    *    *    *


    ఆపరేషన్ థియేటరు నుంచి బయటకు వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీ మెడికల్ ఆఫీసరు డాక్టర్ లత.
    చేతికి ఉన్న గ్లౌజులు తీసి, వాష్ బేసిన్ లో చేతులు కడిగింది.
    మెడికో లీగల్ కేసులలో డాక్టరు లతను విచారించడానికి ఇన్ స్పెక్టరు వీరేష్ ఆసుపత్రికి వచ్చాడు.  
    డాక్టరు లతా గదికి రాగానే ఇన్ స్పెక్టరు వీరేష్ విష్ చేసి తన రాకకు గల కారణం చెప్పాడు.
    ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని సురేఖ శవ పరీక్ష చేసింది డాక్టరు లత.
    ఆమె ఇచ్చే పోస్టుమార్టం నివేదిక ద్వారా ఏమైనా కొత్త ఆధారాలు దొరుకుతాయేమోననే ఆశతో వచ్చాడు వీరేష్.
    "చెప్పండి ఇన్ స్పెక్టర్! నేను మీకేం సాయం చేయాలి?" చిరునవ్వుతో అడిగింది డాక్టర్ లత.
    "మేడమ్! పిక్నిక్ కు వెళ్ళి తిరిగివచ్చిన తరువాత కొద్దిరోజులకే సురేఖ ఆత్మహత్య చేసుకుంది. కారణం ఇదమిత్తంగా ఇదీ అంటూ ఏమీ కనిపించడంలేదు. ఆమెపై ఎవరైనా అత్యాచారం చేసినట్టు ఆధారాలు ఉన్నాయా?" తన సందేహాన్ని వెలిబుచ్చాడు ఇన్ స్పెక్టర్ వీరేష్.
    "అవును ఇన్ స్పెక్టర్! మీ అనుమానం నిజమే. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు సంభోగంలో పాల్గొన్నట్టు వైద్య పరీక్షలో తేలింది. అయితే, అది మానభంగమా? లేక ఆమె ఇష్టం మీద జరిగిందా అనేది చెప్పడం కష్టం. ఆమెను మత్తులో ఉంచి ఎవరైనా అఘాయిత్యం చేస్తే చేసి ఉండవచ్చు. అటువంటప్పుడు అది ఆమె ఇష్టప్రకారం జరిగిందో, ఆమె ఇష్టానికి వ్యతిరేకగా జరిగిందో చెప్పడం కష్టమే..." అంది వివరంగా సమాధానం చెబుతూ డాక్టరు లత.
    ఇన్ స్పెక్టర్ వీరేష్ ఆలోచనలోపడ్డాడు. అంతవరకు అతను ఈ కోణం నుంచి ఆలోచించలేదు.
    "డాక్టర్! కేవలం మీరు ఇచ్చిన క్లూ మీదే నా పరిశోధన ఆధారపడి ఉంది. ఈ కేసు దర్యాప్తులో మీరు నాతో పూర్తిగా సహకరించాలి."
    "ఇన్ స్పెక్టర్! సురేఖ ఆత్మహత్య చేసుకోవడం వలన ప్రజలలో వచ్చిన అలజడిని నేనూ గమనిస్తూ ఉన్నాను. మీరు దర్యాప్తు చేయండి, ముద్దాయిని పట్టుకోవడానికి ప్రయత్నించండి. మీకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది" అంది నమ్మకంగా డాక్టర్ లత.
    "ఈ కేసులో సాక్షులు ఎవరినీ అనుమానించడం లేదు! ఇక నేను ఎవరిని అనుమానించాలి డాక్టర్?" నిరుత్సాహం చోటుచేసుకుంది వీరేష్ మాటలలో.
    "భలే వారే! అప్పుడు నిరుత్సాహపడితే ఎలా? మీరు అధైర్యపడుతూ నన్ను కూడా నిరుత్సాహపరుస్తున్నారు...." అంది డాక్టరు లత.    
    "సారీ డాక్టర్! పరిశోధనలో ఎదురవుతున్న అవాంతరాలనుబట్టి ఆలా అన్నానే కాని, అధైర్యపడి మాత్రం కాదు. ఎనీ వే _ మీరిచ్చిన స్ఫూర్తితో నా దర్యాప్తును త్వరత్వరగా కొనసాగిస్తాను...." అన్నాడు ఆత్మవిశ్వాసంతో.
    "ఆల్ ద బెస్ట్...." అంటూ అతన్ని ప్రోత్సహించింది డాక్టర్ లత.
    ఇన్ స్పెక్టర్ వీరేష్ నూతనోత్సాహంతో బయలుదేరాడు.


                                                     *    *    *    *


    అది హోటల్ త్రీ స్టార్ ఇంటర్ నేషనల్.
    అక్కడ కాన్ఫరెన్స్ హాలులో చాలామంది అభ్యర్థులు కూర్చుని ఉన్నారు.
    ఆ హాలుకు పక్కనే ఉన్న సూట్ (Suite)లో ఇంటర్వ్యూ మొదలయింది.
    ఇంటర్వ్యూలో పాల్గొన్న అభ్యర్థులు బయటకు వచ్చి లోపల జరిగిన విషయాల గురించి చర్చిస్తున్నారు.
    ఇంటర్వ్యూ జరుగుతుండగానే తలుపు తోసుకుని సమ్రాట్ లోపలకు చొచ్చుకుని వెళ్ళాడు.
    అప్పటివరకు ఇంటర్వ్యూ చేస్తున్న విశ్వనాథ్ చివ్వున తలెత్తి చూశాడు.
    ఎదురుగా సమ్రాట్ ను చూస్తూనే "నువ్వెందుకొచ్చావురా?" అంటూ విసుక్కున్నాడు.
    "నాన్నా! మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలిసే వచ్చాను. మీ కంపెనీలో ఖాళీ పూర్తి చేయడానికి ఎలాగూ ఇంటర్వ్యూ చేస్తున్నారుగా! అలాగే నాకు పర్సనల్ సెక్రటరీగా ఎవరైనా లేడీ టైపిస్టును ఎంపిక చేయండి..." అన్నాడు.
    "అయితే, ఈమె ఇవ్వాళ వచ్చిన లేడీ క్యాండిడేట్లలో ఆఖరావిడ. నేను మేల్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేద్దామనుకుంటున్నాను. నీకు ఇష్టం అయితే ఈమెను నీ సెక్రెటరీగా తీసుకో..." అన్నాడు విశ్వనాథ్.
    "ఆమెకు అంగీకారమేనా?" సంశయంగా ఆమెవైపు క్రీగంట చూశాడు సమ్రాట్!
    సమ్రాట్ ను చూసి క్షణం ఆశ్చర్యపోయింది అనూష. వెంటనే అతని నుంచి దృష్టిని మరల్చుకుంది.
    విశ్వనాథ్ సమాధానం కోసం ఆమెవైపు చూశాడు.
    అనూష మౌనంగా ఉంది.
    "మీరు మా వాడికి సెక్రటరీగా ఉండడానికి ఇష్టపడిందీ, లేనిదీ చెప్పలేదు! అంటే మీకు ఇష్టంలేనట్టుంది..."
    "అబ్బే_అదేమీ లేదు! ఆర్డర్స్ ఇవ్వండి జాయిన్ అవుతాను!" అంది నమ్రతగా వచ్చిన అవకాశాన్ని త్రోసిపుచ్చడం ఇష్టంలేక.
    విశ్వనాథ్ సంతకం చేసి అపాయింట్ మెంట్ ఆర్డరు కాగితాన్ని ఆమె చేతి కిచ్చాడు. సమ్రాట్ ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. అతనిలో విజయగర్వం తొంగి చూసింది.
    అనూష విసురుగా ముఖం పక్కకు తిప్పుకుంది.


                                   *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS