"నేను ఏ తప్పూ చేయలేదు ఆంటీ! నా మాట నమ్మవా! లోకులు అనేకం అంటారు. అవన్నీ నమ్ముతావా!" కళ్ళనీళ్లు తిరిగాయి సాహితికి.
ఈ సమయంలో ఏం దాచినా తను దోషిలా తలవంచుకోవలసి వస్తుందని జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది.
'చేయని నేరానికి అనవసరంగా అపనిందల పాలయ్యానే' అనే బాధతో కుమిలి కుమిలి ఏడ్చింది సాహితి.
నిజమే! సాహితి ఏ తప్పూ చేయదు. తనకు ఆ నమ్మకం ఉంది. కాని ఆడపిల్ల అనవసరంగా నలుగురి నోళ్ళలో పడితే రేపు ఎవరు మాత్రం ధైర్యం చేసి పెళ్ళి చేసుకుంటారు?
"ఆడపిల్లలు ఒంటరిగా తిరిగే రోజులు కావమ్మా ఇవి. నువ్వు చదువూ, సంధ్యా అంటూ బయటకు వెళ్ళి లేనిపోని సమస్యలను తెచ్చి పెట్టకు. రేపటినుంచి కాలేజీ మానేయ్ తల్లీ! అంతగా చదవాలనుకుంటే ప్రైవేటుగా డిగ్రీ పూర్తిచేద్దువుగాని" బుజ్జగింపుగా అంది మాధవి.
"ఆంటీ! సమాజం ఏదో అంటుందని భయపడి మధ్యలోనే నా చదువు మానిపిస్తావా? నువ్వు పాఠకుల కిచ్చిన సందేశాలు కేవలం కాగితాలకే పరిమితమా?" సూటిగా అని తల తిప్పుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది సాహితి.
నిజానికి తను సాహితిని ఇప్పటివరకూ కేవలం పెంకిపిల్ల అనుకుంది. కాని తను చాలా తెలివిగలదని నిరూపించుకుంది. ఎవరి సహాయం లేకుండా తను ఆందోళనకారుల నుంచి రక్షించుకుంది.
తను అనుకున్నట్టు సాహితీ చిన్నపిల్లేమీ కాదు. అమాయకురాలు అంతకంటే కాదు. తరగతి చదువులే కాదు, సాహితి సమకాలీన సమాజాన్ని కూడా చదివింది. తనను తాను ఎలా తీర్చిదిద్దుకోవాలో సాహితికి తెలుసు.
సగటు పాఠకునిలా తననే నిలదీసి అడిగిందంటే తనను తను కాపాడుకోగల ధైర్యం ఆమెకు ఉన్నదని అర్ధంచేసుకోవలసిందే. ఈ భావనతో బిందుమాధవి మనసు కాస్త కుదుటపడింది.
* * * *
"జూనియర్ కాలేజే విద్యార్థిని సురేఖ ఆత్మహత్య!" ఆ రోజు పేపర్ హెడ్ లైన్ వార్త.
అంతకుముందురోజే పోలీసు జులుం నశించాలని విద్యార్థినీ విద్యార్థులు ఇన్ స్పెక్టరు వీరేష్ స్టేషన్ ముందు ధర్మా చేశారు.
సాహితి రిపోర్టు ఇవ్వకపోవడం వలన విద్యార్థులకు సర్దిచెప్పడం తలనొప్పి అయ్యింది వీరేష్ కు. అతని వాక్చాతుర్యం వల్లనేమి, అతని నీతి, నిజాయితీ వల్లనైతేనేమి విద్యార్థుల అలజడి సద్దుమణిగింది.
కాని ఈరోజు సురేఖ ఆత్మహత్య కేసుమీద దినపత్రికలో సంపాదకీయమే వచ్చింది. అది చదివి అధికార పార్టీవారు, పోలీసు అధికారులు ఆందోళనకు గురయ్యారు.
అసలు ప్రభుత్వం ఉన్నదా? ఉంటే పోలీసు శాఖ నిద్రపోతున్నదా? అన్నట్టుగా జన ఘోష ఆ సంపాదకీయంలో వినిపిస్తున్నది.
పేపరు మడిచి సుదీర్ఘంగా నిట్టూర్చాడు ఇన్ స్పెక్టర్ వీరేష్. చాలా వరకు తన సర్కిల్ పరిధిలో జరిగిన విషయాలే ఆ సంపాదకీయంలో వచ్చాయి. కొన్ని కేసులు రికార్డుకు వచ్చాయి. కొన్ని ఎందుచేతనో అసలు రిపోర్టే కాలేదు.
ఎవరో వచ్చినట్టు సెంట్రీ చెప్పడంతో ఆలోచిస్తున్నవాడు కాస్తా తలెత్తి చూశాడు ఇన్ స్పెక్టరు వీరేష్.
శ్రీపతి ఇన్ స్పెక్టరుకు విష్ చేసి తనకు తను పరిచయం చేసుకున్నాడు.
"నేను రిపోర్టు ఇవ్వను. విషయం చెబుతాను, ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు. ప్రైవేటుగా దర్యాప్తు చేయండి..." తను వచ్చిన విషయం చెప్పాడు శ్రీపతి.
ఇన్ స్పెక్టరుకు అతని వింత కోరిక అర్థం కాలేదు.
"అలా అయితే ఎవరైనా ప్రైవేటు డిటెక్టివ్ దగ్గరకు వెళ్ళండి. నేను ప్రభుత్వోద్యోగిని. కేసు పెట్టకుండా దర్యాప్తు చేయటం కుదరదు" విసుక్కున్నాడు ఇన్ స్పెక్టరు.
"క్షమించండి ఇన్ స్పెక్టర్! ఒక ఆడపిల్ల తండ్రిగా ప్రాధేయపడుతున్నాను. రిపోర్టు ఎలా ఇవ్వమంటారు? నా కూతురు పెళ్ళిపీటల మీద నుంచి లేచిపోయిందని రిపోర్టు ఇచ్చి నా పరువు ప్రతిష్టలు బజారుపాలు చేసుకోమంటారా?" ఆవేదన కూడుకొని వుంది అతని మాటల్లో.
కళ్ళలో సుడులు తిరుగుతున్న బాధనంతా పంటి బిగువున ఆపడానికి ప్రయత్నిస్తున్నాడతను.
ఇన్ స్పెక్టరు వీరేష్ కు ఒక ఆడపిల్ల తండ్రి పడుతున్న వ్యధ అర్థమయ్యింది. అటువంటి పరిస్థితులలో ఏ తండ్రి అయినా పోలీసుల సహాయం కోరడంలో తప్పులేదు.
ఏదైనా సహాయాన్ని అర్ధించి ఎవరైనా పోలీసు స్టేషన్ కు వచ్చినప్పుడు వాళ్ళను సంతృప్తిపరచి పంపడం పోలీసు ఆఫీసరుకు ఉండవలసిన కనీస ధర్మం.
వీరేష్ తన బాధ్యతను గుర్తించి అతన్ని కూర్చోమన్నట్టు కుర్చీ చూపాడు.
అతడిచ్చిన ఫోటో చూసి "ఏమిటీ?...." అంటూ ఒక్కక్షణం విభ్రాంతికి లోనయ్యాడు.
ఆ రోజు రైల్లో తనతోపాటే ప్రయాణం చేసిన అనూష ఫోటోను గుర్తించాడు. ఆరోజు ప్రయాణ హడావుడిలో తను పేపరు చూడలేదు. చూసివుంటే శ్రీపతి ఇచ్చిన ప్రకటనకు తను తప్పక చర్య తీసుకునేవాడే!
శ్రీపతి ఇన్ స్పెక్టరులో వచ్చిన మార్పును గుర్తించాడు.
"సార్....అనూషను మీరెక్కడైనా చూశారా?" ఆతృతగా అడిగాడు.
"సారీ! ఆమెను ఇంతవరకు చూడలేదు...."
తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోవడం ఇష్టంలేక చిన్న అబద్ధం ఆడాడు వీరేష్.
"ఓకే....! శ్రీపతిగారూ! నా శాయశక్తుల ప్రయత్నించి మీ అమ్మాయి అనూషను మీకు అప్పగిస్తాను. మీ విజిటింగ్ కార్డు ఇవ్వండి..." తను ఆ బాధ్యతను స్వీకరిస్తున్నట్టు నమ్మకంగా అన్నాడు.
శ్రీపతి తన విజిటింగ్ కార్డు ఇచ్చి కృతజ్ఞతలను తెలిపి వెళ్ళాడు. తన కళ్ళముందే ఉన్న అనూషను గుర్తించలేకపోవడం తన పొరపాటుగానే గుర్తించాడు ఇన్ స్పెక్టరు.
పోలీసు ఆఫీసరు జిల్లాలో, రాష్ట్రంలో ఇంకా అయితే దేశంలో జరిగే రోజువారీ సంఘటనలను తెలుసుకొనకపోవడం అవివేకమేనని అనిపించింది.
