తరుచూ తాము ఆడి పోగొట్టుకున్న డబ్బునేకాక, కేసినోస్ కేష్ కౌంటర్స్ ని కూడా లూటీ చేసేవారు. ఆ బెడదను వదిలించుకొనే బ్యాగ్రౌండ్, నెట్ వర్క్ ని రామన్ హో అప్పటికి ఏర్పాటు చేసుకోలేదు.
ఆర్గనైజ్డ్ సెక్యూరిటీ వరల్డ్ ని ఎలా ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్న సమయంలో చిండూ హాన్, రామన్ హోకి తారసపడి అతని అవసరాన్ని తెలుసుకున్నాడు.
రామన్ హో ఆర్గనైజ్ చేస్తున్న గేంబ్లింగ్ హౌసెస్ కి తాను రక్షణ కల్పిస్తానని, అందుకు కొంత డబ్బు ప్రతినెలా తనకు అందించాలని ప్రపోజల్ ని ఛిండూహాన్ తీసుకొచ్చాడు.
ఆ సమయంలో ఆర్గనైజ్డ్ సెక్యూరిటీ టీమ్ ని ఏర్పాటు చేసుకోవటం వాళ్ళను మేనేజ్ చేయటం కొత్త జాబ్ అవుతుందని, దానిమూలంగా కేసినోస్ ని డెవలప్ చేయవలసిన తన ఏకాగ్రత దెబ్బతింటుందని రామన్ హో ఆరోజు నుంచి కేసినోస్ ని రౌడీలు, గూండాల నుంచి రక్షించే బాధ్యతను ఛిండూహాన్ సోదరులకు అప్పగించటం జరిగింది.
ఆ తరువాత రామన్ హో గేంబ్లింగ్ బిజినెస్ బాగా అభివృద్ధి చెందసాగింది. లాభాలు బాగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా రామన్ కేసి నోస్ బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. దాంతో గేంబ్లింగ్ ఆడాలన్న ఉత్సాహంతో ప్రపంచ దేశాల యాత్రికులు విపరీతంగా హాంగ్ కాంగ్ రావటం ప్రారంభమయింది.
క్రమంగా రామన్ హో ఆ వ్యాపారంలో కాకలు తీరిన యోధుడిగా మార్పు చెందసాగాడు.
ఛిండూహాన్ సోదరులకన్నా తక్కువ పారితోషికం తీసుకొని అదే స్థాయి సెక్యూరిటీని కల్పించేందుకు కొందరు ఉత్సాహపడుతున్నట్లు, త్వరలోనే వాళ్ళు రామన్ హోని కలిసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుసుకున్న హాన్ సోదరులు రామన్ హో మంచి మూడ్ లో ఉండగా వెళ్ళి కలిసి చిన్న అభ్యర్ధన చేసారు.
"ప్రతి యేటా కాసినోస్ మీద వచ్చే లాభంలో పదిహేను శాతం సెక్యూరిటీ నిమిత్తం ఖర్చు పెడుతున్నారు, మాకూ ఇది బాగానే ఉంది కాని సొసైటీలో మాకు ఒక గుర్తింపు రావాలంటే మమ్మల్ని మీరు హైర్ చేసుకున్నట్లుగా కాక, మీ భాగస్వాములుగా చేసుకుంటేనే అది వీలు పడుతుంది. అలా అని మీ వ్యాపారంలో వాటా అడిగేంత గొప్ప వాళ్ళం కాదు. ఇప్పుడు మీరిస్తున్న పదిహేను శాతానికే మమ్మల్ని వాటాదారుల్ని చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం." అర్ధించటంతో రామన్ హో ఆలోచనల్లో పడ్డాడు. రామన్ హో పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యే అవకాశాలున్నట్లు గ్రహించారు హాన్ సోదరులు.
అయితే ఆ ప్రపోజల్ కి రామన్ హో పెద్దకొడుకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుసుకొని హాన్ సోదరులు నిరాశపడ్డారు. సరీగ్గా మరో రెండు రోజులకు రామన్ హో పెద్దకొడుకు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు.
కొడుకు చేతికంది వచ్చాడన్న ఆనందంలో ఉన్న రామన్ హో కొడుకు మరణంతో కృంగిపోయాడు.
ఆ పరిస్థితుల్లో కొన్నాళ్ళపాటు వ్యాపార వ్యవహారాల్ని చూసుకొనేందుకు బయటకు రాలేకపోయాడు.
సరీగ్గా ఆ అవకాశాన్ని హాన్ సోదరులు సద్వినియోగ పర్చుకుంటూ కేసినోస్ ని సమర్ధవంతంగా నిర్వహించుకు రాగలిగారు. అయినా ఆ సమయంలో హాన్ సోదరులు పైసా ముట్టుకోక పోవటంతో రామన్ హో వారిపట్ల బాగా ఇంప్రెస్ అయి వారికి తన వ్యాపారంలో పదిహేను శాతంవాటాని వ్రాసి ఇచ్చాడు.
మాస్టర్ తన తండ్రి రామన్ హో కన్నా బాగా చురుకయినవాడు కావటంతో ఆ వ్యాపారాన్ని బాగా విస్తరింపజేసాడు.
తమకన్నా వయస్సులో చాలా చిన్నవాడయిన మాస్టర్ తమకు బాస్ కావటం హాన్ సోదరులకు గొంతు కడ్డం పడింది.
అయినా చేయగలిగింది లేక అలాగే పదిహేనుశాతం వాటాదారులుగానే కొనసాగుతున్నారు.
మాస్టర్ ది ఎంత మాస్టర్ బ్రెయిన్ అంటే తల్లి కోరిక మేరకు మాస్టర్ తన నివాసాన్ని బొంబాయికి మార్చినా, స్థానికంగా హాంగ్ కాంగ్ లో ఉండే హాన్ సోదరులు ఎలాంటి కుంభకోణం చేయకుండా ఉండే ఏర్పాట్లు చేసుకున్నాడు.
అంత నెట్ వర్క్ ఉంది మాస్టర్ కి.
ఆ హాన్ సోదరులే థాయ్ లాండ్ లో ఉన్న కేసినోస్ ని పరిశీలించే నిమిత్తం వచ్చి నాలుగురోజులు సరదాగా గడిపేందుకు బీచ్ రిసార్టుకి వచ్చారు.
ఆ సోదరులిద్దరివి క్రిమినల్ బ్రెయిన్స్...
చిన్నప్పుడు రౌడీయిజాన్ని, గూండాగిరినే వృత్తినే చేసుకుని బ్రతికినవాళ్ళు, చివరకు ఈ వృత్తినే ఆర్గనైజ్ డ్ సెక్యూరిటీగా మార్చుకుని రామన్ హో కేసినోస్ ని కాపాడుతూ చివరకు భాగస్వాములై పోయారు ఆ వ్యాపారంలో.
"ఛిండూ- ఆఫ్ట్రాల్ 15 పర్సెంట్ కే మనకు ఇన్ని కోట్లు లాభం వస్తుంటే మిగతా 85 పర్సెంట్ వాటాకి ఎంత లాభం వస్తుంది? ఫెంటాస్టిక్ ప్రాఫిట్స్" లిండాహాన్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న అంకెల్ని చూస్తూ ఆశగా అన్నాడు.
ఛిండూ ఎక్కడో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడతని మెదడులోని అతి ప్రమాదకరమయిన పథకమొకటి ఒక నిర్దుష్టమయిన రూపాన్ని సంతరించుకుంటోంది.
* * * * *
సెన్సేషనల్ ఎట్మాస్ ఫియర్.
ఎమోషనల్ అండ్ ఏంగ్రీ కాప్స్.
కిల్లింగ్ బిజినెస్ లో ఎమెచ్యూర్ యంగ్ స్టర్స్.
డేంజరస్ ట్రిగ్గర్ మెన్....
ప్రొఫెషనల్స్.
ఫానాటిక్స్ ఇన్ క్రిమినల్ వరల్డ్.
అందరూ కలుసుకొనే స్థలమది.
మార్క్స్ మెన్ లు కౌట్ మెన్, సిగ్నల్ మెన్, గన్ మెన్, మూవింగ్ టార్గెట్ షూటర్స్ - స్టేడింగ్ టార్గెట్ ట్రిగ్గర్స్.
అందరూ అప్పుడప్పుడు కలుస్తుంటారు.
జీవితాంతం కష్టపడినా నాలుగయిదు లక్షలు సంపాదించలేమనుకొనే సోమరిపోతులు, ఈజీ మనీ కోసం తాపత్రయపడే యువకులు, పెట్టుబడిలేని ప్రొఫెషనల్ కిల్లింగ్ బిజినెస్ లోకి దిగిపోతుంటారు.
