Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 106


    మొదటిరోజున తెలిసిన వాళ్ళలో అనంత్ రెడ్డి, స్వప్నరాగలీన, వరాహశాస్త్రి, చారుమతి మరికొందరు వచ్చారు.
    ఒకచోట నిలుచుని వున్న శ్రీపతిని అనంత్ రెడ్డి స్వప్నరాగలీనలు పలకరించి, చిత్రలేఖనాలు చూస్తూ వెళుతూంటే చారుమతి వరాహశాష్ట్రి మరికొందరు ఎదురైతే, స్వప్నరాగలీన చారుమతితో కలిపి ఇంకొకవైపుకి వెళ్ళింది.
    శ్రీపతి కొంచెం మదుగుగా వున్నచోట నిలబడతాడు వెళ్ళి, తను అంతగా కనిపించకుండా అందర్నీ తను గమనించే వీలున్నచోట ఆ దగ్గిర్లోనే "విశ్వలీన" చిత్రలేఖనం వుంది.
    ఒక్కతే చిత్రలేఖనాలు చూస్తూ, అప్పుడే అటు వచ్చి, ఆ "విశ్వలీన" చిత్రలేఖనం చూసి__కలవర పడింది స్వప్నరాగలీన. చారుమతి స్వప్నరాగలీన దగ్గిరికొచ్చి__ "ఆ చిత్రం తీసేస్తే, మీరక్కడే నుంచుంటే, మీ పాదాల దగ్గిర చిత్రలేఖనం సామగ్రి అంతా పోస్తే, యేదో తెలియని వింత రంగుల పొగ మీదకి విరజిమ్మితే చాలు. ఆ చిత్రం దేనికి?" అంది.
    "నన్ను చూస్తే మీకు సంగీత భ్రమే కాక చిత్రలేఖనం భ్రమకూడానా తల్లీ!" అని చారుమతి చెయ్యి పట్టుకుని అవతలికి నడిచింది.
    చారుమతి అటువైపున ఒక చిత్రం చూస్తూంటే, స్వప్నరాగలీన యిటు అడుగులు వేసి శ్రీపతి దగ్గిరికి వెళ్ళి "నాకొకటి కావాలి ఇస్తారూ!" అంది.
    "సంతోషంగా. నేను ఇవ్వగలిగిందైతే. అతి తేలికగా ఇవ్వగలిగేది నా ప్రాణం. గుప్పెడు నిద్రమాత్రలు. ఒకబొట్టు పొటాషియం సైనైడ్. చాకుముక్క. పిస్టల్ గోళీ. నాలుగ్గజాల తాడు. వీటిలో యేదైనా చిటికెలో సంపాదించగలను. చవక కూడా. వాటికంటే నా ప్రాణం మరీ చవక. మరింకేదన్నా ఐతే__చెప్పండి, సాధ్యమైతే తప్పకుండా యిస్తాను" అని చిన్నగా నవ్వాడు.
    "మీ ప్రాణం చాలా విలువైంది. అది వేరే సంగతి లెండి __ నాక్కావల్సింది, ఓ చిత్రలేఖనం" అంది స్వప్నరాగలీన.
    "అన్నీ కావాలన్నా సంతోషంగా యిస్తాను" అన్నాడు శ్రీపతి.
    "ఒక్కటి చాలు. ఒక్కటే కావాలి" అంది.
    "ఇన్నింటిలో ఒక్కటే అంటే__యేదో చెప్పండి" అన్నాడు.
    "కర్తలు. యేదో మీరు గ్రహించగలరు లెండి" అని విషయం మార్చుతూ, "యింత యెప్పుడు నేర్చుకున్నారు?" అంది. పెయింటింగ్స్ అన్నిటి వైపుగా చేత్తో సూచిస్తూ కళ్ళతో ఆశ్చర్యానందాలను తెలియజేస్తూ "నేర్చలేదు. వచ్చింది."
    అంతలో అటునుంచి చారుమతి వచ్చింది.
    "మా చారు వచ్చింది" అని సన్నగా నవ్వింది స్వప్నరాగలీన. అదే సవ్వడి.
    "చారు అంటే కాంతి అందం మంచి అని" అన్నాడు శ్రీపతి.
    "చారు అంటే అంత కాంతివంతమైన మంచి మనసున్న మనిషి__అని" అంది స్వప్నరాగలీన.
    చారుమతి సిగ్గుపడిపోయింది ఆ మాటలకి.
    "మీవారు రాలేదా?" అన్నాడు చారుమతితో.
    "వచ్చారు. అటెటో యెవరితోటో మాట్లాడుతూ చూస్తున్నారు" అంది చారుమతి.
    "మా వరాహ మిహిరు డెక్కడ?" అన్నాడు.
    "తనూ వచ్చాడు!" అంది.
    అటునుంచి డొల్లుకుంటూ వస్తున్న వరాహశాస్త్రి, "కనుగొంటిని నేడు శ్రీరాముని కనులార__ అన్నట్లుగా__ కనుగొంటిని నేడు విశ్వాలీనను కనులార" అని రాగయుక్తంగా పలికి, స్వప్నరాగలీన వంక క్షణకాలం చూసి శ్రీపతితో, "అది వేసిన నీ కుంచె లెంత పుణ్యం చేసుకున్నవో! కనులార కన్న నా కన్నులెంత పుణ్యం చేసుకున్నవో!" అన్నాడు.
    "నాకు తొందరగా వెళ్ళాల్సిన పని వుంది చారూ" అని, 'వస్తా' అని అన్నట్లుగా శ్రీపతి వంకా వరాహశాస్త్రి వంకా చూసి వెళ్ళిపోయింది, వడివడిగా. వడివడిగా నడుస్తున్నా ఆ నడకలో యెంతో హుందాతనం.
    "విశ్వలీన" చిత్రలేఖనాన్ని ఆరోజే రాత్రికి తీసేసి, స్వప్నరాగలీనకి పంపించాడు శ్రీపతి.
    ఆ మూడోనాడు స్వప్నరాగలీన పినతండ్రి హరనాధరెడ్డి వచ్చాడు. వూరినుంచి చిత్రలేఖనాలు చూడటానికి. స్వప్నరాగలీన టెలిగ్రాం యిచ్చి పిలిపించింది.
    "నమస్కారం హరనాధరెడ్డిగారూ. స్వప్న రాలేదా?" అన్నాడు శ్రీపతి, అతనిని చూస్తూనే.
    "యెందుకో బిడియపడుతున్నట్లుగా అనిపించింది ఇక్కడికి రావటానికి. అన్నట్లు ప్రదర్శన తరవాత వీటిని యేం చేస్తారు?" అన్నాడు హరనాధరెడ్డి.
    "యేఁవీఁ చెయ్యను" అన్నాడు శ్రీపతి.
    "మూల పారేస్తే ప్రదర్శన పెట్టించాను. ఒప్పించి" అన్నాడు పక్కనే వున్న రామ్మూర్తి.
    శ్రీపతి రామ్మూర్తిని పరిచయం చేశాడు.
    "భద్రపరచండి. ఆక్షన్ గానీ వేసేట్లయితే నే కొనగలిగితే కొంటాను. అన్నీ నాకెంతో నచ్చాయి." అన్నాడు హరనాధరెడ్డి.
    "మీ కాటేజ్ లో యివి మహదానందం. యీ చిత్తు కాగితాలకేం ఖిమ్మతు! వాటి విలువ, మీ అభిరుచి ఆదరణా" అని రామ్మూర్తి వంక చూసి, "రామ్మూర్తీ, యింత శ్రద్ధగా ప్రదర్శన పెట్టించావు__ ప్రదర్శన అయిపోగానే అంత శ్రద్ధగానూ వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేయించి వీరికి పార్శిల్ పంపించు" అన్నాడు శ్రీపతి.
    "అంత శ్రమ అక్కర్లేదు. మా చిట్టితల్లి స్వప్నకి అందజేయండి. యెప్పుడో యెవరోఒకరు కారులో తీసుకొచ్చి అప్పగిస్తారు." అన్నాడు హరనాధరెడ్డి.
    "వుంటారా ఒక వారం?" అన్నాడు.
    "లేదు. రేపు జరూరుగా వెళ్ళాలి. స్వప్న, యిదీ సంగతి అని టెలిగ్రాం ఇస్తే వచ్చాను. ఈరోజు తప్పించితే మళ్ళీ రావటానికి ఇప్పట్లో వీలుపడదు" అన్నాడు హరనాధరెడ్డి.
    ఐదో రోజున__


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS