Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 105


    చిత్రలేఖనం దృష్ట్యా వాటిస్థాయి నిర్ధారించటానికి చిత్రలేఖనం నిపుణులు వచ్చినట్లు లేరు. తెలియనివాళ్ళూ వస్తున్నారు. వాళ్ళెవరెవరో తెలియదు.
    ప్రదర్శించిన అతని చిత్రలేఖనాలలో కొన్ని__
    ఇసకలోంచి చివ్వున పైకెగిసి వస్తున్న పెట్రోలు నూనె. నలుపూ తెలుపూ మరకలతో ఆరు అడుగుల కొలత వుంటుందనిపించే గరాటా ఆకారంలో ఇనప రేకు__కాడ కింది వైపుకీ. దానిపైన పది అడుగుల పరిధి వుంటుందనిపించే భూగోళం పచ్చని రంగులో__ పరిభ్రమిస్తున్నట్లుగా. గరాటా మీద అరబ్బు షేకు ముసుగు డ్రస్సు. శీర్షికగా కింద__ ది కంటెంపరరీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది వరల్డ్ అని రాసి బ్రాకెట్లో మైడియర్ టోయన్ బీ యువర్ రైట్ అని రాశాడు.
    అసహాయంగా పడివున్న మనిషి. వొకడు చాకుతో మాంసం కోసి తింటున్నాడు. ఇంకొకడు గొట్టం గుచ్చి రక్తం పీలుస్తున్నాడు. ఇంకొకడు వొక చేతిలో కరెన్సీ నోటుతో రెండో చెయ్యి ఆ మనిషి పీకవైపుకీ. ఆ మనిషి నుంచి ధారకట్టి ప్రవహిస్తున్న చమట. ఆ పక్కన వొక యెర్రని బంగళాల పేరుకుని వుంది. ఆ మనిషి భుజాలకీ తలకీ అటు ప్రక్కగా రాబందు నిరీక్షిస్తున్నట్లుగా కూర్చుని వుంది. శీర్షికగా కింద__ మెన్ ఆర్ సో లక్కీ. అయామ్ ఓన్లీ ఏ వల్చర్. హీ యీజ్ నాట్ ఎట్ డెడ్ అని రాశాడు.  
    నది. గోదావరి అని చూడగానే అనిపించేలాగా ఇటు భద్రాచలం రామాలయం. అటు కొత్తగూడెం బొగ్గు ఫ్యాక్టరీ. నదిలో__ నీళ్ళమీద నడుస్తూ మగకుక్క__మగకుక్క అని తెలియటానికి అంగం రవ్వంత బయటికి వచ్చి వుంటుంది. నీళ్ళలో పీకదాకా మునిగి, వంకాయరంగు నెయిల్ పాలిష్ పూసిన గోళ్ళ వేళ్ళతో ఆ కుక్కతోక పట్టుకున్న స్త్రీ. నీళ్ళ పారదర్శకతలోంచి గోచీ పోసి కట్టుకున్న పెద్ద జరీ కంచిపట్టు చీర. వడ్డాణం, కాళ్ళకి ఐదంగుళాల యెత్తు మడమల బూట్లు. శీర్షికగా కింద "అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో" అని రాశాడు.
    మధ్యలో పక్కటెముకలు కనిపిస్తున్న బక్కపలచని గోచిపాతవీరులు__ ఇటు వొకతని చెయ్యి, వైట్ హౌస్ అని రాసివున్న పెద్ద బుట్ట నిండా వున్న ఆయుధాల మీద. రెండో అతని చెయ్యి, అటు క్రెమ్లిన్ అని రాసివున్న పెద్ద బుట్టనిండా వున్న ఆయుధాల మీద. కాస్త పెడగా గుర్రుగా చూస్తున్న చైనా ముఖాల సమూహం. ఆ తలల మీద మూడు నాలుగు ఆయుధాల సన్నని కట్ట. శీర్షికగా కింద__ "పర్ల్సన్ మేన్__పవర్" అని రాశాడు.
    పెద్ద లారీ. లారీ నిండా కనిపిస్తున్న ధాన్యం బస్తాలు. లారీముందు పక్కటెముకలు కనిపిస్తున్న యెడ్ల జత. వాటి మెడలమీద కాడి. ఆ కాడి నుంచి లారీకి కట్టిన గొలుసు. శీర్షికగా కింద__ "ఇండియన్ ఇండస్ట్రీయలైజేషన్" అని రాశాడు.
    చవిటి పర్ర మీద కూరగాయలు. పెద్ద వంకాయ__ దానినిండా కనిపిస్తూ యూరియా. సొరకాయ__దాని నిండా కనిపిస్తూ నీలంరంగు ద్రవం. టొమేటో__మధ్యలో గడ్డకట్టిన గమేక్సిన్ లాంటి పొడి. యెర్రటి వీనెలు కనిపిస్తూ పెద్ద క్యాబేజీ గుండు. పొట్టమీదున్న పచ్చని వరిపైరు మీదకి నల్లని యెర్రని ద్రవం__ చిమ్ముతున్న స్ప్రేయరు. దీనికి పక్కగా క్యాన్వాసుకి యెడమ ప్రక్కన పెద్ద బొర్ర పిలకగుండు జందెంతో, బ్రాహ్మణుడు పైనుంచి కుడిచేత్తో వదులుతున్న నీళ్ళు__నీళ్ళలో నల్లగా మెరుస్తున్న నువ్వులు. శీర్షిక కింద__ "సున్నం పూర్ణ" అని తెలుగులో రాశాడు.
    నల్లని మరక. మరకమీద స్త్రీ ముఖం. కనుబొమలు గొరిగిన గుర్తుగా కనిపిస్తున్న పచ్చదనం మీద పెన్నుతో గీచినంత సన్నగా అటొకటి ఇటొకటి ఐబ్రో పెన్సిల్ గీతలు__అర్ధచంద్రాకారంలో. పెదవిమీద సహజంగా మొలిచి యేపుగా పెరిగినట్లనిపిస్తున్న గుబురు మీసం__కొసలు పైకి మెలితిప్పి వున్నాయి. శీర్షికగా కింద__ "ది లిబరీ వుమన్" అని రాశాడు.
    కింద రాండోలు లాంటి స్త్రీ పరుండి వుంటుంది. మెళ్ళో మంగళసూత్రాలు. పక్కన అరడజను పిల్లలు. వొక కాలు పిల్లల్లో ఇరుక్కుపోయి రెండో కాలు ఆమె బొజ్జలోకి దిగబడిపోయి ఓ పురుషుడు. వూబిలో కూరుకుపోయినట్లుగా నిలబడి, ఏడవలేక నవ్వబోయి, నవ్వలేక అహంభావంగా చూస్తున్నట్లుగా వున్నాడు. శీర్షికగా కింద__ "మగమహారాజు" అని రాశాడు తెలుగులో.
    బాధగా కళ్ళు మూసుకుని నిలుచున్న స్త్రీ__ నిలువెత్తున. వెనకా ప్రక్కలా పురుషులు ఓ చెయ్యి ఆమె భుజంమీద. ఓ చెయ్యి ఆమె వక్షం మీదకి. ఓ చెయ్యి ఆమె పొట్టమీదకి. ఆమె వెనకనుంచి నడుం దగ్గిర చుట్టూ బిగిసిన రెండు చేతులు, చేతివేళ్ళలో చూపుడువేలు బొడ్డులోకి. ఆమె పాదాల దగ్గిర మూడేళ్ళ పిల్లాడు__ బట్టల్లేకుండా, చీమిడి ముక్కుతో. ఎగిరొచ్చి మగవాళ్ళ మెడలలో పడుతున్నట్లుగా పూలదండలు. ఎగిరొచ్చి ఆమెకి కొట్టుకుంటున్నట్లుగా గులకరాళ్ళు. శీర్షికగా కింద__ డబుల్ స్టాండర్డ్__ అని రాశాడు.
    అప్రాముఖ్యమైన చోట, సాధారణంగా యెవరికన్నూ అటుపడే అవకాశం అంతగా లేనిచోట, కేవలం పిన్స్ తో గుచ్చిపట్టి వుంది వొక చిత్రలేఖనం. అడుగునుంచి యెగిసిపడుతున్న సముద్రం. పైనుంచి కిందకి దూకుతున్న హిమపాతం. పశ్చిమాన, పచ్చని పర్వతాల పచ్చిక లోయలు సామవులు. తూర్పున ప్రజ్వరిల్లుతున్న అగ్నిపర్వతం. ఈశాన్యాన సూర్యోదయం. ఆగ్నేయాన చంద్రోదయం. నైరుతి నుంచి వేగంగా వీస్తున్న గాలి. వాయువ్యాన పెద్ద నక్షత్రం. అటూ యిటూ గ్రహగోళాలు, నక్షత్రాలు. ఇవేవీ విడివిడిగా లేవు. వాటన్నిటి స్వభావాలలో మెరుపులతో నునుపుల గరుకులతో రకరకాల రంగుల కలబోతలో వొక సమ్మిశ్రిత పారదర్శక చిత్రం. పరిశీలనగా చూస్తే ఆ చిత్రంలోనే ఆ రూపాలలోంచే కేమొప్లేజ్ లాగా నిగూఢంగా కాక, కొట్టిచ్చినట్లుగా అతి విస్పష్టంగానూ కాక, తాదాత్మ్యంగా వున్నట్లుగా ఓ మానవాకృతి. చిరునవ్వే పెదాలు, చిరు పాదాలు. సన్నటి పొడవాటి వేళ్ళు. కాని అవి పెదాలూ పాదాలూ వేళ్ళూ కావు. ప్రకృతిలోని భాగాలు. అలాగే స్తనాలు. స్తనాలు కావు. యిదంతా క్షణకాలం స్ఫురించినట్లే స్ఫురించి అంతరించిపోతుంది, ఆ యిది. యెంత వెదికినా స్తనాలు కనిపించవు. జబ్బలు, పొట్ట, తొడలు__ కాదు అవీ ప్రకృతే. జుట్టు_నల్లని మేఘంలా. కాదు మేఘమే. ఆ కనిపించిన వాటి ఛాయ యేదో కనిపించినట్లుగా వుంటుంది. అంతలోనే యేదీ కనిపించనట్లుగా అనిపిస్తుంది. చివరికి, మనసులో చెరగని ముద్రలా పడుతుంది. ప్రకృతి స్త్రీ అయ్యి, స్త్రీ ప్రకృతి అయ్యి_మళ్ళీ అంతలోనే ఆ అవయవాలేవీ కనిపించనట్లుగా దళసరి పారదర్శకపు పసుపు రంగు చీర వున్నట్లు భ్రమ. శీర్షికగా క్యాన్వాసుకి వొక మూలన "విశ్వ లీన" అని ఇంగ్లీషు లిపిలో రాశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS