Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 10

    దొరికిన మట్టిని ఎత్తిపోస్తూ వెదుకుతున్నారు.

    వారికి చిత్ర విచిత్రమయిన వస్తువులు నీటి అడుగు పొరల్లో చేతికి తగులుతున్నాయి. చెప్పులు, తామర తూడుల తాలూకు మూలంలో వుండే దుంపలు, చిన్న చిన్న రాళ్ళు రప్పలు.

    ఏనాడో పగిలిపోయిన మట్టి పాత్రల తాలూకు పెంకులు వాటన్నింటిని ఒక్కటి కూడా ఒదిలిపెట్టకుండా శోధిస్తున్నారు. చాలాసేపు ఆ పోరాటం జరిగింది.

    గట్టుమీద చేరి వినోదించే గ్రామపెద్ద ఎవరికయినా ప్రాణహాని వాటిల్లుతుందేమో అని భయపడే స్థితి వచ్చింది. టెన్షన్ ఎక్కువ అయింది. ఎవరో ఒకరికి దొరికిపోతే బాగుండును అని అందరూ అనుకునే సమయం వచ్చింది. ఈ ఆట ఇలాగే సాగితే ఎవరో ఒకరు అయిపోవటం నీరు త్రాగటం జరుగుతుంది అని భయపడే దశ అది!

    ఆ దశలో ముందుగా ఒక పిడికిలి నీటిలోంచి పైకి లేచింది. ఆ పిడికిట్లో అమ్మాయి విసిరిన రుమాలు కన్పించింది. దాంతో గట్టుమీది వారు చెట్లక్రింద వారు ఈలలు కేకలు పెడుతూ విజేతకు జయజయాలు చెప్తారు. ఆ చేయితోపాటే కండలు మెలితిరిగిన శరీర సౌష్టవం కలిగిన ఒక యువకుడు నీటిపైకి లేచి వచ్చాడు.

    అతడు ఆజానుబాహువు స్ఫురద్రూపి, విశాలమయిన కళ్ళు, ఒత్తయిన చెంపలు, బలమయిన మెడమీది మూపురం!

    చేతులు ఉక్కు పిడుగుల్లా కండలు తిరిగి బలంగా వున్నాయి.

    అతడు అతి సునాయాసంగా నిలువు ఈత మీద చెరువు గట్టుకు బయలుదేరాడు. రాజుని అనుసరించి వచ్చే సైనికుల లాగా మిగిలిన యువకులు అతని పరివారంలా చుట్టుముట్టి వస్తున్నారు. ఆ యువకుడు గట్టుకి చేరువ అయిన కొలదీ అతని రూపం మరింత స్పష్టంగా అందరికీ కన్పిస్తోంది. రుమాలు విసిరిన అమ్మాయి ముఖం ఎర్రగా సిగ్గుతో కందిపోయింది. మనసులో గిలిగింతలు పెడుతున్న తీయని ఆలోచనల బరువు మోయలేక తలదించుకుందామె.

    చిట్టిపిడతలా వున్న గడ్డం గుండెల మీద ఆనుకుంది.

    మిగిలిన ఆడపిల్లలు అందరూ ఆమె వంక అసూయగా చూస్తున్నారు. గెలుచుకున్నా అటువంటి అందగాడిని గెలుచుకోవాలి. అదృష్టం అంటే ఆమెదే అనుకున్నారు.

    యువకుడు గట్టుకు వచ్చాడు. రుమాలు ఆమెకు అందించాడు. తనకేదో హక్కు వచ్చినట్టు స్నేహభావంతో ఆమె చేయి పట్టుకున్నాడు.

       
                                   4


    అందరు యువతీ యువకులు ప్రాంతీయ గగ్రామాల పెద్దలు అందరి సమక్షంలో యువకుడు ఆమె చేయి పట్టుకుని గట్టుమీదకి నడిపించాడు.

    వారు ఒకరి గురించి ఒకరు ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

    ఆ క్షణంలో యువతీ యువకులు పరిచయం లేనివారు ఒకరికొకరు దూరంగా వుండాలనే పల్లెసీమల కట్టుబాటు అదృశ్యమయింది. అభ్యంతరాలు వాటంతట అవే చెరిగిపోయాయి!

    క్షణాలమీద ఒకరికొకరు ఆత్మీయుల్లా ఆప్తబంధువుల్లా మంచి స్నేహితుల్లాగా అయిపోయారు. ఆనందం, మంచితనం, ఆహ్లాదం అనేవి నిర్మలమయిన మనసుతో ఆలోచిస్తే తృటికాలంలో పుట్టుకొస్తాయి.

    ఆనందమయినా, విషాదమయినా ఎక్కడో మూలలనించి రాదు. అది మనసులోంచే పుట్టుకొస్తుంది.

    దాన్ని పరిశుభ్రంగా వుంచుకుంటే ఎప్పుడూ అనుభవించగలిగేది ఆనందమే! మనసుకి మురికి పట్టించుకుంటే మిగిలేది విషాదం!!

    వారు అలా చెరువు గట్టుమీదికి చేరి ఉల్లాసంగా మాటలాడుకుంటున్న దృశ్యాన్ని చూచిన తరువాత మిగిలినవారికి కూడా ఎంతో ఆశ కలిగింది.

    తాము కూడా అలాంటి స్నేహితులను సంపాదించుకోగలగాలి!

    ఒక మధురమయిన అనుభవాన్ని మిగుల్చుకోవాలి!

    అందుకోసం మళ్ళీ పోటీ ప్రారంభమయింది!

    మొదటిసారి ముందుకు వచ్చేందుకు రవంత సిగ్గు, బిడియం, అవమానం లాంటివి అడ్డునిలిచి ఆగిపోయిన ఆడపిల్లలు ఈసారి తాము కూడా చొరవ చేయాలని ఎవరికివారే మనసులో తీర్మానించుకున్నారు.

    దాంతో సందడి ప్రారంభమయింది.

    పోటీ అంటూ పొంగి వచ్చింది కాబట్టి క్షణాల్లో అది తొడ త్రొక్కిడిలా అయింది.

    ముందు నేనంటే నేను అనుకునే దశకు వచ్చేశారు.

    ఎలాగయితేనేం మరో ఆడపిల్ల వేదికమీదికి వచ్చింది.

    యువకులు ఆమె విసరబోయే తీయని బాణం గురించి చర్చించుకుంటున్నారు.

    పెద్దలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    యువతి ఈసారి యువకులకు అగ్నిపరీక్ష పెట్టాలనుకుంది. జడ కుచ్చు మీద అలంకరించుకున్న రాళ్ళు పొదిగిన జడపిన్ను తీసిందామె. సీతాకోక చిలుకలా రెక్కలతో అంగుళంన్నర వెడల్పు మూడు అంగుళాలు మాత్రమే పొడవు ఉన్న రాళ్ళు పొదిగిన ఆభరణం అది!

    దాని విలువ కొద్ది వందల రూపాయల మాత్రమే ఉంటుంది.

    యువకులు మహోత్సాహం పడిపోయారు.

    అది ఆకృతిని బట్టి చూస్తే గ్రుచ్చుకుపోయే స్వభావం కల వస్తువు. ఆకృతిలో అలా ఉంది. పైగా లోహం రాళ్ళు కలిసి దాన్ని బరువెక్కించాయి. అది నీటిలో పడగానే బుడుంగున మునిగిపోతుంది.

    బురదలో కూడా గ్రుచ్చుకుపోతుంది.

    అగ్నిపరీక్షలాంటిదే ఇది!

    నీటిలో మునిగి ఎవరు ఎంతసేపు ఉండగలరన్న అంశం మీదకదా విజయం ఆధారపడి ఉంటుంది. అదే సామర్ధ్యానికి పరీక్ష.

    అయితే అంతమంది యువకుల్ని అవకాశం దొరికిందికదా అని అధికమయిన శ్రమకు గురిచేస్తే వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారు.

    ఎవరో ఒకరిని విజయం వరించిన తరువాత అందుకు తగిన స్థాయిలోనే మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

    అందుకామె కూడా సిద్ధంగానే ఉన్నట్లు కనిపించింది.

    చెరువులోకి విసిరేందుకు చేయి ఎత్తగానే యువకుల ఆకలి చూపులు ఆమె శరీరమంతా గ్రుచ్చుకున్నాయి.

    జడ పిన్ను రాళ్ళు పొదిగి బరువుగా ఉంది కాబట్టి చాలా దూరంగా వెళ్ళి పడింది. యువ సింహాల్లాగా యువకులు నీటిలోకి దుమికారు. గట్టు మీద ఒకసారి విజయం చవిచూచిన యువకుడు తిరిగి నీటివైపుగా రావడం మొదలెట్టాడు.

    అతను జోడీ సంపాదించుకున్న యువతి నిరాశగా చూచింది.

    "అప్పుడే వెళ్ళిపోతావా వాల్మీకీ!" అని అడిగింది.

    వాల్మీకీ వెనుదిరిగి చిరునవ్వు నవ్వాడు.

    "మగ వాళ్ళను అస్సలు నమ్మకూడదు" అందామె కచ్చగా.

    "ఇది కేవలం ఆట కదా! నేను మళ్ళీ గెలుస్తాను" అంటూ అతడు నీటివైపుకి పరుగులు తీశాడు. అప్పటికే యువకులు కొంతదూరం వెళ్ళారు. అందరికన్నా వెనుకగా వెళ్ళాడు వాల్మీకి.

    యువతులు వస్తువుని చెరువులోకి విసిరేప్పుడు యువకులు విసురుతున్న అమ్మాయి వంకే రెప్ప వేయకుండా చూస్తుంటారు. కాని విజయ రహస్యం ఏమిటంటే నీటిలో ఆ వస్తువు ఎక్కడ పడిందో ఆ పాయింట్స్ ని ఖచ్చితంగా గుర్తుంచుకోగలగాలి!

    అది నీటిమీద గుర్తు కాబట్టి వెంటనే చెరిగిపోతుంది.


    ఈదుకుంటూ వచ్చిన తరువాత అంతా నీరే ఎక్కడని గుర్తిస్తారు. చక్కని ఊహ కలిగి ఆ చోటుని గుర్తుపెట్టుకుని చేరుకోవడంలో గురి తప్పకుండా ఉండేవారిదే విజయం.

    అంతేకాని విసురుతున్న యువతి వంక నోరు తెరుచుకుని చూస్తూ పడిపోయిన పాయింట్ ని గుర్తించలేని వారికి పరాజయం తప్పదు.

    పదిమంది కన్యకామణుల మధ్య పరాభవమూ తప్పదు. మగతనం, ధీరత్వం విజయసాధన అనేవి, ఈగలు వాలుతున్నా తెలియకుండా ఆడపిల్లల అందమయిన కదలికల్ని, భంగిమల్ని గమనించడంలో ఉందనేది తెలుసుకోవాలి!

    అది ఆడపిల్లలు ఆశించే అర్హత!

    వాల్మీకి కొంతదూరం ఈదుకుంటూ వెళ్ళేసరికి యువకులు పిన్ను మునిగిపోయిన పాయింట్ ను ఇంచుమించుగా రెండుమూడు మీటర్ల వలయంలో ఒక బెటాలియన్ లా ముట్టడించారు.

    యువతులు చూపులు వారి కండరాల కదలికల్ని ఆత్మీయంగా పరామర్శిస్తున్నాయి. ప్రకృతి యిచ్చే సహజమైన ఆనందాన్ని ఆట పేరున వారు సమంగా పంచుకుంటున్నారు.

    సంస్కృతి కట్టుబాటు అనే మాటలకు అర్ధాలను నిర్మలమైన మనసు  ఉల్లాసానికి అనుగుణంగా నిర్వచించుకున్నారు. అందులో లీనమయిపోయారు.

    వాల్మీకి మరోసారి రావడాన్ని యువతులు గుర్తించారు.

    యువతులకయితే అతని రాక ఉల్లాసాన్ని కలిగించింది.పోటీల్లో పాల్గొంటున్నవారు ఒకసారి ఓడిపోయినవారికి మాత్రం అసూయ కలిగించింది. ఈసారి అతన్ని ఓడించాలని వారు ఎత్తుగడ వేశారు.

    జడపిన్ను పడిన చోటుని వలయంలా చుట్టుముట్టి మరొకరు లోనికి వచ్చే అవకాశం లేకుండా చేశారు. ఒకరి తరువాత ఒకరుగా నీటిలో మునిగి బహుమతి కోసం గాలిస్తున్నారు.

    వారి మనసేమిటో దూరంనుంచే గమనించాడు వాల్మీకి.

    వారి దగ్గరకు పోకుండా దూరంగానే నీటిలో మునిగిపోయాడు.

    నీటి అడుగున ఎవరు ఎవరో ఎలా తెలుస్తుంది. అతడు చాలాసేపు పైకి తేలలేదు. ప్రేక్షకులు ఉత్కంఠతో చూస్తున్నారు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS