ఆ క్షణం వరకు నర్సింహాన్ని చూస్తే పులిని చూసినట్టు భయపడే కానిస్టేబుల్స్ మొదటిసారి అతనితో ధైర్యంగా మాట్లాడిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డారో క్షణం.
ఒక పోలీస్ అధికారిపై, అతని జులుంపై తొలిసారి ఎదురు తిరిగి సవాల్ విసిరిన వ్యక్తి కూడా అతడే కావడం విచిత్రం.
"ఏం చేయగలవ్? మహా అయితే రక్తం వచ్చేటట్టు కొట్టగలవ్- బలగం, అధికారం చేతిలో వున్నాయి కాబట్టి? కాని ఓ విషయం గుర్తుంచుకో- నేను బయటకు వెళ్ళిన తరువాత జరిగే పరిణామం గురించి ఆలోచించు" హెచ్చరించాడు సామంత్.
అతడి హెచ్చరికను లెక్క చేయలేదు నర్సింహం.
నర్సింహానికి ఎవరైనా ఎదురు చెబితే ఇరిటేట్ అవుతాడు. క్షమాగుణం అతడిలో ఏ కోశానా లేదు. మరో నాలుగు దెబ్బలు వేసి, ఆ తరువాత రిలాక్స్ డ్ గా కుర్చీలోకి వాలాడు నర్సింహం. అతనికి చాలా చిరాకనిపించింది. ఎందుకో ఆ క్షణంలో అతని వృత్తి పట్ల అంత సంతృప్తుడు కాలేకపోయాడు. అతనికెందుకో తన పవర్ పై పట్టు తగ్గుతున్నట్టనిపించింది.
"సార్! వాడ్ని బయటపడేస్తే మంచిదేమో" చెప్పాడు ఒక కానిస్టేబుల్. అతనికి మనసులో భయంగా వుంది- మరో లాకప్ డెత్ అవుతుందేమోనని.
"సరే బయటపడేయండి" ఎటో ఆలోచిస్తూ చెప్పాడు నర్సింహం.
కాస్సేపటికి సామంత్ ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి జీప్ ఎక్కించారు. ఆ మరుక్షణం జీప్ ఓ మారుమూల ప్రాంతానికి చేరుకుంది.
ఆ వెంటనే సామంత్ శరీరాన్ని తుప్పల మధ్యకు విసిరేశారు.
అప్పుడు సామంత్ కు స్పృహ లేదు.
ఆ తరువాత అటుగా వెళ్ళిన ఒకరిద్దరు అతడ్ని గుర్తించలేదు. గుర్తించినా పట్టించుకోలేదు.
అలా ఎంతసేపు పడివున్నాడో అతనికే తెలియదు.
* * * *
అప్పటికి సామంత్ ని కొట్టి తుప్పల్లో పడేసి రెండురోజులు కావొస్తోంది.
ఆ విషయం పోలీస్ స్టేషన్ లోని అందరూ మర్చిపోయారు.
నర్సింహం అలాంటివి అప్పటికి చాలా చూశాడు. అందువల్ల అతనికా విషయం అసలే గుర్తులేదు.
అతను అప్పుడే డ్యూటీలోకి వచ్చాడు. రావడంతోనే నేరస్తుల ఫైల్స్ ని తెచ్చి ముందు వేసుకున్నాడు.
ఇంతలో ఫోన్ మోగింది.
ఫోన్ ని అందుకున్నాడు నర్సింహం.
"చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నందుకు ఫలితం అనుభవించ బోతున్నావ్..." కర్కశంగా వున్న ఆ మాటలు విని ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు నర్సింహం.
క్షణాల్లో తేరుకుంటూ-
"చట్టాన్ని కొత్తగా నాచేతుల్లోకి తీసుకోలేదు. నేను యూనిఫామ్ వేసుకున్న రోజే అది నా చేతుల్లోకి వచ్చింది..." పొగరుగా అన్నాడు నర్సింహం.
"అదే... ఆ పొగరే తలకెక్కి చేయరాని పనులు చేస్తున్నారు..." తిరిగి ఫోన్ లో వినిపించింది.
నరసింహం పళ్ళు పటపటా కొరికాడు.
"ఆఁ పొగరే... అయితే ఏమంటావ్... అసలు మా డిపార్టుమెంట్ లో చేరిన వాళ్ళకు విచక్షణా జ్ఞానం కన్నా పొగరే ఎక్కువ వుంటుంది. అయితే ఏమిటట?"
"దాన్నే దించబోతున్నాను. అప్పుడప్పుడు మీరు నిజాలు ఒప్పుకుంటుంటారు"
నరసింహం ఓ పక్క మాట్లాడుతూనే, మరోపక్క ఫోన్ లో వినిపిస్తున్న గొంతును గుర్తు పట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
"సరీగ్గా పదిహేనురోజుల్లో నిన్ను మీ ఎస్.పి. సస్పెండ్ చేస్తాడు సిద్ధంగా వుండు"
ఫోన్ కట్ అయిన శబ్దం వినిపించింది. నరసింహం కొద్దిక్షణాలు ఫోన్ కాల్ ని సీరియస్ గా తీసుకోవాలా, లేదా అని మధనపడి, ఆ తరువాత తేలిగ్గా కొట్టిపడేశాడు.
* * * *
రోడ్డు వారగా రెండకరాల విస్తీర్ణం మధ్యలో నిర్మించిన పెద్ద షెడ్. చుట్టూచెడిపోయి, శిధిలమయి పోయిన రకరకాల వాహనాలు... జెఫైర్, ఫాల్కన్, ప్లిమత్, గజెల్, స్టాండర్డు, అంబాసిడర్, ఫియెట్ లాంటి ఓల్డు మోడల్ కార్లు చొట్టలు పోయి, రంగు వెలసి వున్నాయి. కొన్ని చక్రాలు సగం భూమిలోకి కూరుకుపోయి వుంటే, మరికొన్ని ఓ పక్కకు ఒరిగి ఉన్నాయి.
కొన్ని దశాబ్దాలుగా ఎండకి, వానకి తడసిపోయి పురాతన ప్రాభవాన్ని కోల్పోయిన కార్లు, వాటి పక్కనే స్క్రాప్ కిందపడేసిన ఇనుప సామానులు... వాటి మధ్య నుంచి ముప్ఫయ్ అడుగుల రోడ్దొక్కటి మెయిన్ రోడ్ నుండి వెళ్ళి ఆ స్థలం మధ్యలో వున్న షెడ్ ని కలిసి అక్కడితో అంతమయి పోయినట్టుగా వుంది.
చుట్టూ ఆటోమొబైల్ స్మశానంలా వున్నా, మధ్యలో వున్న షెడ్ మాత్రం ముప్ఫయ్ మంది మెకానిక్స్ తో ఎప్పుడూ కలకలలాడుతూ వుంటుంది.
దాని యజమాని హిబ్రూదాదా. ఒకప్పుడు ఎప్పుడో బాగా బ్రతికిన వాడే. ఇప్పుడా ఆవరణలో వున్న విదేశీకార్లలో తిరిగినవాడే.
ఇప్పుడూ అప్పుడూ తిరుగుతూనే వుంటాడు.
అయితే ఒకటే తేడా వుంది. అప్పుడు యజమానిగా వెనుక సీట్లో కూర్చునవాడు. ఇప్పుడు ఆ ఆటోమొబైల్ షెడ్ ఓనర్ గా తన షెడ్ లో పనిచేసే మెకానిక్స్ పనితనాన్ని పరీక్షించేందుకు ట్రైల్ కోసం డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు.
మనిషి చూడడానికి తీహార్ జైల్ తలారిలా వుంటాడు. పబ్లిగ్గా పట్టపగలు పదిమందిని మర్డర్ చేసినవాడిలా కనిపిస్తాడు. ఎవరయినా అతన్ని అదాటుగా చూస్తే కొద్ది క్షణాలు దడుసుకు ఛస్తారు.
ఆరడుగుల ఎత్తులో బలిష్టంగా మెలికలు తిరిగిన కండలతో మాజీ మిస్టర్ ఇండియాలా కనిపిస్తాడు.
అతని షెడ్ కి వచ్చిన ఏ వెహికల్ నయినా ముందు అతనే చూస్తాడు.
ఓ నిముషం ఇంజన్ ఆడించి చూస్తాడు. ఆ మరుక్షణం ఆ వెహికల్ ఓనర్ చెప్పిన సమస్యను వింటాడు.
వెంటనే ఒక మెకానిక్ ను కేకేసి "ఇందులో ట్రబులేం లేదు. కార్పొరేటర్ ఓసారి క్లీన్ చేసి పంపించు" అంటాడు. ఎన్నో కొత్త స్పేర్ పార్ట్స్ వేయవలసి వస్తుందేమో అని భయపడుతూ వచ్చే కార్ల ఓనర్స్, డ్రైవర్స్ హిబ్రూదాదా నోటివెంట వచ్చే చిన్న చిన్న రిపేర్స్ గురించి విని గుండెల నిండా ఊపిరి తీసుకుంటారు.
హిబ్రూదాదాకి యాభై ఏళ్ళుంటాయి. చూడడానికి మాత్రం నలభై ఏళ్ళవాడిలా కనిపిస్తాడు.
షెడ్ లో హిబ్రూ చైర్ పక్కనే ఓ ఇనుప పెట్టె వుంటుంది. కలెక్షనంతా ఎప్పటికప్పుడు అందులో వేసేస్తుంటారు.
మెకానిక్స్ కి ఎప్పుడు అవసరమయితే అప్పుడు ఆ పక్కనే ఎప్పుడూ వుండే రిజిష్టర్ లో రాసి డబ్బు తీసుకోవచ్చు. అలా అని ఎక్కువ తీసుకోవడం గాని, లెక్క తప్పు రాయడం యింతవరకు జరగలేదు.
