పోనీ వెళ్దామా? ఎవరో తేలిపోతుంది అనుకున్నాడు. అంతలోనే, "ఇదెక్కడి దారి తీస్తుందో , వద్దులే" అనుకున్నాడు ఆ రోజు అంతా అన్యమనస్కంగా గడిపాడు.
సాయంత్రం రాంబాబు అడిగాడు "ఏరా! అదోలా కనిపిస్తున్నావూ? ఒంట్లో బాలేదా?" అని రాంబాబుకి అభినవ్ "నొక్కుడు గుండు" అని పేరు పెట్టాడు. అతను అందరితోటి తెగ చనువుగా పూసుకుని రాసుకుని ఉంటాడు.
అభినవ్ సీరియస్ గా , "ఒక ప్రాబ్లం వచ్చి పడింది" అన్నాడు.
"ఏవిట్రా, అదీ! నాతొ చెప్పు - నావంతు సహాయం ఏమైనా చెయ్యగలనేమో చూస్తాను." అన్నాడు రాంబాబు.
అభినవ్ ఉత్తరం సంగతి చెప్పేసాడు.
వింటూనే రాంబాబు పరమ ఉత్సాహంగా , "వెళ్దాం గురూ! సాయంత్రం 'టచ్' చేసుకుని ఇంటికి వెళ్దాం. లేకపోతే పాప బాధ పడ్తుంది. : అన్నాడు.
అభినవ్ ఒప్పుకోలేదు. "వద్దులే, తొందరపాటు మంచిది కాదు. నేను వస్తున్నది చదువుకోవడానికి, ఇటువంటి వాటి మీద నాకు పెద్ద ఇంటరెస్టు లేదు అన్నాడు.
రాంబాబు కాసీపు బ్రతిమిలాడి , లాభం లేదని తెలిసి ఊరుకున్నాడు.
అభినవ్ ఇంటికి వెళ్ళేసరికి, ఇల్లు తాళం పెట్టి కనిపించింది. "అమ్మ గుడికి వెళ్ళినట్లుంది. చేసేపని ఏముందీ! వెళ్ళి అమ్మతో కలిసి వద్దాం" అనుకుంటూ గుడి వైపు అడుగులు వేసాడు.
అభినవ్ గుడి వద్దకు వెళ్ళేటప్పటికీ, జానకి బైటికి వస్తూ కనిపించింది. అతడు అక్కడే ఆగిపోయాడు.
జానకి నవ్వుతూ వస్తోంది! ఆమె నవ్వుకి కారణం వెనుక వున్న బామ్మగారని తెలిసింది అభినవ్ కి. ఇద్దరూ మంచి ఉత్సాహంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. దగ్గరగా వచ్చాకా, తలెత్తి ఎదురుగుండా ఉన్న కొడుకుని చూసింది జానకి.
"అభీ.....ఈవిడ పక్క వీదిలోనే ఉంటారు. రోజూ గుడి దగ్గర ఇద్దరం కబుర్లు చెప్పుకుంటాం" అంది, పక్కనున్న తెల్లచీర ఆవిడ్ని చూపిస్తూ.
అభినవ్ వినయంగా నమస్కారం చేసి వెనుదిరిగాడు.
"మళ్ళీ రేపు కలుద్దాం!" అంటూ ఆవిడ దగ్గర శెలవు తీసుకుని వడివడిగా వచ్చి కొడుకుని అందుకుంది జానకి.
ఆమె ఏదో చెప్తోంది. కానీ అభినవ్ కి వినబడటం లేదు. అభినవ్ దృష్టంతా ఉత్తరం మీదే ఉంది. "వెళ్ళి రావాల్సిందేమో!" అనిపిస్తోంది.
మళ్ళీ కుర్రాడు ఉత్తరం అందించి తుర్రుమన్నాడు.
"నిన్న చాలా ఏడ్చాను! ఎందుకు రాలేదు! ఇవాళ తప్పకుండా రావాలి! మీ అరుంధతి.
రాంబాబు ఉత్తరం చదివి, "వెళ్లోద్దాం గురూ! ఇలాంటివన్నీ ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం?" మరీ ఇంత పిరికి తనమా?" అని రెచ్చగొట్టాడు.
అభినవ్ కి ఆ మాటలకి కోపం వచ్చింది. అతను స్వతహాగా చాలా ధైర్యస్తుడు. తల్లి బాధపడ్తుందని ఏ విషయంలోనూ అనవసరంగా వేలు పెట్టడు అంతే!
కేంటిన్ లో మంజీర కనిపించింది. అభినవ్ వాళ్ళని దాటుకుంటూ వెళ్తూ "దేవయ్య ఈరోజు చెవిలో పువ్వు పెట్టుకుకోలేదులే ఉంది" అంది. ఆమె స్నేహితురాళ్ళు అభినవ్ వైపూ చూసి పడీ పడీ నవ్వుతున్నారు.
"నిన్నే అంటోంది గురూ!" అన్నాడు రాంబాబు.
అభినవ్ నవ్వి ఊరుకున్నాడు.
"ఏం మనిషివి నువ్వు? ఒక ఆడపిల్ల ఏడిపిస్తున్నా ఉలకవు! ఒక ఆడపిల్ల ప్రేమిస్తున్న అంటున్న పలకవు" అన్నాడు రాంబాబు చిరాగ్గా.
అభినవ్ మళ్ళీ ఎప్పటిలా చిరునవ్వు నవ్వాడు.
"నీలాంటి వాళ్ళ వల్లే మనం అసలు ఆడపిల్లలకి చులకన అయిపోతున్నాం!" ఆఖరి బాణం వదిలాడు రాంబాబు.
అభినవ్ లేచి నిలబడుతూ చెప్పాడు. "సాయంత్రం అరుంధతి ఇంటికి వెళ్దాం!"
* * *
తీరా గేటు తీసుకుని లోపలికి వెళ్తుంటే రాంబాబు తెగ కంగారు పడ్డాడు.
"నేను ఇక్కడే ఉంటాను. నన్ను చూసి, వీడేవాడ్రా మధ్యలో అనుకుంటుందేమో!" అన్నాడు రాంబాబు.
అభినవ్ నవ్వుతూ "ఏదో తమాషాకి, నాకు ఏం పెద్ద ఇంట్రస్టు లేదు" అన్నాడు.
పనిమనిషి అనుకుంటా ఎదురొచ్చి "ఎవరు కావాలి?" అంది.
"అరుంధతి" తడబాటు లేకుండా చెప్పాడు అభినవ్.
రాంబాబు మొహానికి పట్టిన చెమట్లు తుడుచుకుంటున్నాడు.
పనిమనిషి ఒకసారి వాళ్ళని ఎగాదిగా చూసి , లోపలి కెళ్ళింది.
చిన్నగా ఉన్నా, అందంగా , అదునాతనంగా ఉన్న ఇంటినీ ఇంటి ముందు తోటనీ గమనించ సాగాడు అభినవ్.
రాంబాబు 'టెన్షన్' గా పారిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు గేటుకి దగ్గరగా నిలబడ్డాడు.
పనిమనిషి వచ్చి "లోపలికి రమ్మంటున్నారు" అంది.
ఇద్దరూ లోపలికి నడిచారు.
అందమైన వయసులో ఉన్న వయ్యారి భామ కోసం, రాంబాబు కళ్ళు ఆశగా వెతికాయి.
కానీ, ఎదురుగా సోఫాలో తెల్ల చీరలో, గుండు చుట్టూ ముసుగు కప్పుకున్న నంది వర్ధనము పువ్వు' దర్శన మిచ్చింది.
"అరుంధతి అనే....."అంటూ నసిగాడు అభినవ్.
"నేనే బాబూ అరుంధతిని" ఆనందంగా చెప్పిందావిడ.
మిన్ను విరిగి మీద పడినట్లయింది ఇద్దరికీ. అంతలోనే అభినవ్ కి ఆమెని ఎక్కడో చూసినట్టు గుర్తుకు రాసాగింది.
ఇంతలో, వెనుక నుంచి కిలకిలా నవ్వులు వినిపించాయి.
తలలు తిప్పి చూస్తే, మంజీర ఆమె స్నేహ బృదం గుమ్మంలో నిలబడి పకపకా నవ్వుతున్నారు.
"ఫూలయిపోయావు గురూ!" అన్నాడు రాంబాబు బాధగా.
మంజీర వెక్కిరింతగా , "మీట్ మిస్టర్ అభినవ్, నీ కోసం వచ్చాడు గ్రానీ!" అంది.
అభినవ్ ఎవరూ ఊహించనంత వేగంగా లేచి, అరుంధతికి నమస్కరించి, "అమ్మ సాయంత్రం మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పమంది. తప్పకుండా వస్తారు కదూ!" అన్నాడు.
అందరూ తెల్లబోయి చూసారు.
అరుంధతి అర్ధం కానట్టు చూస్తూ ....."నువ్వు.....నువ్వు...." అంది.
"నేను జానకి గారి అబ్బాయిని. నిన్న సాయంత్రం గుడి దగ్గర కలుసుకున్నాంగా" అన్నాడు.
అరుంధతి మొహం ప్రసన్నంగా "ఔను నాయనా, మరిచేపోయాను. సాయంత్రం వేళ సరిగ్గా చూడలేదు. అలాగే వస్తాను. అమ్మతో చెప్పు, నాయనా!" అంది.
అభినవ్ ఊపిరి గుండెల నిండా పీల్చుకుని, "రక్షించావు కాదమ్మా!" అనుకున్నాడు.
మంజీర మొహం వాడిపోయింది!
"వస్తానండీ!" అంటూ అభినవ్ అంటే,
"ఉండు నాయనా కాస్త మజ్జిగైనా ...." అంది అరుంధతి.
"నాకు అక్కర్లేదండీ, ఆవిడకి, ఆవిడ మిత్ర బృందానికి ఇవ్వండి" అని, మంజీర వైపు తిరిగి, "వస్తా బై" అంటూ నిష్కరమించాడు.
రాంబాబు కూడా ఈల వేస్తూ ఉషారుగా నడిచాడు.
