అతను అలా వెళ్ళగానే, మంజీర స్నేహితురాళ్ళు , "అతన్ని ఫూల్ చేస్తానని నువ్వే ఫూల్ అయ్యావు" అంటూ విరుచుకు పడ్డారు.
మంజీర కోపంగా , "గ్రానీ అభినవ్ నీకెలా తెలుసు!" అంది.
"వాళ్ళ అమ్మ నాకు పరిచయం కానీ, నీకు అతనెలా తెలుసు?" అడిగింది అరుంధతి.
"ఆ మహానుభావుడే నాతొ చాలెంజ్ చేసింది. అక్కసుగా చెప్పింది మంజీర.
* * *
"అభినవ్ మీ అబ్బాయి అని తెలిసాక, రాకుండా ఉండలేకపోయాను" చెప్పింది అరుంధతి.
"అభినవ్ మీకు ఎలా తెలుసు!" మజ్జిగ గ్లాసు అందిస్తూ సందేహంగా అడిగింది జానకి.
"మా మేనల్లుడి కూతురు మంజీర మీ వాడి కాలేజిలోనే ఈసంవత్సరం చేరింది. ఉట్టి పెంకి ఘటం. మొదటి రోజే మీ వాడితో ఏదో గొడవ పడిందట" అంటూ మజ్జిగ గటగటా తాగి, గ్లాసు క్రింద పెట్టి, "చిన్నపిల్ల దాని మీద కోపం పెట్టుకోవద్దని మీ అబ్బాయితో చెప్పమ్మా. దాని తండ్రి చాలా కంగారు పడ్తున్నాడు" అంది వేడికోలుగా అరుంధతి.
జానకి అనుమానంగా, "మా అభినవ్ , మీ అమ్మాయితో గొడవ పెడ్డాడా?" అంది.
"అదేలే అమ్మా! కాలేజీల్లో మొదటి రోజున ఏడిపించుకోవడాలు , అవీ ఉంటాయటగా, అందుకే ఏదో అన్నాడుట . తప్పు మా పిల్లదీ ఉంది. అయినా ఆడపిల్ల కలవాళ్ళం కదా, మా భయం మాది. అబ్బాయిని కాస్త దాని జోలికి రావద్దని చెప్పమ్మా! అది చెప్తే వినే రకం కాదు. ఒక్కనోక్క పిల్లని, అతి గారభంగా చేసారు తల్లీ తండ్రీ. డబ్బుకి కొదవ లేదు గదా, ఈ చదువులు ఎందుకు? మంచి సంబంధం చూసి పెళ్ళి చేసెయ్యమని చెప్పాను, వింటేనా? ఇంజనీర్ అవుతానని అంటుంది. కాలేజిలో ఇదీ వరుస!"
అరుంధతి మాటల వల్ల సగం అర్ధమయిన జానకికి కొడుకు అంత గొప్పింటి పిల్లతో గొడవ పడటం సహజంగా కంగారు కలిగించింది.
"నాకు తెలియదంటే, ఈరోజే వాడికి చెప్తాను, ఆ పిల్ల జోలికి వెళ్ళవద్దని అసలు మా అభి ఇలా ...."
"ఫరవాలేదు చిన్న తనాలు కదా! ఈరోజు అబ్బాయితో చెప్తానన్నావు. అంతే చాలు! ఏ మాట కామాట మీ అబ్బాయిని చూసాక నా మనసు కుదుట పడింది. మంచి బుద్దిమంతుడలా ఉన్నాడు" అంటూ తెగ పొగిడి , అరుంధతి వెళ్ళిపోయింది.
అరుంధతి వెళ్ళిపోయాక, కూడా లోపలికి రాకుండా, జానకి గుమ్మంలోనే నిలబడి ఆలోచించసాగింది.
అభినవ్ వస్తూనే "ఏంటమ్మా! ఇక్కడ నిలబడ్డావు నా కోసమేనా?" అడిగాడు.
జానకి మాట్లాడకుండా , మౌనంగా లోపలికి నడిచింది.
అభినవ్ కి అరుంధతి వచ్చినట్టు తెలుసు! తల్లి మోహంలో మార్పు గమనించాక, అతనికి అర్ధమయింది. ఆమెకి మంజీర విషయం తెలిసిపోయిందని.
.jpg)
బట్టలు మార్చుకున్నాడు.
తల్లి అన్నం పెట్టె ప్రయత్నం చెయ్యకుండా పడుకునే వుంది.
"అన్నం పెట్టావా?" అడిగాడు.
"చాలా పెద్దవాడి వయ్యావు . చాలా పనులు నాకు తెలియకుండానే చేస్తున్నావు. నీకు ఇంకొకరి సహాయం దేనికి?" దుఖం ఆపుకుంటూ , దుగ్దగా అందని తెలిసిపోతుంది.
అభినవ్ ఆమె మంచం మీద కూర్చుంటూ, కాళ్ళ మీద చెయ్యి వేసాడు.
ఆమె చటుక్కున కాళ్ళు జరుపుకుంది.
"నా తప్పేం లేదని అనను కానీ, ఆ అమ్మాయి తక్కువది కాదు!" అన్నాడు చిన్నపిల్లాడిలా.
జానకి తల ఎత్తి తీవ్రంగా అడిగింది.
"నిన్ను ఎందుకురా నేను ఇంత కష్టపడి చదివిస్తున్నదీ?"
అతను మాట్లాడలేకపోయాడు.
"కనీసం ఎంత కష్టపడి చదివిస్తున్నానో అదన్నా తెలుసా?" ఇంకా తీవ్రంగా అడిగింది. ఆమె కళ్ళమ్మట నీళ్ళు కారసాగాయి.
"అమ్మా!" దెబ్బ తిన్నట్లు చూసాడు అభినవ్.
జానకి ఏడవటం ప్రారంభించింది. "గొప్పవాళ్ళతో నీకు గొడవ లెందుకు? నీ చదువేమిటో , నీ పనేమిటో చూసుకుని వచ్చేయాలి కానీ, మగ దిక్కు లేని సంసారం మనది. నీ తండ్రి చిన్నప్పుడే దేశాలు పట్టి పోయాడు. ఏదైనా అయితే మనకి దిక్కెవరూ?"
అభినవ్ ఆమె దుఖం ఉపశమింప చెయ్యడానికి మాటలు దొరకాలేదు. బాష లేని చోటా, బంధం బలమయిన చోటా, మాటలకంటే మనసు 'చర్య' ద్వారా తెలపడమే సులువు. ఆమె చెయ్యి తీసుకుని తన చెంప కాన్చుకున్నాడు. ఆ తర్వాత అది జరిపి, సున్నితంగా అరచేతిలో ముద్దు పెట్టాడు.
జానకి ఆవేదన తట్టుకోలేకపోయింది. లేచి అభినవ్ తలని రెండు చేతులతో దగ్గరకి తీసుకుని "దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, ఇక మీదట ఆ పిల్ల జోలికి వెళ్ళనని" అంది.
"కానీ ఆ అమ్మాయి రెచ్చగాడితే...."
"అభీ, నా మాట కాదంటున్నావా ?"
"అలా ఎన్నటికీ అనలేనమ్మా"
"మరైతే దేవుడి మీద పప్రమాణం చెయ్యి."
"చేస్తాను గానీ, ఆ దైవం నిన్ను మించిన వాడా?"
"జానకి తృప్తిగా చూసి కొడుకు వైపు "పద భోజనానికి " అంది.
* * *
"ఈసారి మాత్రం ఓడిపోయేది లేదు! పకడ్భందీగా ప్లాన్ చెయ్యాలి!" చెప్పింది మంజీర.
స్నేహితులందరూ ఆమె చెప్పిన దానికి తమ హర్షం ఆమోదం, రెండూ వ్యక్తం చేసారు , టిఫిన్ తింటూ.
"ఇంకా ఏమైనా తింటారా?" అడిగింది మంజీర.
