Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 9


    పక్కన తండ్రి వున్నాడని, అది సభ్యత కాదని తెలిసి కూడా అతను చూపు తిప్పుకోలేక పోయాడు. మెట్లమీంచి దిగివస్తున్న అమ్మాయికేసి కన్నార్పకుండా చూస్తూండిపోయాడు.

    సిరిచందన నిజంగా అద్భుతంగా వుంది. కళ్ళని జిగేల్ మనిపించే అందం మూర్తీభవించి వస్తోంది. కంచిపట్టు పసుపువర్ణం చీర కట్టుకొని చేతిలో ఒక ట్రేతో కాఫీలు తీసుకువస్తోంది. పాల నురుగుతో పోటీ పడుతున్నట్టు ఉందామె శరీరపు తెలుపుదనం. జడ విరబోసుకొని  ఒక క్లిప్ పెట్టుకుంది. వదులుగా వున్న వెంట్రుకల సమూహం వల్ల భూజాలు పూర్తి అందాన్ని సంతరించుకున్నాయి. పదహారణాల తెలుగుదనం ఉట్టిపడుతోంది. పూజకై బయలుదేరుతున్న దేవకన్యలా తోచిందతనికి. సత్యనారాయణరావు కూడా ఆమెని దూరంనుంచి చూసి 'అమ్మాయి మహాలక్ష్మిలా వుంది' అనుకున్నాడు. ఆ వచ్చేది నా కూతురేనా అని క్షణం విస్తుపోయాడు విష్ణువర్థనరావు.

    ఈ లొపులో సిరిచందన దగ్గరి కొచ్చింది.

    అప్పుడు గుర్తుపట్టాడామెని రవితేజ. అతని కనుబొమలు ముడిపడ్డాయి ముందు ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాడు. కానీ దగ్గరికి వస్తూంటే పొరలు విడిపోయినట్టు అతని మెదడులోని జ్ఞాపకాల అలలు కదిలి క్రితం రోజు సాయంత్రం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.

    ఆమే! అందులో సందేహంలేదు. తనెందుకు కన్ ప్యూజ్ అయ్యాడో ఇప్పుడర్థమయ్యిందతనికి. ఆ రోజు ఆమే మోడ్రన్ డ్రస్ లో వుంది. ఇప్పుడు చీర  కడితే పూర్తిగా ఆకారమే మారిపోయింది. ఆడవాళ్ళు ద్రవపదార్థంలా ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం ధరించటంలో వింతేమీ లేదు.

    ఇంతలో సిరిచందన టీపాయ్ దగ్గరి కొచ్చింది. తల వంచుకొని అతనికి కప్పు అందించింది.

    రవితేజ ముఖం సీరియస్ గా వుంది. కమీషనర్ ముందు తనమీద కంప్లయిట్ చేసి చిలిపిగా నవ్వినా సిరిచందన. ఇప్పుడిలా ఒద్దికగా ఏమీ తెలీనట్టు కాఫీ అందిస్తుంటే అతడికి వళ్ళు మండిపోతోంది. తను ఆమెని గుర్తించినట్టు తెలియాలని మొహం మరింత సీరియస్ గా పెట్టుకున్నాడు. అయితే సిరిచందన ఇదేమీ గమనించినట్టు లేదు. తండ్రికి కూడా కాఫీ అందించి, అక్కడినుండి వెళ్ళిపోయింది.

    రవితేజ హతాశుడయ్యాడు. ఇద్దర్నీ ఒంటరిగా కూర్చోపెడతారనీ, అప్పుడామెని దులిపెయ్యవచ్చనీ అనుకున్నాడు. కానీ ఆ అవకాశం దొరకలేదు.

    ఆమె తనని గుర్తుపట్టిందా? గుర్తుపట్టి కూడా అలా తలవంచుకొని సిగ్గు నటిస్తోందా?

    ఈ లోపు లోపలినుంచి విష్ణువర్థనరావు భార్య వచ్చింది. ఆమెని సత్యనారాయణకి పరిచయం చేశాడు. వాళ్ళు ముగ్గురూ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. రవితేజ మాత్రం తన ఆలోచనల్లో తానున్నాడు.

    "కాఫీ తాగు బాబూ" అన్నాడు విష్ణువర్థనరావు. అన్యమనస్కంగానే కప్పు అందుకొని ఒక్క గుక్కతాగి, తిరిగి ప్లేట్ లో పెట్టబోతూ అలాగే ఆగిపోయాడు రవితేజ.

    కప్పుతీసిన చోట, ప్లేట్ కి గుండ్రంగా కట్ చేసి అతికించిన ఒక తెల్లపేపర్ మీద, అందమైన అక్షరాలు "SORRY" అని కనిపించాయి.

    ఒక్కసారిగా  మేఘాలు విడిపోయినట్టు అనిపించింది. తలెత్తిపైకి చూశాడు.

    రెయిలింగ్ కానుకొని బాల్కానీ మీద సిరిచందన నిలబడివుంది. అతడు తనవైపు చూడగానే, అతడికి మాత్రమే అర్థమయ్యేటట్టు సన్నగా నవ్వింది. ఆ తరువాత రెండు చెంపలూ కొట్టుకుంటున్నట్లు అల్లరిగా అతణ్ణి మనసు స్వేచ్చా విహంగంలా ఎక్కడెక్కడికో తేలిపోతూ వుంది.

    చాలా మంది అమ్మాయిలు అందంగా వుంటారు. అందులో చాలామంది ఆరోగ్యంగా కూడా వుంటారు. కానీ మానసికంగా ఆరోగ్యంగా, నిరంతరం హుషారుగా, అల్లరిగా, చిలిపిగా, ప్రపంచంలో ఆనందం అంతా తమ సొంతమన్నట్టుగా వుండే అమ్మాయిలు చాలా తక్కువమంది వుంటారు.

    అలాంటి అమ్మాయి తన భాగస్వామి కాబోతుందంటే పెళ్ళి చూపులకు కూర్చున్న ఏ అబ్బాయి మనసు విహంగమై ఎగరదు?


                              3

    తేజా భోజనం ముగిస్తూండంగా టెలిఫోన్ మ్రోగింది. తేజా అప్పుడే చేతులు కడుక్కుంటున్నాడు. నేప్ కిన్ తో చేతులు తుడుచుకుని వెళ్ళి ఫోన్ ఎత్తి "హలో .....తేజా హియర్......" అన్నాడు.

    "హలో! మీకో విషయం చెప్పాలని ఫోన్ చేసాను. చెప్పమంటారా?" అవతలి నుండి ఎవరిదో ఓ అమ్మాయి కంఠం వినిపించింది.

    "ఇంతకీ మీరెవరూ?" తేజా ప్రశ్నించాడు మొహం చిట్లిస్తూ.

    "నేనెవరో మీ కనవసరం సర్. కానీ నేను చెప్పబోయే విషయం మీ జీవితానికి ఎంతో అవసరం." అవతలి కంఠంలో సీరియస్ నెస్ తొంగిచూసింది.

    "ఇంతకీ ఏమిటంత ముఖ్యమైన విషయం?" మామూలుగా అడిగినట్లు అడిగాడు. కానీ అందులో కంగారు వుంది.

    అతని మనస్సు ఏదో కీడును శంకిస్తోంది.

    "సర్...... మీరు ఈ రోజు ఉదయం ఏ అమ్మాయినైతే పెళ్ళి చేసుకుంటానని ముహూర్తాలు పెట్టుకొని వచ్చారో ఆ ప్రముఖ కలప వ్యాపారవేత్త విష్ణువర్థన్ రావు గారి ఏకైక కుమారై సిరిచందన గురించి కొన్ని వివరాలు మీకు చెప్పాలను కుంటున్నాను......." అవతలివైపు వ్యక్తి కంఠం ఎంతో మామూలుగా వినిపిస్తోంది.

    తేజా శరీరం ఒక్కసారిగా కంపించింది. ఐనా నిలదొక్కుకుంటూ "ఏ..... ఏమిటి..... ఆ వివరాలు?" అని అడిగాడు.

    "ఆ అమ్మాయి ఇంతకుముందే ఒకర్ని ప్రేమించింది. అదీగాక మరో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు......"

    "నో......ఇంపాజిబుల్" అకంగారుగా అరిచినంత పని చేసాడు.

    "ఒకరోజు పెళ్ళి చూపుల్లో చూసి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగు తున్నారు?" అవతలివైపు కంఠం ప్రశ్నించింది.

    అవును నిజమే. ఆమె గురించి తనకి ఏం తెలుసని ఆ విధంగా అన్నాడు?

    అతని మనసులో సంఘర్షణ.

    "ఏమో నాకలా అనిపించింది" ఏదో ఆలోచిస్తూ అన్నాడు తేజ.

    "ఆ అమ్మాయి ఒకతన్ని ప్రేమించింది. తరచుగా వారు కలుసుకుంటారు. ఒకవేళ నా మాటమీద మీకు నమ్మకం లేనట్లయితే ఈ రాత్రి ఇంకో గంటన్నర తరువాత..... అంటే పదిన్నరకి హొటల్ కృష్ణా, రూం నెంబర్ త్రీనాట్ త్రీలో చూడండి. ఆమె ప్రియుడు, ఆమె - ఆ రూంలోనే ఉంటారు......"

    "ఇంతకీ మీరెవరు....." తేజా వాక్యం పూర్తవకుండానే అవతలివైపు ఫోన్  డిస్ కనెక్ట్ అయింది. ఫోన్ పెట్టేశాడు తేజ.

    నిజమేనా? అసలు ఎవరై వుంటారు? ఎవరైనా గిట్టనివారు చెప్పారా? సిరిచందనకి ఎవరైనా శత్రువులున్నారా?

    అతని మస్తిష్కంలో సవాలక్ష ప్రశ్నలు. అతని నుదురు చిరుచెమటలతోతడిసింది. కొడుకు దేని గురించో ఆలోచిస్తున్నాడని గ్రహించాడు సత్యనారాయణరావు. కొడుకు దగ్గిరగా వచ్చి "ఎక్కడికైనా అర్జంటుగా వెళ్ళాలా?" అని అడిగాడు.

    "అవును డాడీ! మళ్ళీ వెంటనే వచ్చేస్తాను."

    కొడుకు అంత టెన్షన్ గా ఉండటం ఆయనెప్పుడూ చూడలేదు.

    తేజ డ్రెస్సింగ్ రూంలో కెళ్ళాడు. యూనిఫాం తీసుకోబోయి ఒక్క నిమిషం ఆలోచించి, మళ్ళీ ప్రక్కనే వున్న మామూలు డార్క్  కలర్ ఫ్యాంటూ, షర్టు చేసుకున్నాడు. రెండు అడుగులు వేసి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా వెనక్కి తిరిగి యూనిఫాం దగ్గరికి వెళ్ళి, దేనికోసమో తడిమాడు. తనకి కావాల్సింది దొరకగానే తీసి జేబులో పెట్టుకొని ఆ గదిలోంచి బయటపడ్డాడు.

    బయట బాగా చలిగా వుంది.

    చేతి వాచ్ నో సారి చూసుకున్నాడు.

    టైం తొమ్మిదిన్నర. ఇంకా గంట వుంది. జీప్ తీసుకుని వెళ్తే ఎవరికైనా అనుమానం రావచ్చు. సెంటర్ అక్కడికి కిలోమీటరు  కన్నా ఎక్కువ వుండదు. నడుచుకుంటూ వెళ్తే పదినిమిషాలు పడుతుంది.

    ఫ్యాంటు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని నడవటం ప్రారంభించాడు. ఫస్ట్ షో వదలడం వల్ల రోడ్డుమీద జనం బాగానే ఉన్నారు. స్కూటర్లు, ఆటోలు, బస్సులు...... ఆ శబ్దం  చికాగ్గా వుంది. అతని మనసులోని ఆలోచనల్లా!

    దాదాపు సెంటర్ దగ్గరికి వచ్చేశాడు. అక్కడినుండి ఇంకో రెండు మూడు ఫర్లాంగులు వెళితే అక్కడ వుంటుంది ఆ హొటల్. కానీ అప్పుడే వెళ్ళటానికి అతని మనసు అంగీకరించలేదు. దేనికోసమో అటూ ఇటూ చూశాడు.

    రోడ్డుకు ప్రక్కగా ఓ పాన్ షాప్  కనిపించింది. ట్రాఫిక్ ను తప్పించుకుంటూ షాప్ దగ్గరికెళ్ళాడు. ఓ సిగరెట్ ప్యాకెట్  తీసుకుని ఒక సిగరెట్ వెలిగించాడు. గుండెలనిండా పొగ పీల్చి వదులుతూ ఆలోచించసాగాడు.

    సిరిచందన ఎంత అందంగా వుంటుంది! పసుపుపచ్చని ఛాయ....... నవ్వినప్పుడు దానిమ్మ గింజల్లా కనబడే పలువరుస....... ఆ కళ్ళల్లోని ఆకర్షణ, కాంతి....... ఒక పురుషుడు ఒక స్త్రీ పై ప్రేమతో తాజ్ మహల్ కట్టించాడంటే ఇన్ని రోజులు ఎంతో విడ్డూరం అనుకున్నాడు. సిరిచందనని చూడగానే- అందులో వింతేమీ కనిపించలేదు. కానీ.....ఫోన్.

    ఫోన్ గుర్తుకు రాగానే అతని మెదడును ఎవరో నొక్కిపట్టినట్టు అయింది.

    ఎలాగైనా సరే ఈ మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలి!

    ఆ టెన్షన్ లోనే మూడు సిగరెట్లు కాల్చాడు. మళ్ళీ వాచ్ వంక ఓసారి చూశాడు. పదింపావు అయింది. మెల్లగా నడక సాగించాడు.

    "హొటల్ కృష్ణా' అన్న ఫ్లోర సెంట్ ట్యూబ్స్ దూరం నుంచే కనిపించాయి..... ఎంట్రెన్స్ గేటు దగ్గర గూర్ఖా నిలబడి వున్నాడు. అతన్ని పట్టించుకొనట్లు లోపలికి సరాసరి రిసెప్షన్ వద్ద కెళ్ళాడు. అక్కడో అందమైన అమ్మాయి ఎడంచేత్తో ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, కుడిచేత్తో ఏదో వ్రాస్తోంది.

    "ఎక్స్ క్యూజ్ మీ! వేరీజ్ రూం నెంబర్ త్రీనాట్ త్రీ?" అడిగాడు రవితేజ.

    ఆమె ఫోన్  కిందకు దించి చిరునవ్వుతో...... "థర్డ్ ఫ్లోర్!" అంటూ లిప్ట్ వైపు కళ్ళతోనే చూపించింది.

    "థాంక్యూ" అని చెప్పేసి లిప్ట్ వైపు అడుగులు వేశాడు. త్రీనాట్ త్రీ మూడో అంతస్తులో లేకపోతే ఎక్కడుంటుంది? తన ప్రశ్నకి తనకే సిగ్గేసింది. మరింత అలర్టుగా వుండాలనుకున్నాడు.

    లిప్టులో థర్డ్ ఫ్లోర్ చేరుకున్నాడు. లిప్టు దిగగానే ఎదురుగా ఉన్న  రూం నంబర్ చూశాడు. దాని ప్రక్క నెంబర్  చూశాడు. రెండింటినీ అంచనా వేసి కుడివైపుగా మెల్లిగా అడుగులేస్తూ కారిడార్ చివరివరకూ వెళ్ళాడు.

    కుడివైపు చివరి డోర్ మధ్యలో అల్యూమినియం అక్షరాలూ '303' అని వున్నాయి.

    కారిడార్ నిర్మానుష్యంగా వుంది. ఓసారి అటూ ఐటూ పరికించి చూశాడు. ఎవరూ రావడం లేదని నిర్థారించుకున్నాక ఓసారి వంగి కీ హోల్ లోంచి చూశాడు.

    లోపల ఏమీ కనిపించలేదు.

    అయితే అతని చెవులకి ఎవరో మగ గొంతు శబ్దం కొంత గరుగ్గా వినిపించింది. అదీ స్పష్టంగా లేదు.

    డోర్ కి కుడివైపు బాల్కనీ వుంది. బాల్కనీలోకి వెళ్ళి రెయిలింగ్ పట్టుకుని క్రిందకి చూశాడు. అక్కడ అన్నీ చిన్న చిన్న చెట్లు పోదల్లా ఉన్నాయి. అటువైపు ఎవ్వరూ రారని నిర్థారణ చేసుకున్నాడు. వెనుక బాల్కనీవైపు పరీక్షగా చూశాడు.

    అతడు నిలబడ్డ స్థలానికి కొంచెం కుడిచేతి వైపుగా గోడ పూర్తిగా అయిపోయింది. పైన వాటర్ టాంక్ నుండి వాచస్ పైప్ లైన్స్ అక్కడినుంచి కనిపిస్తున్నయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS