బాల్కానీ రెయిలింగ్ మీద ఒక కాలు ఆనించి, ఇంకో కాలు పైప్ లైన్ మీద పెట్టాడు. ఇప్పుడు అతని తల రూం పైభాగంలో ఉన్న వెంటిలేటర్ కి సమాంతరంగా వచ్చింది. అందులో నుండి తలపెట్టి క్రిందకి చూసాడు.
గదిలో సిరి ఉన్నట్లయితే అతను కామ్ గా వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నాడు. కానీ గదిలో పావుభాగం మాత్రమే కనిపిస్తూంది. అది డోర్ కి ముందు భాగమే. లోపల ఎవరో కదులుతున్నట్లనిపించింది. పరీక్షగా చూశాడు.
అప్పటివరకు కారిడార్ డిమ్ లైట్ లో ఉండటం వల్ల గదిలో ఎక్కువ వెలుతురు ఉండడంవల్ల, ఆ కదిలిన ఆకారాన్ని అతడి కళ్ళు మొదట్లో గుర్తు పట్టలేకపోయాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా కనిపిస్తోంది. అది ఓ మగవాడి తల వెనుక భాగం.
తేజ పక్కవాటుగా కూర్చోవడంవల్ల పూర్తిగా కనపడటం లేదు. 'బహుశా అతను బెడ్ పై కూర్చొని ఉంటాడు' అనుకున్నాడు.
అతనికి సిరిచందన గుర్తొచ్చింది. తనవైపు నవ్వుతూ చూసి..... చిలిపిగా క్షమాపణ చెప్పుకుంటున్న భంగిమ గుర్తొచ్చింది. అలాంటి సిరిచందన ఇప్పుడొక హొటల్ గదిలో ఒక మగాడితో....
రవితేజ అలా ఎంతోసేపు నిలబడలేకపోయాడు. మెల్లిగా మళ్ళీ ఎప్పటి స్థానంలో దిగేశాడు. అలా దొంగచాటుగా చూడటం సాధ్యం కాదని తెలిసి పోయింది. డైరెక్టుగా- డోర్ దగ్గర కెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. లోపల మాటలు ఆగిపోయాయి.
బెల్ రెండుసార్లు నొక్కినా సమాధానం లేదు.
మూడవసారి నొక్కేసరికి డోర్ మెల్లిగా తెరుచుకుంది. పావుభాగం తెరుచుకునేసరికి లోపలి వ్యక్తి కనిపించాడు.
అతడి ముఖం ఎక్కడో చూసినట్టు అనిపించింది.
.....గుర్తొచ్చింది. అతడు గోల్డ్ బిస్కట్ స్మగ్లర్- ఇబ్రహీం!
డోర్ తీస్తున్న ఇబ్రహీం పెద్దపులిని చూసినవాడిలా కంగారుగా, బలంగా..... తీస్తున్న డోర్ ను మళ్ళీ మూసేశాడు. క్షణంలో వందోవంతులో అతని ప్రయత్నాన్ని గమనించాడు తేజ. తలుపు బలంగా నెట్టాడు. ఎడమచేత్తో నెడుతూనే కుడిచేత్తో రివాల్వర్ ని బయటకు లాగాడు. లా లాగుతూ బలంగా లోపలి తోసుకెళ్ళాడు. తలుపు మూయబోయిన వ్యక్తి, తేజా విసురుకు క్రిందపడ్డాడు. ఆ గదిలో బెడ్ పై కూర్చున్న ఇంకో వ్యక్తి కంగారుగా లేచి నించున్నాడు. జరిగిందేమిటో అతని అర్థమయ్యే లోపునే రవితేజ పొజిషన్ లోకి వచ్చేసాడు.
"హ్యాండ్స్ అప్....! మర్యాదగా చేతులు పైకెత్తండి. లేకుంటే కుక్కలి కాల్చినట్టు కాల్చి పారేస్తా" రవితేజ కంఠం ఆ గదిలో ప్రతిధ్వనించింది.
ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆ ఇద్దరికీ తెలుసు అతడు క్రొత్తగా నగరానికి వచ్చిన ఏ.సి.పి. రవితేజ అని.
ఇద్దరూ చేతులు పైకెత్తి ఎక్కడి వాళ్ళక్కడే నిల్చున్నారు.
"చెప్పండి. బంగారు బిస్కట్లు ఎక్కడ దాచారు?" గద్ధించినట్లు అడిగాడు తేజ. వాళ్ళు మాట్లాడలేదు.
"ఊ..... చెప్పండి" మొదటికన్నా హెచ్చు స్థాయిలో మళ్ళీ గద్ధించాడు ఇలాంటి విషయాల్లో 'రూడ్' గా ఉండకపోతే పని జరగదు.
"మా .... మా దగ్గరేం ....లేదు......సార్" మొదట డోర్ తెరిచినవాడు అన్నాడు.
రవితేజ అతన్ని బలంగా కొట్టాడు. "పిచ్చి పిచ్చి సమాధానాలిచ్చారంటే ఇక్కడికిక్కడే కాల్చిపారేస్తా! నేను మూడంకెలు లెక్కపెట్టేలోగా చెప్పకపోయారో....." అని ఆగి "ఒకటి ......రెండు.... మూడు...." అని పూర్తిచేయబోయాడు. అతడి మొహం చూస్తుంటే ఆఖరి అంకె పూర్తి అవగానే పిస్టల్ పెల్చేటట్టు కనబడ్డాడు. యంగ్ పోలీస్ ఆఫీసర్ల ఎన్ కౌంటర్స్ సంగతి దొంగలకు బాగా తెలుసు.
"బె..... బెడ్ క్రింద బ్రీఫ్ కేసుల్లో ఉన్నాయి సార్" రెండో వ్యక్తి చెప్పాడు. రివాల్వర్ అలాగే గురిపెడుతూ క్రిందకి వంగి ఎడంచేత్తో బెడ్ క్రిందిభాగంలో తడిమాడు. ఒకదానిపై ఒకటి రెండు బ్రీఫ్ కేసులు తగిలాయి. క్రింది దాని హ్యాండిల్ పట్టి బయటికి లాగాడు. ఒకే కలర్ లో ఉన్న రెండు బ్రీఫ్స్ బయటికి వచ్చాయి. అందులో ఒకదాన్ని ఎడమచేత్తోనే పైకి లేపి బెడ్ పై పెడుతూ ఓపెన్ చేశాడు.
తళతళా మెరుస్తూ చిన్న పిల్లలు తినే బిస్కట్ల సైజులో ఉన్నాయి బిస్కెట్లు అందులో నుండి ఒకటి తీసి పరీక్షగా చూశాడు. హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ బిస్కెట్స్. తేజా కళ్ళు ఆనందంతో మెరిశాయి.
కొన్ని రోజులుగా నగరంలో గోల్డ్ బిస్కెట్స్ స్మగ్లింగ్ ఎక్కువైంది.ఆ కేసు తాలూకు ఫైల్ అతనే డీల్ చేస్తున్నాడు. ఆ ఫైల్లో చూసిన ఫోటో ఆధారంగా డోర్ తెరవగానే అతనికి గుర్తుకు వచ్చిందీ విషయం. అందుకే అడిగాడు గోల్డ్ బిస్కెట్స్ ఎక్కడ అని.
నిజానికి తేజాకి కూడా అప్పటివరకూ అనుమానంగానే ఉంది. అసలు తనెందుకు ఇక్కడికి వచ్చాడో పూర్తిగా మరచి పోయాడు. ఇప్పుడు పూర్తి డ్యూటీలో ఉంది అతని మైండ్. ఆ హొటల్ చాలా ఖరీదైంది కావడం వల్ల బెడ్ కి హెడ్ సైడ్ బెడ్ లాంప్ పక్కనే ఫోన్ కనిపించింది.
వెంటనే ఆ వైపు కదిలాడు. రివాల్వర్ మాత్రం వారివైపే గురిపెట్టబడి వుంది. ట్రిగ్గర్ మీద వేలు ఎలర్ట్ గా వుంది.
తాముఏ మాత్రం రియాక్ట్ అయినా ఆ వేలు కదపడం, రివాల్వర్ పేలడం, తాము చావడం ఖాయం అని వారికి తెలుసు. చేతులు అలాగే ఎత్తిపెట్టి నిల్చుని ఉన్నారా పేరుమోసిన స్మగ్లర్స్. టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి చకచకా నెంబర్లు త్రిప్పాడు తేజా. అట్నుంచి రిసీవర్ ఎత్తిన ధ్వని వినిపించగానే "హలో! తేజా స్పీకింగ్....." అన్నాడు.
"హలో తేజా, వాట్స్ డ మాటర్?" కమీషనర్ జనార్ధన్ రావు గొంతు అట్నుంచి వినపడింది.
"జగదాంబ సెంటర్ లోని హొటల్ కృష్ణ, రూం నెంబర్ త్రీనాట్ త్రీకి మీరు కొందరు కానిస్టేబుల్స్ తో రండి."
"ఇంతకీ విషయమేంటి?"
"గోల్డ్ బిస్కెట్స్ స్మగ్లర్స్ ఇద్దర్ని పట్టుకొని నిర్భంధించాను. త్వరగా రండి సర్." అతడు చెప్పింది వినగానే కమీషనర్ కంఠంలో మార్పు వచ్చింది. "వెంటనే బైలుదేరుతున్నా" అంటూ ఫోన్ డిస్ కనెక్ట్ చేశాడు కమీషనర్. అంతకన్నా ఎక్కువ వివరాలు అడిగి సమయం వృధా చేయటం ఇష్టం లేనట్టుగా.
"మీరెళ్ళి ఆ మూలగా నిల్చోండి. క్విక్" చేయి చూపిస్తూ అన్నాడు. వారిద్దరూ అటువైపు అడుగులు వేశారు. తేజా మనసులోఅంచనా వేసుకున్నాడు. కమీషనర్ రావడానికి ఇంకా పది నిమిషాలైనా పట్టొచ్చు. అంతవరకు వీరి నీలాగే మానేజ్ చేయాలి.
ఇంతలో అతని మనసులో మరో ఆలోచన ప్రవేశించింది.
అంతవరకూ అతను అసలు విషయమే మర్చిపోయి డ్యూటీలో నిమగ్నమైపోయాడు. సిరిచందనపై వచ్చిన అభియోగం అంతా వట్టిదే. ఎవరో తనని ఆట పట్టించడానికి ఫోన్ చేశారు! లేదా రూంలో స్మగ్లర్స్ ఉన్నారని ఖచ్చితంగా తెలిసి వారిని పట్టించడానికి ఇలా చేసి ఉంటారు!
ఒకవేళ ఈ స్మగ్లర్లకి పడని వాడెవాడైనా వీరిని పట్టివ్వడానికి అలా ఫోన్ చేశాడా? అలా అయితే డైరెక్టుగా స్మగ్లర్లు ఫలానాచోట ఉన్నారని ఫోన్ చెయ్యవచ్చుకదా? అలా చేస్తే తను నమ్మడని ఈ విధంగా చేశారా? మొత్తంమీద సిరి గురించి చెప్పిందంతా ఒట్టి ట్రాషేనా?
ఆ ఆలోచన రాగానే అతని మనసంతా ఊహాలోకాల్లో తేలిపోయింది క్షణంపాటు అతడు ఆలోచనలో పరిసరాలను గమనించడం మానేశాడు. అతడు వారినే చూస్తూన్నా, అతని చూపుల్లో జీవం లేకపోవడం ఆ స్మగ్లర్లు గ్రహించారు అతడు ఏదో ఆలోచనల్లో ఉన్నాడని నిర్థారించుకొన్నాక తప్పించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాకపోవచ్చని అప్పటికప్పుడే పథకం ఆలోచించసాగారు. వారికో విషయం నిర్థారణగా తెలుసు.
ఇంకాసేపట్లో కమీషనర్ తన బలగంతో వచ్చి అరెస్టు చేస్తాడు. ఆ తరువాత..... చేయగలిగేదేమీ ఉండదు. ఈ ఆలోచన వచ్చాక వాళ్ళు రిస్కు తీసుకోదల్చుకున్నారు. తమ పథకాన్ని వెంటనే అమలు పరుస్తూ అందులో ఒకడు ప్రక్కనే డ్రస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఇత్తడి ప్లవర్ వాజ్ తీసి, గురి తప్పకుండా తాజా చేతిలో ఉన్న రివాల్వర్ కు తగిలేటట్లు గట్టిగా విసిరాడు.
జరిగిందేమిటో తెలుసుకోవడానికి తేజాకి క్షణకాలం పట్టింది. తాను 'సిరి' ఆలోచనలో ఉంటే, వాళ్ళు అది మంచి అవకాశంగా తీసుకున్నారని అర్థమయింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. గాలికన్నా వేగంగా డోర్ తెరుచుకుని ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు.
తేజా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారి వెనకాలే పరిగెత్తాడు. కానీ అప్పటికే వాళ్ళలో ఒకడు క్రిందికి వెళ్ళే మెట్లలో చివరిమెట్లు దిగుతూ కన్పించాడు ఒక్కక్షణం తేజా చురుగ్గా ఆలోచించాడు.
క్రిందకి వెళితే అక్కడికి వెళ్ళేలోపు వాడు మెయిన్ గేటు దాటి రోడ్డుపై జనంలో కలిసిపోవచ్చు. కానీ పైకెళ్ళినవాడు పారిపోలేడు! అందుకే పైకెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. ఒక్కొక్క అంగలో మూడు నాలుగు మెట్లెక్కుతూ పైకి చేరుకున్నాడు.
హొటల్ మూడంతస్తులదే కావడంవల్ల నిముషంలో డాబాపైకి చేరుకున్నాడు. పైనంతా చీకటిగా వుంది. మెట్లకి ప్రక్కనే ఓ చిన్న రూముంది. దానిపై సిమెంటు రేకులేసి వున్నాయి. దానికి ఓ అయిదు గజాల దూరంలో పెద్ద వాటర్ ట్యాంకు సిమెంటుతో కట్టబడి వుంది. ఆ పక్కనే మరొక ప్లాస్టిల్ సింటెక్స్ వాటర్ టాంక్ వుంది. 'పైకొచ్చినవాడు బహుశా అక్కడే దాక్కుని ఉండొచ్చు' అని ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేశాడు. తానో పోరపాటు చేశానని అతడికి గుర్తొచ్చింది. కంగారులో రివాల్వర్ తీసురాకుండానే తను వచ్చేశాడు.
తన పొరపాటుకి తిట్టుకుంటూ, బ్లాక్ కలర్ సింటెక్స్ వాటర్ టాంకర్ దగ్గరకి వచ్చేశాడు. ఆ చీకట్లో అంగుళం అంగుళం పరీక్షగా చూశాడు. అయినా ఆ వచ్చినవాడు కనిపించలేదు.
పూర్తి డాబా అంతా పరీక్షగా చూశాడు. ఆ వచ్చినవాడి ఆధారాలేమీ కనబడలేదు. విలువైన వస్తువు చేతికి దొరికి మళ్ళీ ఎక్కడో జారవిడుచుకున్నట్లు అతని మనసంతా అసంతృప్తితో నిండిపోయింది.
మళ్ళీ ఓసారి పరీక్షగా చుట్టూ చూశాడు. ఆ డాబాకి రెయిలింగ్ లేదు. భవిష్యత్తులో మళ్ళీ పైన కట్టడానికన్నట్లు ఇనుప ఊచలు వదిలిపెట్టారు. ఒకవేళ పైనుండి కింది అంతస్తులోని బాల్కనీలోకి దూకాడేమో అన్న ఆలోచన రాగానే వెంటనే బిల్డింగ్ చివరికంటా వచ్చి క్రిందికి చూశాడు. అతని ఉహ కరక్టే, క్రింద బాల్కనీ ఉంది. కానీ ప్రత్యర్థి ఇంత పై నుండి బాల్కనీలోకి దూకాలంటే చాలా కష్టం. ఒకవేళ దూకినా శరీరానికి తప్పకుండా దెబ్బలు తగులుతాయి. అలా తగిల్తే అతడు అక్కడే ఉండి తీరాలి. ఒకవేళ తను వచ్చి చూస్తే కనిపించకుండా ఉండటం కోసం మరింత లోపలి జరిగాడేమో!
అలా అనుకొని కొద్దిగా వంగి చూశాడు.
అంతే-
ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న అతని వెనక నిలబడిన ఆకారం, అతని నడుముమీద రెండు చేతులూ వేసి బలంగా తోసింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే అతడి శరీరం గాల్లో తేలుతూ వెళ్ళి ఆ మూడంతస్తుల హొటల్ పైనుండి క్రింద పడింది.
ఒక్కసారిగా చల్లటిగాలి రివ్వున అతన్ని చుట్టుముట్టింది. లిప్త పాటు రవితేజకి ఏం జరిగిందో అర్థంకాలేదు. ముక్కులోంచి, నోట్లోంచి గాలి లోపలి వెళ్ళి ఉక్కిరిబిక్కిరయ్యాడు. కళ్ళు తేలిపోయాయి. అతని శరీరం వేగంగా భూమివైపుకి దూసుకుపోసాగింది.
చావుకి బ్రతుకుకి మధ్య కొన్ని క్షణాల వ్యవధిలో పట్టు దొరుకుతుందేమోనని రవితేజ చేతులు, కాళ్ళు కదిలాయి. అతని ప్రయత్నం ఫలించకుండా శరీరం పల్టీ కొట్టింది.
