Previous Page Next Page 
అతని భార్య ప్రియుడు పేజి 8

   
    బెరుకుగా చూసింది.

    "ఏంటా చూపు?"

    తల దించుకుంది.

    "తల దించుకుంటున్నావంటే ఒప్పుకుంటున్నట్టేనా?" కరకుగా ధ్వనించింది.

    ఆమె కళ్ళనుంచి కన్నీరు జారింది.

    "ఆడపిల్లలకి వాళ్ళెలాంటి జాగ్రత్తలో వుండాలో ఎవరూ చెప్పకపోయినా తెలుస్తుంది" అంది.

    జి.కె. నవ్వాడు.

    "నువ్వు లేత కొబ్బరిలా వుంటావు. కాలేజీలో చదువుకున్నావు. అక్కడ వందల సంఖ్యలో అబ్బాయిలూ....... లెక్చరర్స్ ...... చాలామంది వుంటారు. అందులో ఏ ఒక్కరూ నిన్ను ముట్టుకోలేదంటే ఎలా నమ్మాలి. అందులో నువ్వు......

    "అనండి నేను దరిద్రురాలిని. కానీ మీకు తెలుసో తెలీదో? మా పేదింటివాళ్ళే శీలాన్ని అపురూపంగా కాపాడుకుంటారు. మీలాంటి గొప్పవాళ్ళు ఆస్థిని కాపాడుకున్నట్టు, శీలమే మాలాంటి వారికి పెన్నిధి. మీలాంటి వాళ్ళ ఇళ్ళలో పెరిగిన ఆడవాళ్లే సొసైటీలో పార్వర్డ్ అని చెప్పుకుంటూ, బిజినెస్ వ్యవహారాల్లో అవసరం కొద్దీ తప్పు చేస్తుంటారు. కానీ అది తప్పు కాదు ఫ్యాన్సీ"

    "ఏంటే నోరిప్పుతున్నావు, నిన్నిప్పుడు ఉపన్యాసం ఇమ్మనలేదు. ఉద్యోగం కూడా వెలగబెట్టావు. నీలా క్రొత్తగా సర్వీస్ లో చేరిన వాళ్ళని సర్వీస్ మేటర్స్ లో భయపెట్టి పై ఆఫీసర్స్ లొంగదీసుకుంటారు. ఉద్యోగం ఎక్కడ పోతుందో అనే భయంతో వాడి మాట వింటారు.


    డిక్టేషన్ ఇస్తాను రమ్మని కాలు తొక్కుతారు. బీరువాలో ఫైళ్ళు కావాలని ప్రక్కనే వచ్చి నించుని కౌగలించుకుంటారు. ఆదివారం ఆఫీసులో పనుందని పిలిచి కార్యక్రమం నడిపిస్తారు.

    నిర్ఘాంతపోయింది నాగమణి. భర్త ఆలోచనలు ఎంత భయానకంగా వున్నాయో తెలుసుకొంటుంటే రోత పుట్టింది.

    "మిష్టర్ జి.కె." పిలిచిందామె.

    ఉలిక్కిపడ్డాడతను. "ఏమిటా పిలుపు?"

    ఈసడింపుతో చూసింది నాగమణి.

    "మీరు ఊహించుకొన్నట్లు ఆడవాళ్ళింత దిగజారిపోలేదు. పిచ్చివేషాలు వేసే మగవాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఆడవాళ్ళకి తెలుసు. తప్పు చెయ్యొద్దనుకునే ఆడదాన్ని ఒంటి స్తంభం మేడలో బంధించినా అలాగే వుంటుంది. అలాగే మీ మగజాతిలోనూ అందరూ మీలాగ ఆలోచించరు. మంచి చెడు అనేది ఎక్కడైనా వుంటుంది. ఒక మనిషిని వేలెత్తి చూపిస్తే మూడు  వేళ్ళు మనవైపు చూపిస్తుంటాయని మరిచిపోవద్దు. మీ వ్యక్తిత్వం ఏమిటో ఫస్ట్ నైట్ లోనే తెలుసుకునే అవకాశం ఇచ్చారు. థాంక్స్ మిమ్మల్ని చూస్తుంటే గొంగళి పురుగుని చూచినట్లుగా వుంది.

    తోటలో పువ్వులు కోసుకోవడానికి వెళ్తే గొంగళి పురుగు పాకితే ఒళ్ళంతా దురదలు పుడతాయి. పువ్వుకోసం ఆశపడినందుకు ఆ బాధ తప్పదు. పెళ్ళి. సంసారం కోసం మిమ్మల్ని పెళ్లాడినందుకు బహుశా నాకీ బాధ తప్పదనుకొంటున్నాను" ఆమె తెగేసి అలా మాట్లాడుతుంటే జి.కె. కళ్లు ఎర్రబడినయ్.

    అప్రయత్నంగానే అతని చెయ్యి కదిలింది. ఆమె మెడమీద వేసి బిగించాడు.

    "ఈ జి.కె. కోటీశ్వరుడు తలచుకుంటే ఏమైనా చేయగలడు. నేను నిన్ను చంపేసినా నీకు దిక్కుండదు."
    "నేను జి.కె. భార్యని. అంటే నీ ఆస్థికి వారసురాల్ని నేనే. నేను కోటీశ్వరురాలినే. మీరు ఏమైనా చేయగల సమర్థులు కావచ్చు. ఎన్నో హత్యలు చేసి వుండచ్చు. నాకెలాంటి అపకారం జరిగినా బాధ్యత మీదేనని పోలీసులకి, న్యాయస్థానానికి, గవర్నరుగారికి ముందుగానే పిటీషన్ పెట్టి.............."

    ఆమె చెంప ఛెళ్ళుమంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగింది.

    "నన్నే అల్లరి చేస్తావా?" ఉద్రేకంతో అరిచాడు.

    "నా ప్రాణం విలువ నాకు తెలుసు. ఎంతో జీవితం ముందుంది. ఎప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చి ఛస్తావో తెలీని వయస్సు నీది. నిజం చెప్పాలంటే నాకంటే ముప్ఫైయేళ్ళు పెద్దవాడివి. అసలు నన్ను పెళ్ళి చేసుకునేముందు మీకు ఆలోచన కలగలేదా? ఓ కూతురో, ఓ మనవరాలో గుర్తుకురాలేదా? గులాబి పువ్వు అందాన్ని, మల్లెపూవు పరిమళాన్ని చూసి సహించలేని పాపివి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS